పెన్షనర్ల పెదవులపై జగన్ చిరునవ్వు

440
గడప వద్దకే  పెన్షన్ సూపర్‌హిట్
తిప్పలు తప్పించుకున్న పెన్షనర్లు
జగన్ పథకం సక్సెస్
బాబు చేయలేనిది జగన్ చేసి చూపారు
   ( మార్తి సుబ్రహ్మణ్యం)

వినూత్న నిర్ణయాలతో సాహసోపేతమైన పథకాలు ప్రకటిస్తూ సంచలనం సృష్టిస్తోన్న ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి తాజాగా అమలుచేసిన ‘గడప వద్దకే  పెన్షన్’ ఆయనను పెన్షనర్ల ఇళ్లకు  చేర్చింది. ఇప్పటివరకూ సర్కారు కార్యాలయాల చుట్టూ తిరిగిన పెన్షనర్లకు, జగన్ పథకం వరప్రసాదంగా మారింది. వాలంటీర్లే ఇంటివద్దకు వచ్చి పెన్షన్ డబ్బులిస్తున్న వైనం, వారిలో జగన్‌పై సానుకూలత పెంచింది. ఫలితంగా నేరుగా డబ్బులతో పెన్షనర్లకు చేరువ య్యే ‘జగన్ పథకం’ సూపర్‌హిట్టయింది.
గతంలో పంచాయతీ ఆఫీసుల వద్ద గంటల తరబడి వేచి చూసి, సొమ్మసిల్లి ఆగిన గుండెలకు లెక్కేలేదు. క్యూలలో నిలబడలేక, ఆరుబయటే నిద్రించే ముసలమ్మ, ముసలాయన ఫొటోలకు అంతే లేదు. అలాంటి ఈతిబాధలకు చరమగీతం పాడుతూ జగన్ ప్రవేశపెట్టిన గడప వద్దకే పెన్షన్ పథకం పెన్షనర్ల పెదవులపై చిరునవ్వులు పూయించింది. ఒకరకంగా సీఎం జగన్ వారి పెదవులపై చిరునవ్వులు పూయించారు.
‘ఉపాయం  లేని వారిని ఊరినుంచి వెళ్లగొట్టమని’ పూర్వకాలం మన పెద్దలు చెప్పేవారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టిడిపి ప్రభుత్వ హయాంలో పెన్షన్లను రెట్టింపు చేసినా, అవి నేరుగా కాకుండా పంచాయతీ కార్యాలయాలు, మరికొన్ని పథకాలు పోస్టాఫీసుల ద్వారా, ఇంకొన్ని ఆన్‌లైన్‌లో  అందేవి. ఫలితంగా లబ్థిదారులు గంటలపాటు ఎండ, వానల్లో నిల్చోవలసి వచ్చేది. పైగా ఆ డబ్బులు ఎవరు ఇస్తున్నారో లబ్థిదారులకు పెద్దగా తెలిసేది కాదు. వైఎస్ హయాంలో అయితే.. ఆ ఊరిలో ఎవరైనా లబ్ధిదారుడు చనిపోతేనే కొత్త పెన్షన్ వచ్చేది. ఈ విధానం తప్పని, మనమే నేరుగా లబ్థిదారులకు డబ్బులిస్తే పార్టీకి ఉపయోగం ఉంటుందని, పోస్టాఫీసు, బ్యాంకుల ద్వారా ఇస్తే పార్టీకి లాభం లేదని నాడు  మంత్రులు, ఎమ్మెల్యేలు నెత్తీనోరూ బాదుకుని వాదించినా బాబు వాటిని పెడచెవినపెట్టారు. పారదర్శకత, కంప్యూటరైజేషన్, ఆన్‌లైన్, గవర్నరెన్స్ అంటూ లెక్చరిచ్చి వారి నోరు మూయించారు.
ఎక్కడి పాట అక్కడ పాడే అధికారులు కూడా బాబుకు వంతపాడారు. నేరుగా డబ్బులిస్తే అవినీతి జరిగి, మీకు చెడ్డపేరు వస్తుందని నూరిపోశారు. దానికి నాలుగైదు కలర్ పేపర్లు తెచ్చి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్, వంకాయ అని షో చేసి బాబును మెప్పించడమే కాకుండా, మంచి పోస్టింగులు కొట్టేశారు. సరే.. దానితో మంత్రులు, పార్టీ నేతలు విధిలేక తెల్లముఖాలేసేవారు. సరే.. ఎన్నికల ఫలితాల్లో చివరకు పార్టీనే తెల్లముఖం వేయాల్సి వచ్చిందనుకోండి. అది వేరే విషయం.
సీన్ కట్ చేస్తే.. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్నయిన ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సరైన తెలివి ఉపయోగించి, ఉపాయం తనకు ఉన్నందున ఊళ్లోనే ఉండేలా చూసుకున్నారు. గడప వద్దకే పించన్ పథకం పేరు కొత్తగా ఉన్నా పాలిసీ పాతదే. ఖాతా కూడా పాతదే. కాకపోతే.. వాలంటీర్లు పింఛనర్ల ఇంటికే వచ్చి అవ్వా, తాతలకు డబ్బు ఇచ్చే సరికొత్త విధానంతో జగన్ వారి హృదయాల్లో నిలిచిపోయారు. ఇలాంటి పథకం ప్రవేశపెట్టే ముందు జగన్.. చంద్రబాబులా ఏ అధికారి సలహా, అభిప్రాయం తీసుకోలేదు. వారు కూడా బాబుకు ఇచ్చినట్లు జగన్‌కు సలహా ఇచ్చే ధైర్యం చేయలేదు. తాను అనుకున్నది అమలుచేశారంతే! అందుకే ఈ పథకం సూపర్ డూపర్ హిట్టయింది. వాలంటీర్లు తమ తలుపు తట్టి గడపముందుకొచ్చి, డబ్బులు చేతులో పెడితే తీసుకునే వారి ఆనందానికి అవధుల్లేవు. మనీ మహత్యమది. దానిని జగన్ గుర్తించారు. బాబు గుర్తించలేదు. తేడా అదే!
     గడప వద్దకే పెన్షన్ పథకం తొలిరోజు స్పందన అనూహ్యం, అద్భుతం.  గ్రామ, పట్టణ వాలంటీర్లు దండుగా వెళ్లి లబ్థిదారుల తలుపుతట్టి, చేతిలో డబ్బు పెడితే, తీసుకుంటున్నప్పుడు వారి సంతోషం చెప్పనలవి కాదు. సహజంగా ఇలా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలే ఇంటికి వచ్చి డబ్బులిచ్చిపోతాయి. కానీ ఇకపై ప్రతినెలా ఇలా సర్కారే కదలివచ్చి, చేతిలో పెన్షన్ కాసులు పెడితే సంతోషించని వారెవరు? వృద్ధుల ఆనందానికయితే హద్దులే ఉండవు. తొలిరోజున ఒక్కపూటలోనే  42,81291 మంది వృద్ధాప్య, వితంతు, వికలాంగ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పింఛన్లు వారి ఇళ్ళవద్దకే వెళ్లి 1,019 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం ఒక చరిత్ర. బయోమెట్రిక్ డివైస్, సెల్‌ఫోన్లు వె ంటబెట్టుకుని వెళ్లిన 2,16,874 మంది వాలంటీర్లనూ అభినందించాల్సిందే. కాకపోతే కొన్నిచోట్ల ఒక్కొక్కరి వద్ద 50 రూపాయలు తీసుకున్నారన్న ఆరోపణలొచ్చాయి అది వేరే విషయం. తేనె తీసేవాడిని ఆ తేనె నాకకూడదంటే కుదరదు మరి. కాకపోతే గదత జన్మభూమి కమిటీ స్థాయి దోపిడీ మాత్రం కనిపించలేదు. అంతవరకూ సంతోషించాలి. అయితే..  లబ్థిదారుల నుంచి వసూలు చేసిన డబ్బులను పంచుకునే విషయంలో వాలంటీర్ల మధ్య వాటాల తేడాలు వచ్చి,  వారు ఘర్షణ పడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గడప వద్దకే పెన్షన్ పథకంతో జగన్ వృద్ధులకు మరింత చేరువయ్యారు. ఎన్నికల ముందు ఆయన తన ప్రతి ప్రసంగంలోనూ అవ్వా బాగున్నావా? తాతా బాగున్నావా? అంటూ పిలిచేవారు. స్వయంగా జగన్ వృద్ధుల దగ్గరకు వెళ్లి ముద్దులు పెట్టేవారు. ఆవిధంగా అంతకుముందు ఏ నాయకుడూ తమను పిలవని ఆ పిలుపునకు పరవశించిపోయిన వృద్ధులు.. అప్పటికే బాబు పెన్షన్ పెంచినా, ఆయనను కాదని జగన్‌కే ఓటేశారు. పాదయాత్రలో జగన్ వెంట వికలాంగులు ఎక్కువమంది కనిపించేవారు. జగన్ వారితో సెల్ఫీలు దిగేవారు. మొత్తంగా జగన్ పాదయాత్ర, ఎన్నికల ప్రచారం వృద్ధులు, వికలాంగులు, వితంతుల హార్ట్‌ను టచ్ చేసింది. దానికి వారు ఓటు రూపంలో ఆయనకు ప్రతిఫలం చెల్లించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గడప వద్దకే పెన్షన్ పథకం రూపంలో వారి రుణం తీర్చుకున్నారు. ఈరకంగా జగన్ నిర్ణయాలపై ఎన్ని విమర్శలున్నాయో, అన్ని ప్రశంసలూ వ్యక్తమవుతుండం విశేషం.
అంతా బాగుంది కానీ.. అంకెల్లోనూ అబద్ధాలా?

పెన్షనర్ల ఇంటి వద్దకే వెళ్లి డబ్బులు చెల్లించే ఈ ప్రక్రియ వల్ల లబ్థిదారులు సంతోషంగానే  ఉన్నారు. తమకు ఆఫీసుల చుట్టూ తిరగే పని లేకుండా చేసినందుకు వారంతా జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. కానీ పెన్షన్లపై జగన్ తాజాగా చేసిన ట్వీట్ విమర్శలకు గురవుతోంది.

ఎందుకంటే గతంలో ఇచ్చిన పెన్షన్ వివరాలను సీఎంఓ మీడియా బృందం తప్పులతడకగా పేర్కొంది. ‘ఎన్నికలకు ముందు వచ్చే పెన్షన్ వేయిరూపాయలు కాకుండా ఇప్పుడు 2,250 వచ్చింది. పెన్షన్ వయసు కూడా 65 ఏళ్ల నుంచి 60కి తగ్గించాం’ అని ట్వీట్ చేశారు. కానీ గత ప్రభుత్వం రెండువేల రూపాయల  పెన్షన్ ఇవ్వగా, దాన్ని సీఎం సోషల్ మీడియా బృందం వెయ్యిరూపాయలుగా పేర్కొంది. ఎన్నికల ముందు పెన్షన్ వయసును 45కు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. కొత్తగా 6.11 లక్షల మందికి పెన్షన్ ఇస్తామన్నప్పటికీ, అనేక కారణాలతో  లక్షల పెన్షన్లు తొలగించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన మహిళల ఆవేదన సోషల్‌మీడియాలోనూ వైరల్ అవుతోంది.