విగ్రహ విధ్వంసంపై రోడ్డెక్కనున్న పీఠాధిపతులు

427

పిఠాపురంలో దేవతా విగ్రహాల వరస విధ్వంసం
కాళ్లు, చేతులు, ముక్కు నరికేసిన వైనంపై పీఠాథిపతుల ఆగ్రహం
ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి  స్వామి పరిపూర్ణ హెచ్చరిక
కమలదళాన్ని కదిలించిన కన్నా
ఏపీలో మరోసారి భగ్గుమన్న హిందూ సమాజం

( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆ గ్రామంలో వరసగా అన్నీ దేవతా విగ్రహాలే. సూటిగా చెప్పాలంటే అదో దేవతలున్న గ్రామం. మరి అలాంటి గ్రామంలో కొలువుదీరిన దేవతా విగ్రహాలకు ముక్కు లేదు. కళ్లు లేవు. చెవులు లేవు. కాళ్లు లేవు. రోజుకో విగ్రహ విధ్వంసం. నిర్నిరోధంగా సాగుతున్న ఈ పైశాచికత్వాన్ని అడ్డుకునే దిక్కు లేదు. ఈ విషయం సోషల్ మీడియాలో వీడియోల రూపంలో వెలుగులోకి వచ్చిన తర్వాతనే ఉలిక్కి పడిన హిందూ సమాజం, తర్వాత  మేల్కొంది. బిజెపి దళపతి కన్నా లక్ష్మీనారాయణ తన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కార్యాచరణ ఖరారు చేశారు.  నిందితులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీలను డిమాండ్ చేశారు.  శ్రీపీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద రంగంలో దిగారు. ఆ వెంటనే వీహెచ్‌పీ. ఆ తర్వాత స్వాములు, హిందూ ప్రముఖులు ఆయన వెంట నడిచారు.  హిందూ సమాజం కదిలివచ్చింది. ముష్కరులను అరెస్టు చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళన  తప్పదన్న పరిపూర్ణ హెచ్చరిక ఏపీలో మరింత వేడి రగిస్తోంది.
ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్నిరోధంగా మత మార్పిళ్లు జరుగుతున్నాయన్న హిందూ సంస్థల ఆందోళన నేపథ్యంలో జరిగిన మరో ఘటన,  హిందూ సమాజంలో మరింత ఆందోళనకు కారణమయింది. ఇంతకూ ఏం జరిగిందంటే..  తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో  15 దేవాలయాలకు చెందిన దేవతావిగ్రహాలు ప్రతిరోజూ విధ్వంసమవుతున్న తీరు స్థానిక హిందువులు, భక్తులను ఉలికిపాటుకు గురి చేసింది. అందులో 9 ఆలయాలకు చెందిన దేవతా విగ్రహాలు ముష్కరచర్యకు బలయిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్రమంలో, హిందూ సమాజం మేల్కొంది. ముందు దీనిపై వచ్చిన ఫిర్యాదుకు స్పందించిన బిజెపి చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు, జిల్లా నేతలను అప్రమత్తం చేశారు. వారంతా అక్కడ పర్యటించి, ఫొటో, వీడియోలను ఎస్పీ, కలెక్టర్‌కు అందించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దానితో రంగంలోకి దిగిన పోలీసులు వారికి చెప్పిన సమాధానాలు విస్తుపోయేలా చేశాయి. ఈ అరాచకానికి పాల్పడిన యువకుడికి మతిస్థిమితం లేదని చెప్పిన జవాబుపై స్వామి పరిపూర్ణ విరుచుకుపడ్డారు. ‘ల్యాప్‌ట్యాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్లు ఉన్న ఇంజనీరింగ్ విద్యార్ధికి మతిస్థిమితం లేదని చెబితే నమ్మే అమాయకులు కాదు హిందువులు. ఇది ఒక వ్యక్తి చేసినది కాదు. దీనిపై పెద్ద ముఠా కుట్రనే ఉంది. ఫిబ్రవరి 5 సాయంత్రం లోగా నిందితులను అరెస్టు చేసి, వారితో హిందువులకు క్షమాపణ చెప్పించకపోతే, 6వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తాం. ఈ విషయాన్ని ప్రధాని మోదీని కలిసి వివరిస్తామ’ని హెచ్చరించారు. పిఠాపురంలో ముష్కరమూక జరిపిన విధ్వంసకాండను ఆయన.. భువనేశ్వరీ పీఠాథిపతి స్వామి కమలానందభారతి, హంపీ పీఠాథిపతి గోవిందానంద సరస్వతి శ్రీనివాసానంద స్వామి, రచయిత జొన్నవిత్తుల, పత్తిపాటి పద్మాకర్, హమారా ప్రసాద్, బిజెపి ధార్మికసెల్ రాష్ట్ర కన్వీనర్ తూములూరి చైతన్య, జనసేన నేతలతో కలసి సందర్శించి, సర్కారు నిర్లక్ష్యంపై విరుచుకుపడ్డారు.
ఫిబ్రవరి 5లోగా జగన్ సర్కారు స్పందించకపోతే, 6 వ తేదీ నుంచి ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం ప్రార ంభించేందుకు హిందూ సంస్థలు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగా ప్రతి దేవాలయాల ఎదుట దీపారాధన చేసి, తమ నిరసన ప్రకటించనున్నారు. ఆ తర్వాత పుష్కరఘాట్‌లు, నదుల వద్ద జలదీక్ష నిర్వహించనున్నారు. అప్పటికీ స్పందన రాకపోతే ప్రతి పట్టణంలో మహార్యాలీ నిర్వహించడం ద్వారా తమ నిరసన ప్రకటించనున్నారు. పదిహేనురోజుల తర్వాత.. బహుశా ఫిబ్రవరి నెలాఖరుకు స్వాములు ప్రధాని మోదీని కలిసేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఏపీలో శరవేగంగా జరుగుతున్న మతమార్పిళ్లకు నిరసనగా అఖిల భారత హిందూ మహాసభ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. విజయవాడలో భారీ నిర్వహించిన హిందూ మహాసభ, రాష్ట్రంలో జరుగుతున్న మతమార్పిళ్ల వెనుక జగన్ సర్కారు హస్తం ఉందని నేతలు ఆరోపించినవిషయం తెలిసిందే. ఇది కూడా చదవండి.. ‘ అనుకున్నట్లే.. అమరావతికి హిందూదళం వచ్చేసింది! ’.ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పక్కనే ఉన్న తంగిడి నుంచి వచ్చిన 25 మంది కాపులను క్రైస్తవంలోకి మార్చేందుకు గోపాదాల రేవు వద్ద జరిగిన ప్రయత్నాలను, అక్కడి స్థానికులతో కలసి పౌరోహితులు అడ్డుటున్న వైనానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది కూడా చదవండి.. ‘ మళ్లీ మతమార్పిడి కలకలం ’ అంతకుముందు విజయవాడ పుష్కరఘాట్ వద్ద 40 మందిని మతం మార్చిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.