ఏ ఎన్నికయినా ఇక ఏకపక్షమే!

627

ఇన్ని తీర్పులిచ్చాకయినా ఆ నేతలు  మారాలి
విపక్షాలు ఇకనైనా ప్రజలకోసం పనిచేయాలి
మత-కుల రాజకీయాలను ప్రజలు నమ్మరు
మతం కాదు మనుషులే ముఖ్యమన్నది కేసీఆర్ పాలిసీ
జనాలకు కావల్సింది సమస్యలు తీర్చేవాళ్లే
బెంగాల్‌లో సీపీఎం  రికార్డును దాటేస్తాం
‘సూర్య’తో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్

(మార్తి సుబ్రహ్మణ్యం)

తలసాని శ్రీనివాసయాదవ్. తెలుగు రాష్ట్రాల్లో  పరిచయం  చేయాల్సిన అవసరం లేని పేరిది. టిడిపిలో ఉన్నా, టీఆర్‌ఎస్‌లో ఉన్నా తుపానే. తాను నమ్మిన వారినే కాదు, నమ్ముకున్న వారినీ విడిచిపెట్టకుండా వారి అడుగులో అడుగువేసే  నైజం ఆయనది. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ఆ తత్వమే ఈ బీసీ నేతను, ఇప్పటికీ జనక్షేత్రంలో చిరస్థాయిగా నిలిచేలా చేసింది. అధినేతలకు ఇష్టుడిగా పేరున్న తలసాని, విపక్షాలపై ఒంటికాలితో లేవడంలో ఘనాపాఠీ. తెలంగాణ ఆర్టీసీ సమ్మె సమయంలో విపక్షాలు, కార్మిక సంఘాల కన్నెర్రకు మంత్రులెవరూ నోరెత్తని సమయంలో, ధైర్యంగా సర్కారు పక్షాన గళం విప్పి సమ్మె తీరును తప్పుపపట్టిన తర్వాతే, మిగిలిన మంత్రులు నోరువిప్పారు. ఇప్పుడు తెరాసలోని ట్రుబుల్ షూటర్‌లలో ఒకరిగా మారిన తలసాని.. ఇకపై తెలంగాణలో ఏ ఎన్నికలొచ్చినా ప్రజాతీర్పు మున్సిపల్ ఎన్నికల మాదిరిగానే ఏకపక్షంగానే ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెరాసకు ఇక జనక్షేత్రంలో తిరుగులేదని, ప్రజాశీస్సులు, ఆదరణ ఉన్నంతకాలం తెరాసను ఏ పార్టీ ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. మత-కుల రాజకీయాలకు తెలంగాణలో స్థానం లేదని ఇప్పటికి మూడు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేసిన తర్వాత కూడా విపక్షాలలో మార్పు రాకపొతే, ఇక వారిని దేవుడు కూడా కాపాడలేరంటున్న తలసానితో ‘సూర్య’ ముఖాముఖి ఇది. అధికారం కోసం కాంగ్రెస్-బిజెపి ప్రయత్నాలు, మున్సిపల్ ఎన్నికలు, పరిపాలన తీరుతెన్నులు, కేంద్ర సహకారం వంటి అంశాలపై తలసాని ఏమన్నారో ఆయన మాటల్లోనే…ఇది కూడా చదవండిమున్సి ‘పల్స్’ పట్టిన టీఆర్‌ఎస్?
‘మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెరాస క్యాడర్‌లోనే కాదు. ప్రజల్లో కూడా ఒక ఆత్మస్థైర్యాన్ని, ఈ రాష్ట్ర దిశను స్పష్టం చేశాయి. ఇకపై తాము ఎవరివైపు మొగ్గాలో, ఏ పార్టీతో కలసి అడుగులు వేయాలో, ఎవరికి మద్దతునీయాలో అన్న విషయాన్ని ఈ ఎన్నికల ఫలితాలు చాటాయి. ఈ విజయం మా పార్టీది కాదు. తెలంగాణ ప్రజలది. మేం సంపూర్ణ  సేవకులం. ప్రజలకు మాత్రమే బానిసలం. అందుకే కేసీఆర్ నుంచి సామాన్య నాయకుడి వరకూ చేసే ఆలోచనలన్నీ వారి కోసమే. తెలంగాణలో పేదరికం ఉండకూడదన్న కేసీఆర్ లక్ష్యంలోని నిజాయితీని గుర్తించిన ప్రజలు, ఏ ఎన్నికలొచ్చినా మాకే పట్టం కడుతున్నారు. దీన్ని అన్ని వర్గాలూ ఆలోచించాలి’.‘ప్రతిపక్షాలు చెప్పినట్లుగా తలూపి, ప్రతిసారీ మా చిత్తశుద్ధిపై శీలపరీక్ష చేసుకోవలసిన అవరసరం మాకు లేదు. ఆ పనిచేయాల్సింది ఇప్పుడు వాళ్లే. ఎందుకంటే ఇప్పటివరకూ జరిగిన రెండు అసెంబ్లీ, జడ్పీటీసీ, మున్సిపల్, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మాకే ఎక్కువ సీట్లు ఇచ్చారు. సరే. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్-బిజెపి మతం-స్థానికంగా కులవాదాన్ని తెరపైకి తెచ్చి కొన్నిచోట్ల లబ్థిపొందాయి. మంచిదే. మరి ఆ విజయం, ఆ విశ్వాసం, ఆ ధీమా నిన్నటి మున్సిపల్ ఎన్నికల్లో ఏమయ్యాయి? ఎందుకు అవి డబుల్ డిజిట్ సాధించలేకపోయాయి? అని ఇప్పుడైనా ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది. ఎందుకంటే వాళ్లకు ఇప్పుడు పనేమీ లేదు కాబట్టి! విపక్షాలుగా సలహాలు ఇవ్వడం ఎలాగూ రాదు. కనీసం ప్రజల కోసం చేసే మంచిపనులకయినా అడ్డుపడకుండా ఉంటే వారిని ప్రజలు క్షమించే అవకాశం ఉంటుంది’ఇది కూడా చదవండి..మళ్లీ కారెక్కిన తెలంగాణ !
‘మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నేను ఆశించిన దానికంటే ఎక్కువగానే వచ్చాయి. కొన్ని చోట్ల రెబెల్స్ పోటీ ఊహించనిది. ఈ ఎన్నికల్లో పార్టీ నాయకత్వం గెలుపు గుర్రాలకే సీట్లు ఇచ్చింది. ఎన్నికలంటే నేతల్లో అంచనాలు ఎక్కువ ఉండటం సహజం. అందుకే చూడండి. మా పార్టీ టికెట్ల కోసమే పోటీ ఉంది. అదే కాంగ్రెస్-బిజెపిలో సీట్లు అడిగేవారు కూడా లేక, కొన్ని చోట్ల రెబెల్స్‌కు మద్దతునివ్వాల్సిన దుస్థితి. కేంద్రమంత్రులు, సీఎంలు పనిచే సిన ఈ పార్టీలు తమ దుస్థితికి కారణాలేమిటో ఇప్పటికీ గుర్తించే స్థితిలో లేరు. రోజూ మీడియాలో తెరాసను తిట్టడం ద్వారా పేరు తెచ్చుకోవాలన్న లక్ష్యంలో, కనీసం  పదో వంతు కూడా ప్రజాసమస్యలపై లేదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే బిజెపి-కాంగ్రెస్ నేతలు ఈ ఫలితాలు చూసి మొహం ఎక్కడ పెట్టుకుంటారు? తెలంగాణ ప్రజల కష్టం తెలిసిన పార్టీకే ఈ ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారు’.ఇది కూడా చదవండి.. ‘ తెరాస తురుపుముక్క తలసాని! 
‘తెలంగాణలో కులాలు, మతాల పేరుతో రెచ్చగొడితే రాజకీయ ప్రయోజనం పొందవచ్చన్న కొన్ని పార్టీల పప్పులు ఉడకవు. తెలంగాణ కుల-మత రహిత సమాజం. మా సీఎం కేసీఆర్ దృష్టిలో హిందువులు, ముస్లింలు ఒక్కటే. హిందువుల పండుగలకు ఎంత గౌరవం ఇస్తుందో ముస్లిం, క్రైస్తవులు, సిక్కుల పండులకూ అంతే గౌరవం ఇస్తుంది. అసలు మనిషి మనిషిగా జీవించడానికి కులం మతం ఎందుకు? మతాలు కాదు మనుషులే ముఖ్యం!  అన్ని మతాలు కలసికట్టుగా ఎందుకు జీవించకూడదని కేసీఆర్ కూడా ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజంలో అభివృద్ధి ఫలాలు అందరికీ పంచేందుకు  కేసీఆర్ కృషి చేస్తుంటే, అదే సమాజాన్ని మత-కుల ప్రాతిపదికగా చీల్చి రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్‌కు, ఆర్టీసీ సమ్మె  సమయంలో జరిగిన ఉప ఎన్నికలో ఎన్ని ఓట్లు వచ్చాయి? బిజెపికి నోటా కంటే తక్కువ ఓట్లు ఎందుకొచ్చాయని అడిగితే జవాబు చెప్పే దమ్మే లేదు. స్థానిక ఎన్నికల్లో మా సమీపంలో ఆ రెండు పార్టీలూ లేవంటే, తెలంగాణ ప్రజలు ఎవరిని నమ్ముతున్నారు? ఎవరిని నమ్మడం లేదని తేలిపోయింది కదా?’
‘ఆటల్లో  దమ్మున్న వాళ్లు, రాజకీయాల్లో ప్రజాబలం ఉన్న వాళ్లు మాత్రమే గెలుస్తారు. నిజంగా ప్రతిపక్షాలు చెప్పుకుంటున్నట్లు వాళ్లకు అంత బలమే ఉంటే మున్సిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగానే జరిగాయి కదా? ఎక్కడా చిన్న ఘర్షణ కూడా జరగలేదు కదా? చాలాచోట్ల ముసుగులో కాంగ్రెస్-బిజెపి కలసి పనిచేశాయి కదా? ఇండిపెండెంట్లు కూడా చాలాచోట్ల గెలిచారు కదా? మరి నిజంగా కాంగ్రెస్-బిజెపికి జనంలో బలం ఉంటే గెలవాలి కదా? ఎందుకు గెలవలేకపోయారు? వాళ్లు మీడియాలో ఉండి మాపై యుద్ధం చేస్తున్నారు. మేం ప్రజాక్షేత్రంలో నిలబడి సమస్యల పరిష్కారానికి యుద్ధం చేస్తున్నాం. అదీ తేడా! అందుకే నేను చెబుతున్నా. పశ్చిమ బెంగాల్‌లో 20 ఏళ్లు పాలించిన  సీపీఎం రికార్డును మా పార్టీ అధిగమిస్తుంది. ఇది విజయగర్వంతో చెప్పడం లేదు. ప్రజలపై మాకున్న నమ్మకం. మాపై ప్రజలు చూపిస్తున్న నిరంతర అభిమానం మేరకే చెబుతున్నా’
‘మా పాలనపై విమర్శించేందుకు ఏమీ లేకనే మతాలు, కులాలను తెరమీదకు తెస్తున్నారు. కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే కాదు. దేశంలో, ఆమాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా ఆర్ధికమాంద్య ప్రభావం ఉంది. అయినా తట్టుకుని తెలంగాణ పురోగమిస్తోంది. కేసీఆర్ వద్ద ఆ ప్రణాళికలున్నాయి. పెన్షన్లు, బడుగు, బలహీన, వర్గాలకు ఇస్తున్న పథకాలు ఎక్కడ ఆగాయో చెప్పండి? మా ప్రాధాన్యతలు మాకున్నాయి.  ప్రపంచంలోని ఐటి రంగం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తోంది. మొన్నటి దావోస్ సదస్సు చూశారు. పెద్ద కంపెనీలు ఇక్కడకు రావడానికి కేటీఆర్‌తో చర్చలు జరిపాయి.  ఈ రాష్ట్రం నుంచి బిజెపి, కాంగ్రెస్ నుంచి ఎన్నికైన బిజెపి-కాంగ్రెస్ ఎంపీలు ఒక్క ప్రాజెక్టు కోసమైనా కేంద్రంతో పోరాడారా చెప్పండి? ప్రజలపై అంత ప్రేమ ఉంటే, రాష్ట్రానికి రావలసిన నిధుల కోసం కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయటం లేదు? కేంద్ర నిధులు నత్తనడక సాగుతున్నా, తెలంగాణ తన కాళ్లపైన తాను నిలబడగలుగుతుందంటే కారణం దానికి కేసీఆర్ లాంటి దార్శనికుడి అనుభవం. కేటీఆర్ లాంటి యువకుల కొత్త ఆలోచనలు. అందుకే తెలంగాణ సమాజం ఉద్యమం నుంచి ఇప్పటివరకూ తెరాసతోనే ఉంది. ఇకపైనా ఉంటుంది’.
‘ నా కుమారుడు సాయి గత లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి తీవ్రస్థాయిలోనే పోటీ ఇచ్చాయి. జయాపజయాలు ప్రజాధీనాలు. ఒక ఓటమి మరో విజయానికి నాంది. నా రాజకీయ జీవితం అట్లాగే మొదలయింది. అప్పుడే ఎన్నికల బరిలో తొలిసారి దిగిన అతనికి, తర్వాత ఓటమి కారణాలు తెలిసి, దానిని విశ్లేషించుకునే అవకాశం వచ్చింది.  ఆ ఎన్నికలు అతనికి ఒక గుణపాఠం. అతనికే కాదు. ఓడిన ప్రతివారికీ ఏ స్థాయిలో జరిగే ఎన్నికలయినా గుణపాఠాలే. ఆ ఎన్నికల్లో బిజెపి మతం సహా అన్ని కార్డులూ వాడింది. నా కుమారుడి రాజకీయ భవిష్యత్తేమిటన్నది నా చేతుల్లో ఏం ఉంటుంది? అధిష్టానం, ప్రజలే దానిని నిర్ణయిస్తారు.