ఆ రెండు కేసులూ సీబీఐకి ఇవ్వనున్న జగన్?

466

తనపై నమ్మకం పెంచుకునే ప్రయత్నం
విపక్షాలకు అవకాశం ఇవ్వకూడదన్న భావన
వివేకా హత్య, కోడికత్తి కేసులు సీబీఐకి?
అదే మంచిదంటున్న వైసీపీ నేతలు
తండ్రి దారిలోనే తనయుడు

( మార్తి సుబ్రహ్మణ్యం)

గత ఎన్నికల ముందు ఏపీలో సంచలనం సృష్టించిన రెండు ప్రధాన కేసులను  సీబీఐ విచారణకు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా తనపై విశ్వసనీయత, చిత్తశుద్ధికి సంబంధించి వస్తున్న ఆరోపణలకు తెరదించాలని ఆయన నిర్ణయించకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలోనే నడవాలని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో పరిటాల రవి హత్య కేసులో తన కుమారుడు జగన్ పాత్రపై టిడిపి ఆరోపించగా, దానికి స్పందించిన వైఎస్ సీబీఐ విచారణ కోరారు. ఇప్పుడు ఈ రెండు కే సులను కూడా అదే తరహాలో సీబీఐకి ఇవ్వడం ద్వారా తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని జగన్ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఏడాది క్రితం ఏపీలో రాజకీయంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య, నాటి విపక్ష నేత జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో కోడికత్తితో జరిగిన హత్యాయత్న కేసులను సీబీఐతో విచారణ జరిపించాలని లేఖ రాసేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆ రెండు కేసులను నాటి రాష్ట్ర ప్రభుత్వం విచారిస్తే బాధ్యులు బయటకు రారని, అసలు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని పోలీసులపైనే తమకు నమ్మకం లేదని నాడు జగన్, ఆయన పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఆమేరకు కోడికత్తి కేసుకు సంబంధించి విచారణకు వెళ్లిన ఏపీ పోలీసులకు జగన్ సహకరించలేదు. అసలు ఆ హత్యాయత్నం కేసులో చంద్రబాబునాయుడు ఉన్నారని వైసీపీ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే నిందితుడు కోడి కత్తి శ్రీను ప్రస్తుతం జైలులో ఉన్నాడు.
ఇక సరిగ్గా ఎన్నికలకు కొద్దిరోజుల ముందు,  కడప జిల్లా పులివెందులలో జరిగిన జగన్ చిన్నాన్న  వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై అనేక అనుమానాలు వ్యక్యమయ్యాయి. ఈ హత్యను టిడిపి చేయించిందని వైసీపీ.. జగనే చేయించారని, ఆయన కుటుంబసభ్యులే ముద్దాయిలంటూ టిడిపి ఆరోపణ-ప్రత్యారోపణ చేసుకున్నాయి. ఇది సహజంగానే ఎన్నికల సమయంలో వైసీపీకి సానుభూతిపరంగా బాగా అక్కరకొచ్చింది. అయితే, ఈ విచారణపై తమకు నమ్మకం లేదని,స్వతంత్ర లేదా సిట్టింగ్ న్యాయమూర్తి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని వివేకా కూతురు, జగన్ సహా వైసీపీ నేతలంతా డిమాండ్ చేశారు. ఈ కేసుపై వేసిన సిట్ కొందరిని అరె స్టు చేసింది. ఈలోగా ఇద్దరు ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. సిట్ సభ్యులను మార్చింది. దీనితో కేసు మరింత గందరగోళంగా మారింది.
ఈ నేపథ్యంలో.. తన తండ్రి వివేకా హత్య కేసు విచారణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మలేనందున కేసును, సీబీఐతో విచారణ చేయించాలని గతంలో డిమాండ్ చేసిన  కూతురు డాక్టర్ సునీత తాజాగా హైకోర్టును తిరిగి అదే డిమాండ్‌ను అభ్యర్ధించడం సంచలనం సృష్టించింది. తన సోదరుడే సీఎంగా ఉన్నప్పటికీ, కేసులో జరుగుతున్న ఆలస్యంపై అనుమానాలు వ్యక్తం చేయడం చర్చనీయాంశమయింది. వివేకా సతీమణి సౌభాగ్యమ్మ కూడా ఈపాటికే హైకోర్టును ఇలాగే అభ్యర్ధించారు. తాజాగా హైకోర్టులో వేసిన పిటిషన్‌లో వైఎస్ కుటుంబసభ్యులే.. కడప ఎంపి అవినాష్‌రెడ్డి, ఇతర వైసీపీ నేతలు, బిజెపి నేత ఆదినారాయణరెడ్డి, బిటెక్ రవిపై అనుమానాలు వ్యక్తం చేయడం సంచలనం సృష్టించింది. ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి సహజంగా విపక్షంలో ఉన్నందున, వారిపై అనుమానాలు కూడా అంతే సహజం. కానీ సొంత కుటుంబసభ్యుడైన ఎంపి అవినాష్‌రెడ్డి పైనా అనుమానాలు వ్యక్తం చేయడమే ఆశ్చర్యం. ఇంకా వారితోపాటు, కేసులో కీలకపాత్రధారులైన వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగయ్య సహా పోలీసు అధికారులు, వైఎస్ కుటుంబసభ్యులపైనే అనుమానాలు వ్యక్తం చేయటం సంచలనం సృష్టిస్తోంది.
తన సోదరుడు జగన్ సీఎం అయిన తర్వాత జరిగిన పరిణామాలు ఏకరవు పెడుతూ వివేకా కుమార్తె హైకోర్టుకు ఇచ్చిన వివరాలు వైసీపీని రాజకీయంగా ఇబ్బందికి గురిచేసేవే. కేసును కావాలనే జగన్ సర్కారు నీరుగారుస్తోందని బహిరంగంగా చెప్పకపోయినా, ఆమె పిటిషన్‌లో పేర్కొన్న అంశాలే దానినే స్పష్టం చేస్తున్నాయి.  ఈ కేసులో నిందితుడైన శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యపైనా ఆమె అనుమానం వ్యక్తం చేయడం, ఉదయ్‌కుమార్‌రెడ్డి, డాక్టర్ మధుసూదన్‌రెడ్డిని ఇప్పటిదాకా విచారించకపోవ డం, ఎస్పీ మహంతి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోవడం, ప్రస్తుత ఎస్పీ అన్బురాజన్ సరిగా విచారణ జరిపించకపోవడంపై ఆమె వ్యక్తం చేసిన అనుమానాలన్నీ సామాన్య, రాజకీయవర్గాల్లో చర్చలకు దారితీసేవే. పైగా.. వీటికి మించి తన సోదరుడు జగన్ ఎన్నికల ముందు సీబీఐ విచారణకు డిమాండ్ చేసి, ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మౌనంగా ఉండటాన్ని ఆమె ప్రశ్నించిన తీరు జగన్ విశ్వసనీయతను అనుమానించేలానే ఉంది. సిట్ సభ్యులను పదే పదే మార్చడంపై, జగన్ సోదరి తెరపైకి తీసుకువచ్చిన సందేహాలు అటు విపక్ష టిడిపికి అస్త్రాలుగా మారుతున్నాయి.seeking-CBI-investigation.pdf
వైఎస్ వివేకా కూతురు పిటిషన్ వేసిన నేపథ్యంలో,  కేసును సీబీఐకి ఇవ్వడానికి ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటూ హైకోర్టు వేసిన ప్రశ్న.. సహజంగానే ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేలా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విపక్షంలో ఉండగా సీబీఐకి డిమాండ్ చేసిన జగన్, సీఎం అయిన తర్వాత కేసును సీబీఐకు ఎందుకు ఇవ్వలేదన్న వివేకా కుమార్తె ప్రశ్న కూడా, సహజంగా ఎవరికైనా సమంజసంగానే కనిపిస్తుంది. ఈ క్రమంలో తన విశ్వసనీయతపై మరిన్ని అనుమానాలు, విమర్శలు, ఆరోపణలు రాకుండా ఉండాలంటే కేసును సీబీఐకి ఇవ్వడమే మంచిదని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.పైగా ఒకరకంగా సొంత కుటుంబసభ్యురాలే  తన విశ్వసనీయతపై అనుమానం వ్యక్తం చేస్తూ కోర్టుకెక్కినందున, అది విపక్షానికి అస్త్రంగా మారకముందే ఈ నిర్ణయం తీసుకోవడం ఉత్తమమని ఆయన యోచిస్తున్నట్లు చెబుతున్నారు. దీనిపై ఆలస్యం చేసేకొద్దీ.. వైఎస్ కుటుంబంలో చీలికలు వచ్చాయని, తన కుటుంబసభ్యులే నమ్మని జగన్‌ను ప్రజలు ఎలా నమ్ముతారని టిడిపి చేసే విమర్శలకు ముందస్తుగా అడ్డుకట్ట వేసేందుకయినా.. కేసును సీబీఐకి ఇవ్వడమే మంచిదని జగన్ భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.నిజానికి వైసీపీ నేతలు కూడా ఈ రెండు కేసులను సీబీఐకి ఇవ్వడమే మంచిదన్న అభిప్రాయంతో ఉన్నారు. విపక్షంలో ఉండగా తామే సీబీఐ విచారణ కోరినందున, ఇప్పుడు తాము ఆ డిమాండ్‌పై మౌనంగా ఉండటం వల్ల, తమ పార్టీ విశ్వసనీయతకే నష్టమని విశ్లేషిస్తున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించడం తమకు చేతకాదని, మాట తప్పడం, మడమ తిప్పడం రాదని చర్చల్లో బల్లగుద్ది వాదించే తమ వాదనకు  ఈ రెండు కేసులు తలనొప్పిగా మారినందున, సీబీఐకి ఇవ్వడమే మంచిదంటున్నారు.