ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో తెలుగు నేతలు

373

స్టార్ క్యాంపెయినర్‌గా బిజెపి నేత, సినీ నటి కవిత
తెలుగు, మళయాళ, కన్నడ, తమిళ ప్రాంతాల్లో ప్రచారం
హస్తినలో బిజెపి తెలుగు నేతల హల్‌చల్

(మార్తి సుబ్రహ్మణ్యం)

దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బిజెపి నేతలు బిజీగా ఉన్నారు. బిజెపికి ప్రతిష్ఠాత్మకంగా మారిన ఢిల్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చేందుకు బిజెపి నాయకత్వం, వివిధ రాష్ట్రాలకు చెందిన తమ పార్టీ నేతలను ప్రచార రంగంలోకి దింపింది. ఆయా రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాలను గుర్తించి, అక్కడ ఆయా రాష్ట్రాల నేతలను ప్రచారంలోకి దింపింది. ఇది చాలా ఏళ్లుగా కొనసాగుతున్న ఎన్నికల వ్యూహమే.
అయితే, ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మెజారిటీ సాధిస్తుందన్న సర్వే నివేదికల నేపథ్యంలో, ఈ ఎన్నికలను బిజెపి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. పైగా ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపి అధికారం కోల్పోవడం కూడా, బిజెపి పట్టుదలకు మరో కారణంగా కనిపిస్తోంది. దేశ రాజకీయాల్లో ఢిల్లీ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ఎప్పటికీ సవాలే. అందులోనూ దేశంలో అధికారంలో ఉన్న పార్టీలకు అది మరీ ప్రతిష్టాత్మకం.పైగా..నద్దా అధ్యక్షుడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో, బిజెపి దీనిని సవాల్‌గా తీసుకుంది. ఈ ఎన్నికల్లో బిజెపి విజయం సాధిస్తేనే శ్రేణుల్లో నూతనోత్సాహం పెల్లుబుకుతుంది. ఓడిపోతే దేశంలోని ప్రాంతీయ పార్టీలు మరింత బలపడతాయి. ఈ దృష్ట్యా ఢిల్లీ ఎన్నికలు బిజెపికి పెను సవాల్‌గా మారాయి.
వివిధ రాష్ట్రాల ప్రజలు వలస వెళ్లిన ఢిల్లీలో కేరళ ప్రాంతానికి చెందిన వారి సంఖ్యనే అధికం. ఆ తర్వాత తమిళ, తెలుగు, కన్నడిగులున్నారు. ఈ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేసేందుకు సినీ నటి, ఏపీ బిజెపి ఉపాధ్యక్షురాలు కవితను ఆ పార్టీ నాయకత్వం స్టార్ క్యాంపెయినర్‌గా నియమించింది. తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లో అనర్గళంగా ప్రసంగించే కవితను ఆ ప్రాంతాలు వారు నివసించే ప్రాంతాల్లో ప్రచారం చేయిస్తున్నారు. కర్నాటక వాసులు ఎక్కువగా నివసించే ఆర్కేపురం, త్రిలోక్‌పురి, మంగోల్‌పురి, రోహిణి; తమిళ ప్రజలు ఎక్కువగా నివసించే  వాజీపూర్, కల్కాజీ, ఓక్లా, ఉత్తంనగర్, తిలక్‌నగర్, పప్పన్‌కిల్లా, ద్వారకా, కొండిల్, ఆర్కేపురం, జంగ్‌పుర, కరోల్‌బాగ్, షకూర్‌బస్తి, త్రిలోక్‌పురి; కేరళీయులు ఎక్కువగా నివసించే త్రిలోక్‌పురి, హరినగర్, మెహ్రాలీ, జనక్‌పురి, ద్వారకా, రోహిణి, ఆర్కేపురం, సీమపురి, పట్పర్‌గంజ్, బిస్వాసన్; తెలుగు వారు ఎక్కువగా ఉండే షాద్రా, సుల్తాన్‌పురి, జనక్‌పురి, ఆర్కేపురం, మాల్వీయనగర్, కరోల్‌బాగ్ ప్రాంతాల్లో కవిత ప్రచారం నిర్వహిస్తున్నారు.ఇంటింటికీ వెళ్లడం, కరపత్రాలు పంచడం, స్ట్రీట్ మీటింగులు నిర్వహించడంలో కవిత బిజీగా ఉన్నారు. తమిళ, తెలుగు ప్రాంతాల్లో ఆమె ప్రచారానికి ఎక్కువ స్పందన లభిస్తోంది.
ఇక బిజెపి జాతీయ నేత పురంధీశ్వరి, ఎంపి జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ మాధవ్, రమేష్‌నాయుడు, హైదరాబాద్ బిజెపి సిటీ చీఫ్ రామచంద్రరావు, ఆకుల విజయ తదితరులు కూడా తెలుగు వారున్న ప్రాంతాల్లో బిజెపి అభ్యర్ధుల విజయం కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. రామచంద్రరావు హైదరాబాద్ వాసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.