ఏబివెంకటేశ్వరరావు సస్పెండ్

587

పంతం నెగ్గించుకున్న జగన్
మరి సర్కారు నిర్ణయం కోర్టులో నిలుస్తుందా?
గ్లోబల్ టెండర్ల ద్వారానే పరికరాల కొనుగోలు
మూడుసార్లు రీ టెండర్
మరి అవకతవకలు ఎలా?
అదే ఆరోపణలు ఎదుర్కొన్న  సతీష్‌చంద్రకు మాత్రం పోస్టింగ్
కమ్మ అయినందుకే ఏబివీపై వేటా?
ఏబి క్యాట్‌కు వెళతారా?
(మార్తి సుబ్రహ్మణ్యం)

గత ప్రభుత్వంలో నిఘా దళపతిగా పనిచేసిన ఆలూరు బాల వెంకటేశ్వరరావు (ఏబి వెంకటేశ్వరరావు)ను సస్పెండ్ చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీ ఎక్విప్‌మెంట్ కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంలో ఆయన అవతకతవలకు పాల్పడినందున కాండక్టు రూల్స్‌ను ధిక్కరించినందున రూల్ 3 (1) కింద ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు జీఓ ఎంఎస్ నెంబర్ 18లో పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ శనివారం రాత్రి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనితో ఏబి వెంకటేశ్వరరావుకు ఎలాంటి పోస్టింగు ఇవ్వకుండానే, సస్పెండ్ చేయాలన్న ఏపీ సీఎం జగన్ పంతం నెగ్గినట్టరయింది. కానీ సర్కారు చేసిన అభియోగాలు, రేపు కోర్టులో నిలుస్తాయా అన్నదే చర్చనీయాంశంగా మారింది.
సెక్యూరిటీ పనిముట్ల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డార న్న సర్కారు అభియోగాన్ని పరిశీలిస్తే.. గతంలో చంద్రబాబు సర్కారు నక్సల్స్ కదలికలు కనుగొనేందుకు  యుఏవితోపాటు, మరో పరికరాన్ని సుమారు 22 కోట్లకు కొనుగోలు చేసింది. వాటిని స్టేట్ ట్రేడింగ్ కార్పోరేషన్ ద్వారా, కేంద్ర అనుమతులు, పరిశీలనతో కొనుగోలు చేసింది. దానికి సంబంధించి రెండు కమిటీలు కూడా ఏర్పాటుచేసింది. అయితే, ఆ రెండు కమిటీలలో నాడు ఇంటలిజన్స్ ఏడీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు సభ్యుడు కాకపోవడం గమనార్హం. అయితే ఆ పరికరాలు కొనుగోలు చేసే ముందు, ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు ఆహ్వనించింది. ఆ సందర్భంలో రెండుసార్లు సింగిల్ టెండర్ రాగా, రెండుసార్లూ దానిని రద్దు చేసి, మూడోసారి దానిని ఖరారు చేసింది. ఇదీ.. ఆ పరిక రాలకు సంబంధించిన వివరాలు.
 అయితే.. జగన్ సర్కారు అందులో అవకతవకలు జరిగాయంటూ ఆయనను సస్పెండ్ చేసిన తీరు ఆశ్చర్యంగా కనిపిస్తోందని న్యాయనిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ టెండర్లలో ఖరారయిన అంశంపై సస్పెన్షన్ చెల్లదని, అందులోనూ వాటి అర్హత ప్రాతిపదికను ఖరారు చేసేందుకు నియమించిన ఏ కమిటీలోనూ సభ్యుడు కాని అధికారిని సస్పెండ్ చేయడం కుదరదంటున్నారు. పైగా ఏబివెంకటేశ్వరరావు ఏడిజిగా పనిచేసిన కాలంలో ఇదంతా జరిగిందంటున్నారు. కానీ ఆయనను ఆ హోదా నుంచి తొలగించి, ఇప్పటివరకూ ఎలాంటి పోస్టింగు ఇవ్వకుండా గత ఎనిమిది నెలల నుంచి వెయిటింగ్‌లో ఉంచారు. ఒకవేళ నిజంగా అందులో అవకత వకలు జరిగాయని భావిస్తే, ఆయన ఆ పోస్టులో ఉండగానే చర్యలు తీసుకోవలసి ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. పైగా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు, ఈ కేసులో అంత అత్యవసరం లేదని వారు భావిస్తున్నారు.
నిజానికి తనకు గత 8 నెలల నుంచి పోస్టింగు లేకుండా వెయింటింగ్‌లో ఉంచిన నేపథ్యంలో, వేతనం ఇవ్వ్వాలని ఆయన రెండుసార్లు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఏబి వెంకటేశ్వరరావు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే సహజంగా ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు తమకు అన్యాయం జరిగిన సందర్భాల్లో క్యాట్‌ను ఆశ్రయిస్తుంటారు. ఇటీవలే జాస్తి కృష్ణకిశోర్‌కు వ్యతిరేకంగా జగన్ సర్కారు నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఆయన దానిని సవాల్ చేస్తూ క్యాట్‌ను ఆశ్రయించారు. దానిపై క్యాట్ కూడా కృష్ణకిశోర్‌కు అనుకూలంగానే వ్యాఖ్యానాలు చేసింది. ఈ నేపథ్యంలో ఏబీ కూడా క్యాట్‌ను ఆశ్రయిస్తారా?లేదా? అన్నది చూడాలి.
ఇదిలాఉండగా.. గతంలో వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, వారిని టిడిపిలో చేర్చడంలో నాటి సీఎంఓ ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్ర, ఇంటలిజన్స్ ఏడీజీ ఏబి వెంకటేశ్వరరావు కీలకపాత్ర పోషించారని వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి సహా కీలకనేతలంతా ఆరోపించారు. వారిద్దరిపై ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేశారు. దానితో నాటి సీఎస్ పునేఠా, ఏబి వెంకటేశ్వరరావును ఈసీ బదిలీ చేసింది. దీనితో తనపై విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలకు ఆగ్రహించిన ఏబి వెంకటేశ్వరరావు, ఆయనపై పరువునష్టం దావా వేస్తానని పత్రికాప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే విచిత్రంగా.. వైసీపీ ఎమ్మెల్యేల కొనుగోలులో ప్రముఖ పాత్ర పోషించారన్న ఆరోపణకు గురైన అదే సతీష్‌చంద్రకు, ఉన్నతవిద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పోస్టింగు ఇచ్చిన జగన్ సర్కారు.. అదే ఆరోపణలు ఎదుర్కొన్న ఏబి వెంకటేశ్వరరావుకు ఎలాంటి పోస్టింగు ఇవ్వకపోగా, ఆయనను సస్పెండ్ చేయడం ఆశ్చర్యపరుస్తోంది. సీఎంఓ అధికారి ఒత్తిడితోనే సతతీష్‌చంద్రకు పోస్టింగ్ వచ్చిందని, త్వరలో ఆయన సీఎస్ అయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదన్న వ్యాఖ్యలు కూడా వినిపించాయి. ఇది కూడా చదవండి.. ‘ఏపి కొత్త సీఎస్ సతీష్‌చంద్ర’... అయితే, సతీష్‌చంద్ర ఉత్తరాదికి చెందిన అధికారి, ఏబి వెంకటేశ్వరరావు కమ్మ వర్గానికి చెందిన వ్యక్తి కావడమే దీనికి కారణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి.. ఐఏఎస్‌ల్లో ఉన్న ఐక్యత ఐపిఎస్‌లకేదీ?’ జగన్ సర్కారు కమ్మ వర్గాన్ని అణచివేస్తోందని, ఆ సామాజికవర్గానికి చెందిన సీఐ, అడిషనల్ ఎస్పీ, ఎస్పీలకు ఇప్పటివరకూ పోస్టింగులు కూడా ఇవ్వలేదన్న ఆరోపణల నేపథ్యంలో, అదే సామాజికవర్గానికి చెందిన ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయడం విమర్శలకు దారితీస్తోంది.