బాబుపై బిజెపి గేమ్‌ప్లాన్ షురూ!

355

సన్నిహితుల ఇళ్లపై ఐటి దాడులతో మొదలు
బాబు పీఎస్, టిడిపి నేత ఇళ్లపై ఐటి మెరుపు దాడులు
త్వరలో మరికొందరు సన్నిహితులపైనా?
ఆర్ధికమూలాలు దెబ్బతీయడమే లక్ష్యం
టిడిపి అంతమే బిజెపి పంతమా?
ఆ తర్వాతనే వైసీపీ పని పడతారా?
ఏపీలో మొదలయిన బిజెపి పొలిటికల్ ఆపరేషన్ ?

(మార్తి సుబ్రహ్మణ్యం)

ఆంధ్రప్రదేశ్‌లో బలం లేని బిజెపి మరొక దారిలో పాగా వేసే పొలిటికల్ మాస్టర్‌ప్లాన్‌కు తెరలేపింది. అందులో భాగంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని నిరీర్యం చేయడం ద్వారా, తొలి అడుగువేయాలన్న ఆపరేషన్‌ను చంద్రబాబు సన్నిహితులపై ఐటి దాడులతో మొదలుపెట్టింది. టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు వద్ద సుదీర్ఘకాలం పిఎస్‌గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్, డిఎన్‌సి ఇన్‌ఫ్రా అధినేత నరేన్, కడప జిల్లా టిడిపి అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఆర్‌విఆర్ ఇన్‌ఫ్రా (నవయుగ), మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్, లోకేష్ సన్నిహితుడు రాజేష్ నివాసాలపై ఢిల్లీ నుంచి వచ్చిన ఐటి బృందం ఏకకాలంలో విజయవాడ, హైదరాబాద్‌లో దాడులు జరపడం సంచలనం సృష్టించింది. మరో మూడురోజులపాటు ఈ దాడులు కొనసాగే అవకాశం లేకపోలేదంటున్నారు. బాబు పిఎస్ శ్రీనివాస్, రాజేష్ మినహా.. మిగిలిన గత ఎన్నికల్లో టిడిపికి నిధులు సమీకరించారన్నది ఒక ఆరోపణగా వినిపిస్తోంది.
శ్రీనివాస్, రాజేష్ పైవారిచ్చే ఎలాంటి ఆదేశాలనయినా  పాటించేవారే తప్ప, స్వతహాగా వ్యాపారాలు చేసిన వారు కాదు. వారికి ఏ స్థాయిలోనూ సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం, అధికారం లేదంటున్నారు. అందులోనూ శ్రీనివాస్ ప్రభుత్వోద్యోగి.  చంద్రబాబు ఆర్ధిక వ్యవహారాలు, నిర్ణయాల్లో ఆయన భాగస్వామిగా ఉంటారని భావించలేం. ఆ మాటకొస్తే చాలామంది ప్రభుత్వోద్యోగులు మాజీ సీఎంలు, మాజీ గవర్నర్ల వద్ద సుదీర్ఘకాలంగా పనిచేస్తుంటారు. వారు ఏ పదవుల్లో ఉన్నా వారినే తెచ్చుకునే సంప్రదాయం కొన్నేళ్ల నుంచీ ఉంది. మంత్రులయితే, తమకు కావలసిన వారిని పిఎ, పిఎస్‌లుగా తెచ్చుకుంటారు. దానికి కారణం వారిపై ఉన్న నమ్మకం. ఏళ్లపాటు పనిచేసినందున, తమ వద్దకు వచ్చే వ్యక్తుల  గురించి, వారి అవసరాల గురించి వారికి పూర్తి అవగాహన ఉంటుందన్న విశ్వాసం.  ఆ కోణంలో విశ్లేషిస్తే శ్రీనివాస్‌పై దాడుల వెనుక.. చంద్రబాబుకు సంబంధించి ఏమైనా ఆధారాలు దొరుకుతాయోమోన్న ఆశ కనిపిస్తోంది. అయితే, ఐటి అధికారులు సహజంగా తమకు పక్కా సమాచారం ఉంటే తప్ప దాడులు చేయరు. పైగా ఆయన నివాసంలో వారు  గంటలసేపు విచారణ జరగడం సహజంగా ఉత్కంఠ రేపేదే.రాజేష్ కూడా బాబు కుటుంబానికి విశ్వసనీయుడైన వ్యక్తే తప్ప, తనమంతట తానుగా ఆర్ధిక వనరులు సమీకరించే స్థాయి ఉన్న వాడు కాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బాబు కుటుంబానికి సన్నిహితుడయినందున, సహజంగా పార్టీ అంతర్గత వ్యవహారాలు తెలిసి ఉండవచ్చంటున్నారు. ఇక మిగిలిన కంపెనీలలో ఏవైనా ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి అవకతవకలు జరిగి ఉండవచ్చంటున్నారు. ఆ కంపెనీలు గత సర్కారులో లబ్థి పొందినందున దానిని కొట్టివేయలేమంటున్నారు. అయితే.. ఐటితోపాటు ఈడీ అధికారులు కూడా దాడుల్లో పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతున్నా, ఇంతవరకూ అది ధృవపడలేదు.
బాబు సన్నిహితులపై దాడులు చేసేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం విజయవాడ, హైదరాబాద్‌కు రావడం, అది కూడా సీఆర్‌పిఎఫ్ బలగాలతో దాడులు చేయడం బట్టి.. ఇవి రాజకీయ ప్రేరేపిత దాడులని సులభంగానే అర్ధమవుతోంది. బాబు మాజీ పిఎస్ సహా ఆయన సన్నిహితుల ఇళ్లపై దాడులు చేశారంటే.. ఇక బిజెపి చంద్రబాబును రాజకీయ పద్మవ్యూహంలో ఇరికించే ప్రణాళికకు తెరలేపినట్లే అర్ధం చేసుకుని తీరాలి. ఎన్నికలయిన 7 నెలల తర్వాత ఈ దాడులు జరగడం, అది కూడా దాడులకు గురైన వారంతా ఏదో ఒక రూపంలో బాబుకు అత్యంత నమ్మకస్తులే కావడంతో, ఏపీలో టిడిపిని రాజకీయంగా నిర్వీర్యం చేసే మాస్టర్‌ప్లాన్ ప్రారంభమయిందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
నిజానికి చాలాకాలం నుంచి రాజకీయవర్గాలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేసేలా ఈ దాడులు జరగడం ఆసక్తి కలిగిస్తోంది. రాష్ట్రంలో బిజెపి బలపడాలంటే, ముందు ప్రతిపక్షంగా ఉన్న టిడిపిని బలహీనం చేయాలి. అది జరగాలంటే టిడిపిని ఆర్ధికంగా దెబ్బతీయాలి. అందుకు ఆ పార్టీకి సహకరించే వ్యక్తులు, కంపెనీల ఆర్ధికమూలలు కదిలించాలి. ఆ తర్వాత పార్టీకి చెందిన అగ్రనేతలు, వారి కంపెనీలపై ఐటి, ఈడీ విభాగాలు దాడులు చేసిన నేపథ్యంలో… అభద్రతాభావానికి గురైన ఆ పార్టీ ఎమ్మెల్యేలు, తమ రాజకీయ-ఆర్ధిక ప్రయోజనాలు కాపాడుకునేందుకు మూకుమ్మడిగా బిజెపిలో చేరేలా చూడాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు విధిలేని పరిస్థితిలో తన పార్టీని బిజెపిలో విలీనం చేస్తారు. దానితో రాష్ట్రంలో ‘ఆపరేషన్ టిడిపి’ విజయవంతంగా పూర్తవుతుంది. అప్పటివరకూ, అంటే టిడిపి బలహీనపడేవరకూ  జగన్‌కు తెరచాటు మద్దతు ఇస్తూనే ఉంటుంది.
ఇక ఆ తర్వాత వైసీపీని నిర్వీర్యం చేసే వ్యూహంపై పూర్తి స్థాయి దృష్టి సారిస్తుంది. ఆ క్రమంలో జగన్‌ను మళ్లీ జైలుకు పంపిస్తారు. ఆ సమయంలో ఏర్పడే రాజకీయ సంక్షోభాన్ని సద్వినియోగం చేసుకుని, వైసీపీలో చీలిక తీసుకువస్తుంది. అందుకు వైసీపీలో ఉన్న తన అనుకూల వ్యక్తుల సాయం తీసుకుంటుంది. ఫలితంగా మెజారిటీ వైసీపీ ఎమ్మెల్యేలు, అప్పటికే తన పార్టీలో చేరిన టిడిపి ఎమ్మెల్యేలతో కలసి బిజెపి ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది. ఒకవేళ ఆ ప్రయత్నం నెరవేరకపోయినా, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరిస్తుంది. దాని బలంతో వచ్చే ఎన్నికల్లో అధికారం సాధిస్తుంది. ఇదీ.. గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం.
తాజా దాడుల తీరు, అదే సమయంలో బాబు తనయుడు లోకేష్‌కు భద్రత కుదింపు, త్వరలో టిడిపి చీలిపోతుందన్న ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి ప్రకటన పరిశీలిస్తే ఈ ప్రచారం నిజమేనన్న అనుమానం రాక తప్పదు.తాజా దాడులపై చంద్రబాబు తన విలేకరుల సమావేశంలో స్పందించలేదు. మీడియా కూడా వాటిపై ఆయనను ప్రశ్నించినట్లు లేదు.బాబు వద్ద సుదీర్ఘకాలం నుంచి పిఎస్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ నివాసంపై ఐటి దాడులు జరిగాయంటేనే, బిజెపి బాబుపై పూర్తిస్థాయి దృష్టి సారించినట్లు మెడ మీద తల ఉన్న ఎవరికైనా అర్ధమయి తీరాలి.అదేవిధంగా ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే నవయుగ ఇన్‌ఫ్రా, లోకేష్ సన్నిహితుడు రాజేష్ నివాసంపైనా మూకుమ్మడి దాడులు జరిగాయంటే.. బాబు రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్న సంకేతాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. బిజెపి బాబు ఆర్ధికమూలాలను దెబ్బతీసే వ్యూహానికి తెరలేపినట్లు అర్ధం చేసుకుని తీరాలి. దాడులకు గురైన వారితో ఆ సొమ్ములు చంద్రబాబువేనని చెప్పించడం ద్వారా, వ్యక్తిగతంగా ఆయనను, సంస్థాగతంగా టిడిపిని అణచివేయాలన్న లక్ష్యం కనిపిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ఇటీవల కృష్ణపట్నం పోర్టు కంపెనీకి చెందిన తన 75 శాతం వాటాను నవయుగ అదానీకి అమ్మేసిందన్న వార్తలు వెలువడ్డాయి. ఆ క్రమంలో రాష్ట్రంలో కీలకనేత ఒకరు వెయ్యి కోట్ల రూపాయలు తన వాటాగా ఇస్తేనే, ఆ ప్రక్రియ సజావుగా సాగుతుందని షరతు విధించినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.ఒకవేళ నవయుగపై దాడుల్లో ఆ విషయం కూడా వెలుగులోకి వస్తుందో లేదో చూడాలి. చంద్రబాబు లక్ష్యంగా బిజెపి మొదలుపెట్టిన రాజకీయ వ్యూహం ఆలస్యంగానయినా,ఊహించనిరీతిలో ఉధృతంగానే మొదలయినట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో మోదీ-అమిత్‌షాను వ్యక్తిగత లక్ష్యంగా చేసుకుని, కాంగ్రెస్‌తో కలసి యుద్ధం ప్రకటించిన బాబుపై వారు ఆలస్యంగానయినా తమ శైలిలో  ప్రతీకారం తీర్చుకున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల కర్నూలుకు చెందిన ఓ నేత బిజెపిలో చేరిన సందర్భంగా అమిత్‌షాను కలసి, బిజెపి-టిడిపి మళ్లీ కలుస్తాయన్న ప్రచారం జరుగుతోందన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారట. అందుకు ఆయన ఆ సమస్యే ఇక రాదని బిగ్గరగా వ్యాఖ్యానించినట్లు సమాచారం.అంటే కమలదళం.. గత ఎన్నికల్లో బాబు తమపై చేసిన యుద్ధాన్ని అంత సులభంగా మర్చిపోయేలా లేరని స్పష్టమవుతోంది. అందుకే తొలుత.. రాష్ట్ర స్థాయిలో తాను తీసుకోవల్సిన ప్రతీకార చర్యలను, వైసీపీతో తెలివిగా చేయించిందంటున్నారు.  రాజధాని విషయంలో తన పార్టీ కూడా వైసీపీని వ్యతిరేకిస్తున్నప్పటికీ,  బిజెపి ఢిల్లీ పెద్దలు మాత్రం మౌనంగా ఉన్నారు. అలాగని వైసీపీకి పూర్తి స్థాయిలో సహకరించకుండా, టిడిపిని బలహీనం చేసే విషయం వరకూ సహకరిస్తున్నట్లు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆపరేషన్ టిడిపి విజయవంతం అయిన తర్వాత, ఇక తర్వాత ‘ఆపరేషన్ వైసీపీ’నేనంటున్నారు. ఈ విషయం ముందుగా పసిగట్టినందుకే జగన్.. ఐదేళ్లలో నెరవేర్చాల్సిన నవరత్న హామీలను ఇప్పుడే పూర్తి చేసి, జనంలో నిలిచిపోయే తిరుగులేని వ్యూహానికి తెరలేపారన్న ప్రచారం జరుగుతోంది. ఇది ఆయన రాజకీయ గురువు ఇచ్చిన సలహాగా చెబుతున్నారు. ఈడీ కేసులో జగన్ తిరిగి అరెస్టవుతారన్న ప్రచారం గత నెలరోజుల నుంచి విపరీతంగా జరుగుతోంది. ఆ మేరకు రెండు, మూడు నెలలకు మించి జగన్ సీఎంగా ఉండలేరని అటు బిజెపి వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. జరుగుతున్న పరిణామాలన్నీ ఈ ఊహాగానాలు, అనుమానాలకు బలమిచ్చేలా కనిపిస్తుండటం ప్రస్తావనార్హం.