పవన్ యాక్షన్.. బిజెపి డైరక్షన్!

388

సినిమాలు చేయాలని ఆదేశించిన బిజెపి
పవన్ గ్లామర్ కోసమే రాజకీయ వ్యూహం
అందుకే మాట మార్చిన జనసేనాధిపతి

(మార్తి సుబ్రహ్మణ్యం)

పోలీ పోలీ నీ భోగం ఎన్నాళ్లే.. అంటే మా అత్త మాలపల్లి వెళ్లివచ్చేదాకా అంటే  ఇదే. ‘ఇకపై నేను సినిమాలు చేయను. పూర్తి సమయం ప్రజాక్షేత్రంలోనే గడుపుతా. రెండు పడవల ప్రయాణం కుదరదు’- ఇది జనసేనాధిపతి పవన్‌కల్యాణ్ ఒకప్పుడు చేసిన ప్రక టన. కానీ ఇప్పుడు పవన్ మాట మార్చి, తాను మళ్లీ మొహానికి రంగేసుకుంటానని సెలవిచ్చారు. ఆరకంగా… స్టేట్‌మెంట్లు మార్చని వాడు పొలిటీషియనే కాదన్న గిరీశం వారసుడి అవతారమెత్తారు.
పవన్ తాజా ప్రకటన వెనుక బిజెపి నాయకత్వం ఆదేశాలున్నట్లు సమాచారం. రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమాలు చేసుకోవాలని ఆయనకు బిజెపి నాయకత్వం స్పష్టం చేసిందని, అందుకే ఆయన తన సినిమా జీవితాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటన చేసినట్లు చెబుతున్నారు. బిజెపి వ్యూహాత్మకంగానే పవన్ కల్యాణ్‌కు ఈ హితబోధ చేసినట్లు కనిపిస్తోంది. ఏపీలో ఇప్పట్లో ఎన్నికలు లేవు. అసలు వైసీపీ మిత్రపక్షమో, శత్రుపక్షమో, రహస్య మిత్రుడన్న దానిపై దానికే స్పష్టత లేదు. కాబట్టి సినిమాల్లో గ్లామర్ హీరోగా పేరున్న పవన్ కల్యాణ్‌ను వచ్చే ఎన్నికలవరకూ సినిమాల్లో కొనసాగించేలా చూస్తే, దాని ద్వారా వచ్చే అదన పు సినిమా మైలేజీతో పార్టీకి మేలు జరుగుతుందన్నది బిజెపి యోచనగా కనిపిస్తోంది.ఆలోగా వైసీపీ సర్కారు మీద బిజెపి చేసే పోరాటాల్లో పవన్ పాల్గొనే చూస్తే, వచ్చే జనంతో బిజె పి-జనసేన పొత్తు బలంగా ఉందన్న సంకేతాలు పంపించవచ్చన్నది బిజెపి వ్యూహమంటున్నారు. దీర్ఘకాలిక రాజకీయాల్లో కొనసాగడం ద్వారా పవన్ సాధించేదేమీ ఉండదని, ఇప్పటి జనసేన ప్రజామద్దతుకు కారణం ఆయన సినీ గ్లామరే కారణం కాబట్టి, దానిని స్థిరం చేసుకోవాలంటే పవన్‌ను సినీ హీరోగానే ముద్ర వేస్తేనే లాభమన్నది బిజెపి లక్ష్యంగా కనిపిస్తోంది. ఇది కూడా చదవండి.. ‘ పవర్ కథలో పవన్ పులుసులో ముక్కేనా?

తాజాగా పవన్ సినిమాలకు ఎక్కువ సమయం కేటాయిస్తూ, మళ్లీ సినీరంగం వైపు మళ్లడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ,  సీబీఐ మాజీ జెడి, గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన  లక్ష్మీనారాయణ జనసేనకు రాజీనామా చేయడం చర్చనీయాంశమయింది. నిజానికి ఆయన జనసేనకు రాజీనామా చేస్తారని చాలాకాలం నుంచి ప్రచారం జరుగుతోంది. లక్ష్మీనారాయణ బిజెపిలో చేరవచ్చని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, లక్ష్మీనారాయణ రాజీనామా ఆమోదిస్తున్నట్లు ప్రకటించిన పవన్.. ఆ సందర్భంగా తన సినిమా రంగ పున: ప్రవేశం గురించి చేసిన వ్యాఖ్యలు, గతంలో ఆయన చేసిన ప్రకటనలనే ఖండించినట్లున్నాయి. తాను ఇకపై పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తానని గతంలో ప్రకటించారు. 20-11-18న పవన్ ఒక ప్రకటన విడుదల చేస్తూ ‘నేను త్వరలో ఒక సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ అది అబద్ధం. నేను ఏ సినిమానూ అంగీకరించలేదు. నాకు  అంత సమయం లేదు. ప్రజా జీవితానికే పూర్తి సమయం కేటాయించాను. నా ఆలోచనలన్నీ ప్రజాక్షేమం కోసమే. నా తపన అంతా సమ సమాజస్థాపన కోసమే’నని పవన్ స్పష్టం చేశారు. మరో సందర్భంలో తనకు గతంలో కంటే నాలుగు రెట్ల రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్ చేసినా నేను అంగీకరించలేదు. ఓడినా నాలో దీక్ష పట్టు సడలలేదు అని  చెప్పారు.

కానీ తాజాగా తనకు సినిమా తప్ప మరో ఆదాయం, ఆధారం లేదని స్పష్టం చేశారు. జగన్ మాదిరిగా సిమెంట్ ఫ్యాక్టరీలు, చంద్రబాబులా పాల ఫ్యాక్టరీలు తనకు లేవని పరోక్షంగా చెప్పారు. తనపై ఆధారపడి చాలామంది బతుకుతున్నందున, సినిమాలే ఆధారమని చెప్పకనే చెప్పారు.  అంతేనా?.. గతంలో వామపక్షాలతో స్నేహం చేసినప్పుడు ప్రత్యేక హోదాపై మోదీ మోసం చేశారని, మోదీ-బాబు-జగన్‌ను నమ్మవద్దని పిలుపునిచ్చారు. చంద్రబాబు-మోదీ వాడుకుని వదిలేశారన్న వీడియో కూడా అప్పట్లో సంచలం సృష్టించింది. నిజమే.. ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాలో రావుగోపాలరావు చెప్పినట్లు ‘ ఆ ముక్క అంతకుముందు చెప్పాలి’ అన్నట్లు.. ఈ ముక్క ఎన్నికల ప్రచారంలోనే చెబితే సరిపోయేది కదా ‘తమ్ముడూ’!