పింఛన్లపై చెరుగుతున్న జగన్ ముద్ర

506

కమిషన్లు కొట్టేస్తున్న సిబ్బంది
కడప జిల్లాలోనే కమిషన్ల పర్వం
వెనక్కి ఇప్పించిన వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
పాత పద్ధతే బాగుంటుందన్న లబ్ధిదారులు
4 లక్షలమంది పెన్షనర్లకు గండి
సర్కారుకు శాపనార్ధాలు పెడుతున్న పెన్షనర్లు

 

(మార్తి సుబ్రహ్మణ్యం)

గడప వద్దకే పెన్షన్లు పథకంతో నేరుగా లబ్థిదారుల ఇళ్ల వద్దకే వచ్చి నగదు ఇస్తున్న వినూత్న ప్రక్రియ ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇమేజ్‌ను పెంచింది. కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఇళ్ల వద్దకే వచ్చి డబ్బులిస్తున్న వైనం వారిని సంతృప్తిపరుస్తోంది. కానీ, కిందిస్థాయి అధికారుల చేతివాటంతో, పెన్షనర్ల హృదయాలపై పడిన జగన్ ముద్ర చెరిగిపోతోంది. పెన్షన్ డబ్బులు ఇచ్చిన చేతితోనే కొంత మినహాయించుకుని ఇస్తున్న తీరే దానికి కారణం.జగన్ సొంత కడప జిల్లాలోనే పెన్షన్ల పంపిణీలో అవినీతి పర్వానికి తెరలేచింది. నగదు పంపిణీ చేస్తున్న కింది స్థాయి సిబ్బంది, అందులో 500 రూపాయలు మినహాయించుకుని ఇస్తున్న వైనం లబ్థిదారుల ఆగ్రహానికి కారణమవుతోంది. దీనికంటే గతంలో ఇచ్చిన విధానమే బాగుందనే అభిప్రాయానికి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని చాపాడు మండలం ఖాదర్‌పల్లె, పల్లెవోలు, నాగులపల్లె గ్రామాల్లో పెన్షన్లు పంపిణీ చేసేందుకు వచ్చిన స్థానిక అధికారి ఒక్కొక్కరి నుంచి 500 రూపాయలు మినహాయించుకున్నారు. ఇది మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వద్దకు చేరడంతో ఆయన పంచాయతీ చేసి, ఎవరి డబ్బు వారికి ఇప్పించారు.  ఈ సంఘటనలను పరిశీలిస్తే.. నేరుగా లబ్థిదారులకు నగదు రూపంలో ఇస్తున్న డబ్బు, ఏ స్ధాయిలో చేతులు మారుతున్నాయో స్పష్టమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ సొంత జిల్లాలోనే అవినీతి ఇంత భయంకరంగా ఉంటే ఇక మిగిలిన జిల్లాల్లో చెప్పాల్సిన పనిలేదు.
మైదుకూరు నియోజకవర్గంలోని ఆ మూడు గ్రామాల్లో పెన్షన్లు ఇవ్వడానికి వెళ్లిన గ్రామ కార్యదర్శి భానుకోట మునిరెడ్డి తమ నుంచి 500 రూపాయలు వసూలు చేశారని, ఆఫీసులో పుస్తకాలు, ఫర్నీచరు కోసం తీసుకుంటున్నానని ఆయన సమాధానం ఇచ్చారని లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు. ఈ పంచాయతీ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే వద్దకు చేరడంతో ఆయన స్పందించి, వారి డబ్బు వారికి ఇప్పించారు.
నిజానికి లబ్థిదారులకు నేరుగా డబ్బులిచ్చే ఈ కార్యక్రమం వల్ల సీఎం జగన్ ప్రతి లబ్దిదారుడికీ చేరువయ్యారు. తమను ఆఫీసుల చుట్టూ తిప్పే పని తప్పించినందుకు వారంతా ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. ఇది కూడా చదవండి.. ‘ పెన్షనర్ల పెదవులపై జగన్ చిరునవ్వు
ఒకేసారి చేతిలో డబ్బు రావడం వల్ల తమకు కొంత డబ్బు ఇబ్బంది కూడా తీరుతుందని వారు సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ, డబ్బులు పంపిణీ చేసే స్థానిక గ్రామ కార్యదర్శులు, వాలంటీర్లు చేతివాటం ప్రదర్శిస్తున్న తీరు జగన్‌పై పడిన తొలి సానుకూలత,  ప్రతికూలంగా మారుతున్న పరిస్థితి ఏర్పడింది. 50, 100, 500 రూపాయలు మినహాయించుకుని మిగిలిన డబ్బు ఇస్తున్నారని, దీనికంటే గతంలో తీసుకున్న విధానమే బాగుందన్న అభిప్రాయానికి  లబ్ధిదారులు వస్తున్నారు.
అటు భారీ సంఖ్యలో పెన్షన్లను తొలగించడంతో స్థానికంగా సర్కారుపై వ్యతిరేకత పెరుగుతోంది. తమను ఏ కార ణంతో తొలగించారో వారికి అర్ధం కాని పరిస్థితి. తమ వీధికి వచ్చిన అధికారులు తమను మినహాయించి, కొత్తవారికి పెన్షన్లు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాలలో మైనారిటీలు బయటకు వచ్చి జగన్ సర్కారును దుర్భాషలాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, రాష్ట్రంలో ఇప్పటికే పెన్షన్లు తీసుకుంటున్న 4, 27, 538 మంది లబ్థిదారులను తొలగించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.ప్రభుత్వ పథకాలలో తమ ప్రభుత్వం కులం, పార్టీలు చూడదని జగన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని వారు గ్రామ వాలంటర్లపై విరుచుకుపడుతున్నారు. పలువురు వృద్ధులయితే శాపనార్ధాలు కూడా పెడుతుంటే, వాలంటీర్లు తెల్లముఖం వేయాల్సివస్తోంది. స్థానిక వైసీపీ నేతలు చెప్పినట్లే చేస్తున్నామే తప్ప, అందులో తమ పాత్ర ఏమీ లేదని వారు వివరణ ఇచ్చుకుని తప్పించుకుంటున్నారు. ఇవన్నీ సహజంగానే జగన్ సర్కారుకు మైనస్ మార్కులుగానే భావించక తప్పదు. అయితే తాము కొత్తగా 6.11 లక్షల మంది కొత్తవారికి పెన్షన్లు ఇచ్చామని, గతంలో అనర్హులకూ జన్మభూమి కమిటీ పెన్షన్లు ఇచ్చిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెబుతున్నారు. దరఖాస్తు చేసుకుంటే ఇస్తామని చెప్పారు. అది నిజమే అయినప్పటికీ, కొన్నేళ్ల నుంచి పథకాలు అనుభవిస్తున్న లబ్థిదారులను, ఆ జాబితా నుంచి తొలగిస్తే సహజంగా వచ్చే వ్యతిరేకత ఏ ప్రభుత్వానికయినా నష్టమే. అందుకు జగన్ కూడా మినహాయింపు కాదు.