వార్నీ…ఐపిఎస్‌లకూ ఫోర్జరీ బాధ తప్పదా?

468

ఏబి వెంకటేశ్వరరావు సంతకం స్కానింగ్
దానితోనే తాను తప్పు చేశానన్న బోగస్ ప్రకటన
అందులోనూ అన్నీ తప్పులే
బాబు-లోకేష్-రామోజీ-రాధాకృష్ణనూ ఇరికించే మైండ్‌గేమ్
పోలీసులకు ఫిర్యాదు చేయనున్న ఏబీవీ
మీడియా కథనాలపై లీగల్ నోటీసులు
ఇదో ‘సోషల్’ అనాధల మాయ

(మార్తి సుబ్రహ్మణ్యం)

తల్లీ తండ్రీ లేని వారిని అనాధ అంటారు. ఎవరికి పుట్టారో కూడా తెలియని వారినీ అలాగే పిలుస్తుంటాం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాదీ అదే పరిస్థితి. రాష్ట్రం కాని రాష్ట్రం నుంచి, దేశం కాని దేశం నుంచి ఒక్కో పోస్టింగుకు 25 రూపాయలు, 50 రూపాయలకో తమ యజమానుల కోసం.. పోస్టింగు పెట్టి పొట్ట నింపేసుకునే సోషల్ మీడియా అనాధల సంఖ్య పెరుగుతోంది. అయితే వీరంతా తలిదండ్రులున్నప్పటికీ.. గత ఐదారేళ్ల నుంచి రాజకీయ పార్టీలకు పుట్టిన అనాధల్లా మారుతున్నారు. ఫోర్జరీలతో ఎమ్మెల్యేలు, మంత్రులే బెదిరిపోతుంటే, ఇప్పుడు ఆ బాధ ఆ ఫోర్జరీగాళ్లను పట్టుకునే ఐపిఎస్‌లకూ తప్పడం లేదు. అదే విచిత్రం మరి! వివిధ ఆరోపణలతో సస్పెండయిన ఏపీ మాజీ నిఘా దళపతి ఏబీ వెంకటేశ్వరరావు సంతకాన్ని స్కానింగ్ చేసి, ఆయన చేయని ప్రకటనపై సంతగించిన వైనం సోషల్ మీడియా అక్రమ సంతాన పైత్యాన్ని స్పష్టం చేస్తోంది.
భద్రతాపరికరాల కొనుగోలుకు సంబంధించి అవకతవకలకు పాల్పడ్డారంటూ, జగన్ సర్కారు ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది.ఇది కూడా చదవండి…’ఏబివెంకటేశ్వరరావు సస్పెండ్‘.అయితే, దానిపై ఆయన తన సంతకంతో ఒక ప్రక టన విడుదల చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వం నన్ను సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల కబురు మీ వరకూ చేరే ఉంటుంది. మీడియాలో వస్తున్న కథనాలలో వాస్తవం లేదని తెలియచెప్పడం ఈ ప్రకటన ఉద్దేశం. దీనివల్ల మానసికంగా నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి, మరెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఈ చర్యను ఎదుర్కొనేందుకు చట్టపరంగా నాకున్న అవకాశాలను  పరిశీలిస్తున్నాను. తదుపరి ఏమిటనేది క్రమంగా మీకే తెలుస్తుంది’ అన్నది ఆయన విడుదల చేసిన ప్రకటన సారాంశం. దానిపై ఆయన సంతకం కూడా ఉంది. గత ప్రభుత్వం వద్ద పనిచేసిన అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా, వారిపై కేసులు పెడుతూ జగన్ సర్కారు వారి మానసిక స్ధైర్యాన్ని దెబ్బతీస్తోందన్న విమర్శల నేపథ్యంలో.. సస్పెండయిన ఏబీ, తన ప్రకటనలో ‘దీనివల్ల మానసికంగా నాకు వచ్చిన ఇబ్బందేమీ లేద’ని స్పష్టం చేయడం బట్టి, తాను మానసికంగా ధృడంగానే ఉన్నానని, తనపై మీ మైండ్‌గేమ్ పనిచేయదని సర్కారుకు ఆయన చెప్పకనే చెప్పినట్టయింది.
సరే… దాన్నలా పక్కకుపెడితే, కొద్ది గంటల తర్వాత అచ్చు అదే ఫాంట్, అదే సంతకంతో విడుదలైన మరో ప్రకటన గందరగోళానికి దారితీసింది. ఆ ప్రకటన అంతా నా ఉద్యోగాన్ని నేను కాపాడుకోవడం కోసమే వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశానన్నట్లు సాగింది. ‘రాష్ట్ర ప్రభుత్వం నన్ను సస్పెండ్ చేయడం చాలా బాధ కలిగించింది. వైసీపీ పార్టీకి అప్పట్లో నేను వ్యతిరేకంగా పని చేయడానికి కారణం నా ఉద్యోగాన్ని నేను కాపాడుకోవడం కోసం. నన్ను చంద్రబాబు, లోకేష్, మీడియా అధిపతులు రాధాకృష్ణ, రామోజీరావులు ఒత్తిడి చేయడంతోనే ఆవిధంగా వ్యవహరించడం జరిగింది. అంతేకానీ నాకు ఎలాంటి వ్యక్తిగత కక్షలేదని తెలియచేసుకుంటున్నాను. నా పాత్ర ఎంతో మిగతా వారి పాత్ర అంతకంటే ఎక్కువ ఉందని గమనించగలరు’ అని ఏబీవీ విడుదల చేసిన ప్రకటనలో క నిపించింది. అందులోనూ అచ్చు ఏబీవీ తొలుత విడుదల చేసిన సంకతమే కనిపించడం మరో విశేషం. అంతా బాగానే ఉంది. కానీ, ఏబివీ తొలుత విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఒక్క అక్షరం కూడా తప్పు కనిపించలేదు. పైగా అన్నీ పొట్టి పదాలే కనిపించాయి. కానీ ఆయన సంతకంతో విడుదలైన రెండో ప్రకటన మాత్రం అన్నీ అచ్చు తప్పులే కనిపించాయి. స్వతహాగా రచయిత, తెలుగుభాషాభిమాని, తెలుగు భాష, సాహిత్యం మీద పట్టు ఉన్న ఆయన అన్ని తప్పులతో ప్రకటన విడుదల చేశారని బుర్ర, బుద్ధి ఉన్న ఎవరూ అనుకోరు. ఆ ప్రకటన ‘తెలియచేసుకుంటు ఉన్నాను’, ‘గమానించగలరు’ అలా సాగింది. సరే.. తన సంతకం ఫోర్జరీ చేసి విడుదల చేసిన ఆ ప్రకటనపై ఫిర్యాదు చేస్తానని ఏబీవీ చెప్పినట్లు సమాచారం. అదే సమయంలో తన సస్పెన్షన్‌కు సంబంధించి వ్యక్తిత్వహననానికి గురిచేస్తూ కథనాలు రాస్తున్న కొన్ని పత్రికలు, చానెళ్లకు లీగల్ నోటీసులు ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
ఇక ఏబీవీ పేరుతో విడుదలైన ఆ బోగస్ ప్రకటన.. రాజకీయ అంశాలతో కనిపించడం మరో విశేషం. తొలి లేఖలో రాజకీయ అంశాలు స్పృశించకుండా, కేవలం తన గురించి బంధు మిత్రులెవరూ ఆందోళన చెందవద్దని మాత్రమే పేర్కొనగా.. ఆయన పేరుతో విడుదలైన బోగస్ లేఖలో మాత్రం.. తన సస్పెన్షన్‌కు, బాబు-లోకేష్- రామోజీ-రాధాకృష్ణలను కూడా లాగి లింకు పెట్డడం  చూస్తే.. ఆ లేఖ సృష్టించిన వారు ‘గ్రామ రాజకీయాలకు ఎక్కువ-నియోజకవర్గ రాజకీయాలకు ఎక్కువ’ అన్నట్లుగా కనిపించారు. సహజంగా ఆ ప్రాంతాల్లో ఇలాంటి చీప్ పాలిటిక్స్ కనిపిస్తుంటాయి. కానీ ప్రజలు అప్‌డేటయిన విషయాన్ని సోషల్ మీడియా అనాధ బిడ్డలు విస్మరించడమే విచిత్రం.

నిజంగా ఏ అధికారైనా తనకు అలాంటి పరిస్థితే ఎదురైతే విచారణ సంఘానికో, కోర్టుకో విన్నవిస్తారే తప్ప, ఈవిధంగా పత్రికా ప్రకటనలివ్వరన్న విషయం మెడపై తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది. పైగా డిజిపి స్థాయి వ్యక్తి, తన పరిథి తెలియకుండా ఇలా వ్యక్తుల పేర్లు పెట్టి బహిరంగ ప్రకటన విడుదల చేస్తారనుకోవడం వెర్రితనం.  కానీ ఆయన సంతకాన్ని స్కానింగ్ చేసిన వారు మాత్రం ఆ చిన్న లాజిక్ మిస్సయి, తప్పులో కాలేసినట్లు కనిపించింది. అంటే.. ముందు తాము చేయదలచుకున్నది  ప్రచారంలోకి వెళితే, తర్వాత ఆ బురద వాళ్లే కడుక్కుంటారన్న తెలివి కామోసు! హేమిటో.. ఐపిఎస్సులకూ ఈ ఫోర్జరీల పీడ తప్పడం లేదు. మళ్లీ వాటిని విచారించి ఆ సోషల్ మీడియా అనాధ బిడ్డలను గుర్తించి కనిపెట్టేదీ పోలీసులే.
తిరుపతి ప్రెస్‌మీట్ పేరుతో మరో ప్రకటన..
కాగా సోమవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏబి వెంకటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించనున్నారంటూ మరో వార్త సంచలనం సృష్టించింది. దీనిపై ఆయనను వివరణ కోరగా.. ‘నేను కూడా సోషల్ మీడియాలోనే చూశా. శునకానందం పొందుతూ ఇలా దుష్ప్రచారం చేస్తున్న వారు,  త్వరలో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు. ఆ మేరకు న్యాయపరంగా ఉన్న మార్గంలో వెళతా’మని చెప్పారు.