అవును.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు!

409

స్వరూపాకు సెక్యూరిటీ ఇస్తే ఏంటట?
కంచి, శృంగేరీ పీఠాలకు ఇవ్వకపోతే నేం?
స్థానిక పీఠాథిపతులకు ఆ స్థాయి లేదు మరి

(మార్తి సుబ్రహ్మణ్యం)

హేమిటో.. ఈ ఎల్లో మీడియా పూర్తిగా బరితెగించేసింది. శంకరాచర్యుల  అంశలో ఉన్న విశాఖ పీఠాథిపతి శ్రీమాన్ స్వరూపానంద సరస్వతి అంటే ఎల్లో మీడియా కళ్లలో నిప్పులు పోసుకుంటోంది ఎందుకో?! ఆయన అనుభవిస్తున్న రాచమర్యాదలు చూసి ఈర్ష్యతో కుళ్లుకుంటోంది. లోకకల్యాణం కాంక్షించే విశాఖ స్వాములోరికి ఇద్దరు ముఖ్యమంత్రులైన శిష్యులుండటం నేరమా? ఆయన పీఠానికి కారుచౌకగా భూములివ్వడం ఆక్షేపణీయమా? అందులో ఓ సీఎంకు ముద్దులివ్వడం పాపమా? ఆయన పీఠానికి సచివాలయం తర్వాత అంతటి స్థానం కల్పిస్తే, అందులో ఆక్షేపణ ఏమిటి? పోలీసు సార్లు కింద కూర్చుని స్వాములోరి అనుగ్రహభాషణ విని తరిస్తే తప్పేమిటి? అసలు ఇవన్నీ కాదండీ.. తెలుగు రాష్ట్రాల పాలకులకు పరమ పూజ్యునీయుడైన స్వామివారికి పోలీసు సెక్యూరిటీ కల్పిస్తే ఎల్లో మీడియాకు వచ్చిన నష్టమేంటిట? ఆ మాత్రానికే స్వామి వారి సౌకర్యాలు చూసి ఈర్ష్యపడాలా?.. ఆ పిచ్చిరోజులోన్లే ఆఫ్టరాల్ రాజుగారి బామ్మర్దినే జనం రాజులాగా గుర్తిస్తే, రాజుకు గురువైన రాజగురువును రాజు తర్వాత రాజుగా గుర్తిస్తే తప్పేంటి? ‘చిన్నతనం’ నుంచే ‘వేదాలు’, ‘పురాణాలు’ ‘ఉపనిషత్తులు’ అవపోసన పట్టిన జగ(న్గు)ద్గురువుగా విశాఖ జగదాంబ సెంటర్, అప్పటి సినిమా హాళ్ల పరిసర ప్రాంత వాసుల  నుంచి విశాఖ వాసులకు వర కూ.. ఇంకా చెప్పాలంటే ద్రోణంరాజు సత్యనారాయణ, సుబ్బిరామిరెడ్డి కాలం నాటి పాతకాలం వరకూ అందరికీ తెలిసిన స్వరూపానందుల వారికి, ఏపీ సర్కారు ఇచ్చిన పోలీసు ఎస్కార్ట్‌పై కొత్త వివాదానికి తెరలేచిన నేపథ్యంలో.. ఆయన భక్తుల నుంచి వినిపించిన ఆవేదనాపూరిత స్వరమిది!
విశాఖ శారదాపీఠాథిపతి స్వరూపానంద సరస్వతి అనుభవిస్తున్న సర్కారీ రాచమర్యాదలపై మరో  వివాదానికి తెరలేచింది. రాష్ట్రంలో ఏ పీఠాథిపతికీ లేని విధంగా, పోలీసు సెక్యూరిటీ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది పీఠాథిపతులు ఉన్నప్పటికీ వారికెవరికీ ప్రత్యేకంగా పోలీసు ఎస్కార్టు, బందోబస్తు, అవుట్‌పోస్టు సౌకర్యాలు లేవు. చివరకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆధ్మాత్మిక గురువైన త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయరు స్వామి వారికీ ఇలాంటి ప్రత్యేక సౌకర్యాలు లేవు. ఆయన పర్యటన ప్రాధాన్యం బట్టి స్థానిక పోలీసులే బందోబస్తు ఏర్పాటుచేస్తుంటారంతే. చాలాసార్లు ఆయన శిష్యబృందమే తప్ప పొలీసులు కనిపించరు. గతంలో కంచి పీఠాథిపతి జయేంద్రసరస్వతికి మాత్రమే ప్రత్యేక భద్రతా సౌకర్యం ఉండేది. ఆయన దేశవ్యాప్తంగా పర్యటించే క్రమంలో, ఉగ్రవాదుల నుంచి ముప్పు లేకుండా ప్రభుత్వం ఆ మేరకు భద్రత కల్పించింది.
ఇక శృంగేరీ, పుష్పగిరి, భువనేశ్వరీ, హంపీ, శివపీఠం అధిపతులకూ ప్రభుత్వాలు ఈరకమైన ప్రత్యేక సౌకర్యాలు సమకూర్చిన దాఖలాలు లేవు. వారు కూడా తమకు ఆ రకమైన సౌకర్యాలు కల్పించాలని కోరిన సందర్భాలూ లేవు. కాకపోతే వీరిలో కొందరికి ప్రోటోకాల్ సౌకర్యం సమకూర్చాయి. అయినప్పటికీ వారిలో ఎవరూ సర్కారీ సౌకర్యాలు కోరుకోలేదు. ఉగ్రవాదుల ముప్పు ఉన్న సందర్భాల్లో, ప్రభుత్వాలే వారి పర్యటన సమయంలో కొంత భద్రత కల్పించేవి. అయితే, విశాఖ పీఠాథిపతి స్వరూపానంద తరహాలో ఏ పీఠానికీ గతంలో ఇలాంటి సౌకర్యాలు కల్పించిన దాఖలాలు లేవు.అసలు సర్వసంగ పరిత్యాగి, భవబంధాల వంటి లంపటాలు లేని స్వాములకు, ఆధ్మాత్మిక ప్రసంగాలు, భక్తులకు ఆశీర్వాదాలిచ్చి ఆశ్రమాలకే పరిమితమయ్యే స్వాములకు..  ఈ పోలీసు ఎస్కార్టు, సెక్యూరిటీ పిచ్చ, ఈ పబ్లిసిటీ సోకు, ఫ్లెక్సీలు-హోర్డింగుల భజనసంఘాలేమిటి? ఎందుకు?  అన్నది ఇప్పుడు తెరపైకి వచ్చిన చర్చ.  
ఇప్పటివరకూ తెలుగు ప్రజలు చాలామంది పీఠాథిపతులను దర్శించారు. వారి ప్రవచనాలు విన్నారు. ఆ సందర్భాల్లో వారి చుట్టూ శిష్యులు, వచ్చి వెళ్లడానికి పెద్ద వాహనం తప్ప సెక్యూరిటీ కనిపించేది కాదు. కారణం వారిలో హిందువులు కాని వారూ ఉండవచ్చన్న ముందుచూపు. కానీ ఇప్పుడు శారదాపీఠం ఉత్తరాధికారి ఖరీదైన కార్లలో తిరుగుతున్న తీరును, స్వయంగా తోటి పీఠాథిపతులే ఆక్షేపిస్తున్న పరిస్థితి. స్వాముల వద్దకు సహజంగా రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపారులు వస్తుంటారు. వారికి కోట్లాదిమంది శిష్యులున్నా, ఈతరహా వీవీవీఐపి భక్తులతోనే అవసరాలు ఎక్కువ. వీవీఐపి భక్తులంతా ఒకచోట చేరితే ఇక అక్కడి ముచ్చట్లన్నీ అంతా వ్యాపార వ్యవహారాలపైనే  కదా? శంషాబాద్‌లో నెల్లూరుకు చెందిన ఓ ఆశ్రమ అధిపతి ఒకరికి పోలీసు, పొలిటికల్ నేతలైన శిష్యులే ఎక్కువ. ఆయన కాంగ్రెస్ హయాంలో ల్యాండ్ సెటిల్‌మెంట్లు, పోలీసు ట్రాన్స్‌ఫర్లు, పేకాట క్లబ్బులకు అనుమతి ఇప్పించేవారు. పోలీసు బాసులంతా ఆయన ఆశ్రమంలో కొలువుదీరేవారు. మంత్రులతో కాని ఎన్నో పనులను ఆయన ఇట్టే చక్కదిద్దేవారు. ఇలాంటి స్వాములే అప్పుడు, ఇప్పుడూ ‘పవర్’ఫుల్!కంచి, శృంగేరీ, పుష్పగిరి వంటి శంకరాచార్య పరంపర ఉన్న పీఠాల ఆచార వ్యవహారాలు,ఇప్పటికీ  ధర్మశాస్త్రాల ప్రకారమే కొనసాగుతున్నాయి. కానీ ఎవరికి వారు స్థాపించుకున్న  ‘లోకల్ పీఠాలే’పవర్ పాలిటిక్స్ కోసం వెంపర్లాడి, హిందూ ధర్మాన్ని మంటకలుపుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతమంది ముఖ్యమంత్రులు, ఎంతమంది గవర్నర్లు, ఎంతమంది మంత్రులు, ఎంతమంది ఆఫీసర్లు తమ పీఠానికి వస్తే వారికి  బయట మార్కెటు పైరవీల గిరాకీ!
అలాగని ప్రతి పీఠం అలాంటి దిగజారుడు పనులకు  పూనుకోదు. నిబద్ధత, హిందూ ధర్మ శాస్త్రలు అనుసరించే పీఠాలు, పీఠాథిపతులు బోలెడు. నిజానికి వారిలో చాలామందికి పీఠం నిర్వహణకు తగిన ఆర్ధిక వనరులు కూడా ఉండవు. ఎందుకంటే వారికి ‘ఆర్ట్ ఆఫ్ లీవింగ్’ తెలియదు కాబట్టి! పాపం వారింకా సత్తుకాలపు చాదస్తపు రోజుల్లోనే బతుకుతున్నారు. పాలకులకు దగ్గరగా ఉంటే, వీఐపి భక్తులు ఎక్కువ వచ్చి, తమ ఆర్ధిక ‘పఠం’ బలపడుతుందన్న  కాంక్ష ఉన్న ‘స్వయంప్రకటిత’ పీఠాలకే ఈ జబ్బు ఎక్కువన్నది ఒక విమర్శ. రాజకీయ పార్టీల మధ్య స్నేహాలు కుదర్చడానికి, మరో పార్టీని అధికారం నుంచి దించడానికి బేరసారాలు సాగించే ‘పవర్‌బ్రోకర్లు’గా రూపాంతరం చెందిన కొన్ని స్వయంప్రకటిత పీఠాథితులను చూసి హిందూ సమాజం అసహ్యించుకుంటోంది.  
అసలు ఐఏఎస్‌లను పీఠాలకు  పిలిచి, దేవదాయ శాఖ భూములపై సమీక్ష నిర్వహిస్తున్న దిక్కుమాలిన రోజులివి. తమ పీఠాలపై ఎన్ని ఆరోపణలు వస్తున్నా పట్టించుకోకుండా, వాటిని దులిపేసుకుని.. న వ్విపోదురుగాక నాకేటి సిగ్గని,  మళ్లీ రాజకీయపార్టీల కౌగిలిలో తన్మయత్వంతో కరిగిపోతున్న ‘ఆధునిక సర్వసంగ పరిత్యాగుల’ను చూసి లోకం సిగ్గుపడుతోంది. ఆ..  పడితే పడింది లెండి.. స్వాములోర్లకయితే సొమ్ములొస్తున్నాయి కదా? అదే పదివేలు!