స్వామీ.. ‘పిఠాపురం’పై మాట్లాడరేమీ?

601

పిఠాపురంలో దేవతావిగ్రహాల ధ్వంసంపై స్వరూప మౌనం
 సర్కారుకు అల్టిమేటం జారీ చేసిన పీఠాథిపతులు
అయినా పత్తా లేని విశాఖ స్వరూపుడు
 మతమార్పిళ్లపై మౌనవ్రతమేల?
 సేవకుడు దేవుడికా? సర్కారుకా?
 స్వరూపానంద స్వామిపై విమర్శల జడివాన
                 ( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆయన మహా పవర్‌ఫుల్  స్వామి. పైగా ‘పవర్’కు ఒకటి, రెండు గజాల దగ్గరగా ఉన్న పొలిటికల్ స్వామి. ఆమాటకొస్తే ఆ పవర్‌ను ప్రసాదించిందీ ఆయనే. ఇంకా చెప్పాలంటే.. ఆ రాష్ట్ర ఏలికను తన తపోశక్తితో గద్దెపై  ప్రతిష్ఠించిందీ ఆయనే. అంత త్రికాలజ్ఞాని అయిన స్వామివారు.. శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలను పుక్కిటపట్టిన వాల్మీకి,  వ్యాసుడు, దూర్వాసుడు, భరధ్వాజుడు, గౌతముడు, జమదగ్నితోపాటు.. మరీచి, అంగీరసు,  అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు వంటి సప్తర్షులకే మార్గదర్శి మరి! అంటే గురువులకే గుగ్గురువన్నమాట. ఆయనకు ‘సప్తర్షి హోదా’ ఒక్కటే క ట్టబెట్టలేదు గానీ.. తెలుగు రాష్ట్రాలకు ఆయన శారదాపీఠమే ఒక సప్తర్షి మండలం.
   సహజంగా పురాణాలు తెలిసిన వారికి సప్తర్షి మండలం అంటే గుర్తుకువచ్చేది అరుంధతీ నక్షత్రం. కానీ మన తెలుగు రాష్ట్రాలకు సప్తర్షి మండలమంటే గుర్తుకొచ్చేది మాత్రం విశాఖలోని చినముషిడివాడలోని శ్రీ శారదాపీఠం, అందులో కొలువుదీరిన శ్రీమాన్ స్వరూపానంద స్వామి! ఒకవైపు సముద్రం. చుట్టూ చీకటి. ఇలాంటి సందర్భాల్లో మన పెద్దలకు సప్తర్షి మండలం ఒక దారి చూపే సాధనంగా ఉండేది. ఇప్పుడు సముద్రానికి దగ్గరే ఉన్న శారదాపీఠం కూడా ఒక ‘సప్తర్షి మండలం’లా అవతరించింది. నాడు మహా రుషులే తారారూపంలో సంచరించేవారని నమ్మేవారు. నేడు ఆ తారనే ఈ స్వామి వారి రూపంలో, భూమిపై నడయాడుతున్నారు మరి! తన మహాపాదయాత్రతో దేశానికి ఆధ్మాతిక మార్గం చూపిన  కంచి మహాపీఠాథిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి కంటే ‘మహాజ్ఞాని’ అయిన శ్రీమాన్ స్వరూపానంద సరస్వతి స్వామి వారికి.. రాష్ట్రంలో నిర్నిరోధంగా జరుగుతున్న దేవతా విగ్రహాల విధ్వంసాలు పట్టకపోవడమే వింత. కనీసం వాటిపై ధర్మాగ్రహం కూడా వ్యక్తం చేయని ఆ మౌనవ్రతమే ఆయనను వివాదాల పాలు చేస్తోంది.
    కొద్దిరోజుల క్రితం ఏపీలోని పిఠాపురం గ్రామంలో 15 దేవాలయాలకు చెందిన దేవతా విగ్రహాల కళ్లు, ముక్కు, చెవులు, కాళ్లు నరికి.. వాటిపై మలమూత్రాలు విసర్జించిన ముష్కరుల కిరాతక చర్యపై, యావత్ హిందూ సమాజం కన్నెర్ర చేసింది. బిజెపి, జనసేన వంటి రాజకీయ పార్టీలు సర్కారుకు ఫిర్యాదు చేశాయి. స్వయంగా శ్రీపీఠాథిపతి పరిపూర్ణానంద స్వామి, భువనేశ్వరి పీఠాథిపతి కమలానంద భారతీ స్వామి,  హంపీ పీఠాథిపతి గోవిందానంద సరస్వతి శ్రీనివాసానంద స్వామి, రచయిత జొన్నవిత్తుల, పత్తిపాటి పద్మాకర్, హమారా ప్రసాద్, బిజెపి ధార్మికసెల్ రాష్ట్ర కన్వీనర్ తూములూరి చైతన్య తదితరులు పిఠాపురంలో ధ్వంసమైన దేవతా విగ్రహాలను పరిశీలించి, జరిగిన కిరాకతకాన్ని ఖండించారు. ఫిబ్రవరి 5లోగా ప్రభుత్వం స్పందించకపోతే, 6 నుంచి రాష్ట్రవ్యాప్త ఆందోళనతో హిందూ సమాజం రోడ్డెక్కుతుందని శ్రీపీఠాథిపతి పరిపూర్ణానంద హెచ్చరించారు. ఉతుత్తి అరెస్టులపై ఆయన మండిపడ్డారు.
   పిఠాపురంలో జరిగిన దేవతా విగ్రహాల విధ్వంస అనంతర పరిణామాలు, పీఠాథిపతుల హెచ్చరికల నేపథ్యంలో హిందూ సమాజంలో స్పందన మొదలయింది. అయితే హిందూ ధర్మం, శాస్త్రాలను పుక్కిటపట్టిన ‘కలియుగ చంద్రశేఖరేంద్ర సరస్వతి’ స్వరూపానందుల వారి నుంచి మాత్రం ఇప్పటిదాకా మాట లేదు, పలుకు లేదు. బహుశా తన స్వరపేటిక వల్ల తన ‘ముద్దుల’ సీఎం శిష్యుడికి ఎక్కడ ఇబ్బంది వస్తుందేమోనన్న ముందు జాగ్రత్తతో, స్వామి వారు ముందస్తు మౌనవ్రతంలోకి వెళ్లినట్లున్నారన్న వ్యంగ్యాస్త్రాలు వ్యక్తమవుతున్నాయి. పిఠాపురం అరాచకంపై కనీసం స్పందించని వ్యక్తికి పీఠం నిర్వహించే నైతిక హక్కు ఉందా? ఒక దేవాలయం, అందులోని విగ్రహాలను ధ్వంసం చేసిన కిరాతకంపై మాట్లాడలేని స్వరూప ఒక పీఠాన్ని ఎలా నిర్వహిస్తారు? రాష్ట్రంలో నిర్నిరోధంగా జరుగుతున్న మతమార్పిళ్లపై మాట్లాడని వ్యక్తికి హిందూధర్మం గురించి మాట్లాడే అర్హత ఉందా? నగరం నడిబొడ్డున, నదుల సాక్షిగా వందలమంది సమక్షంలో జరుగుతున్న మతమార్పిళ్ల దృశ్యాలను ‘కళ్లున్న ప్రతి ఒక్కరూ’ వీడియోలో చూస్తే.. ‘త్రికాలజ్ఞాని’గా ‘భజన’లందుకుంటున్న స్వరూపకు మాత్రం కనిపించకపోవడం బటి,్ట ఆయన నేత్రాలు అధికారమత్తులో మూసుకుపోయాయా? అనే ప్రశ్నలు హిందూ సమాజం నుంచి వినిపిస్తున్నాయి. మరి స్వామివారు వాటికి సమాధానమిస్తారా? లేక వీవీఐపిల సేవలోనే కొనసాగుతారో చూడాలి. ఇది కూడా చదవండి.. జగద్గురు ‘స్వరూప’ం మారిందేమిటి స్వామీ?
ఇక తాజాగా జైలునుంచి విడుదల అమలాపురం మాజీ ఎంపి హర్షకుమార్ స్వరూపానందపై చేసిన ఆరోపణ, ఆయన రాజకీయ దళారీగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలకు దారితీసింది. అవంతి శ్రీనివాస్‌ను టిడిపి నుంచి వైసీపీలోకి తీసుకువచ్చి, ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి మంత్రిని చేసింది స్వరూపానంద సరస్వతేనని హర్షకుమార్ చేసిన ఆరోపణ సంచలనం సృష్టించింది. నిజానికి ఎన్నికల ముందు శారదాపీఠంలో విజయసాయిరెడ్డి-సోమువీర్రాజుతో స్వరూప చర్చించిన ఫొటోలు మీడియాలో రావడం చర్చనీయాంశమయింది. దానితో బిజెపి- వైసీపీ బంధానికి ఆయనే ప్రయత్నిస్తున్నారన్న కథనాలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు హర్షకుమార్ తాజా ఆరోపణతో అది నిజమేనేమోనన్న భావన ఏర్పడింది.
స్వరూప ఆస్తులపై శివమెత్తిన స్వామి
ధార్మిక కార్యక్రమాల కంటే రాజకీయ కార్యక్రమాల్లోనే ఎక్కువగా కనిపించే స్వరూపానంద సంపాదనపై, ఇటీవల విశ్వధర్మ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు శివస్వామి చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ‘స్వామి అంటే సర్వసంగపరిత్యాగి కావాలి. పార్టీలకు, ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండకూడదు. స్వరూపానంద తీరు వేరేలా ఉంది. 25 ఏళ్ల క్రితం ఆయన పరిస్థితి ఏమిటి? ఇప్పుడు 100 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? రాజధాని రైతులు నానా కష్టాలు పడుతుంటే, శారదాపీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేద్ర సరస్వతి ఖరీదైన కార్లలో తిరిగి సిగ్గులేకుండా ప్రసాదాలు తిని వెళతారా’ అని విరుచుకుపడ్డారు. రాజధాని రైతులు చేస్తున్న దీక్షాశిబిరానికి శివస్వామి, భవానీ శంకరానంద, భక్త చైతన్యానంద, శుభానందదత్త, వంశీకృష్ణ స్వాములు వెళ్లి సంఘీభావం ప్రకటిస్తే… స్వరూపానంద సరస్వతి మాత్రం హాజరుకాకపోవడం చర్చనీయాంశమయింది.
   పైగా, తన పీఠం వార్షికోత్సవాలకు హాజరుకావాలని, సాధారణ వ్యక్తుల మాదిరి వీవీఐపిలు, జడ్జిల వద్దకు వెళ్లి ఆహ్వానపత్రాలు ఇవ్వడం హిందూ పీఠాల స్థాయిని దిగజార్చడమేనన్న విమర్శలు పెల్లుబుకుతున్నాయి.  ‘పీఠంలో జరిగే వార్షికోత్సవాలకు ప్రచారం ఎందుకు? సాధారణ నేతలు, ప్రజల మాదిరిగా పెళ్లికార్డులు పంచినట్లు పీఠం ఉత్తరాథికారి కార్లలో తిరిగి కార్డులు పంచడం చూస్తే ఆయన పీఠం నిర్వహిస్తున్నారా? ఫంక్షన్ హాలు నిర్వహిస్తున్నారా? ఆయన తీరు స్వామికి తక్కవ లీడరుకు ఎక్కువన్నట్లుంది. ఈ తరహా పబ్లిసిటీ స్వాములను హిందూ సమాజం ఎప్పుడూ చూడలేదు. ఇది సిగ్గుపడాల్సిన విషయం. కంచి మహాపీఠం, హంపి పీఠం, భువనేశ్వరి పీఠాథిపతులెప్పుడూ ఇలా ప్రచారం చేసుకోలేదే? పిఠాపురంలో దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తే కనీసం ఖండించని స్వరూప ఏ మొహం పెట్టుకుని హిందూ ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడతారు? అసలు స్వాములకు ప్రచారంతో పనేంటి? గతంలో ఎన్టీఆర్ ఓసారి కంచి మహాపీఠాథిపతి కాళ్లు తాకిన తర్వాత, స్వామి ఆ పరిహారం కోసం చాలా ఇబ్బందిపడ్డారు. స్వాములెవరూ భక్తులను తాకరు. దూరం నుంచే దర్శనమిస్తారు. అదే పద్ధతి, శాస్త్రం. కానీ స్వరూపానంద వీవీఐలకు ముద్దులు కూడా ఇవ్వడం, వారి ఇళ్లకు వెళ్లి ప్రత్యేక పాదపూజలు చేయించుకోవడం  క్షంతవ్యం కాదు. ఆయన పద్ధతులన్నీ హిందూ శాస్త్రానికి, ఒక సర్వసంగ పరిత్యాగికి ఉండాల్సిన లక్షణాలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. స్వరూపకు రాజకీయాలపై ఆసక్తి ఉంటే వైసీపీలో చేరితే ఎవరికీ అభ్యంతరం ఉండదు.యుపిలో చాలామంది స్వాములు బిజెపిలో చేరి ఎంపి, ఎమ్మెల్యేలుగా ఉన్నారు’ అని  ఏపీ బ్రాహ్మణ చైతన్యవేదిక  రాష్ట్ర కో కన్వీనర్ శిరిపురపు శ్రీధర్ వ్యాఖ్యానించారు. స్వరూప హిందూ ధర్మ రక్షణ కంటే, సొంత  పబ్లిసిటీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు.  ఇకనైనా ఇలాంటి హిందూ పీఠాల స్థాయి తగ్గించే పనులు మానుకుంటే హిందూ ధర్మాన్ని పరిరక్షించినంత పుణ్యం వస్తుందని వ్యంగ్యాస్త్రం సంధించారు. ఇది కూడా చదవండి.. ‘ఆయ్.. అమ్మా.. స్వాములోరిని శంకిస్తే కళ్లుపోతాయ్’  కాగా, అసలు స్వరూపానంద సూచన మేరకే విశాఖను రాజధానిగా మారుస్తున్నారని, ఆయన భూముల విలువ పెంచుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని టిడిపి నేత యనమల రామకృష్ణుడు కూడా ఆరోపించడం ప్రస్తావనార్హం.