జీవీఎల్.. జగన్ ఏజెంటా?

495

సొంతగడ్డపైనే పాపం జీవీఎల్‌కు సెగ
సంఘ్‌లోనూ అసంతృిప్తిస్వరం
అటు విపక్షాల నుంచి పెరుగుతున్న ఆరోపణలు
ఇటు సొంత పార్టీలోనూ కరవైన మద్దతు
వర్ల నుంచి సంఘ్ శార్దా వరకూ..

(మార్తి సుబ్రహ్మణ్యం)

గుంటుపల్లి వెంకట లక్ష్మీ నరసింహారావు… అదేనండీ…‘దక్షిణ భారతదేశం నుంచి  ఎన్నికయిన ఏకైక పార్టీ అధికార ప్రతినిధిగా చెబుతున్నా.. నామాటే ఫైనల్. నా మాటే పార్టీ మాట’ అని మీడియా ముందు బల్లగుద్ది వాదిస్తుంటారే.. జీవీఎల్ నరసింహారావు. ఆయనన్నమాట.  ఇప్పుడు గుర్తుకొచ్చిందా! ఓకే. ఓకే. ఈ రాష్ట్ర ప్రజలెవరూ ఆయనను అంత అర్జంటుగా  గుర్తు తెచ్చుకోరు. ఎందుకంటే ఆయన గుర్తులేవీ ఇక్కడ లేవు కాబట్టి. కేరాఫ్ అడ్రసంతా ఢిల్లీనే. పుట్టి, పెరిగింది బల్లికురవ, నర్సరావుపేట అయినప్పటికీ జీవనం అంతా ఢిల్లీనే కాబట్టి, ఇక్కడి వారికెవరికీ ఆయన తెలిసి ఉండకపోవడం పెద్ద ఆశ్చర్యం కాదు. కానీ.. వర్ల రామయ్యలు, శైలజానాధ్‌లు, బండారు సత్యనారాయణలు, అనూరాధలకు మాత్రం జీవీఎల్ గుర్తుకొచ్చారు. సంఘ్ సిద్ధాంతకర్తలక్కూడా! ఇప్పటివరకూ పేపర్లు, టీవీలు చూసేవారికి ఆయన బిజెపి జాతీయ అధికార ప్రతినిధిగానే తెలుసు. కానీ ఈ నేతలు కొత్తగా ఆయనను జగన్ ఏజెంటుగా ముద్ర వేయడంతో ఆ రెండోహోదాపై సహజంగానే చర్చ మొదలయింది. ఇంత రచ్చ జరుగుతున్నా ఆయన సొంత పార్టీ గళధారులేమైనా విమర్శలకుపై ఏమైనా గొంతు విప్పారా? మా జీవీఎల్‌ను అంతలేసి మాటలంటారా అని ఎదరుదాడి చేశారా అంటే అదీ లేదు. అది ఇంకో కథ!
ఏపీకి చెందిన యుపి బిజెపి ఎంపి జీవీఎల్ నరసింహారావు రాజధాని అమరావతి తరలింపు, మూడు రాజధానులు చేయాలన్న ఏపీ సీఎం జగన్ సంకల్పానికి సంబంధించి.. గత కొద్దిరోజుల నుంచి చేస్తున్న ప్రకటనలు, పిలిచి ఏర్పాటుచేసిన మీడియా పేరంటాల్లో చెబుతున్న మాటలు మాజీ మిత్రపక్షమైన టిడిపికి క డుపు రగిలిస్తున్నాయి. అయితే గట్టిగా విమర్శించలేని దుస్థితి. ఎందుకంటే అసలే పార్టీ ఓడిపోయింది. పైన మోదీ-షా. ఏం మాట్లాడితే అది నానా రకాలుగా వెళ్లి, చివరకు ఏం కొంపముంచుతుందో తెలియదు. అసలే రోజులు బాగోలేదు. అందుకే కదా.. ప్రతి కేంద్రబడ్జెట్‌పై మీడియాను పిలిచి మరీ మాట్లాడే చంద్రబాబు, ఈసారి గమ్మున ఉండిపోయింది. అలాగని మౌనంగా ఉంటే కుదరదు. రాజకీయబండి నడవాలి. అందుకే జీవీఎల్‌పై టిడిపి ఫైర్‌బ్రాండ్ వర్ల రామయ్యను వదిలారు..ఇంకేముంది? అవకాశం వస్తే రెచ్చిపోయే రామయ్య.. జీవీఎల్‌పై విరుచుకుపడ్డారు. అటు బిజెపిని టచ్ చేయకుండానే, బిజెపి కూడు తింటూ వైసీపీ పాట పాడుతున్నారని జీవీఎల్‌పై శివమెత్తారు. పైగా… జగన్ అండ్ కోతో ఆయన ఎక్కడెక్కడ, ఎలా అంటకాగిందీ ప్లేసుతో సహా చెప్పడం కలకలం కలిగించింది.
‘బిజెపి రాష్ట్ర శాఖ ఒకదారిలో వెళ్తుంటే జీవీఎల్ ఇంకో దారిలో వెళుతున్నారు. యుపి ఎంపి అయిన ఆయన రాష్ట్రంలో తనకు సంబంధం లేని అంశాల్లో తల, కాళ్లు, చేతులు ఎందుకు పెడుతున్నారు? వైసీపీకి అనుకూలంగా మాట్లాడటం ఆయనకు అలవాటయింది. అందులో మతలబేమిటి? జీవీఎల్ జగన్ సన్నిహితులను ఎందుకు కలిశారు? వారిద్దరి మధ్య జరిగిన చర్చలేమిటో చెప్పాలి. రాష్ట్ర బిజెపి నేతలు లేకుండా ఆయనొక్కరే వారిని ఎందుకు కలిశారు? వారిని  కలిసేందుకు హడావిడిగా వెళ్లిన జీవీఎల్ తర్వాత ప్రశాంతంగా బయటకు రావడం వెనుక ఏం జరిగిందో చెప్పాలి. బోలెడు అనుమానాలు కలుగుతున్నాయి. 15-20 రోజుల క్రితం జీవీఎల్ జగన్ ముఖ్య అనుచరులతో ఢిల్లీలోని లోధి హోటల్‌లో కలుసుకున్నారు. ఒకప్పుడు సామాన్య గుమాస్తాగ ఉన్న జీవీఎల్‌కు ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలెలా వచ్చాయి? ఆయనో పనికిమాలిన ఎంపి. జగన్ ఏజెంటుగా పనిచేస్తున్నార’ని దూదేనట్లు ఏకిపారేశారు.ఇక రాజధానులపై జీవీఎల్ చేస్తున్న ప్రకటనలపై, విశాఖకు చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి బోలెడంత కోపం వచ్చింది. ‘జీవీఎల్ ఈ రాష్ట్రానికి చెందినవాడైనా ఆయనతో మనకు నయాపైసా (ఇది మాట వరసకు లెండి. ఆయన రూపాయి కూడా అన్నార్లెండి) లాభం లేదు. ఆయన సీఎం జగన్‌కు ఏజెంటుగా వ్యవహరిస్తున్నారు. అమరావతిలో రైతుల ఆవేదన ఆయనకు కనిపించలేదా? జీవీఎల్ నపుంసకుడిలా వ్యవహరిస్తున్నారు’ అని తిట్లు, శాపనార్ధాలు లంకించుకున్నారు.
అటు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా జీవీఎల్‌కు జగన్ ఏజెంటన్న బిరుదు ఇచ్చారు. ‘ బిజెపి ఎంపి జీవీఎల్ జగన్ ఏజెంటులా వ్యవహరిస్తున్నారు. బిజెపి-వైసీపీ కలసి కాపురం చేస్తున్నామని చెప్పవచ్చు. ఈ డొంకతిరుగుడు అనవసరం. వాళ్లు లీగల్‌గానే కాపురం చేయవచ్చ’ని ఘాటైన విమర్శలు చేశారు.  పిసిసి చీఫ్ శైలజానాధ్ కూడా బిజెపి-వైసీపీ బంధాన్ని కడిగేశారు. ఎన్నార్సీ బిల్లుకు ఢిల్లీలో మద్దతునిచ్చి, మంత్రులిక్కడ నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. జీవీఎల్ వ్యవహారశైలి తమకంటే ఆ పార్టీ వాళ్లకే బాగా తెలుసన్నారు.
వీళ్లంటే సరే..  అటు  బిజెపికి దిక్సూచి లాంటి ఆర్‌ఎస్‌ఎస్ కూడా జీవీఎల్ మాటలపై మండిపడటమే ఇక్కడ ఆశ్చర్యం. సంఘ్ సిద్ధాంతకర్త రతన్ శార్దా కూడా జీవీఎల్‌పై విమర్శానాస్త్రాలు సంధించారు. ‘బిజెపి వైఖరి జగన్ తుగ్లక్  అనేదా.. లేక రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదన్న జీవీఎల్ వ్యాఖ్యలే దాని విధానమా? అసలు మూడు రాజధానుల చెత్త ఆలోచనలను ఎలా సమర్ధిస్తారు? వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేయడమే బిజెపి విధానమా? రాజధానికి భూములిచ్చిన రైతుల జీవితాలతో జగన్ ఆడుకోవడాన్ని, మూడు రాజధానుల చెత్త ఆలోచనను సమర్ధిస్తున్నారా’ అంటూ ఏకిపారేయడమే విస్మయం కలిగిస్తోంది.
సరే.. ఈ రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమైనవే అయినప్పటికీ..మన జీవీఎల్ లోధి హోటల్‌లో జగన్ సలహాదారులను కలిశారన్న వర్ల రామయ్య ఆరోపణే ఆసక్తికరంగా మారింది. నిప్పు లేనిదే పొగ రాదన్నట్లు.. హోటల్ పేరు సహా చెప్పడం మరిన్ని అనుమానాలకు, చర్చకు దారితీసింది. ఈవిధంగా తమ జాతీయ నేత జీవీఎల్‌పై విపక్షాలు ఈ స్థాయిలో విరుచుకుపడుతుంటే, బిజెపినేతలు మాత్రం మౌనంగా ఉండటం మరో ఆశ్చర్యం. సహజంగా ఏ పార్టీ అయినా తమ నేతపై ఎవరైనా విమర్శలు చేస్తే ఎదురుదాడి చేస్తుంటాయి. కానీ, జీవీఎల్‌పై నలుచెరుగులా దాడి జరుగుతుంటే ఒక్క కమల వీరుడూ గళం విప్పకపోవడం బట్టి.. జీవీఎల్‌కు రాష్ట్రంలో ఎంత బలం ఉందో అర్ధమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే.. ప్రత్యేక హోదా గురించి ఎక్కువగా మాట్లాడితే గత ప్రభుత్వానికి పట్టిన గతే జగన్‌కూ పడుతుందని వ్యాఖ్యానించిన జీవీఎల్ హెచ్చరికను, మీడియా ప్రతినిధులు కన్నా లక్ష్మీనారాయణ వద్ద ప్రస్తావించి, ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. అయితే దానిని వివాదం చేయాల్సిన పనిలేదని సర్దిచెప్పారు.
ఇటీవల పార్లమెంటులో గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ రాజధానిపై ప్రశ్న అడగటం, అమరావతిని తాము గతంలోనే రాజధానిగా నోటిఫై చేశామంటూనే రాజధాని ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిథిలోనిదని కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది.  కేంద్రమంత్రి ఆ మాట చెప్పారో లేదో.. చెప్పిన వెంటనే జీవీఎల్ మీడియా ముందుకొచ్చి.. తాను చెప్పిందే నిజమయిందన్నారు. అది సహజంగానే టిడిపికి మింగుడుపడలేదు. వైసీపీకి మాత్రం బిర్యానీ పెట్టిన సంతోషం కలిగించింది. దీన్నిబట్టి జీవీఎల్ రాజధాని అంశంపై ‘బాగా ఉత్సాహంతో’నే ఉన్నట్లు కనిపిస్తోంది. మీడియా, విపక్షాల పుణ్యమా అని.. రోజూ కాళ్లకు బలపాలు కట్టుకుని పార్టీ కార్యక్రమలాంటూ రాష్ట్రమంతా తిరుగుతున్న కన్నా లక్ష్మీనారాయణ, పురంధీశ్వరి వంటి నేతలకు రాని ఉచిత ప్రచార ం.. ఒకటి రెండు స్టేట్‌మెంట్లిచ్చే జీవీఎల్‌కు బాగానే వస్తోంది. అది కూడా ఒక ఆర్టే సుమీ!