నిజామాబాద్‌లో స్పైసీబోర్డు ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్
పసుపుబోర్డుకు మించిన ప్రయోజనాలు
నిజమైన నిజామాబాద్ రైతుల కల
సత్తా చాటిన ఎంపి అర్వింద్
పైచేయి సాధించిన బిజెపి
(మార్తి సుబ్రహ్మణ్యం)
ఇప్పుడు తెలంగాణలో తెరాస-భాజపా మధ్య రాజకీయ యుద్ధం జరుగుతోంది. తమకు అందివచ్చిన ఏ ఒక్క అంశాన్నీ ఏ ఒక్కరూ విడుచుకునేందుకు సిద్ధంగా లేరు. ఏ చిన్న అంశం వచ్చినా దానిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు, ఇరు పార్టీలూ పోటీ పడుతున్నాయి. ఈ పోటీలో పాపం నాయకత్వం కోసం కొట్టుకుంటున్న కాంగ్రెస్ కొన్ని కిలోమీటర్ల వెనుకబడిపోయింది. తాజాగా నిజామాబాద్‌లో పసుపుబోర్డుకు మించిన ప్రయోజనాలున్న స్పైసీ ప్రాంతీయబోర్డు ఏర్పాటు అంశం బిజెపికి కలసిరానుంది.
నిజామాబాద్‌లో పసుపు ఏర్పాటుచేయాలని రైతులు చాలాకాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. గత టిఆర్ఎస్ ఎంపి కవిత కూడా ఆ మేరకు వారి హామీ ఇచ్చారు. కానీ, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి దానిని నెరవేర్చడంలో ఆమె విఫలమయ్యారు. గత ఎన్నికల్లో ఆమె ఓటమికి అదీ ఒక కారణమన్న వ్యాఖ్యలు లేకపోలేదు. పార్లమెంటులో ఆమె పసుపుబోర్డు ఏర్పాటు అవసరాన్ని చాలా సార్లు డిమాండ్ చేసినా, కేంద్రం పట్టించుకోలేదు. అయితే, గత ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసిన ధర్మపురి అర్వింద్ తాను గెలిస్తే, నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుచేస్తామని రైతులతో కూడిన జేఏసీకి హామీ ఇచ్చారు. తాను ఎంపీగా గెలిచిన 5 రోజుల్లో బోర్డు ఏర్పాటుచేయిస్తానని హామీ ఇచ్చారు. కానీ 7 నెలలయినా హామీ పత్తా లేకపోవడంతో రైతులు నిరసన వ్యక్తం చేశారు. దానితో సంక్రాంతి తర్వాత రైతులు శుభవార్త వింటారని మరో హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటిదాకా దానిని నెరవేర్చకపోవడం, ఇటీవలి బడ్జెట్ ప్రసంగంలోనూ దాని ప్రస్తావన లేకపోవడంపై, రైతులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు తెరాస కూడా బిజెపి వైఫల్యాన్ని ఎండగట్టింది.
అయితే, హటాత్తుగా కేంద్రమంత్రి పియూష్ గోయెల్.. నిజామాబాద్ లో స్పైస్ ప్రాంతీయ బోర్డు ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించి, తెరాస పక్కలో బాంబు వేశారు. ‘‘ఇది పసుపు పంట ఎగుమతులపై ప్రత్యేక దృష్టితో పనిచేస్తుంది. పసుపు సహా మిగిలిన మసాల దినుసుల ఎగుమతి కోసం పనిచేస్తుంది. పసుపుబోర్డుకు మించిన ప్రయోజనాలు ఈ బోర్డు ద్వారా లభిస్తాయి. పసుపు పంట నాణ్యత, దిగుబడి పెంచే విషయంలో ఈ కార్యాలయం పనిచేస్తుంది. పంట దిగుబడి వచ్చిన తర్వాత ఎగుమతులకు బోర్డు అన్ని రకాలుగా సహకరిస్తుంది. రైతులతో అంతర్జాతీయ బయ్యర్లతో సమావేశం ఏర్పాటుచేసి వారికి అధిక ధర వచ్చేలా చూస్తుంది. దీనితో నిజామాబాద్ రైతులు కోరిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చామని’ గోయెల్ తన ప్రకటనలో స్పష్టం చేశారు.దీనితో పసుపు బోర్డు కావాలంటూ ఏళ్లతరబడి కోరుకుంటున్న రైతుల స్వప్నం ఢముల్ ధమాకాతో నెరవేరినట్టయింది. పైగా వారి ఉత్పత్తుల అమ్మకాలకు రైతుల సమక్షంలోనే, నేరుగా అంత ర్జాతీయ బయ్యర్లకు అమ్మే వెసులుబాటు కల్పించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క పసుపు మాత్రమే కాకుండా అన్ని మసాలా దినుసుల ఎగుమతులకూ కొత్తగా ఏర్పాటుచేయబోయే, స్పైసీ ప్రాంతీయ బోర్డు వారధిగా నిలిచే ఏర్పాటుచేసిన బిజెపికి రైతులు కృతజ్ఞతలు చెబుతున్నారు.
తాజాగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సహజంగానే రాజకీయంగా బిజెపికి కలసిరానుంది. ఎందుకంటే నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పటుచేయాలని రైతులు కొన్నేళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో రైతులు భారీ సంఖ్యలో నామినేషన్లు కూడా వేసిన విషయం తెలిసిందే. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్.. కేంద్రం వద్ద తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. అయితే, తాజా బడ్జెట్లో అది కార్యరూపం దాలుస్తుందని భావించినా అది ఫలించలేదు. దానితో జేఏసీ బిజెపిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనితో ఎంపి అర్వింద్ మళ్లీ రంగంలోకి దిగి సమస్య తీవ్రత, గత హామీ, స్థానిక రాజకీయ పరిణామాలు వివరించడంతో, సాంకేతికంగా నిజామాబాద్‌లో స్పైసీ ప్రాంతీయబోర్డు ఏర్పాటుచేస్తున్నట్లు కేంద్రమంత్రి గోయెల్ ప్రకటించారు. తాజా పరిణామాలతో.. పసుపుబోర్డుకు మించిన ప్రయోజనాలతో కూడిన స్పైసీ బోర్డును ఇవ్వడం ద్వారా, బిజెపి తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస చేయలేని పని సాధించిందన్న కీర్తి దక్కించుకున్నట్టయింది. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పటికీ నిజామాబాద్‌లో పసుపు బోర్డు తీసుకురాలేకపోయారని ధ్వజమెత్తిన బిజెపి.. తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే బోర్డు ఏర్పాటుచేయిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు దానిని నెరవేర్చడం ద్వారా తెలంగాణలో జరుగుతున్న బిజెపి-తెరాస రాజకీయ యుద్ధంలో పైచేయి సాధించినట్టయింది. అటు ఎంపీగా అర్వింద్ తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ద్వారా, జిల్లా రైతుల గుండెల్లో నిలిచిపోయారు.