అడ్డం తిరిగిన అజయ్ కల్లం ‘రెడ్డిమార్కు’ ప్రసంగం

622

కల్లంగారూ ఏమిటీ ‘రెడ్డిభజన’ అంటూ సోషల్‌మీడియాలో దాడి
చరిత్ర అంతా మీ రెడ్లదేనా?
మరి తప్పులతో మీకు సంబంధం లేదా?
కల్లం తరఫున ఖండించిన లక్ష్మణరెడి ్డ
సోషల్ మీడియాలో కుల సమరం
( మార్తి సుబ్రహ్మణ్యం)
అజయ్ కల్లం. సీనియర్ ఏఐఎస్. నిజాయితీపరుడైన అధికారి. ఏడు నెలల క్రితం ఆయన గురించి విన్న వారికి తెలిసింది ఇంతే. కానీ, జగన్మోహన్‌రెడ్డి ఏపీ సీఎం అయిన తర్వాత మాత్రం, సలహాదారుగా మారిన ఆయన ‘అజయ కల్లం రెడి’్డ అని, తన పేరు చివర ఉన్న ఆ రెండు అక్షరాలను తొలగించుకున్నారని,  టిడిపి నేతల విమర్శల ద్వారా బయట ప్రపంచానికి తెలిసింది. సహజంగా అయితే ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారు, అది కూడా అధికారిగా
పనిచేసిన వారు రాజకీయ ప్రసంగాలు చేయరు.
 కల్లం ఇప్పుడు వైసీపీ నేత కాదు. వేతనం తీసుకుంటున్న ప్రభుత్వ సలహాదారు. అయితే తాజాగా కుప్పంలో వైసీపీ నిర్వహించిన సభలో కల్లం  చేసిన ప్రసంగంలో ఆయనలోని రెడ్డితనం బయటకొచ్చింది. మరి సోషల్‌మీడియా ఖాళీగా కూర్చుంటుందా? చర్చ పేరిట రచ్చ చేయదూ? అదిగో.. ఇప్పుడు అదే పనిచేసింది. ఇంకేముంది? ఆయన చేసిన రెడ్లగొప్పతనంపై చర్చ లాంటి రచ్చ మొదలయింది. తెలుగు జాతికి రెడ్ల సేవలు, త్యాగాలపై ఆయన చేసిన ప్రసంగాన్ని చాలా గౌరవంగా తూర్పారపడుతూ, మర్యాదగా చురకలు పెట్టిన వ్యంగ్య కథనం ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అజయ్‌కల్లం చేసిన ప్రసంగంలోని అంశాలను ప్రస్తావిస్తూ, సంధించిన వ్యంగ్య ప్రశ్నాస్త్రాల పూర్తి పాఠం ఇది..

అజయ్ కల్లం గారూ,

నమస్కారాలు! ఇప్పుడే మీరు నారావారి పల్లెలో మాట్లాడిన వీడియెూ చూస్తున్నా. ప్రభుత్వ అధికారిగా మంచి పేరు ఉన్న అజయ్ గారేనా మాట్లాడుతుంది అని అనుమానం వచ్చి ఇంకో రెండు సార్లు చూసా. నమ్మకూడదనుకున్నా కానీ ఒక ఫక్తు రాజకీయ నాయకుడి మాదిరిగా మాట్లాడింది మీరే అని కళ్లు చెబుతున్నాక నమ్మక తప్పలేదు. అందుకే భాదతో రాస్తున్నా.

మీ రాజకీయ ప్రసంగంలో ప్రధాన అంశాలు

1. “తెలుగుజాతి చరిత్ర శాతవాహనులు, కాకతీయులు, రెడ్డి రాజులు వంటి రాజుల కాలంలోనే మెుదలైంది” అని చెప్పారు. తెలుగుజాతి అంతకు వేల సంవత్సరాల ముందే మెుదలైందని మీకు తెలియదా? మహాభారతంలో తెలుగుజాతి నాగజాతి వారుగా కురుక్షేత్రంలో పాల్గొన్న ఆధారాలు ఉన్నట్టు తెలియదా లేక ఈజాతికి మూలం రెడ్డి రాజులని చెప్పదలుచుకున్నారా?

2. “ఆంధ్రా యూనివర్సిటీ ఎక్కడ పెట్టాలని ఆంధ్రులు, సీమ వారు గొడవపడి, సీమ వారు అనంతపురంలో కావాలని అడిగితే, సిఆర్ రెడ్డి గారు విశాఖలో సూచించారని చెప్పారు”. ఇక్కడా ఇంకో రెడ్డి గారిని పొగడటానికి చరిత్రను చక్కగా వక్రీకరించారు. ఆంధ్రా యూనివర్సిటీ విషయంలో ఈ సిఆర్ రెడ్డి గారి కుతంత్రాలును అయ్యదేవర కాళేశ్వరరావు గారి జీవితకధలో ఎండగట్టి ఆయన నిజస్వరూపాన్ని బట్టలూడదీసి ప్రజల కళ్లకు చూపించిన విషయం మీకు తెలిసే ఉంటుంది. ఆయన నిర్వాకాలను నిరసిస్తూ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు రాసిన పధ్యాల గురించీ అందులో చెప్పారు. యూనివర్సిటీ విషయంలో మరి అంత దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడిన సిఆర్ రెడ్డి గారినా మీరు “సర్” సిఆర్ రెడ్డి అని భక్తి చాటుకుంది?

3. “శ్రీభాగ్ ఒడంబడిక, సీమ ప్రాంతం పెద్దలు కడప కోటి రెడ్డి గారు అంటూ“ ఇంకో రెడ్డి గారి గొప్పతనం గురించి చెప్పారు. ఆ ఒప్పందంలో సంతకాలు పెట్టిన కల్లూరి సుబ్బారావు గారు, పప్పూరి రామాచార్యులు కూడా పెద్దమనుషులని గుర్తురాలేదు మీకు. శ్రీభాగ్ ఒడంబడిక జరిగింది 1937, తర్వాత 20 ఏళ్ల వరకు స్వతంత్రం కూడా రాలేదు. వచ్చిన 6 ఏళ్ళకు ఆంధ్ర రాష్టం వచ్చింది అదికూడా ఈ పెద్దమనుషుల వల్లకాదు, పొట్టి శ్రీరాములు గారి వల్ల. శ్రీభాగ్ ఒడంబడిక జరిగింది ఆంధ్ర, రాయలసీమ వ్యక్తుల మధ్య. తర్వాత 1956 లో పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. అది ఆంధ్ర-రాయలసీమ, తెలంగాణ వ్యక్తుల మధ్య. ఈ రెండు ప్రాంతాల పెద్దమనుషులు (మీరు చెప్పే పెద్దలు రెడ్లు కూడా ఉన్నారు) 30 ఏళ్లకు ఇంకొక ప్రాంత పెదదలతో కొత్త ఒప్పందం చేసుకుంటే పాతది రద్దయినట్టే, అది కూడా చెల్లుబాటు కావాలంటే దాని గురించి కూడా కొత్త ఒప్పందంలో చెప్పాలని పెద్ద పదవులు నిర్వహించిన మీకు చెప్పాల్సిన పనిలేదు. సరే మీరంటన్నట్టు ఆ ఒడంబడిక ప్రకారం పదేళ్లలో సీమ నీటి వనరుల మీద పదేళ్లు ఖర్చు పెట్టాలని, రాయలసీమ వద్దనుకున్నవి కోస్తాకు పడేయాలని అనుకున్నా, మెదటి 20 ఏళ్లు పరిపాలించింది రాయలసీమ నాయకులు, లేక సీమ మానస పుత్రులని చెప్పుకునే నెల్లూరు, పల్నాటి సీమ రెడ్లే కదండీ, మరి ఈ ఒప్పందాలెందుకు అమలు కాలేదు?

4. “తెలంగాణ విముక్తి తర్వాత అక్కడి పెద్దలు కెవి రంగారెడ్డి గారు, మర్రి చెన్నారెడ్డి గారు రాయలసీమకు అంతకుముందు జరిగిన అన్యాయం చూసి ఉమ్మడి తెలుగు రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేకించారు” అన్నారు. ఇక్కడా తెలంగాణకు చెందిన ఇద్దరు రెడ్లు పెద్దలన్నారు గానీ ఆ రాష్ట ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు, జెవి నర్సింగరావు గారు పెద్దలుగా కనిపించలేదు. ఇక ‘ రాయలసీమకు అంతకుముందు జరిగిన అన్యాయం చూసి’ అన్నారు. అంతకు ముందు అంటే ఆంధ్ర రాష్టం ఏర్పడిన 53-56 వరకు. అప్పుడు ఒడంబడిక ప్రకారం రాజధాని కర్నూలులో, హైకోర్టు గుంటూరులోనే పెట్టారు, మరి ఉల్లంఘన ఎక్కడ? ఇక ఆ మూడు సంవత్సరాలలో ప్రకాశం గారు 1 సంవత్సరం, రాష్ట్రపతి పాలన 6 నెలలు, బెజవాడ గోపాలరెడ్డి గారు 19 నెలలు, వీళ్లలో ఎవరు అన్యాయం చేసారు రెడ్డి గారు?

5. జంటిల్మెన్ అగ్రిమెంట్ నుంచి ఏకంగా ప్రత్యేక తెలంగాణ పోరాటానికి వచ్చేసారు, ఆ మద్యలో 60 ఏళ్లలో ఏంజరిగిందో, ఎవరేంచేసారో మర్చిపోయారేంటి, అదికూడా చెప్పి ఎవరేంచేసారో కూడా ప్రజలకు చెప్పాల్సింది? ఆ జంటిల్మెన్ అగ్రిమెంట్ సిరా తడి ఆరక ముందే దానికి తూట్లు పొడవడం మెుదలు పెట్టి తెలంగాణ ప్రజలలో అనుమానాలు, అభద్రత కలగజేసింద ఏ ప్రాంతం వారో, ఏ వర్గం వారో కూడా చెప్పాల్సింది?

6. “శివరామకృష్ణన్ నివేదిక విజయవాడ-గుంటూరు ప్రాంతం పనికిరాదు, వైజాగ్, నడకుడి నుంచి పరిపాలన చేయాలని ఇస్తే అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు” అన్నారు. మరి అప్పట్లో కీలక పదవులలో ఉన్న మీరెందుకు మాట్లాడలేదు? పోనీ ప్రభుత్వ ఉద్యోగిగా మీ నిబంధనలు ఒప్పుకోలేదనుకుందాం, మీకు ప్రధాన కార్యధర్శి అవకాశం వచ్చినపుడు అప్పటి పాలకులు రాష్టానికి చేసిన అన్యాయానికి నిరసనగా తిరస్కరించి ఉండొచ్చుకదా. కేవలం మూడు నెలల పదవికోసం ఎందుకు పాకులాడారు? మీరు తిరస్కరించి ఉంటే మీరు మీ అంతట చెప్పకపోయినా, ఒక ప్రధాన కార్యధర్శి స్ధాయి అధికారి తిరస్కరణ చర్చకు వచ్చి పాలకుల దుర్నీతి ప్రజలకు తెలిసేది కదా? మరి మీపాపం లేదా ఆరోజు?

7. “అమరావతిలో భూములు రెండు వేల మందికి చెందిన బినామీలు, పత్రికాధిపతులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దగ్గర ఉందని” చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ కాలంలో దాదాపు 3 సంవత్సరాలు ఉన్నత స్ధానంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పటి పరభుత్వానికి ముఖ్య సలహాదారుగా 9 నెలలగా, అనేక కమిటీలలో సభ్యుడుగా ఉండి ఆ వివరాలు ఎందుకు చెప్పలేదు. ఆ స్ధాయులో ఇంత మెూసం జరుగుతుంటే, మీ పదవీ విరమణ తరవ్వాతైనా చెప్పాలి కదా. అమ్మకోవడానికో, ఒక పార్టీకి మేలు చేయడానికో పుస్తకాలు రాసిన మీకు, ఆ నిజాలు చెప్పి మీరు పుట్టిన మీ రాష్ట్రానికీ, మీ సాటి ప్రజలకు మేలు చేయాలనిపించలేదా??

8. “జియన్ రావు కమిటీలో అర్బన్ డెవలప్మెంట్ నిపుణులు ఉన్నారు, లక్ష కోట్లు ఒక్కచోట కాకుండా వికేంద్రీకరణ చేయాలని చెప్పారు” అని అన్నారు. అర్బన్ డెవలప్మెంట్ నిపుణులు అయితే వాళ్ల అనుభవంతో పట్టణం లక్ష కోట్లతో కాకుండా, ఏ 5 వేల కోట్లో, 10 వేల కోట్లతోనే పూర్తి చేసే సలహాలు ఇవ్వాలి కానీ, ఇక్కడ పెట్టిన 10 వేల కోట్ల బూడిదలో పోసి ఇక్కడ నుండి తీసేసి ఒక 20 వేల కోట్లతో ఇంకో చోట పెట్టమని సలహా ఇచ్చారంటే, పైగా ముఖ్యమంత్రి చెప్పిన విధంగా తూచా తప్పకుండా వాళ్లేం నిపుణులు, అదేం కమిటీ? వాళ్ళేమ నిపుణులు?

9. “శివరామకృష్ణన్ నివేదికలో రెండు, మూడు వేల కోట్లతో రాజధాని కట్టుకోవాలని సూచించారని చెప్పారు”. అమరావతి కోర్ కేపిటల్ లో ఇప్పుడు ఉన్న మౌలిక సదుపాయాలు, ఇప్పటికే కట్టిన భవంతులకు రెండు, మూడు వేల కోట్లతో కనీస సదుపాయాలున్న రాజధాని వస్తుంది కదా. మీరు చెప్పే వికేంద్రీకరణ రాజధానికి ఉద్యోగుల తరలింపే 15 వేల కోట్ల లెక్కలు వస్తున్నట్టు మీకసలు తెలియడం లేదా?

10. “రాజధాని మద్యలో పెట్టింది తుగ్లక్ అని చెప్పారు”. మిమ్మల్ని సాకుతున్న నాయకుడిని దేశమంతా తుగ్లక్ అంటుంటే దానినుంచి మరల్చాలనే తాపత్రయం తప్ప, తుగ్లక్ అప్పటికే వందల సంవత్సరాలుగా ఉన్న రాజధానిని అచ్చం ఇప్పుడు జరుగుతున్నట్లే మార్చడానికి ప్రయత్నించి పిచ్చి తుగ్లక్ అయ్యాడు కానీ, అసలు రాజధాని లేని పరిస్ధితులలో కాదని మీకు తెలియదా?

11. “చెన్నై, ముంబై మద్యలో లేవు” అని చెబుతారు. దృతరాష్ట ప్రేమ తప్ప చరిత్ర మీకు తెలియదనుకోలేం. బ్రిటీష్ వారి మద్రాసు ప్రావిన్స్ సిక్కోలు నుండి రామేశ్వరం వరకు చూస్తే మద్రాసు దాదాపు మద్యలో లేదా? మహారాష్ట, గుజరాత్ కలిసిన బ్రిటీష్ బాంబే ప్రావిన్స్ కి ముంబై మద్యలో లేదా? ఇవన్నీ సివిల్స్ లో ఉత్తీర్ణులయిన మీకు తెలియదంటే మీ తెలివితేటలు, మీరు చేరుకున్న స్ధాయి మీదే అనుమానం వస్తుంది, మన వర్గపు నాయకుల అండతో ఎదిగారా అని?

12. మీ రాజకీయ ప్రసంగంలో “అభివృద్ది చెందిన నగరాలలో పరిశ్రమలు పెట్టరు, కేవలం సర్వీస్ సెక్టార్ లో కొన్ని ఉద్యోగాలు మాత్రం వస్తాయి” అంటారు, అదే నోటితో “నగరాన్ని అభివృధ్ది చేస్తే, అంతా ఒక చోటే కేంద్రీకృతం అవుతుందనీ” అంటారు. ఏం మూట్లాడుతున్నారో మీకైనా అర్దం అవుతుందా రెడ్డి గారూ? ఇంత కన్ఫూజన్ లో ఎందుకున్నారు? కొత్తగా అంటుంచుకున్న భావజాలం మీ ఆలోచనా శక్తిని తగ్గించిందా?

13. “పేద రాష్టం లక్షల కోట్లు పెట్టలేం” అంటున్నారు. పేద రాష్టం అని తెలిసీ ఇప్పుడు పని చేసే 60% మంది ద్యోగులు కంటే అదికంగా 5 అంకెల జీతాన్ని పెన్షన్ గా తీసుకుంటున్న మీరు, 8 అంకెల సంవత్సర ఖర్చుతో ఒక పదవితీసుకున్నారని గుర్తుందా? మీకు స్పూన్, ప్లేట్ ల కోసం లక్షలు రూపాయలు అప్పుల రాష్ట్రపు ప్రజల సొమ్ము ఖర్చు పెట్టారని తెలుసా? పోనీ అప్పుడు తెలిదనుకున్నా ఇప్పుడు తెలిసింది కదా, అది ప్రజల డబ్బేకదా. వద్దని చెప్ప గలరా?

14. తెలుగుదేశం ఉన్న ప్రతిసారీ అప్పులు మిగులుతాయి, ప్రతిరోజూ ఓవర్ డ్రాఫ్టుకు వెళ్ళారు. 2004 లో 35% ఉన్న అప్పు రాజశేఖర్ రెడ్డి గారు 21%నికి తగ్గించారని” చెప్పారు. ఇక్కడ మళ్లీ ఇంకో రెడ్డి గారి స్తోత్రం. రెండు మూడు సంవత్సరాలు తప్ప తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నన్ని రోజులూ దాదాపుగా మీరు ఉద్యోగంలో ఉన్నారు. అప్పటి ప్రభుత్వం ఎందుకు ఓవర్ డ్రాఫ్టుకు వెళ్ళావలిసి వచ్చిందో మీకు తెలిసి ఉంటుంది కదా ఆ కారణాలేవో ప్రజలకు చెప్పవచ్చుకదా? అప్పుడు తార్కికంగా మాట్లాడుకోవచ్చు.
2004లో 40 వేల కోట్లతో 35% ఉన్న అప్పు, 2009 కి దాదాపు 80 వేల కోట్లకు చేరుకుంది మరి 21% ఎలా తగ్గినట్టు? పోనీ బాగా అభివృద్ది చేసారనుకుంటే మీ రాజకీయ ప్రసంగంలోనే చెప్పారు కదా, అభివృద్ది ప్రోగ్రెస్సివ్ అని, అంటే రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాత్రికి రాత్రి అభివృద్ది చెందలేదు, అంతకు ముందు పరభుత్వాలు చేసిన కృషి కూడా చాలా ఉంది అనేకదా?

15. హైటెక్ సిటీ గురించి మాట్లాడుతూ, “రాజీవ్ గాంధీSEZ పాలసీ తెచ్చారు, పీవీ గారు ప్రమెూట్ చేసారు, నేదురుమల్లి జనార్ధన రెడ్డి గారు 3.5 కొట్లు ఇచ్చి శంకుస్థాపన చేసారు” అని చెప్పారు. ఇక్కడా ఇంకో రెడ్డి గారికి గొప్పతనం కట్టబెట్టే ప్రయత్నమే. రాజీవ్ గారైనా, పివీ గారైనా తెచ్చిన లేక ప్రమెూట్ చేసిన పాలసీ దేశం మెుత్తానికి కానీ, హైదరాబాద్ కో, ఆంధ్రప్రదేశ్ కో కాదు. అలాంటప్పుడు అదే సమయంలో ఐటి పరిశ్రమ మెదలు పెట్టిన త్రివేడ్రం, భువనేశ్వర్, చంఢీగడ్, కలకత్తా లలో ఎందుకు అభివృద్ది కాలేదు? నేదురుమల్లి రెడ్డి గారు నిధులు ఇవ్వనందుకో, కోట్ల రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టనందుకో అని చెబుతారా? ఒక వ్యక్తి మనకు నచ్చకపోవచ్చు, కానీ ఆ వ్యక్తిలో మంచిని మంచిగా చెప్పగలిగినప్పపడే చదువుకున్నవాడికి, మూర్ఖుడికి మద్య వ్యత్యాసం. రాజకీయ నాయకుడిగా, ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తిగా చంద్రబాబు మీద మీకు కొన్ని అభిప్రాయాలుండవచ్చు కానీ మీరు అక్కడ మాట్లాడిన మాటలు మీ వ్యక్తిత్వానికి ఏమాత్రం వన్నెతేవు. ఆయన మీద ఆరోపణలు చెయ్యడానికి మీకు మీడియా, మీకుల సోషల్ మీడియా దగ్గర చాలా విషయాలున్నాయి, కనీసం మంచిని మంచి అని చెప్పలేని స్ధాయికి మిమ్మలను మీ అసహనం, కుల పక్షపాతం తీసుకువెళుతున్న విషయం గుర్తించారా?

దాదాపు ఇదే సమయంలో పక్క రాష్ట ప్రధాన కార్యదర్శి రామమెూహన్ రావుగారూ కూడా ఒక రాజకీయ పార్టీలో చేరారు. ఆయన మీకంటే ఎక్కువకాలం ఆ పదవిలో ఉన్నారు కానీ ఇంతగా కులాన్ని తన వంటికి పులుముకోలేదు. ఆయనే కాదు, విజయరామారావు గారు, జెపి గారు, తోట చంద్రశేఖర్ గారు, రమణాచారి గారు, లక్ష్మీనారాయణ గారు ఇంకా చాలా అధికారులు మంది రాజకీయాలలోకి వచ్చినా ఈ స్ధాయి పతనం చూడలేదు.

“తలలు బోడులైతే తలపులు బోడులౌనా” అని శతకకర్త చెప్పినట్టు, పేరులో తోక తీసినంత తేలికగా బుర్రలో బుద్దులు తీయలేమని నిరూపించారు.

“అదృష్టం కొద్దీ ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చిందని” చెబుతూ కొత్త కులదేవుడి మీద మీరు పొంగిస్తున్న ప్రేమ చూస్తుంటే మాకు కూడా మా అదృష్టం కొద్దీ మీరీ ప్రసంగం చేసారు లేకపోతే మేం ఐఏయస్ అజయ్ కల్లం గారు గానే ఊహిస్తున్న మీరు కూడా కేవలం ఒక సగటు పల్నాటి ప్రాంతపు కల్లం అజయ్ రెడ్డి అని మాకు తెలిసేది కాదనిపిస్తుంది.

అయితే.. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సమయంలో, ఆయనను సమర్ధిస్తూ జనచైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి మరో పోస్టు పెట్టారు. సోషల్‌మీడియాలో అజ్ఞాత వ్యక్తి పెట్టిన పోస్టు వెనుక, టిడిపి అధినేత చంద్రబాబు ఉన్నారన్న అర్ధం వచ్చేలా లక్ష్మణరెడ్డి పోస్టు పెట్టారు. లక్ష్మణరెడ్డి వైసీపీకి సానుభూతిపరుడన్న పేరున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన పెట్టిన పోస్టులో కూడా ‘గతంలో చేసిన పాపాలకు ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు. మళ్లీ అవే పాపాలను కొనసాగిస్తే ప్రజలు మిమ్మల్ని భూస్ధాపితం చేస్తార’ని లక్ష్మణరెడ్డి టిడిపి అధినేత చంద్రబాబును హెచ్చరించారు. అయితే, అజయ కల్లం వంటి అవినీతి రహిత నిష్కళంక వ్యక్తిపై అపనిందలు వేయడంపై లక్ష్మణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ.. పోస్టు పెట్టిన అజ్ఞాతవ్యక్తి, తన కథనంలో అజయకల్లంపై ఎక్కడా అవినీతి ఆరోపణలు చేయలేదు. కానీ ఆయన లేవనెత్తిన చారిత్రక నేపథ్యం, రాష్ట్ర చరిత్ర, అందులో రెడ్లపాత్రపై చేసిన ప్రసంగాలకు రుజువులు మాత్రమే జనం ముందుంచారు. పైగా.. లక్ష్మణరెడ్డి పోస్టులో ఒక విషయాన్ని అంగీకరించడం ద్వారా, కల్లం గత ఎన్నికల్లో టిడిపి ఓటిమికి పనిచేశారని పేర్కొనడం గమనర్హం. ‘గత ఎన్నికల ముందు గత ప్రభుత్వం (బాబు) చేసిన తప్పులను ప్రజల ముందు ఉంచి అవినీతి పాలనకు చరమగీతం పాడటంలో అజేయకల్లం కీలకపాత్ర పోషించారు’ అని గుర్తు చేశారు. అజయ కల్లంపై వచ్చిన విమర్శలను ఖండిస్తూ లక్ష్మణరెడ్డి పెట్టిన పోస్టు ఇది. 

నిష్కళoక అవినీతి రహిత అజేయ కళ్లo పై అపనిందలా?

ఆంధ్రప్రదేశ్ లో గత నాలుగు దశాబ్దాలుగా ఐఏఎస్ అధికారిగా వివిధ హోదాల్లో పని చేస్తూ ప్రజల మన్ననలను పొందిన అజేయ కళ్లo పై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బెదిరింపు ధోరణి తో మాట్లాడడం సమంజసం కాదు.

గత ఎన్నికల ముందు గత ప్రభుత్వం చేసిన తప్పులను ప్రజల ముందు ఉంచి అవినీతి పాలనకు చరమగీతం పాడటంలో అజేయ కళ్లo కీలక పాత్ర పోషించారు.

సమాజంలో అవినీతి పోవాలని గ్రామస్వరాజ్యం రావాలని అధికార, అభివృద్ధి వికేంద్రకరణ జరగాలని స్థానిక ప్రభుత్వాలకు నిధులు, విధులు కేటాయిస్తూ బలోపేతం చేయాలని వ్యవసాయ రంగం ఆధునీకరించబడి గణనీయంగా అభివృద్ధి కావాలని పేదరికం లేని సమాజం ఏర్పడాలని నిరంతరం తపించే ప్రజా అధికారి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కళ్లo పై ఆరోపణలు చేయటం మానుకోవాలని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను కోరుతున్నాను. గతంలో చేసిన పాపాలకు ప్రజలు సరైన తీర్పు ఇచ్చారని మరలా అవే పాపాలు కొనసాగిస్తే ప్రజలు మిమ్మల్ని భూస్థాపితం చేస్తారని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి.లక్ష్మణ రెడ్డి పేర్కొన్నారు.

గత ఎనిమిది నెలలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు తేవటం గ్రామ, వార్డు సచివాలయ ఏర్పాటు, పాలనా వికేంద్రీకరణ, తదితర ప్రధాన ప్రభుత్వ నిర్ణయాల లో అజేయ కళ్లo పాత్ర గణ నీయమైనది అని లక్ష్మణ రెడ్డి పేర్కొన్నారు.

దశల వారి మద్య నిషేధం అమ్మఒడి, రైతు భరోసా, సచివాలయాలు ఏర్పాటు, జగనన్న గోరుముద్ద, పెన్షన్ల డోర్ డెలివరీ,వివిధ వృత్తుల వారికి చేయూతనిస్తూ సంక్షేమ పదంలో భారత దేశంలోనే అగ్రగామిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ను వేగంగా అభివృద్ధి చేస్తున్నా కార్యకలాపాలను స్వాగతించకుండా అవహేలనoగా మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం.

ఆరోగ్యశ్రీ, విద్యా,వైద్య రంగాలలో వినూత్నమైన మార్పులు చేస్తూ పేద ప్రజలు కు అండగా ఉన్న పధకాలను స్వాగతించు కుండా నిజాయితీపరులైన అజేయ కళ్ళం పై, మరియు అత్యున్నత అదికారులపై ఆరోపణలు చేయటం మానుకోవాలని, లేకపోతే ప్రజాఅగ్రహానికి గురికాక తప్పదు.

జన చైతన్య వేదిక
రాష్ట్ర అధ్యక్షులు
వి.లక్ష్మణ రెడ్డి