బాబు..కిం కర్తవ్యం?

421

కమలంపై సమరమా? సర్దుబాటా?
అటు వైసీపీ, ఇటు బిజెపి వరస దాడులతో ఆగమాగం
సన్నిహితులపై ఐటి, ఈడీ దాడులతో  కలవరం
కేంద్రబడ్జెట్‌పై స్పందించలేని బాబు నిస్సహాయత

(మార్తి సుబ్రహ్మణ్యం)

రాజకీయ సంక్షోభాలు ఎదుర్కొని గోడకు కొట్టిన బంతిలా మళ్లీ నిటారుగా నిల్చునే రాజకీయ యోద్ధగా పేరున్న టిడిపి అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మున్నెన్నడూ ఎదుర్కోని విచిత్ర పరిస్థితిలో చిక్కుకున్నారు. సహజంగా సంక్షోభాలనే అవకాశంగా మార్చుకుని దూసుకువెళ్లే ఆయనకు, ఇప్పుడు ఎలాంటి అవకాశాలూ కనిపించడం లేదు. కేంద్రం-రాష్ట్రంలో ఆయనకు ఉన్న అన్ని దారులూ మూసుకుపోతున్నాయి. గత ఎన్నికల ముందు తమపై ఆగర్భశత్రువులా వ్యవహరించిన బాబుపై, బిజెపి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునే పనిలో ఉంది. బాబు సన్నిహితులపై ఐటి దాడుల ద్వారా, ఆయనపై ప్రత్యక్ష యుద్ధానికి  బిజెపి తెరలేపింది. అటు తాను 16 నెలల పాటు జైలులో ఉండేందుకు, బాబు మంత్రాగమే కారణమని రగలిపోతున్న ఏపీ సీఎం జగన్, రాష్ట్రంలో టిడిపిని నిర్వీర్యం చేసే పనిలో ఉన్నారు. బిజెపి ఆర్ధికమూలలను దెబ్బతీస్తుంటే, వైసీపీ రాజకీయంగా దెబ్బతీసే వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. దానితో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో చంద్రబాబు కొట్టుమిట్టాడుతున్నారు.
ఎన్టీఆర్ నుంచి పార్టీ పగ్గాలు అందుకోకముందు నుంచీ బాబుకు జాతీయ రాజకీయాలతో సన్నిహిత సంబంధాలున్నాయి. పేరుకు ఎన్టీఆర్ సీఎం అయినప్పటికీ, జాతీయ రాజకీయాలను చక్కబెట్టింది మాత్రం చంద్రబాబే. జ్యోతిబసు, బిజూపట్నాయక్, విపి సింగ్, చౌతాలా, దేవెగౌడ, మమతబెనర్జీ, ఫరూఖ్ అబ్దుల్లా, లాలూ ప్రసాద్‌యాదవ్, జయలలిత, ఏబి బర్దన్, సీతారాంఏచూరి వంటి అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు నెరిపిన బాబు.. తన రాష్ట్ర రాజకీయ అవసరాలకు, చివరకు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టిడిపిని కాంగ్రెస్ సరసన చేర్చి, దానితో కలసి పోటీ చేశారు. బిజెపికి వ్యతిరేకంగా కొన్ని రాష్ట్రాల్లో ప్రచారం కూడా చేశారు. గత ఎన్నికల్లో కర్నాటకలో బిజెపికి వ్యతిరేకంగా పనిచేయడంతోపాటు, కేసీఆర్‌తో పాటు బాబు కూడా కాంగ్రెస్‌కు నిధులు పంపించారని బిజెపి భావిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కు నిధులు సమకూర్చారన్న కోపం లేకపోలేదు. ఇప్పుడు బిజెపి ఆగ్ర హం, ప్రతీకారానికి అదే ప్రధాన కారణంగా మారింది.
ఇంత చేసిన బాబు.. అంతకుముందు ఎన్డీఏ కన్వీనర్‌గా వ్యవహరించి, వాజపేయి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించడం విశేషం. వాజపేయి వంటి సౌమ్యుడిని జయలలిత, మమత వంటి ప్రాంతీయ నేతలు ముప్పుతిప్పలు పెట్టినప్పటికీ, బాబు మాత్రం బిజెపికి నమ్మకమైన మిత్రుడిగా అవతరించారు. సాంకేతిక సలహాలు, ఆర్ధిక సంస్కరణకు సంబంధించి వాజపేయి సర్కారుకు  అనేక సలహాలిచ్చారు. అదే సమయంలో కేంద్ర సర్కారును వినియోగించుకుని, రాష్ట్రానికి అనేక నిధులు సాధించారు. అప్పట్లో చంద్రబాబు ఢిల్లీకి వచ్చారంటే, ఏ రాష్ట్రానికి వెళ్లాల్సిన నిధులను ఆయన పట్టుకుపోతారోనన్న బెంగ ఆయా పార్టీల్లోఉండేది. బాబు ఢిల్లీకి వచ్చిన వెంటనే ఏమిచ్చినా ఇవ్వకపోయినా, పనికి ఆహార పథకానికి సంబంధించిన బియ్యాన్ని కేంద్రం సిద్ధం చేసేదంటే.. ఆరోజుల్లో బిజెపి-టిడిపి మధ్య సత్సంబంధాలు ఏ స్థాయిలో ఉండేవో స్పష్టమవుతుంది. బిజెపి అగ్రనేతలు అద్వానీ, మురళీమనోహర్‌జోషి, దివంగత ప్రమోద్‌మహాజన్ వంటి వారితోనూ ఆయనకు సత్సంబంధాలుండేవి. రాష్ట్రపతి ఎన్నిక సమయంలో వాజపేయిని ఒప్పించి మరీ, మైనారిటీకి చెందిన అబ్దుల్‌కలాంను రాష్ట్రపతిని చేసిన ఘనత బాబుదే. లోక్‌సభ స్పీకర్‌గా బాలయోగిని నియమించుకునేలా చూసుకుని, జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.
ఎటొచ్చీ.. మృదుస్వభావులైన ఆ తరం బిజెపి పగ్గాలు, నరేంద్రమోదీ-అమిత్‌షా  ద్వయం చేతికి వచ్చిన తర్వాతనే, జాతీయ స్థాయిలో టిడిపి ప్రభ తగ్గడం ప్రారంభమయింది. బిజెపికి సంపూర్ణ మెజారిటీ ఉండటం, వారిద్దరు అనేక విషయాల్లో అత్యంత కఠినంగా వ్యవహరించడంతో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీలు కూడా, బిజెపిపై పోరాడే శక్తి లేక బలహీనపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆవిధంగా గత ఎన్నికల ముందు వరకూ బిజెపిపై కన్నెత్తి చూసేందుకే రాజకీయ పార్టీలు వణికిపోయిన పరిస్థితి.
అలాంటి సమయంలో.. జాతీయ హోదా ఇవ్వనందుకు నిరసనగా  ఎన్డీఏ నుంచి టిడిపి వైదొలగగా, ఏపీ సంకీర్ణ సర్కారు నుంచి బిజెపి నిష్క్రమించింది. ఇక ఆ తర్వాత బిజెపి టిడిపిపై యుద్ధం ప్రకటించింది. అయితే ఏపీలో బిజెపి అత్యంత బలహీనంగా ఉండటంతో, బలంగా ఉన్న వైసీపీని తెర వెనుక నుంచి ప్రోత్సహించింది. జగన్‌కు దన్నుగా నిలిచింది. ఎన్నికల సమయంలో టిడిపి ఆర్ధికమూలాలు దెబ్బకొట్టింది. బాబుకు సన్నిహితులైన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల నుంచి ప్రతి ఎన్నికల్లో వచ్చే నిధులు రాకుండా, వారిపై ఐటి దాడులు చేయించడం ద్వారా టిడిపిని ఆర్ధికంగా దెబ్బకొట్టింది. దానితో ఎన్నికల్లో అభ్యర్ధులకు నిధులు సమకూర్చలేక టిడిపి డీలా పడిపోయింది. దానితో మీరు సర్దుబాటు చేసుకుంటే, ఎన్నికల తర్వాత సర్దుతామని చెప్పాల్సి వచ్చింది. దానితో అభ్యర్ధులు అప్పులు చేసి నిధులు సర్దుబాటు చేసుకోవలసి వచ్చింది. అయితే, ఇప్పటివరకూ ఆ నిధులు వారికి సర్దుబాటు చేయలేక వాయిదాలు వేస్తున్న పరిస్థితి నెలకొంది.
ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి, పార్టీకి రాజీనామా చేసిన ఓ ఎమ్మెల్సీ అయితే.. నేరుగా తనకు అప్పులిచ్చిన వారిని బాబు వద్దకు తీసుకువెళ్లారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే, ప్రత్యర్ధి జగన్ మాత్రం ఎన్నికలకు నెలరోజులముందుగానే తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆర్ధిక దన్ను, రెడ్డి వర్గానికి చెందిన ఫార్మా కంపెనీల ద్వారా నిధులను నియోజకవర్గాలకు చేర్పించడంలో విజయం సాధించారు. గత ఎన్నికల్లో టిడిపి కంటే వైసీపీనే అన్ని రంగాల్లో ముందు నిలిచింది. వైసీపీ ఒక్కో నియోజకవర్గానికి 10 నుంచి 20 కోట్ల వరకూ సమకూర్చగలిగితే, ఎప్పుడూ నిధుల పంపిణీలో ముందుండే టిడిపి మాత్రం ఐటి దాడులతో చేతులెత్తేసింది.  అంతకుముందే.. హైదరాబాద్‌లో ఆస్తులున్న టిడిపి నేతలను ఎన్నికల్లో పోటీ చేయకుండా నివారించడమో, వారిని వైసీపీలోకి పంపించడమో చేయడంలో కేసీఆర్ విజయం సాధించారు. ఎన్నికలకు ముందు నుంచీ బాబు సర్కారుకు పోలీసులపై పట్టు లేకపోవడం కూడా కేసీఆర్-జగన్‌కు కలసివచ్చింది. ఆ విధంగా టిడిపిని అటు ఆర్ధికంగా బిజెపి దెబ్బకొడితే, ఇటు వైసీపీ రాజకీయంగా దెబ్బకొట్టింది. మొత్తంగా అందరినీ కూడగట్టి, బిజెపిపై యుద్ధం ప్రకటించినందుకు బాబు తగిన మూల్యం చెల్లించుకోవలసి వచ్చినట్లు ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
ఎన్నికల తర్వాత బిజెపికి అనూహ్యమైన మెజారిటీ రావడం, రాష్ట్రంలో తన ప్రత్యర్ధి జగన్ సీఎం కావడంతో బాబు బలహీనపడాల్సి వచ్చింది. పైగా తన పార్టీకి చెందిన నలుగురు ఎంపిలతోపాటు, రాష్ట్రంలో చాలామంది టిడిపి నేతలు బిజెపిలో చేరటం బాబుకు షాక్ కలిగించింది. ఇటు తన పార్టీకి చెందిన వారిని తన నుంచి దూరం చేసిన వైసీపీని ఎదుర్కొనే శక్తి కరవయిపోయింది. అటు బిజెపి కూడా రాజ్యసభలో తన అవ సరం కోసం వైసీపీని తెరవెనుక నుంచి ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో టిడిపిని నిర్వీర్యం చేసేందుకు తాను చేయవలసిన పనులన్నీ వైసీపీతో చేయించటం ద్వారా, చేతికి మట్టి అంటుకోకుండా అటుంచి నరుక్కువస్తోంది. టిడిపి బలహీనపడితే తప్ప, తన పార్టీ ఎదగదన్న వ్యూహమే బిజెపి చర్యలలో కనిపిస్తోంది.  రాజధాని అంశంలో కూడా బిజెపి శల్యసారథ్యమే  వహిస్తోంది. జీవీఎల్ నరసింహారావుతో రాజధానికి వ్యతిరేకంగా, బిజెపి రాష్ట్రశాఖతో అనుకూలంగా తీర్మానం చేయించడం ద్వారా కర్ర విరక్కుండా పాము చావకుండా అన్నటు,్ల వ్యూహాత్మక ద్వంద్వ వైఖరి అమలుచేస్తోంది. అందుకే.. అసలు వైసీపీ తమకు శత్రువా? రహస్య మిత్రుడా అన్నది బిజెపి నేతలకూ అంతుపట్టడం లేదు.
ఈ పరిస్థితిలో బాబుకు అత్యంత నమ్మకస్తులైన వారిపై ఐటి, ఈడీ దాడులు చేస్తుండటం రాజకీయంగా ఆసక్తిరేపుతోంది. కేంద్రం-బిజెపి నాయకత్వ ఆదేశాలు లేనిదే.. ఎలాంటి ఆధారాలు లేనిదే ఆ విభాగాలు దాడులకు పూనుకోవన్న విషయం మెడ మీద తల ఉన్న వారికెవరికయినా అర్ధమయ్యేదే. ఆ ప్రకారంగా.. ఇక బాబును బలహీన పరిచే ప్రణాళిక ప్రారంభ మైనట్లే లెక్క. దేశంలో రాహుల్ కుటుంబంతో సహా విపక్ష నేతలు, వారి కంపెనీలపై గత కొన్నేళ్ల నుంచి శరపరంపరగా జరుగుతున్న దాడులు చూస్తే.. ఇక బిజెపి దృష్టి బాబుపై పడిందని సులభంగానే అర్ధమవుతుంది. ఈ పరిస్థితిని బాబు ఎలా ఎదుర్కొంటారన్నదే అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న. నిజానికి బాబు ఎన్డీఏలో ఉన్నప్పుడు గానీ, అంతకుముందు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా జాతీయ-ప్రాంతీయ పార్టీలను కూడగట్టి , ఆ పార్టీని మూడు చెరువు నీళ్లు తాగించినప్పుడు గానీ ఇలాంటి క్లిష్ట పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదు.
చివరకు వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న యుపిఏ1- యుపిఏ2లోనూ, బాబుపై దృష్టి పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నించలేదు. వైఎస్ సీఎం అయిన తర్వాత తొలిరోజుల్లో, కాంగ్రెస్ నేతలు బాబుకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రకటనలపై స్వయంగా రాహుల్‌గాంధీనే స్పందించారు.  ఎవరూ అలా వ్యతిరేక ప్రకటనలు చేయవద్దని,  దేశంలో ఉన్న కొద్దిమంది మేధావుల్లో బాబు ఒకరని, ఆయనను గౌరవించాలని  స్పష్టం చేశారు.  ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ బాబును రాజకీయ ప్రత్యర్ధిగానే భావించింది. దేశంలో బిజెపి వ్యతిరేక శక్తులందరిపైనా ఐటి, ఈడీ దాడులు జరిగినా, గత ఎన్నికల ముందు బిజెపి నుంచి బయటకు వచ్చే ముందువరకు బాబు అనుచరులపైనా ఎన్డీఏ దృష్టి సారించలేదు. ఎప్పుడైతే మోదీ-షా ద్వయాన్ని ధిక్కరించడం ప్రారంభించారో అప్పటి నుంచే బాబుకు ఆర్ధికంగా, రాజకీయంగా కష్టాలు ప్రారంభమయ్యాయి.
తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న బాబుకు ఈ పరిణామాలు సవాలు. ఒకరకంగా మోదీ-షా మనస్తత్వం ఆయనకు పూర్తిగా కొత్త. ఎవరి అంచనాలకూ అందని వ్యూహకర్తలు వారు. వాళ్లిద్దరి మనస్తత్వం గ్రహించడం కూడా కష్టమే. ఈ క్లిష్ట, గందరగోళ పరిస్థితిని ఎదుర్కొని బయటపడకపోతే పార్టీ నిలబడటం చాలా కష్టం. పార బలహీనపడుతుందని భావిస్తే ఎవరూ కొనసాగేందుకు ఇష్టపడరు.  పార్టీ నిలదొక్కుకోవాలంటే ఆర్ధిక వనరులు అవసరం.గతంలో మాదిరిగా ఇప్పడు పార్టీకి సంబంధించిన ఆర్ధికాధికారాలు బాబు చేతి నుంచి కుటుంబసభ్యుల చేతుల్లోకి వెళ్లిపోయాయని, ఖర్చు విషయంలో ఎన్టీఆర్ లక్షణాలు పుణికిపుచ్చుకున్న వారి నుంచి వనరులు ఆశించలేమన్న వ్యాఖ్యలు గత ఐదారునెలల నుంచి పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. చంద్రబాబు పూర్తి స్థాయిలో సొంత నిర్ణయాలు తీసుకున్న ప్రతిసారీ పార్టీ పురోగతి సాధించిందని, ఎప్పుడైతే ఒత్తిళ్లు, కుటుంబసభ్యుల జోక్యం మొదలయిందో అప్పటి నుంచే తిరోగమనం మొదలయిందని సీనియర్ నేతలు విశ్లేషిస్తున్నారు.
ఈ పరిస్థితిలో సహజంగా బాబుకు మూడే మార్గాలు కనిపిస్తున్నాయి. ఒకటి బిజెపితో సంధి చేసుకోవడం, రెండోది కుదరకపోతే సమరం సాగించడం. మూడోది స్వంత వనరులతో పార్టీ నడిపించి, కార్యకర్తలకు భరోసా కల్పించడం. మొదటి దానికి బాబు సిద్ధంగానే ఉన్నప్పటికీ, బిజెపి నాయకత్వం అందుకు సుముఖంగా లేదంటున్నారు. ఒకవేళ పైస్థాయిలో సానుకూలంగా ఉన్నా, రాష్ట్ర స్థాయిలో బాబును వ్యతిరేకిస్తూ, వైసీపీతో రహస్య స్నేహం చేస్తున్న బిజెపి లోని ఒక వర్గం ఆ ప్రయత్నాలను నీరుగార్చడం ఖాయం. ఇక  చివరకు పార్టీని బిజెపిలో విలీనం చేయడం ఒక్కటే మార్గం. అందుకు బాబు అంగీకరిస్తారా అన్నది ఒక ప్రశ్న.ఇక రెండో మార్గంలో వెళ్లడం అంత సులభం కాదు. ఎందుకంటే దేశంలో నెలకొన్న ఈ క్లిష్ట రాజకీయ పరిస్థితిలో బిజెపితో  కలబడి నిలబడటం అంత సులభం కాదన్నది బాబుకు స్పష్టంగా తెలుసు. అందుకే ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజ్యసభలో కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లులను టిడిపి సమర్ధించింది. బిజెపిపై విమర్శలను పూర్తి స్థాయిలో అటకెక్కించింది. చివరకు ప్రతి బడ్జెట్‌పై స్పందించే చంద్రబాబునాయుడు, ఈసారి మాత్రం మౌనవ్రతం పాటించారు. ఒకవేళ కాంగ్రెస్‌తో కలసి పోరాటం చేసినా సంస్థాగతంగా ఆ పార్టీనే బోలెడన్ని సమస్యలు ఎదుర్కొంటోంది. మూడవది అమలు కావాలంటే, ఎన్టీఆర్ లక్షణాలు పుణికిపుచ్చుకున్న కుటుంబసభ్యుల పెద్దమనసుపైనే ఆధారపడి ఉంది. మరి ఈ పరిస్థితిలో బాబు పార్టీని ఎలా గట్టెక్కిస్తారు? తన వారికి ఏరకంగా ఆత్మస్ధ్యైర్యం ఇస్తారో చూడాలి. ఏదేమైనా ఇప్పటికయినా కుటుంబసభ్యులు, భజన సంఘాలను పక్కకుపెట్టి నిర్ణయాలు తీసుకోకపోతే, టిడిపి ఉనికి ప్రశ్నార్ధకమేనన్నది పార్టీలోని మెజారిటీ నేతల వ్యాఖ్య.