వైసీపీ టార్గెట్.. రామోజీ,లోకేష్

472

తెరపైకి మండలి రద్దుపై రామోజీ నాటి వైఖరి
రద్దును నాడు సమర్ధించిన ఈనాడు రామోజీరావు
నేడు వ్యతిరేకించడాన్ని ప్రశ్నిస్తున్న వైసీపీ
రామోజీని నైతిక సంకటంలో పడేసిన జగన్
లోకేష్ కోసమే కౌన్సిల్‌ను కాపాడుతున్నారన్న కొత్త కోణం
టిడిపి పోరాటాన్ని బలహీనం చేసే ఎత్తుగడ
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లక్ష్యంగా విమర్శల దాడి
వైసీపీ వ్యూహబృందం మైండ్‌గేమ్

( మార్తి సుబ్రహ్మణ్యం)

శాసనమండలిలో జగన్ సర్కారు ప్రవేశపెట్టిన రెండు కీలక బిల్లులు తిర స్కరణకు గురైన వైనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. మండలి రద్దు కేంద్రంగా వైసీపీ-టిడిపి వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ వ్యవహారంలో మండలి రద్దును తప్పుపడుతున్న ఈనాడు అధిపతి రామోజీరావు, ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ, టిడిపి యువనేత లోకేష్ లక్ష్యంగా అధికార వైసీపీ విమర్శనాస్ర్తాలు ఎక్కుపెడుతోంది. అందులో ఈనాడు అధిపతి రామోజీరావుపై వైసీపీ వ్యూహబృందం ఎక్కుపెట్టిన నైతిక అస్త్రం ఆసక్తికరంగా మారింది.
సోమవారం జరగనున్న శాసనసభ సమావేశంలో శాసనమండలి భవితవ్యమేమిటో స్పష్టం కానుంది. ఈలోగా.. జగన్ సర్కారు తలపెట్టిన మండలి రద్దు ప్రయత్నాలను ప్రతిఘటిస్తున్న టిడిపికి దన్నుగా ఉన్న, ఈనాడు అధినేత రామోజీ లక్ష్యంగా వైసీపీ వ్యూహబృందం నైతిక అస్ర్తాలు సంధించడం విశేషం. నైతిక విలువల గురించి తరచూ ప్రస్తావించే ఈనాడు.. ఇప్పుడు దానిని ఎలా ఎదుర్కొంటుందోనన్న ఆసక్తి మొదలయింది. ఎందుకంటే.. 1983లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు శాసనమండలి రద్దును ఇదే ఈనాడు స్వాగతించింది. దాని రద్దు అవసరాన్ని నొక్కి చెప్పింది. రామోజీని సభకు పిలిపించాలని ఆనాడు మండలిలో మెజారిటీ ఉన్న కాంగ్రెస్ పార్టీ తలపోసినప్పుడు, ఎన్టీఆర్‌తో అసలు మండలినే రద్దు చేయించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆరోవేలు లాంటి మండలి రాష్ర్టానికి అవసర ం లేదని, దానివల్ల బోలెడు ప్రజాధనం వృధా అవుతోందని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.
ఇప్పుడు అదే మండలిని రాష్ట్రం విడిపోయిన తర్వాత వైసీపీ అధినేత,ఏపీ సీఎం జగన్ రద్దు చేయాలని సంకల్పించారు. అయితే.. నాడు ఇదే మండలి రద్దును స్వాగతించిన రామోజీరావు, ఇప్పుడు మాత్రం రద్దును వ్యతిరేకించడాన్ని వైసీపీ ఆక్షే పిస్తోంది. మంత్రి బొత్స సత్యనారాయణ ఇదే అంశాన్ని ప్రస్తావించడం ద్వారా, రామోజీని నైతిక సంకటంలో పడేశారు. ఆనాడు రద్దును స్వాగతించిన మీరు, ఇప్పుడెలా వద్దంటున్నారని నేరుగా రామోజీనే ప్రశ్నిస్తూ, ఇదేనా మీ నైతిక విలువలని దునుమాడారు. అటు ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణనూ విడిచిపెట్టకుండా కడిగిపారేశారు. పార్టీ మారకపోతే ఆర్ధిక ప్రయోజనాలు అందిస్తామని టిడిపి ఎమ్మెల్సీలకు చంద్రబాబు హామీ ఇచ్చారని మీ పత్రికలోనే రాసిన రాధాకృష్ణ.. టిడిపి ఎమ్మెల్సీలను తాము ప్రలోభపెడుతున్నామని ఎలా ఆరోపిస్తారని నిలదీశారు. ఈ రెండు పత్రికలు మండలి రద్దు కాకుండా టిడిపికి అండగా నిలబడుతున్నాయని ధ్వజమెత్తారు. ఇదే విషయాన్ని అటు ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి కూడా నిలదీశారు. పచ్చ పత్రికలెన్ని అడ్డుకున్నా ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోలేవన్నారు.
ఇక టిడిపి యువనేత, ఎమ్మెల్సీ లోకేష్ లక్ష్యంగా వైసీపీ కొత్తగా మైండ్‌గేమ్ ప్రారంభించింది. ఎమ్మెల్సీగా ఉన్న లోకేష్ పదవి పోకుండా కాపాడేందుకే, మండలిని కొనసాగించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని బొత్స మరో ఆరోపణ చేశారు. ఎక్కడా ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్‌కు.. మండలి రద్దయితే ఉన్న ఎమ్మెల్సీ కూడా పోతుందన్న భయంతోనే, మండలిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆరకంగా.. వైసీపీ తాజాగా ఈ కోణాన్ని తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది. కేవలం కొడుకు కోసమే చంద్రబాబు కౌన్సిల్ కోసం పోరాడుతున్నారన్న ప్రచారాన్ని కింది స్థాయికి చేర్చడం ద్వారా, మండలి కోసం టిడిపి పోరాటానికి విలువ లేకుండా చేయాలన్నదే వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోంది. అటు తన సర్కారుపై రోజూ విమర్శలదాడి చేస్తున్న ఈనాడును.. గతంలో మండలి రద్దు సమయంలో పోషించిన పాత్రను గుర్తు చేయడం ద్వారా, దానికి విశ్వసనీయత లేకుండా చేయాలన్న వ్యూహం వైసీపీ నేతల విమర్శల్లో స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో మండలి రద్దును స్వాగతించిన ఈనాడు రామోజీ, ఇప్పుడు వద్దనడాన్ని ప్రముఖంగా ప్రస్తావించడం ద్వారా, ఆ సంస్థ-దాని యజమాని రామోజీరావును విజయవంతంగా నైతిక సంకటంలో పడేసినట్టయింది.