బాబుకు.. జగన్ ‘యాదవ’ షాక్

826

బాబు చేయలేనిది జగన్ చేయబోతున్నారు
యాదవులకు రాజ్యసభ సీటు
బీదమస్తాన్‌రావుకు ఎంపి
ఇప్పటివరకూ యాదవులకు సీటివ్వని టిడిపి
తొలిసారి నిర్ణయం తీసుకోనున్న జగన్

(మార్తి సుబ్రహ్మణ్యం)

వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే. అది మంచయినా, చెడయినా సరే. ఎవరేమనుకుంటారన్న దానితో సంబంధం లేకుండా, తాను మాట ఇస్తే దానిని నెరవేర్చే తత్వం. అదే ఆయనకు ఇన్ని కోట్ల మందిని అభిమానులుగా మార్చింది. ఇప్పుడు ఏపీలో బీసీ వర్గాల్లో అతిపెద్ద జనాభా అయిన యాదవుల విషయంలోనూ అలాంటి సంచలన నిర్ణయమే తీసుకోవడం ద్వారా, రాష్ట్రంలోని బీసీలలో అతిపెద్ద జనాభా ఉన్న యాదవుల పెదవులపై చిరునవ్వులు పూయించనున్నారు.
రానున్న రాజ్యసభ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా యాదవ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావుకు వైసీపీ టికెట్ ఇచ్చేందుకు సీఎం జగన్ నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ మేరకు ఆయనకు రాజ్యసభ సీటుకు సంబంధించి జగన్ హామీ ఇచ్చారంటున్నారు.  ఈ విషయంలో ఆయన టిడిపి సంప్రదాయ  యాదవ ఓటు బ్యాంకును దెబ్బతీసేందుకు సిద్ధమవుతున్నారు. పైగా వ్యక్తిగతంగా టిడిపి అధినేత చంద్రబాబుకు సైతం యాదవులను దూరం చేయడం ద్వారా, యాదవ ఓటు బ్యాంకును శాశ్వతంగా తన వైపు మళ్లించుకునే వ్యూహానికి తెరలేపారు. అందులో భాగంగానే యాదవ సామాజికవర్గంలో పట్టు, పలుకుబడి ఉన్న బీద మస్తాన్‌రావుకు రాజ్యసభ సీటు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సుదీర్ఘకాలం టిడిపిలో పనిచేసి, చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడైన యాదవ నేత బీద మస్తాన్‌రావు ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి, జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం బాబుకు షాక్ కలిగించింది. ఎందుకంటే ఆయన నెల్లూరు జిల్లాలో పార్టీకి పెట్టనికోటలా నిలిచారు. పార్లమెంటు, అసెంబ్లీ, జడ్పీ ఎన్నికల సమయంలో పార్టీ అవసరం కోసం, తనకు  ఆసక్తి లేకపోయినా బాబు ఆదేశాల ప్రకారం పోటీ చేసి, ఆర్థికంగా నష్టపోయారు. అయినా తర్వాత ఆయనను పార్టీ ఆర్ధికంగా ఆదుకోలేదన్న ప్రచారం ఉంది. గత రాజ్యసభ ఎన్నికలో యాదవ కోటాలో రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చి, మొండిచేయి చూపించారు.ఎన్నికల సమయంలో ఆయన వ్యాపారాలపై ఐటి దాడులు కూడా జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన మౌనంగా ఉండిపోయి, వ్యాపారాలకు పరిమితమయ్యారు.డిసెంబర్ 3 2019న ‘సూర్య వెబ్‌సైట్‌’లో వచ్చిన టిడిపికి బీద సోదరులు గుడ్‌బై? వార్త నిజమయింది.
వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపి విజయసాయిరెడ్డి స్నేహితుడైన బీద హటాత్తుగా జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం ద్వారా, బాబుకు షాక్ ఇచ్చారు. బాబుకు నమ్మకస్తుడు, జిల్లాలో పార్టీకి ఆర్ధికంగా దన్నుగా నిలిచిన మస్తాన్‌రావు వైసీపీలో చేరడాన్ని టిడిపి నాయకత్వం జీర్ణించుకోలేపోతోంది. అయితే.. చంద్రబాబు రాజ్యసభ సీటు ఇస్తానని మాట ఇవ్వకుండా మాట తప్పడమే ఆయన పార్టీ మారేందుకు కారణమంటున్నారు. పార్టీలో మొదటి నుంచి సేవలందిస్తున్న తమను కాదని కొత్తగా పార్టీలో చేరిన నారాయణకు పెద్దపీట వేయడాన్ని కూడా ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఈ విషయంలో జగన్ వ్యూహాత్మకంగానే వ్యవహరించారు. రాష్ట్ర బిసి జనాభాలో అధిక సంఖ్యలో ఉన్న యాదవుల గత రాజకీయ నేపథ్యాన్ని గుర్తించిన తర్వాతనే, ఆయనకు ఎంపి హామీ ఇచ్చి వైసీపీలోకి తీసుకువచ్చినట్లు కనిపిస్తోంది.
ఎందుకంటే… ఇప్పటివరకూ టిడిపి చరిత్రలో, చంద్రబాబు పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో యాదవ వర్గానికి చెందిన ఒక్కరికీ సీటు ఇవ్వలేదు. కమ్మ, కాపు, కాపు, ముస్లిం, బిసిలోని ఇతర వర్గాలకే అవకాశం ఇచ్చిన బాబు… యాదవులకు ఒక్క అవకాశం కూడా ఇవ్వకపోవడం ఆ సామాజికవర్గం అసంతృప్తికి కారణమయింది. కాపు వర్గానికి చెందిన అల్లాడి రాజ్‌కుమార్, సి.రామచంద్రయ్యకు రెండుసార్లు, కళావెంకట్రావు, వంగాగీత, ఎర్రా నారాయణస్వామి, సీతారామలక్ష్మికి ఒకసారి, కమ్మ సామాజికవర్గానికి చెందిన రేణుకాచౌదరి, సుజనా చౌదరికి రెండుసార్లు,  దుర్గా రామకృష్ణ, యడ్లపాటి వెంకట్రావు,  కంభంపాటి రామ్మోహన్‌రావు, గరికపాటి మోహన్‌రావు, నందమూరి హరికృష్ణ, కనకమేడల రవీందర్, యలమంచిలి శివాజీ, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, వెలమ వర్గానికి చెందిన సీఎం రమేష్‌కు రెండుసార్లు, సినీనటుడు రావుగోపాలరావుకు ఒకసారి, గౌడకు చెందిన  దేవేందర్‌గౌడ్, రావుల చంద్రశేఖరరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, కడప నుంచి రామమునిరెడ్డి, మైసూరారెడ్డితోపాటు  పద్మశాలికి చెందిన రుమాండ్ల రామచంద్రయ్య, గుండు సుధారాణి, ముస్లిం వర్గానికి చెందిన లాల్‌జాన్‌బాషా, సైఫుల్లా వంటి వారికి అవకాశం ఇచ్చారు.
అయితే.. ఈ జాబితాలో యాదవ వర్గానికి చెందిన వారు ఒక్కరూ లేకపోవడంపై, ఆ వర్గంలో చాలాకాలం నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత ఐదారేళ్ల నుంచి రాజ్యసభ కోసం ప్రయత్నిస్తున్న సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు, ప్రతిసారి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోతూనే ఉంది. ఇటీవలి కాలంలో సుధాకర్‌యాదవ్‌కు టిటిడి చైర్మన్ పదవి లభించింది. ఉమ్మడి రాష్ట్రంలో బాబు సీఎంగా ఉన్న సమయంలో  కూడా కమ్మ, రెడ్లు, కమ్మవర్గానికి ఇచ్చిన ప్రాధాన్యం యాదవులకు ఇవ్వవలేదన్న విమర్శలుండేవి. క్యాబినెట్‌లో కూడా యనమల రామకృష్ణుడు, తలసాని శ్రీనివాసయాదవ్, కృష్ణాయాదవ్‌కు తప్ప మరొకరికి అవకాశం దక్కేది కాదు. వీరిలో యనమలను కొనసాగించడం పార్టీ-పరిపాలన దృష్ట్యా అనివార్యం కాగా, తలసానికి హైదరాబాద్‌లో ఉన్న పట్టు, అనుచరులు, ఫాలోయింగ్ వల్ల మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చింది.
నిజానికి ఏపీలోని ప్రతి జిల్లాలో ఎక్కువ జనాభా ఉన్న కులంగానో, రెండవ పెద్ద కులంగానో యాదవులకు స్థానం ఉంది. విశాఖ, చిత్తూరు, గుంటూరు వంటి ఆరేడు జిల్లాల్లో యాదవులదే సింహభాగం. ప్రధానంగా విజయవాడ, గుంటూరు, విశాఖ, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, కర్నూలు వంటి పెద్ద నగరాల్లో యాదవులదే ఆధిపత్యం. రాజకీయంగా యాదవులకు ఏ పార్టీ అయినా ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. ఇంతపెద్ద జనాభా ఉన్న యాదవులకు, టిడిపి ఇప్పటివరకూ రాజ్యసభ ఇవ్వకపోవడాన్ని గుర్తించిన జగన్.. రానున్న రాజ్యసభ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్‌రావుకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. నిజంగా అదే జరిగితే, ఇప్పటివరకూ టిడిపికి సంప్రదాయ మద్దతుదారుగా ఉన్న యాదవ వర్గంలో చీలికలు రావడం ఖాయం.