పరిటాల హంతకులకు జగన్ బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లిచ్చారా?

495

జగన్‌పై మాజీ ఎంపి హర్షకుమార్ సంచలన ఆరోపణలు
పరిటాల హత్యకు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు సప్లై చేశారన్న ఆరోపణ
వివేకా హత్యను సీబీఐకు ఎందుకివ్వలేదు?
కొండారెడ్డి జీఓ ఇవ్వలేదేంటని బాధపడ్డారు
బోటు ప్రమాదకారకులకు స్వామి స్వరూపానంద అండ
జగన్ నన్నేమీ చేయలేరు
సంచలనం సృష్టిస్తోన్న హర్షకుమార్ వీడియో
(మార్తి సుబ్రహ్మణ్యం)

అమలాపురం మాజీ ఎంపి హర్షకుమార్ ఏపీ సీఎం జగన్‌పై చేసిన సంచలన ఆరోపణలు సోషల్ మీడియాలో విస్తృతస్థాయిలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల హర్షకుమార్‌ను జగన్ ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన జగన్‌పై మీడియా వద్ద చేసిన తీవ్ర ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. జగన్‌తోపాటు, ఆయన గురువుగా భావిస్తున్న విశాఖ శారదా పీఠాథిపతి స్వరూపానంద సరస్వతిపైనా తీవ్రమైన ఆరోపలు గుప్పించారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అవుతున్నాయి.
మాజీ మంత్రి, అనంతపురం జిల్లా టిడిపి నేత పరిటాల రవి హత్య కేసులో జగన్ ప్రమేయాన్ని హర్షకుమార్ తెరపైకి తీసుకురావడమే ఈ సంచలనానికి కారణం. పరిటాల హత్యకు జగన్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు సరఫరా చేశారంటూ హర్షకుమార్ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇటీవల జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాజమండ్రి జైలుకు వెళ్లిన హర్ష.. ఆ సమయంలో అక్కడ ఖైదీలను కలిశారు. అందులో కీలక వ్యక్తులు కూడా ఉన్నందున, బహుశా వారి అనుభవాలు తెలుసుకుని తాజాగా ఇచ్చిన ఇంటర్య్వూలో వాటిని వెల్లడించినట్లు కనిపిస్తోంది. ప్రధానంగా జగన్ తరఫున శిక్ష అనుభవిస్తున్న కొండారెడ్డి తనకు చెప్పిన విషయాలను కూడా హర్షకుమార్ వెల్లడించిన వైనం సంచలనం సృష్టిస్తోంది.

 ‘పరిటాలను హత్య చేసిన వారికి జగన్ స్వయంగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు సరఫరా చేశారు. తర్వాత దానిపై సీబీఐ విచారణ జరిగిన సమయంలో, ఆయన తండ్రి వైఎస్ సీఎంగా ఉన్నందున అది అలా వెళ్లిపోయింది. ఇప్పుడు జగన్ తరఫున శిక్ష అనుభవిస్తున్న కొండారెడ్డి తనకు జగన్ సర్కారు జీఓ ఇవ్వకపోవడంపై బాధపడుతున్నాడు. ఇదేందన్నా నేను జగన్ కోసం జైలుకెళితే, జీఓ ఇవ్వడేంటన్నా అని వాపోతున్నాడు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు జగన్‌కు తెలిసి జరగకపోతే, ఇప్పటిదాకా ఆ కేసును ఎందుకు సీబీఐకి ఇవ్వలేదు? వివేకా కూతురు కూడా ఇదే ప్రశ్నించింది కదా? వివేకాను జగన్ కొట్టారని నేను ఎన్నికల ముందే చెప్పా. జగన్ పాలన పగ, ప్రతీకారంతో నడుస్తోంది. ప్రజావేదిక ధ్వంసంతోనే అది రుజువయింది. అంటే అది ఫ్యాక్షనిస్టు మనస్తత్వం. విధ్వంసం చేస్తేగానీ ఆయన గుండెకు సంతృప్తినివ్వదు. ఇది ఫ్యాక్షనిస్టుల శాడిజం. అందుకే ఆయన పరిపాలనను చూస్తున్నా. 16 నెలలు 420 కేసులపై అరెస్టయిన జగన్‌కు జైలులో ఉండే బాధేమిటో తెలిసినందున, తమందరినీ బయటకు పంపుతారని జైల్లో ఉన్న ఖైదీలు ఆశపడ్డారు. ఈ ప్రభుత్వం నన్నేమీ చేయలేదు’ అని హర్షకుమార్ స్పష్టం చేశారు.

జగన్‌పై ఇలాంటి తీవ్రమైన ఆరోపణ చేసిన హర్షకుమార్..ఆయన గురువైన విశాఖ శారదాపీఠాథిపతి స్వరూపానందనూ విడిచిపెట్టకపోవడం విశేషం. రాజమండ్రి వద్ద జరిగిన బోటు ప్రమాదానికి కారకులైన వారిని శిక్షించాలని భావించిన సమయంలో, స్వరూపకు మంత్రి అవంతి శ్రీనివాస్ శిష్యుడయినందున వదిలేశారనిమరో సంచలన ఆరోపణకు తెరలేపారు. బోటులో అనేక లోపాలున్నాయని, అది మంత్రి అవంతిదేనని బాధిత కుటుంబానికి చెందిన ఓ మహిళ చెప్పింది. అందుకే నేను సుప్రీంకోర్టుకెళ్లా. అప్పటినుంచీ జగన్ నన్ను వేధిస్తున్నాడు. ఒక పేదవాడి కోసం పోరాడితే నన్ను 48 రోజులు జైల్లో పెట్టారు. అయినా నన్నేమీ చేయలేరన్నారు. ఇక్కడి పోస్టు ఆఫీసర్ కలెక్టర్‌కు స్నేహితుడు. ఇప్పటి కలెక్టర్ జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఒకరు. వాళ్లంతా కలసి పోర్టు అధికారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నా. అందుకే నాపై కోపం అని వివరించారు.
‘ఎన్నికల ముందు టిడిపి ఎంపీగా ఉన్న అవంతి శ్రీనివాస్‌ను వైసీపీలో తీసుకువచ్చింది స్వరూపానే. అందుకే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రిని చేశారు. మరి అమలాపురం టిడిపి ఎంపీగా ఉన్న ఎస్సీ వ్యక్తి రవీంద్ర ఎంపీ పదవికి రాజీనామా చేసినా, ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. అంటే జగన్‌పై స్వరూపా ప్రభావం ఎంత ఉందో స్పష్టమవుతోంది. ఇంకా చాలా ఉన్నాయి. విశాఖ చాలా బ్యూటీఫుల్ సిటీ. దయచేసి రాజధానితో దాని కీర్తిని దిగజార్చకండి’ అన్నారు.
అయితే జగన్‌పై రాజకీయపరమైన ఆరోపణలు చేసిన హర్షకుమార్.. దేశాన్ని దిగ్భ్రమగొలిపిన బోటు ప్రమాదకారకులను కాపాడారన్న ఆరోపణ మాత్రం, స్వామికి నైతిక సంకటంగా మారింది. ఇప్పటికే అనేక విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వరూప.. ఇలాంటి పనులు కూడా చేస్తున్నారన్న భావన హర్షకుమార్ తాజా ఆరోపణలతో తెరపైకి వచ్చినట్టయింది