అయ్యో…జగన్ మడమ తిప్పేశారేంటి చెప్మా?

587

అయ్యో…జగన్ మడమ తిప్పేరేంటి చెప్మా?
చిన్నాన్న హత్య కేసుపై పిటిషన్ వాపసులో మతలబేంటి?
ఆ పిటిషన్‌తో జగన్ ఇమేజీకి డ్యామీజీనే
సోదరే అనుమానిస్తుంటే సీబీఐకి ఇవ్వరేం?
టిడిపి చేతికి బ్రహ్మాస్త్రం ఇచ్చామంటున్న వైసీపీ నేతలు  

(మార్తి సుబ్రహ్మణ్యం)

అది ఎన్నికల సమయం. మరికొద్దిరోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. అంతలోనే పెద్ద కుదుపు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, వైసీపీ అధినేత, నాటి విపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి చిన్నాయన వైఎస్ వివేకానందరెడ్డి ఆయన ఇంట్లోనే దారుణ హత్యకు గురైన వార్త సంచలనం సృష్టించింది. ఆ హత్యకు కారణం చంద్రబాబు నాయుడేనని, టిడిపి నేతలే హత్యకు కారణమని జగన్ గవర్నర్‌ను కలిసి ఆరోపించారు. తనకు టిడిపి ప్రభుత్వం చేసే విచారణపై నమ్మకం లేదని, సీబీఐ , లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. వివేకా కూతురుదీ సేమ్ టు సేమ్ డిమాండ్. అంతకుముందు.. రక్తపుమరుగులో ఉన్న వివేకా దేహం చుట్టూ ఉన్న రక్తాన్ని కడిగేశారు. దానితో ఆధారాలు ధ్వంసమయ్యాయి. ఎన్నికలు ముగిసేంతవరకూ జగన్.. దానిపై సీబీఐ డిమాండ్ చేస్తూనే ఉన్నారు.
సీన్ కట్ చేస్తే..ఎన్నికలయ్యాక వైసీపీనే అధికారంలోకి వచ్చింది. హతుడు వివేకా కొడుకు జగనే సీఎం అయ్యారు. అంటే తన చిన్నాయన హత్యపై సీబీఐ డిమాండ్ చేసిన జగన్ ఏపీ సీఎం అయ్యారు. ఇప్పటికి ఆయన సీఎం అయి 8 నెలలవుతోంది. కానీ ఆ కేసు దిక్కూ మొక్కూ లేదు. మధ్యలో సిట్ అధికారులను మార్చేశారు. ఎస్పీ కూడా బదిలీ అయిపోయారు. అదే విషయాన్ని వివేకా కుమార్తె ఇటీవలే హైకోర్టుర్టులో పిటిషన్ వేశారు. అంతకుముందు ఆయన భార్య కూడా పిటిషన్ వేశారు. ప్రభుత్వం సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశిండం లేదని ప్రశ్నించారు. హైకోర్టు జోక్యం చేసుకుని సీబీఐ విచారణకు ఆదేశించాలని అభ్యర్ధించారు. పైగా తన సోదరుడే సీఎంగా ఉన్నప్పటికీ, ఈ ప్రభుత్వంపై తనకు నమ్మకం లేదని స్పష్టం చేశారు.
మరి ఈ పరిస్థితిలో మాట తప్పడం, మడమ తిప్పడం చేతకాని రాజన్న కుమారుడైన జగన్.. ఆ కేసును సీబీఐకి కదా అప్పగించాల్సింది? అదే కదా ఆయన గురించి తెలిసిన వారు, ఆయన తత్వం తెలిసిన వారు ఊహించే భావన? చివరకు తన సోదరే తనను అనుమానిస్తున్న పరిస్థితులో ఏ సోదరుడైనా.. అదీ అధికారంలో ఉన్న ఏ సోదరుడైనా సీబీఐ విచారణకు ఆదేశించి కదా తన చిత్తశుద్ధి నిరూపించుకుంటారు? కానీ జగన్ తీరు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉండటమే,  ఆయనను ప్రేమించే అభిమానులకు విస్మయం కలిగించింది.
వివేకా హత్య కేసును సీబీఐతో విచారణ చేయించాలన్న తన పాత పిటిషన్‌ను, ఉపసంహరించుకున్నట్లు జగన్ వేసిన తాజా పిటిషనే ఆయన ఇమేజీని పూర్తిగా డామేజి అయేందుకు కారణమయింది. అంతేనా?.. టిడిపి చేతికి బ్రహ్మాస్త్రం ఇచ్చినట్టయింది. ఎన్నికల ముందు తన చిన్నాన్న వివేకానందరెడ్డి హత్యపై నానా యాగీ చేసిన జగన్.. తానే సీఎం అయిన తర్వాత, సీబీఐ విచారణకు ఆదేశించడానికి బదులు, ఆ డిమాండ్ చేస్తూ గతంలో తాను వేసిన పిటిషన్‌ను ఎందుకు వాపసు తీసుకున్నారో తెలియక జగన్ అభిమానులూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఆ హత్య వెనుక  జగన్ కుటుంబసభ్యులే ఉన్నారని, అందుకే ఆయన సీబీఐకి కేసు అప్పగించడం లేదని  టిడిపి నేతలు ఆరోపిస్తుంటే, దానిని నిజం చేసేందుకన్నట్లు తన పిటిషన్ వాపసు తీసుకోవడాన్ని జగన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్ సోదరి సైతం ఈ ప్రభుత్వంపై తనకు నమ్మకం లేదని స్వయంగా కోర్టుకే చెబితే, ఇక తమ నాయకుడి ఇమేజ్ ఏం కావాలని జగన్ అభిమానులు తెగ ఆవేదన చెందుతున్నారు.
తాజాగా జగన్ వేసిన ఉపసంహరణ పిటిషన్ టిడిపికి వజ్రాయుధంగా మారింది. అటు వైసీపీ నేతలూ అలాగే భావిస్తున్నారు. దానిపై టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య.. సీఎం జగన్‌పై సంధించిన ప్రశ్నాస్త్రాలు ఆయన చిత్తశుద్ధిని, మాటతప్పరు-మడమ తిప్పరన్న పేరున్న ఆయన కీర్తిని గంగపాలు చేసేలా కనిపించాయి. నిజానికి వర్ల సంధించిన ప్రశ్నలకు బహుశా జగన్ వద్ద కూడా జవాబులు కనిపించనంతగా ఉన్నాయి. ‘సౌభాగ్యమ్మ, సునీత వేసిన పిటిషన్లు కూడా ఉపసంహరించుకునేలా జగన్‌వారిపై ఒత్తిడి చేస్తున్నారు. అందువల్ల వారిద్దరికీ రక్షణ కల్పించాలి. అసలు గతంలో సీబీఐ విచారణకు డిమాండ్ చే సిన ఆయన ఇప్పుడెందుకు పిటిషన్ ఉపసంహరించుకున్నారు? తనకు కావల్సిన వారు, మిత్రులు బయటపడతారన్న భయంతోనే పిటిషన్ ఉపసంహరించుకున్నారా? సునీత ఈ కేసులో వ్యక్తం చేసిన అనుమానాలన్నీ జగన్ నిర్ణయంతో నిజమని తేలింది. కేసును సీబీఐకి అప్పగించిన తర్వాత జగన్ పిటిషన్ ఉపసంహరించుకుంటే బాగుండేద’ని వర్ల శరపరంపరగా ప్రశ్నాస్త్రాలు సంధించారు.
తాజాగా తమ నేత జగన్ తీసుకున్న నిర్ణయం ఆయన కష్టపడి పెంచుకున్న ఇమేజీని డ్యామేజీ చేసేదేనని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసు సీబీఐకి ఇస్తే జగన్ విశ్వసనీయత మరింత పెరిగేదని, ఆ కేసులో టిడిపి చేసే ఆరోపణలన్నీ అబద్ధాలని తేలిపోయే అవకాశాన్ని ఆయన ఎందుకు చేజార్చుకున్నారో తమకు అర్ధంకావడం లేదని అటు వైసీపీ నేతలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తమ నేత నిర్ణయం టిడిపికి అస్త్రం ఇచ్చినట్టయిందని వ్యాఖ్యానిస్తున్నారు. టిడిపి నేతల రాజకీయ ఆరోపణలను పక్కకుపెడితే.. జగన్ సర్కారుపై తనకు నమ్మకం లేదంటూ సోదరి వేసిన పిటిషన్ వల్ల,తమ నేత విశ్వసనీయతకు మచ్చ ఏర్పడిందని వాపోతున్నారు. సొంత సోదరే ఈ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని చెబితే, దానినే అస్త్రంగా సంధిస్తున్న టిడిపిపై తామెలా ఎదురుదాడి చేయాలని ప్రశ్నిస్తున్నారు.  ఇప్పటికయినా వివేకా హత్య కేసు మిస్టరీ వీడి, తమ నేత మచ్చలేని నేతగా కీర్తి రావాలంటే.. సీబీఐ విచారణ ఒక్కటే శరణ్యమంటున్నారు. అయితే.. ఈ కేసు సీబీఐకి ఇస్తే, ఇక తాము కేంద్రం చేతిలో బందీలుగా మారాల్సి ఉంటుందని, తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున, నిష్పాక్షిక విచారణ చేసే అవకాశం ఉంటుందని మరికొందరు పార్టీ నేతలు వాదిస్తున్నారు.  
ఇదిలా ఉండగా.. ఇటీవల జైలు నుంచి విడుదలైన అమలాపురం మాజీ ఎంపి హర్షకుమార్.. హత్యకు గురైన వివేకానందరెడ్డి కేసుపై చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. వివేకా కేసును సీబీఐకి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దానితోపాటు.. పరిటాల హంతకులకు బుల్లెట్‌ప్రూఫ్ జాకె ట్లను జగనే సమకూర్చారంటూ చేసిన ఆరోపణ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదికూడా చదవండి పరిటాల హంతకులకు జగన్ బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లిచ్చారా?