అదేంటీ..బిజెపి-హిందుత్వ వేర్వారా?

704

బిజెపిని విమర్శిస్తే హిందుత్వాన్ని వ్యతిరేకించినట్లు కాదా?
చెప్పింది సంఘ్ నేత సురేష్ భయ్యాజీనే 
ఏపీలోకైస్తవ విస్తృతిపై సంఘ్ నజర్
జగన్ సర్కారు క్రైస్తవ అనుకూల విధానాలపై మోదీకి ఫిర్యాదు
బిజెపి రాజకీయ వ్యూహంపై సంఘ్ శ్రే ణుల అసంతృప్తి? 

(మార్తి సుబ్రహ్మణ్యం)

అవునా..? హిందుత్వ-బిజెపి ఒకటి కాదా? రెండూ వేర్వారా? దానికీ, దీనికీ సంబంధం లేదా? మరి .. హిందుత్వపై బిజెపికి మాత్రమే పేటెంట్ ఉన్నట్లుగా చెప్పే ఆ పార్టీ నేతల మాటేమిటి? అసలు బిజెపికి-హిందుత్వకు సంబంధం లేదని చెప్పింది ఎవరు? ఇవే కదా అందరి అనుమానాలు? నిజమే ముందు ఎవరూ నమ్మలేదు.  కానీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యాజీ చెబితే నమ్మాలి కదా?! అంతేనా? బిజెపిని విమర్శించిన వారిని హిందూ వ్యతిరేకులుగా భావించాల్సిన పనిలేదనీ భయ్యాజీ స్పష్టం చేశారు.తాజాగా గోవాలో జరిగిన ఓ సమావేశంలో ‘హిందువులు  తమ సమూహానికే ఎందుకు శత్రువులుగా మారుతున్నారు’ అన్న ప్రశ్నకు జవాబిచ్చిన భయ్యాజీ, హిందుత్వ-బిజెపి బంధాన్ని విప్పిచెప్పారు. ఆయనేమన్నారంటే.. ‘బిజెపిపై విమర్శలు చేసేవారిని హిందుమతానికి వ్యతిరేకంగా పరిగణించలేం. ఇది రాజకీయ యుద్ధం. అది కొనసాగుతూనే ఉంటుంది. దాన్ని హిందువులతో మమేకం చేయలేదు. హిందువులు హిందూ సమాజానికి  శత్రువులుగా మారుతున్నరన్నది మీ ప్రశ్న.అయితే బిజెపికి మద్దతుగా ఉన్న హిందువులంతా  బిజెపి వాళ్లు కాద’ని స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వంపై విమర్శల గురించి ప్రస్తావిస్తూ ‘ఎక్కడైతే నియంతృత్వ పాలన ఉంటుందో అక్కడ ప్రతిపక్షం కూడా ఉంటుంది. ఒకవేళ నేను దేశ సంక్షేమం, సమస్యల గురించి ఏదైనా మాట్లాడాల్సి వస్తే దానిని రాజకీయం చేస్తారు. నేను ఈ దేశస్తుడినే అయినప్పపుడు, దేశం గురించి ప్రశ్నించే హక్కులేదా’ అని వేసిన ప్రశ్న సహజంగానే చర్చనీయాంశమయింది. 
భయ్యాజీ చేసిన ఈ వ్యాఖ్యలు సహజంగానే బిజెపిని నడిపిస్తున్న వారి విధానాలకు వ్యతిరేకంగా కనిపించాయి.ఎందుకంటే.. బిజెపి నాయక ద్వయం అనుసరిస్తున్న రాజకీయ విధానాలపై, ఆ పార్టీ మార్గదర్శి సంఘ్ అసంతృప్తితో ఉందన్న వార్తలు చాలాకాలం నుంచీ వెలువడుతున్నాయి. వివిధ అంశాలపై బిజెపి అనుసరిస్తున్న వైఖరిని సంఘీయులు విబేధిస్తున్నట్లు.. సంఘ్ సిద్ధాంతకర్తలు వివిధ సందర్భాల్లో సంఘ్ సొంత పత్రికలోనే రాస్తున్న వ్యాసాలు, బయట చేస్తున్న వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధానంగా.. తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాలపై బిజెపి వైఖరి, సంఘ్‌కు ఏమాత్రం రుచించడం లేదని సంఘ్ పెద్దలుచేసిన వ్యాఖ్యలే  స్పష్టం చేశాయి. ఏపీ రాజధానిగా ఉన్న అమరావతిని తరలించడంతోపాటు, జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న 3 రాజధానుల ఏర్పాటు, ఏపీ-తెలంగాణలో పెరుగుతున్న క్రైస్తవ మతప్రచారంపై విశ్వహిందూ పరిషత్ (వీహీచ్‌పీ) ఇచ్చిన నివేదిక.. బిజెపి నాయకత్వ విధానాలను తప్పుపట్టినట్లు స్పష్టం చేసింది. 
ప్రధానంగా.. ఏపీలో జగన్ సర్కారు రాజధానిని తరలించి, మూడు రాజధానుల ఏర్పాటుకు సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలకు,  జీవీఎల్ నరసింహారావు వంటి బిజెపి ఎంపీలు ఇస్తున్న మద్దతును ప్రశ్నించడం చర్చనీయాంశమయింది. సంఘ్ సిద్ధాంతకర్త, ప్రముఖ రచ యిత రతన్ శార్దా.. ఏపీలో మూడు రాజధానుల ఆలోచనపై బహిరంగంగానే విరుచుకుపడ్డారు. రాజధానిపై కేంద్రం స్పందించదన్న బిజెపి ఎంపి జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యను ఆయన తన ట్విట్టర్‌లో తూర్పారపట్టారు. ‘మూడు రాజధానుల చెత్త ఆలోచనను ఎలా సమర్ధిస్తారు?  వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేయడమే బిజెపి ఉద్దేశమా? ఆంధ్రకు కేంద్రం ఇచ్చిన వేల కోట్ల రూపాయలు వృధా చేయడాన్ని బిజెపి అంగీకరిస్తుందా? రాజధానికి భూములిచ్చినరైతుల జీవితాలతో సీఎం జగన్ ఆడుకోవడాన్ని, మూడు రాజధానుల చెత్త ఆలోచనను సమ్మతిస్తోందా? బిజెపి వైఖరి జగన్ తుగ్లక్ అనేదా? లేక రాజధానిపై కేంద్ర ం జోక్యం చేసుకోదన్న జీవీఎల్ వ్యాఖ్యలే దాని విధానమా’ అని బిజెపిని నిలదీశారు. సంఘ్ సిద్ధాంతకర్తగా పేరున్న రతన్ శార్దా చేసిన ఈ ట్వీట్‌కు బిజెపి నుంచి ఎలాంటి జవాబు లేకపోగా, పార్లమెంటులో మళ్లీ రాజధాని అంశంపై కేంద్రానికి సంబంధం లేదని కేంద్రమంత్రి స్వయంగా పార్లమెంటులో సమాధానమిచ్చారు. 

ఇక ఆర్‌ఎస్‌ఎస్ అధికార పత్రికయిన  ‘ఆర్గనైజర్’లోనూ ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటును మరో సంఘీయుడు దునుమాడిన వైనాన్ని అన్ని పత్రికలు, చానెళ్లూ ప్రముఖంగా ప్రచురించి, ప్రసారం చేయడం సంచలనం సృష్టించింది. అందులో జగన్‌ను తుగ్లక్‌గా అభివర్ణిస్తూ, ఆంధ్రలో ‘జగ్లక్ పాలన’ అంటూ వ్యాఖ్యానించడం ఓ కుదుపు కుదిపింది. స్వతంత్ర భారతావనిలో రాజధానులు మార్చిన వారెవరూ లేరని, ఢిల్లీ నుంచి రాజధానిని దౌల్తాబాద్‌కు మార్చిన తుగ్లక్.. అక్కడ వ్యయప్రయాసలు, ప్రాణనష్టం ఎక్కువకావడంతో మళ్లీ రాజధానిని ఢిల్లీకి మార్చారంటూ సంఘీయుడైన ప్రమఖ రచయిత దుగ్గరాజు శ్రీనివాసరావు రాసిన వ్యాసం పరిశీలిస్తే.. పలు రాష్ట్రాల్లో తన రాజకీయ ప్రయోజనాల కోసం బిజెపి అనుసరిస్తోన్న విధానాలు సంఘ్‌కు రుచించడం లేదని స్పష్టమవుతోంది. ‘రాజధానులు మార్చడంలో జగన్ తుగ్లక్‌లా వ్యవహరించి ‘జగ్లక్’గా కొత్త పేరు తెచ్చుకున్నారు. మాజీ సీఎం చంద్రబాబుపై కక్షతో రాజధానిని అమరావతి నుంచి తరలించి, మూడు రాజధానులు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. జగన్ ప్రభుత్వం ఆర్ధికంగా దినదినగండంలా పనిచేస్తోంది. ఈ పరిస్థితిలో ఏ ప్రభుత్వమైనా దానిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ జగన్ మాత్రం కక్ష సాధింపు ధోర ణితో వ్యవహరిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవలసిన సమయం వచ్చింది. మంచి సలహాలిచ్చి జగన్‌ను దారికి తేవాలి. అంతేకాదు. ప్రస్తుత పరిస్థితులు రాష్ట్రంలో బిజెపి పెంచుకునేందుకు అద్భుత అవకాశం కూడా’ అని రచయిత విస్పష్టంగా రాశారు. ఇది ఒకరకంగా.. మూడు రాజధానులకు అనుకూల అర్ధం వచ్చేలా మాట్లాడుతున్న బిజెపి ఎంపి జీవీఎల్, మరికొందరు నేతలకు ఇబ్బంది కలిగించే వ్యవహారమే. ఇది కూడా చదవండి.. ‘ జీవీఎల్.. జగన్ ఏజెంటా? చాలామంది వాదిస్తున్నట్లు ఈ వ్యాఖ్యలు రచయిత అభిప్రాయాలయినప్పటికీ, సంఘ్ అధికార పత్రికలో ఎవరంటే వారి వ్యాసాలు ముద్రించరని, కేవలం హిందూ భావజాలం ఉన్న వారి వ్యాసాలే ముద్రిస్తుందని  గుర్తు చేస్తున్నారు. రచయిత దుగ్గరాజు సంఘ్‌కు సన్నిహితంగా వ్యవహరించేవారే కావడం గమనార్హం. ఇది కూడా చదవండి.. ‘ అమరావతి ఆటలో బిజెపి గెలుస్తుందా?
ఇక ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల్లో క్రైస్తవ మతం విస్తృతమవుతోందంటూ,  బిజెపికి మరో దిక్సూచి అయిన విశ్వహిందూ పరిషత్ ఇచ్చిన నివేదిక కూడా చర్చనీయాంశంగా మారింది. ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ సర్కారు ముస్లిం, క్రైస్తవులకు భారీగా ప్రయోజనాలు చేకూరుస్తోందంటూ వీహెచ్‌పి నేతలు ఏకంగా రాష్ట్రపతి కోవిందుకు ఓ నివేదిక ఇచ్చారు. ‘తాను క్రైస్తవుడినయినందుకే తనను జగన్ సర్కారు  కలెక్టర్‌గా నియమించిందని గుంటూరు కలెక్టర్ శామ్యూల్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. గత ఆరునెలల కాలంలో 6 వేల మంది క్రైస్తవులకు ఉద్యోగాలిచ్చామన్నారు. ఇది క్రైస్తవ ప్రభుత్వం అయినందుకే, ఈ వర్గం వారికి అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. క్రైస్తవులైన ఆనందరాజు, రాజశేఖరబాబును టిటిడిలో సహాయ కార్యనిర్వహక అధికారులుగా నియమించారు. హిందూ దేవాలయ భూములను జగన్ సర్కారు క్రైస్తవ, ముస్లిం అవసరాల కోసం ఇచ్చేస్తోంది. కడప జిల్లాలోని వీరభద్ర స్వామి ఆలయానికి చెందిన 4 ఎకరాల భూమిని వక్ఫ్ బోర్డుకు అప్పచెప్పారు. పండగ సీజనల్లో హిందువులు సందర్శిస్తున్న సందర్భాల్లో, బస్సు చార్జీలను 50 నుంచి 100 శాతానికి పెంచుతున్నారు. క్రైస్తవ, ముస్లింకు చెందిన పవిత్ర స్థలాలకు మాత్రం ఉచితంగా తీసుకువెళుతున్నారు. క్రైస్తవ, ముస్లిం మత గురువులకు జగన్ సర్కారు ప్రభుత్వ డబ్బుతో వేతనాలిస్తోంది. తెలంగాణ సర్కారు చర్చిల నిర్మాణాలకు 10 లక్షలు ఇస్తోంది. కాబట్టి రెండు రాష్ట్రాల్లో మైనారిటీ సంతుష్ఠీకర విధానాలు అవలంబిస్తోన్న జగన్-కేసీఆర్ సర్కారును కట్టడి చేయాలని కోరుతున్నామ’ని వీహెచ్‌పీ నేతలు కోటేశ్వరశర్మ, వి.శ్రీవెంకటేశ్వర్లు,ఎన్.సాయిరెడ్డి, బండారి రమేష్ రాష్ట్రపతికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి.. ‘ అనుకున్నట్లే.. అమరావతికి హిందూదళం వచ్చేసింది!
నిజానికి ఏపీలో జగన్ సర్కారు అనుకూల విధానాలను బిజెపి రాజకీయకోణ ంలో మద్దతునీయడం సంఘ్‌కు ఏమాత్రం రుచించడం లేద. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మతమార్పిళ్లు గణనీయంగా పెరిగాయని, ప్రధానంగా తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల్లో అడ్డు అదుపు లేకుండా మతమార్పిళ్లు జరుగుతున్నాయని, కృష్ణా జిల్లా విజయవాడలోనూ ఈ సంస్కృతి పెరగడానికి ప్రభుత్వ ప్రోత్సాహమే కారణమని సంఘ్ ఇప్పటికే తన నాగపూర్ ప్రధాన కార్యాలయానికి నివేదికలందించింది. మతమార్పిళ్లు, దేవాలయాల్లో దేవతావిగ్రహాలను ధ్వంసం చేయడం, గ్రామాల్లోకి వాహనాలు, మైకులతో వచ్చి మతప్రచారం చేసే వారిపై ఫిర్యాదులిచ్చినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని  నివేదికలో వివరించారు. పిఠాపురంలో విగ్రహాలు ధ్వంసం చేసినా ఎలాంటి చర్యలూ లేవని ఫిర్యాదు చేశారు.  ఇది కూడా చదవండి.. ‘విగ్రహ విధ్వంసంపై రోడ్డెక్కనున్న పీఠాధిపతులు ’ గుంటూరు జిల్లా తెనాలిలో సంఘ్ నేత శ్రీనివాస్‌పై ముస్లిం నేతలు బాహాటంగా దాడి చేసినా ఎలాంటి చర్యలు తీసుకోని విషయాన్ని కూడా ఆ నివేదికలో స్పష్టం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో క్రైస్తవ మత మార్పిళ్లను ప్రోత్సహిస్తున్న జగన్ సర్కారును బిజెపి సర్కారు రాజకీయ కారణాలతో సమర్థిస్తున్న వైనమే సంఘ్ శ్రేణులకు ఏమాత్రం రుచించడం లేదంటున్నారు.  ఇది కూడా చదవండి..  ‘ మళ్లీ మతమార్పిడి కలకలం ’..