ఆయన సాంబి‘రెడ్డిగారే’… కానీ జగన్‌ను చంపేస్తానన్నాడు!

470

రాజధాని రైతు దీక్షలో వైసీపీ అభిమాని ఆవేశం
బిత్తరపోయిన అమరావతి రైతులు
(మార్తి సుబ్రహ్మణ్యం)

కమ్మవారంతా టిడిపిని, రెడ్లంతా వైసీపీని ప్రేమిస్తారన్నది ఒక ముద్ర. ఆ రెండు పార్టీలు అధికారంలో ఉండి ఏం నిర్ణయాలు తీసుకున్నా ఆ సామాజికవర్గాల వారు వాటిని గుడ్డిగా ఆమోదిస్తారన్నది ఒక ప్రచారం. కానీ, అదంతా భ్రమేనని.. తమకు అన్యాయం జరిగితే సొంత పాల‘కుల’నయినా వారిని నడిబజారులో నిలదీసి కడిగేస్తారన్న సత్యం, అమరావతి రైతు సాంబిరెడ్డి ఆవేశంతో తేలిపోయింది. పాలకులు తమ కులం వారయినంత మాత్రాన తాము గొర్రెల్లా వాటిని సమర్ధించాల్సిన అవసరం లేదని, తమకు అన్యాయం జరిగితే ఎంతవరకయినా వెళ్లేందుకు రె‘ఢీ’యేనన్న ఓ సగటు రెడ్డిగారు ఆవేదనతో ఆవిష్కరించిన ఆవేశమిది!
ఏపీ రాజధానిగా ఉన్న అమరావతి నుంచి విశాఖకు మార్చేందుకు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలపై అమరావతి రైతాంగం భగ్గుమంటోంది. రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో అన్ని కులాల రైతులు పాల్గొంటున్నారు. బయట ప్రచారంలో ఉన్నట్లు ఆ నిరసనలు ఒక్క కమ్మ కులానికే పరిమితం కాదని సాంబిరెడ్డి అనే వైసీపీ సానుభూతిపరుడైన ఓ రైతు నిరూపించిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజధాని త రలింపునకు వ్యతిరేకంగా పెదపరిమిలో జరుగుతున్న రైతు నిరసన దీక్షలో ఓ రైతు చేసిన ఆవేశపూరిత ప్రసంగం అక్కడి రైతులను ఖంగుతినిపించింది. తమను నమ్మించి మోసం చేసిన సీఎం జగన్‌ను అవసరమైతే చంపేసేందుకైనా వెనుకాడబోనని ఆ రైతు ఆవేశంతో ఊగిపోవడంతో రైతు శిబిరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంతకూ ఆ రైతు కమ్మ కులానికి చెందినవారనుకుంటే కచ్చితంగా త(ప)ప్పులో కాలేసినట్లే. ఆ రైతు పేరు సాంబిరెడ్డి! అవును అచ్చంగా రెడ్డి కులానికి చెందిన సాంబిరెడ్డే!! గత ఎన్నికల్లో జగన్‌పై టన్నులకొద్దీ ప్రేమాధిమానాలతో వైసీపీ విజయానికి పనిచేసిన సాధారణ రైతుబిడ్డ!!! అయితే, ఇప్పుడు జగన్‌ను నమ్మి ఓటేసినందుకు తమబోటి రైతులంతా రోడ్డునపడ్డామని, ఆయన అందరినీ రోడ్డునపడేశారని సాంబిరెడ్డి కన్నీటిపర్యంతమయ్యాడు.
అంతలోనే తేరుకుని.. రాజధాని తరలింపు నిర్ణయాన్ని విరమించుకోకపోతే జగన్‌ను హత్య చేసేందుకయినా వెనుకాడేది లేదని చేసిన హెచ్చరిక, శిబిరంలో ఉన్న వారిని ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘తాడేపల్లిలో జగన్ కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్నారు. కాబట్టి ఎక్కడికీ పోడు. అక్కడే ఉంటాడు. కానీ, రాజధాని తరలింపును ఆపకపోతే జగన్‌ను హత్య చేసేందుకయినా వెనుకాడబోన’ని తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. అయితే, అక్కడున్న రైతులు సాంబిరెడ్డి వద్దకు వెళ్లి, ఆయనను సముదాయించారు. ఆవిధంగా మాట్లాడకూడదని, మనది శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమమని సర్దిచెప్పడంతో సాంబిరెడ్డి శాంతించాడు.
సో.. దీన్నిబట్టి అర్ధమయ్యేది ఏమిటంటే… పాలకులు తీసుకునే ఏ నిర్ణయాన్నయినా ఆ పాల‘కుల’పోళ్లు గుడ్డిగా సమర్ధించరు. ఆ నిర్ణయాల వల్ల తాము నష్టపోతే, నిర్మొహమాటంగా నిలదీసేందుకయినా సిద్ధంగా ఉంటారు. ఆ ఆగ్రహానికి, నిరసనకు కులం అడ్డుగా భావించరు. ప్రకాశం జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో కమ్మ సామాజికవర్గం టిడిపిని గుడ్డిగా సమర్ధించదు. అక్కడ వైసీపీలో కూడా కమ్మవారు మెజారిటీ సంఖ్యలోనే ఉంటారు. మొదట్లో కాంగ్రెస్‌లో కూడా కమ్మవారు ఎక్కువమంది ఉండేవారు.  కృష్ణా జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. ఒక్క గుంటూరు జిల్లాలోనే మెజారిటీ కమ్మవారు టిడిపిని గుడ్డిగా మద్దతునిస్తారు. అయితే నర్సరావుపేట, సతె్తనపల్లి వంటి నియోజకవర్గాల్లో ఇటీవలి ఎన్నికల్లో ఆ వర్గం వారు.. దివంగత నేత కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరాం అరాచకాలు, దోపిడీకి నిరసనగా వైసీపీకి మద్దతునిచ్చారు. ఇప్పుడు మంగళగిరిలోనూ దాదాపు ఇలాంటి రివర్స్ పరిస్థితే మొదలయినట్లు కనిపిస్తోంది.

మంగళగిరి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో చాలామంది కమ్మవారు టిడిపి అభ్యర్ధి లోకేష్‌ను కాకుండా, వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డిని వ్యక్తిగత అభిమానంతో  సమర్ధించారు. వైసీపీ తాడేపల్లి పార్టీ అధ్యక్షుడు, జగన్ నివాసం ఉండే ప్రాంత పార్టీ అధ్యక్షుడు స్వయంగా కమ్మ వర్గానికి చె ందిన వారే కావడం విశేషం. ఆ ఎన్నికల్లో రెడ్లంతా గంపగుత్తగా ఆళ్లకు ఓటేసి గెలిపించారు. అయితే, రాజధానిని తరలించేందుకు జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తమ ఎమ్మెల్యే ఆళ్ల సమర్ధిస్తుండటాన్ని రెడ్డి వ ర్గం జీర్ణించుకోలేకపోతోంది. పక్కనే ఉన్న మరో రాజధాని నియోజకవర్గమైన తాడికొండ, ప్రత్తిపాడు నియోజవకర్గంలోని రెడ్డి సామాజికవర్గానికి చెందిన రైతులు కూడా జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుండటం విశేషం. వీరంతా కులాభిమానంతో గత ఎన్నికల్లో జగన్‌కు జైకొట్టిన వారే కావడం ప్రస్తావనార్హం.