జగన్‌కు నైతిక జంజాటం!

497

ఆ ఇద్దరు మంత్రులు రాజీనామా చేస్తారా?
ఇద్దరు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల మాటేమిటి?
వారిపై అనర్హత వేటు వేయరేం?

( మార్తి సుబ్రహ్మణ్యం)

రాజకీయాల్లో నైతిక విలువల గురించి మాట్లాడటమే కాదు. దానిని ఆచరించే నేతగా ప్రచారంలో ఉన్న ఏపీ సీఎం జగన్‌కు, ఇప్పుడు గొప్ప నైతిక జంజాటం వచ్చి పడింది. దానికి కారణం విధానమండలి రద్దు తీర్మానం. కౌన్సిల్‌ను రద్దు చేయాలని శాసనసభలో తీర్మానం చేసే ముందే కౌన్సిల్ నుంచి ఎన్నికయి, మంత్రులుగా ఉన్న ఇద్దరితో రాజీనామా చేయిస్తారని అంతా భావించారు. కానీ, వారిద్దరితో రాజీనామా చేయించకుండానే తీర్మానం ఆమోదింపచేసుకోవడం చర్చనీయాంశమయింది. ఇది జగన్ తరచూ చెప్పే నైతిక విలువల ప్రసంగానికి పూర్తి విరుద్ధమనేంటున్నారు.
ఏపీ శాసనమండలిని రెండోసారి రద్దు చేసిన సీఎంగా జగన్ రికార్టు సృష్టించారు. దానివల్ల ఆర్ధిక భారం తప్ప మరొకటి లేదని విస్పష్టంగా ప్రకటించారు. సరే.. సభలో సంపూర్ణ మెజారిటీ ఉండటం, పైగా సభలో ప్రతిపక్షం కూడా లేకపోవడం వల్ల అధికార పార్టీ చేసిన తీర్మానం అవలీలగా ఆమోదించబడుతుంది. అయితే.. ఏ కౌన్సిల్‌నయితే రద్దు చేశారో, అదే కౌన్సిల్ నుంచి మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణతో రాజీనామా చేయించి, తాను చెప్పే విలువలకు జగన్ నిర్వచనం చె బుతారని చాలామంది భావించారు. అటు ఆ మంత్రులు కూడా జగన్ విధానాలను జవదాటమని, పదవులు త్యజించేందుకు సిద్ధమేనని ప్రకటించారు. కానీ తీర్మానం ఆమోదించిన తర్వాత కూడా వారిద్దరితో రాజీనామా చేయించకపోవడంవిమర్శలకు గురవుతోంది.నిజంగా జగన్‌కు కౌన్సిల్ రద్దు చేయాలన్న సంకల్పం ఉంటే, ముందుగా తన ఇద్దరు మంత్రులతో రాజీనామా చేయించి ఉండే వారన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అందుకు విరుద్ధంగా వారితో రాజీనామా చేయించకుండానే సభలో తీర్మానం ఆమోదించుకోవడం వల్ల, జగన్ చెప్పే నైతిక విలువలకు ఆచరణలో పొంతన కుదరడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మామూలుగా జగన్ శైలి ప్రకారమైతే, సభలో తీర్మానం ప్రవేశపెట్టే ముందుగానే ఆ ఇద్దరితో రాజీనామా చేయించేవారని గుర్తు చేస్తున్నారు.

అదేవిధంగా టిడిపికి రాజీనామా చేసి తన పార్టీకి బహిరంగంగానే జైకొట్టిన టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మద్దాళి గిరి శాసనసభ్యత్వాలను…గతంలో తాను సూత్రీకరించినట్లు ఇప్పటివరకూ అనర్హులుగా ప్రకటించకపోవడం, తాజాగా ఇద్దరు ఎమ్మెల్సీలపైనా వేటు వేయాలని చైర్మన్‌ను కోరకపోవటం విమర్శలకు తావిస్తోంది. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని గతంలో జగనే స్పీకర్‌ను కోరిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వారంతా నేరుగా వైసీపీలో చేరకపోయినా, ఎన్నికయిన పార్టీ విధానాలతో విబేధించి,బహిరంగంగానే వైసీపీకి జై కొట్టినందున… జగన్ చెప్పినట్లు వారిపై అనర్హత వేటు వేయకపోవడం బట్టి, జగన్ చెప్పే నైతిక విలువలు నేతిబీర చందమేనని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.