కేసీఆర్, జగన్… ఓ బడ్జెట్!

262

 కేంద్ర బడ్జెట్‌లో అన్యాయంపై భిన్నస్వరాలు
 కేంద్రంపై విరుచుకుపడ్డ కేసీఆర్
మోసం చేశారని సమీక్షలో మండిపాటు
అన్యాయంపై  కనీసం నోరెత్తని జగన్
 సమీక్ష కూడా నిర్వహించని వైనం
 కమలంపై కత్తులు దూసిన కేసీఆర్
 కేంద్ర అన్యాయంపై స్పందించని జగన్
 కేసుల భయమే కారణమంటున్న విపక్షం
 కేంద్ర బడ్జెట్‌పై గురుశిష్యుల దారులు వేరు
(మార్తి సుబ్రహ్మణ్యం)

వాళ్లిద్దరూ గురుశిష్యులు. రాజకీయాల్లో ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకుంటారు. గురువు గీసిన గీత శిష్యుడు దాటరు. శిష్యుడికి కష్టం వస్తే గురువు తట్టుకోలేరు. అలా వారిద్దరి ‘మన్‌కీబాత్’ ఒకటే. మరి కీలకమైన అంశం, అది కూడా తమ రాష్ట్రాలకు జరిగిన అన్యాయానికి సంబంధించిన అంశంలో మాత్రం.. వారిద్దరి దారులు వేరు. ఆ అంశంలో గురువు పరశురాముడయితే, శిష్యుడు మాత్రం మహాముని. కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు జరిగిన అన్యాయంపై గురువు కేసీఆర్ అగ్గిరాముడయి, కమలంపై కత్తులు దూశారు. కానీ ఆయన శిష్యుడైన జగన్ మాత్రం, విచిత్రంగా అసలు నోట మాటలు లేక మూగనోము పట్టిన ైవె చిత్రి ఇది.
దేశమంతా ఊపిరి బిగపట్టి, ఉత్కంఠతో ఎదురుచూసే కేంద్ర బడ్జెట్‌లో యథాప్రకారంగా తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగింది. గత కొన్నేళ్ల నుంచి ఏపి-తెలంగాణ రాష్ట్రాలకు ఈ అన్యాయం నిర్నిరోధంగా కొనసాగుతోంది. అయినా ఎదిరించే మొనగాడే లేడు. కారణం రాజకీయ అవసరాలు. కేసుల దోబూచులాట. మోదీ-అమిత్‌షా భయం. ఎక్కడ చాపకింద నీళ్లు తెస్తారోనన్న వణుకు. అయితే.. తెలంగాణ సీఎం, తెరాసాధినేత కేసీఆర్ మాత్రం కేంద్రం చూపుతున్న సవతిప్రేమను దునుమాడుతూనే ఉన్నారు. బిజెపిపై బహిరంగ యుద్ధం చేస్తూనే ఉన్నారు.
 తాజాగా నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై ధ్వజమెత్తారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణకు ద్రోహం చేసిందని విరుచుకుపడ్డారు. విభజన చట్టం హామీల అమలును నిలదీశారు. బడ్జెట్ వివరాలతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్, అది ముగిసిన తర్వాత తెలంగాణ వాణి వినిపించారు. తాము ప్రధానిని కలిసినప్పుడు ఏం కోరిందీ? బడ్జెట్‌లో ఏం ఇచ్చిందీ వివరిస్తూ బిజెపి సర్కారుపై ఒంటికాలితో లేచారు. కేసీఆర్ ఒక్కరే కాకుండా.. కేటీఆర్, మంత్రులు, ఎంపీలందరూ ఒక్క గొంతుకతో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని దుమ్మెత్తిపోశారు. ప్రేమ పుట్టినా, పగ పుట్టినా ఆయనంతే. దటీజ్ కేసీఆర్!
   అయితే.. విచిత్రంగా కేసీఆర్ శిష్యుడైన ఏపీ సీఎం జగన్ మాత్రం అసలు బడ్జెట్‌తో తనకేం సంబంధం అన్నట్లు.. తామరాకుమీద నీటిబొట్టులా నిమ్మకునీరెత్తినట్లు ఉండటమే ఆశ్చర్యం. కనీసం ఆయన బడ్జెట్ తీరు తె న్నులు, ఏపీకి కేటాయింపులు, నిలిచిపోయిన నిధులపై సమీక్షించినట్లు ఆయన సొంత మీడియాలో కూడా వచ్చిన దాఖలాలు లేవు. పైగా.. మోదీని అర్జునుడితో పోలుస్తూ, మోదీ సర్కారు వృద్ధిమంత్రమని కథనాలు రాయడం మరో వైచిత్రి. సహజంగా కేంద్ర బడ్టెట్‌పై ముఖ్యమంత్రులు స్పందిస్తుంటారు. కానీ జగన్ మాత్రం కనీసం నోరెత్తకపోవడమే విచిత్రం. తెలంగాణకు జరిగిన అన్యాయంపై తెరాస పార్టీ యావత్తూ మూకుమ్మడిగా  కేంద్రంపై విరుచుకుపడితే, వైసీపీ మాత్రం మొహమాటంతో ఆవేదన వ్యక్తం చేసినట్లు మాట్లాడింది. కనీసం బంతిపూల యుద్ధం కూడా చేయలేకపోయింది. బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని ఆర్ధికమంత్రి బుగ్జన, వైసీపీ పార్లమెంటరీపార్టీ నేత విజయసాయిరెడ్డి కంటితుడుపు వ్యాఖ్యలు చేస్తే.. ఆ పార్టీకే చెందిన ఎంపి రఘురామకృష్ణంరాజు మాత్రం అద్భుతమని అభినందించడం మరో విడ్డూరం.
నిజానికి బడ్జెట్ తర్వాత సీఎం జగన్ మీడియాతో మాట్లాడతారని, అదీకాకపోతే కనీసం పత్రికాప్రకటనయినా విడుదల చేస్తారని చాలామంది భావించారు. సీఎం అయిన తర్వాత మర్యాదపూర్వకంగానయినా ఒక్కసారి కూడా ఏపీ మీడియాతో మాట్లాడని జగన్.. కనీసం కేంద్రబడ్జెట్‌లో జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తారని భావించారు. అయితే, సాయంత్రం వరకూ ఆ ఛాయలేమీ కనిపించలేదు. ఇది కూడా చదవండి.. ‘సీఎం మాట్లాడాలని రూలుందా’? ఎందుకంటే తెలంగాణ సీఎం కేసీఆర్ అప్పటికే సమీక్షలో ఉన్నారు. ఆ తర్వాత వాటి వివరాలు వెల్లడించారు. అయితే జగన్ అలాంటి ప్రయత్నమేదీ చేసినట్లు కనిపించలేదు.  ఢిల్లీలో విజయసాయిరెడ్డి, రఘురామకృష్ణంరాజు, హైదరాబాద్‌లో ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. అది కూడా బిజెపిపై కనీసం బంతిపూల యుద్ధం కూడా చేయలేకపోయారు. దురదృష్టం.. అన్యాయం జరిగింది.. మొండిచేయి చూపారు.. మరోసారి అభ్యర్ధిస్తాం.. నిరాశే ఎదురయింది వంటి పొడిపొడి మాటలు తప్ప.. సూటిగా, సమరనినాద ధ్వనులేవీ వినిపించే ప్రయత్నం కూడా చేయకుండా జాగ్రత్త పడినట్లు కనిపించింది.  
22 మంది ఎంపీలను ఇస్తే కేంద్ర మెడలు వంచి ప్రత్యేక హోదాతోపాటు, రాష్ట్రానికి రావలసినవన్నీ సాధిస్తామని విపక్ష నేతగా జగన్ చెప్పిన మాటలు, ఆచరణలో లేశమాత్రమయినా కనిపించలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంటులో హోదా గురించి పోరాడిన దాఖలాలయితే భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ఆర్ధికమంత్రి ప్రసంగం ముగిసిన తర్వాతయినా, ైవె సీపీ ఎంపీలు కనీసం ధర్నా చేసే ప్రయత్నం కూడా చేయలేదు. రాష్ట్రానికి అన్యాయం జరిగినా కేసీఆర్ మాదిరి ధైర్యంగా నోరువిప్పే సాహసం కూడా చేయని జగన్ మౌనానికి,  రాజకీయ అవసరాలే కారణమన్నది బహిరంగ రహస్యం. విపక్షాలు సైతం బిజెపికి భయపడి, వైసీపీని బిజెపి ‘బీ’టీముగా మార్చేశారని ఆరోపించడం ప్రస్తావ నార్హం