కమలంపై  కేసీఆర్ సమరం!

403

జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్ వారసుడిగా తెరపైకి?
సీఏఏకు వ్యతిరేకంగా జాతీయ ఉద్యమానికి నాయకత్వం?
కాంగ్రెస్-బిజెపికి ప్రత్యామ్నాయంగా మరో ప్రయత్నం
త్వరలో సీఎంల కాన్‌క్లేవ్‌కు సిద్ధం
హిందు-ముస్లింలతో సమ దోస్తీ వ్యూహం

(మార్తి సుబ్రహ్మణ్యం)

దేశంలో కాంగ్రెస్ సహా మిగిలిన పార్టీలకు ఆ ఇద్దరంటే వెన్నులో వణుకు. వారిద్దరూ సీరియస్‌గా దృష్టి సారిస్తే తమ బతుకు బస్టాండవుతుందన్న భయం. కేసులనీ ఈగలు వాగిలినట్లు వచ్చి తమ మీద వాలిపోతాయోమోనన్న బెంగ. అందుకే వీలైనంతవరకూ వారి దృష్టిలో పడకుండా రాజకీయాలు చేసుకుంటే చాలన్న భావన. ఇది చిన్నా చితకా నేతలకే కాదు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఒకప్పటి మహామహులకూ వర్తించే మాట. కానీ..  తన ప్రజలిస్తున్న వరస వెంట వరస అనుకూల తీర్పుతో, జనక్షేత్రంలో బాహుబలిగా నిలిచిన  ‘ఒకే ఒక్కడు’ మాత్రం.. వారిద్దరి సారథ్యంలోని జాతీయ పార్టీని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. బిజెపి-కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టేందుకు తెలంగాణను కేంద్రబిందువుగా మార్చేందుకు నడుంబిగిస్తున్నారు. హైదరాబాద్ నుంచే ‘ఢిల్లీ’ని చూపుడువేలుతో ప్రశ్నిస్తూ, జాతీయ స్థాయిలో సమరం చేసేందుకు రె‘ఢీ’ అవుతున్నారు.అప్పుడెప్పుడో ఎన్టీఆర్, మొన్నటి చంద్రబాబునాయుడు మాదిరిగా! జాతీయ పౌరసత్వ సవరణ చట్టమే ఆ ఒక్కడి యుద్ధానికి కారణం కానుంది. ఇంతకూ ఆ ఒక్కడూ తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
రెండుసార్లు తెలంగాణ పాలకుడిగా ప్రజామోదం పొందిన కేసీఆర్ ఇకపై జాతీయ రాజకీయాలపై దృష్టి సారించనున్నారా? తన తెలంగాణ  మాగాణంలో విరబూసేందుకు  శతవిధాలా ప్రయత్నిస్తున్న బిజెపిని దేశస్థాయిలో సవాల్ చేసేందుకు సిద్ధమవుతున్నారా? మైనారిటీలకు వ్యతిరేకంగా ఉందని భావిస్తున్న ఒక చట్టానికి వ్యతిరేకంగా, దేశం ఉన్న పార్టీలను ఒకే తాటికిపైకి తీసుకురానున్నారా? అన్న ప్రశ్నలకు ఆయన చేస్తున్న ప్రకటనలు, ఆ మేరకు చేస్తున్న ప్రయత్నాలు అవుననే సమాధానమిస్తున్నాయి.
కేంద్రం ఆమోదించిన జాతీయ పౌరసత్వ సవరణ చట్టం, జనగణన వల్ల ఈ దేశంలోని ముస్లిం మతస్థులకు ముప్పని బిజెపి మినహా దేశంలోని అన్ని రాజకీయ పార్టీల ఆందోళన. ఆ మేరకు ముస్లింలు చేస్తున్న ఆందోళనలకు, ధర్నా శిబిరాలకు వెళ్లి మరీ హాజరువేయించుకుని, వారి పట్ల తమకున్న భక్తిని ప్రదర్శించుకుంటున్నాయి. చివరకు ఈ బిల్లును వ్యతిరేకిస్తు, బిజెపిని సవాల్ చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆప్తమితుడైన ఏపీ సీఎం జగన్ సారథ్యంలోని వైసీపీ కూడా, ఈ బిల్లుకు పార్లమెంటులో జైకొట్టింది. అది వేరే విషయం. కానీ, కేసీఆర్ మాత్రం తన రాష్ట్రంలోని ముస్లింల మనూభావాలకు అనుగుణంగా అడుగులు వేయాలనే నిర్ణయానికి వచ్చారు. రావడమే కాదు.. ఏకంగా అదే అంశంపై ఢి ల్లీని ఢీకొట్టేందుకు సిద్ధమవుతుండటం చర్చనీయాంశమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత వరస వెంట వరస వరిస్తున్న విజయోత్సాహంలో, ఆయన ఢిల్లీని ఢీకొట్టేందుకే సిద్ధమవుతున్నారు. జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏకంగా దేశంలోని బిజెపియేతర ముఖ్యమంత్రులను కూడగట్టి, హైదరాబాద్‌లోనే కాంక్లేవ్ నిర్వహించేందుకు వడివడిగా అడుగులేస్తున్నారు. గతంలో ఇందిర-రాజీవ్ ప్రధానులుగా ఉన్నప్పుడు తెలుగుదేశం వ్యవస్థాపకుడైన దివంగత నందమూరి తారకరామారావు, ఆ తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడయిన చంద్రబాబునాయుడు కూడా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్‌కు నాయకత్వం వహించారు. గత ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా బాబు కాంగ్రెస్‌తో కలసి యుద్ధం చేశారు. ఇప్పుడు తెలంగాణాధీశుడు కేసీఆర్ కూడా ఎన్టీఆర్ బాటలోనే, దేశంలో అధికారంలో ఉన్న బిజెపిని సవాల్ చేసేందుకు విపక్షానికి చెందిన సీఎంలను కూడగట్టే పనిలో బిజీగా ఉన్నారు.
బాగానే ఉంది. మరి ముస్లింల కోసం కేసీఆర్ చేస్తున్న ఈ పోరాటంతో తెలంగాణలోని హిందువులు కేసీఆర్ నాయకత్వంలోని తెరాసకు దూరమయిపోరా? అన్నది బుద్ధిజీవులకు వచ్చే సందేహం. నిజమే. కేసీఆర్ కేవలం ముస్లింల కోసమే పోరాడితే, హిందువులకు కోపం రావడం సహజమే కదా?! కానీ.. ఆ సూత్రం ఎక్కడైనా నిజమవుతుందేమో గానీ, తెలంగాణలో మాత్రం కాదు! ఎందుకంటే.. నిజాం ప్రభువును నిర్భయంగా కీర్తించిన   కేసీఆర్.. త్రిదండి చిన జీయర్ స్వామి పల్లకీని స్వయంగా మోస్తారు.ముస్లింలకు వరదానాలిస్తూ, వారి రక్షకుడి అవతారమెత్తిన అదే కేసీఆర్.. చాగంటి కోటేశ్వరరావు వంటి ప్రవచకారుడి కాళ్లు మొక్కుతారు.  ఆ వెంటనే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీతో భుజం కలుపుతారు. ముస్లిం సంతుష్ఠీకరణ  విధానాలు అవలంబిస్తున్నారన్న విమర్శలు ఎదుర్కోనే అదే కేసీఆర్..  లెక్కలేనన్ని యజ్ఞాలు, మహాయాగాలు  చే స్తుంటారు. పండితోతత్తముల సేవలో తరిస్తారు.దేవాలయాలు సందర్శిస్తుంటారు. యాదాద్రిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.  శ్లోకాలు చెప్పడంలో ఆయనకు ఆయనే  సాటి. హిందూ సమాజం తమకు మార్గదర్శిలా నమ్మే బ్రాహ్మణులను గౌరవించడంలో, ఆయన ముందు బిజెపి ముఖ్యమంత్రులూ దిగదుడుపే.అంటే… అటు ముస్లిం-ఇటు హిందువులకు ‘సమాన ప్రతినిధి’ అన్న భావన కేసీఆర్ చర్యల్లో కనిపిస్తుంది. ఇక అలాంటప్పుడు కేసీఆర్ కేవలం ముస్లింలకే ప్రతినిధి అన్న విమర్శను జనక్షేత్రంలో ఉన్న వావెవరూ నమ్మే అవకాశాలు తక్కువే కదా?
హిందువుల ఓట్లు ఎప్పుడూ ఒకే పార్టీ వైపు మొగ్గు చూపవు. అన్ని పార్టీలూ వారి ఓట్లు చీల్చుకుంటాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. కానీ ముస్లిం ఓట్లు ఎప్పుడూ గంపగుత్తగా ఒకే పార్టీ వైపు మొగ్గు చూపుతాయి. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం పార్టీగా ఉన్న మజ్లిస్‌కు హైదరాబాద్ వదిలేసి, మిగిలిన నియోజకవర్గాల్లో ఆ పార్టీ దన్నుతో కాంగ్రెస్ ముస్లిం ఓటు పొందింది.  అంటే మిగిలిన నియోజకవర్గాల్లో మజ్లిస్ పోటీ చేయదన్న మాట! ఆ తర్వాత కేసీఆర్ కూడా అదే సూత్రాన్ని విజయవంతంగా అమలుచేస్తున్నందున, ముస్లిం ఓట్లు తెరాస నుంచి జారిపోయే అవకాశాలు ఉండవు. ఇదే కేసీఆర్ నిర్నిరోధ విజయసూత్రం! ఇదంతా హిందువులలో నమ్మకం కలిగేంచే పార్టీల ‘కార్యాచరణ వైఫల్యమే’ కారణం కావచ్చు. వారి వైఫల్యమే కేసీఆర్‌కు విజయసోపానాలుగా కనిపిస్తున్నాయి.
ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్షంగా వచ్చిన ఫలితాలు కూడా, బహుశా కేసీఆర్ ఢిల్లీపై యుద్ధకాంక్షకు కారణంగా కనిపిస్తోంది. ఆ ఎన్నికల్లో హిందువులకు ప్రతినిధిగా భావించే బిజెపి, ముస్లింలపై పేటెంట్ ఉందనుకునే కాంగ్రెస్.. రెండింటిని తెలంగాణ ప్రజలు మరోసారి చాపచుట్టారు. ఆ రెండు పార్టీలకు చెందిన ఎంపీలున్న నియోజకవర్గాల్లో కూడా కారు హోరెత్తింది. బహుశా ఈ విజయంతోనే ఆయన సీఏఏకు వ్యతిరేకంగా దేశంలోని ప్రతిపక్ష సీఎంలతో కాంక్లేవుకు సిద్ధమవుతున్నట్లున్నారు. అటు హిందు-ఇటు ముస్లింల సంతుష్టీకరణ సూత్రంతో దేశంలో నయా రాజకీయాలకు తెరలేపి.. బిజెపి వ్యతిరేక పార్టీలను కూడగట్టి, జాతీయ స్థాయిలో బిజెపికి ప్రత్యామ్నాయ నేతగా అవతరించాలన్నదే కేసీఆర్ లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే అది సాధ్యమా? అసాధ్యమా అన్నది పక్కకుపెడితే.. జాతీయ రాజకీయాలకు మరోసారి తెలంగాణ వేదిక కానుందన్నది మాత్రం నిజం.