కష్టాల్లో కేకే

328

ఏపీ ఓటరయినా మున్సిపల్‌లో ఓటు
బిజె పి ఫిర్యాదుతో బట్టబయలు
కేకే సభ్యత్వం రద్దయ్యే అవకాశం
పావులు కదుపుతున్న బిజెపి

తెరాస సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడైన కే.కేశవరావు చట్టపరమైన చిక్కుల్లో ఇరుకున్నారు. కొత్తగా రూపొందించిన తెలంగాణ మున్సిపల్ చట్టం ఆయనను సాంకేతిక సమస్యల్లోకి నెడుతోంది.  సాంకేతికంగా ఏపీలో ఓటరయిన ఆయన, ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా నమోదయి, ఓటు కూడా వేసి బిజెపి చేతికి చిక్కారు. దానితో ఇప్పుడు పెద్ద చిక్కుల్లోనే ఇరుకున్నారు. కావాలనే చట్టాన్ని దుర్వినియోగం చేసిన కేశవరావుపై చర్య తీసుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తదితర నేతలు నేరుగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాత ఆయన తెలంగాణకు సంబంధించిన రాజ్యసభ సభ్యుడు  కాదని, విభజన సమయంలో ఆయనను  ఏపీకి  కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన జాబితాను, బిజెపి తాజాగా విడుదల చేయడంతో కేకే పీకలోతు కష్టాల్లో కూరుకుపోయినట్టయింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా ఓటు వేసిన కేకే ఏపీకి చెందిన సభ్యుడేనని రాజ్యసభ సచివాలయం, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌కు లేఖ రాసింది. ఇది బిజెపికి బ్రహ్మాస్త్రంగా మారనుంది.
        నిజానికి తెలంగాణ మున్సిపల్ చట్టం-2019 ప్రకారం ఇతర రాష్ట్రాలకు చెందిన రాజ్యసభ సభ్యులు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోకూడదు. కానీ, తుక్కుగూడలో బలం ఉన్న బిజెపికి చైర్మన్ పదవి రాకుండా,  ఎక్స్‌అఫిషియో హోదాను అడ్డుపెట్టుకుని ఓటేసిన వైనంపై బిజెపి సీరియస్ అయి, రాజ్యసభ చైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. దానితో నిబంధనల ప్రకారం తప్పు చేసిన కేకే సభ్యత్వాన్ని రద్దు చేసే దిశగా బిజెపి అడుగులు వేయడం కేకేను కలవరపాటుకు గురిచేస్తోంది. ఆధారాలన్నీ పక్కాగా ఉన్నందున ఆయనపై వేటు వేసే అధికారం రాజ్యసభ చైర్మన్‌కు ఉంది. దానితోపాటు, చట్టాన్ని దుర్వినియోగం చేసిన కేకేపై న్యాయపోరాటానికీ సిద్ధమవుతోంది. మరి ఇంత రచ్చకూ కారణమైన తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఏమవుతుందో చూడాలి. రాజకీయాల్లో నైతిక విలువల గురించి మాట్లాడే తెరాస నేతలు, తమ పార్టీకి బలం ఉన్న మున్సిపాలిటీలో దొడ్డిదారిలో చైర్మన్ పదవులు ఎలా సంపాదిస్తారని బిజెపి సీనియర్ నేత, నగర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు విమర్శించారు.