కర్ర విరగలేదు.. రాజధాని చావలేదు!

480

ఇదీ కేంద్రం తీరు
            (మార్తి సుబ్రహ్మణ్యం)

ఒక ఊళ్లో గొడవ పడుతున్న ఇద్దరిని రాజుగారు పిలిపించారు. ఏం జరిగింది? ముందు ఎవరు ఎవరిని కొట్టారని ప్రశ్నించాడు. అయితే అందుకు ఇద్దరూ,  ముందు ఎవరికి వారు ఎదుటివాడే తనను కొట్టాడని ఫిర్యాదు చేస్తారు. ఇక లాభం లేదనుకున్న రాజు ఆ కొట్లాటకు సాక్షి అయిన అక్కడి వ్యాపారిని పిలిపిస్తాడు. అందుకు ఆ వ్యాపారి.. ‘రాజా వీళ్లిద్దరూ కొట్టుకున్న మాట నిజం. కానీ ముందు ఎవరు ఎవరిని కొట్టారో మాత్రం తెలియదు. అప్పుడు గాలి వాన వచ్చి నా కళ్లలో మట్టి పడింది’ అని తెలివైన సమాధానం ఇచ్చి బయటపడతాడు.


ఏపీ రాజధాని అమరావతి అంశంపై పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం చూస్తే,  చిన్నప్పుడు చదివిన ఈ కథ గుర్తుకు వచ్చింది. గుంటూరు టిడిపి ఎంపి గల్లా జయదేవ్ రాజధానికి సంబంధించి  అడిగిన  ప్రశ్నకు.. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ ఇచ్చిన జవాబు,  రాజధానిని కొనసాగించాలని పోరాడుతున్న టిడిపికి కొంత అనుకూలంగా, విశాఖకు తరలించే ప్రయత్నం చేస్తున్న వైసీపీ సర్కారుకు మరికొంత అనుకూలంగా కనిపించింది. రాజధానిపై నిర్ణయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. అది కేంద్ర పరిధిలోకి రాదని తేల్చిచెప్పారు. ఇది అధికార వైసీపీ తనకు అనుకూలంగానే భావిస్తోంది.
      అయితే అమరావతిని 2015లోనే రాజధానిగా నోటిఫై చేశామన్న మరో మాట మాత్రం, రాజధాని కోసం పోరాడుతున్న టిడిపి వాదనకు  ఊపిరిపోసింది. అంటే అమరావతిని ఎప్పుడో రాజధానిగా నోటిఫై చేసినందున, ఇక కొత్త రాజధాని అవసరం లేదన్నట్లుగానే కేంద్రమంత్రి ప్రకటనను భావించాల్సి ఉంటుంది. మళ్లీ..మూడు రాజధానుల ముచ్చటను ప్రస్తావిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రయత్నిస్తోందన్న విషయం మీడియాలోనే చూస్తున్నామన్న కేంద్రమంత్రి, దానిపై వివరణ ఇవ్వకుండా దాటేశారు. అంటే..రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అధికారిక ప్రయత్నాలు, నిర్ణయాలేవీ ఇప్పటిదాకా కేంద్రానికి ఏ రూపంలోనూ చేరలేదని స్పష్టమవుతోంది.
    ఈ విషయంలో బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేస్తున్న వాద నే నిజమని, తాజాగా  కేంద్రమంత్రి సమాధానం చూస్తే అర్ధమవుతుంది. రాజధాని ఎక్కడ ఏర్పాటుచేసుకోవాలన్న అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానిదేనని, అందులో కేంద్రం జోక్యం చేసుకోదని ఆయన చాలాసార్లు వాదించారు. అయితే, దానిని బిజెపిలోని ఒక వర్గమే వ్యతిరేకించింది. అవసరమైనప్పుడు కేంద్రం జోక్యం చేసుకుంటుందని బిజెపి నేతలు వ్యాఖ్యానించారు. అటు బిజెపి రాష్ట్ర శాఖ కూడా అమరావతిలోనే రాజధాని ఉండాలని తీర్మానించింది. మరి కేంద్రమే చెప్పినట్లు.. ఇప్పటికే అమరావతిలో రాజధాని ఉందని గుర్తించినందున, వైసీపీ సర్కారు  మూడు రాజధానుల కోసం చేస్తున్న ప్రయత్నాలకు ఎలా స్పందిస్తుందో చూడాలి.