ముంబాయిని మించి…

401

త్వరలో తెలంగాణలో ఫిలిం పాలిసీ
తలసానితో చిరు-నాగ్ భేటీ
( మార్తి సుబ్రహ్మణ్యం)

ప్రపంచాన్ని ఆకర్షిస్తోన్న హైదరాబాద్‌లో సినిమా పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సర్కారు ప్రణాళికలు రూపొందించింది. ఆ మేరకు దేశంలోనే అత్యుత్తమ సినిమా విధానాన్ని రూపొందించేందుకు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సినీ ప్రముఖుల అభిప్రాయం తెలుసుకుంటున్నారు. ముంబయిని మించి అత్యుత్తమ సినిమా విధానం ప్రవేశపెట్టాలన్నది కేసీఆర్ లక్ష్యమని తలసాని ఇటీవలే ప్రకటించారు. అందులో భాగంగా ఆయన సినీ పరిశ్రమ దిగ్గజాలయిన చిరంజీవి, అక్కినేని నాగార్జునతో భేటీ అయ్యారు. చిరంజీవి నివాసంలో జరిగిన ఈ భేటీలో సినిమా కార్మికుల సమస్యలు, సినీ కార్మికులకు సంక్షేమ పథకాల అమలు, ఇళ్ల నిర్మాణాలు, థియేటర్ల కొరత, కొత్త సినిమాల విడుదల సమయంలో టికెట్ల పెంపు వంటి అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ సినీ స్టుడియోలకు దేశానికి చెందిన నిర్మాణ సంస్థలే కాకుండా, అంతర్జాతీయ స్థాయి సినిమా కంపెనీలు కూడా వస్తున్నాయి. దేశ సినిమా చరిత్రలో సంచలనం సృష్టించిన బాహుబలి సినిమాకు హైదరాబాద్‌లోని కంపెనీలే విజువల్ ఎఫెక్ట్ అందించాయి. ప్రపంచాన్ని ఆకర్షించిన  ‘చోటా బీం’ పాత్ర సృష్టితోపాటు, లైఫ్ ఆఫ్‌వై వంటి టెక్నికల్ సినిమాలకు హైదరాబాద్‌లో ఉన్న కంపెనీలే విజువల్ ఎఫెక్ట్ అందించాయి. ఇప్పటికే పలు దేశాలకు చెందిన సినీ కంపెనీలు సర్వ సౌకర్యాలు ఉన్న రామోజీఫిలిం సిటీకి వస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే మంత్రి కేటీఆర్.. హైదరాబాద్‌ను యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్ హబ్‌గా మార్చేందుకు ఉన్న వనరులను, ఇటీవలి తన దావోస్ పర్యటనలో పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఇది కూడా చదవండి… ‘దావోస్‌లో తెలంగాణ దరువు’ ఆ మేరకు హైదరాబాద్‌లో ఇమేజ్ టవర్స్ నిర్మాణానికి సిద్ధమవుతున్నట్లు వారికి వెల్లడించారు.
     ఈ ప్రయత్నాలు ఫలిస్తే, సినిమా నిర్మాణాలు, సాంకేతిక అంశాల్లో హైదరాబాద్,  ముంబయిని  మించిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
దానికంటే ముందు, ఇక్కడ ఉన్న సినీ పరిశ్రమ కార్మికుల సమస్యలతోపాటు, సినిమా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం కోసం ఒక మెరుగైన విధానం తీసుకురావాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించింది. అందులో భాగంగానే మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సినీ దిగ్గజాలయిన చిరంజీవి-నాగార్జునను కలసి, వారి సలహాలు తీసుకున్నట్లు చెబుతున్నారు.
నిజానికి గతంలో చాలామంది సినిమాటోగ్రఫీ మంత్రులుగా పనిచేసినా తలసాని మాదిరిగా, పరిశ్రమతో నిరంతరం సంబంధాలు కొనసాగించిన మంత్రులెవరూ లేరు. దానికి ఆయన హైదరాబాద్‌కు చెందిన ప్రజాప్రతినిధి కావడం ఒక ప్రధాన కారణం. టిడిపిలో ఉన్నప్పటి నుంచి తలసానికి సినిమా ప్రముఖులు, నటులతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. దివంగత దాసరి, శ్రీహరి వంటి ప్రముఖులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆ అనుకూల అంశంతోనే ఆయన సినీ ప్రముఖులతో, నిరంతరం సమావేశాలు నిర్వహిస్తున్నారు. చాలామంది సినిమాటోగ్రఫీ మంత్రులు, అప్పుడప్పుడు సినిమాల ప్రారంభోత్సవాలకు సంబంధించి క్లాప్ కొట్టడానికే వచ్చేవారు. అయితే, తలసాని మాత్రం  ధియేటర్లలో టికెట్ల రేట్లు, సినీ కార్మికుల సమస్యల సందర్భంగా స్పందించి, వారితో భేటీ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాగా.. ఎన్టీఆర్ కుమార్తెను వివాహం చేసుకున్న సమయంలో, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ హయాంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.