తమ్ముళ్ల త్యాగాలకు తగిన ప్రతిఫలం?

618

కౌన్సిల్‌పై నిలబడితే ఆర్ధిక ప్రయోజనాలు
ఒకవేళ రద్దయినా సర్కారు వేతనాలు సర్దుబాటు
ఎమ్మెల్సీలకు టిడిపి నాయకత్వం బంపర్ ఆఫర్
కౌన్సిల్‌పైపట్టు కోసం వైసీపీ-టిడిపి కసరత్తు

( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ కౌన్సిల్‌పై పట్టు సాధించేందుకు అధికార వైసీపీ-ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల పెనుగులాట ఆసక్తికరంగా మారింది. కౌన్సిల్ రద్దుపై రెండంచల వ్యూహం అనుసరిస్తోన్న వైసీపీ.. అందులో తొలి అడుగుగా టిడిపి ఎమ్మెల్సీలను వీలైనంత ఎక్కువమందిని ఆ పార్టీకి దూరం చేసే ఎత్తుగడతో వెళుతోంది. వారి ప్రయోజనాలు కాపాడతామని హామీ ఇస్తోంది. ఆ మేరకు వైసీపీ వ్యూహకర్త, ఎంపి విజయసాయిరెడ్డి, టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి టిడిపి ఎమ్మెల్సీలతో రహస్య మంతనాలు జరుపుతున్నారు. దీనిని అడ్డుకుని, తమ ఎమ్మెల్సీలను కాపాడుకునేందుకు అటు టిడిపి నాయకత్వం కూడా రంగంలోకి దిగి, ఆ పార్టీ కూడా అదే దారిలో నడుస్తుండటంతో, కౌన్సిల్ సభ్యులు ఎటువైపు ఉంటారన్న అంశం ఆసక్తికరంగా మారింది.
గుండె గుబుల్..
సోమవారం జరగనున్న అసెంబ్లీ సమావేశంలో శాసనమండలి రద్దుపై తీర్మానం చేస్తారని, ఆ మేరకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారన్న ప్రచారం వైసీపీ-టిడిపి ఎమ్మెల్సీల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. పదవి కోల్పోతే వచ్చే ప్రయోజనాలన్నీ నిలిచిపోతాయన్నది ఒక భయం కాగా, స్థానికంగా రాజకీయంగా వెనకబడి పోతామన్నది మరో భయానికి కారణంగా కనిపిస్తోంది. టిడిపి ఎమ్మెల్సీలను గంపగుత్తగా పార్టీ మార్చేందుకే జగన్.. మండలి రద్దుపై మైండ్‌గేమ్ ఆడుతున్నారని ఒకవైపు అనుమానిస్తున్నప్పటికీ, జగన్ తాను అనుకుంటే ఏదైనా చేస్తారన్న భయం కూడా వారిలో కనిపిస్తోంది.
చక్రం తిప్పేది ఆ ఇద్దరే!
అందుకే ప్రయోజనాలు ఆశిస్తున్న ఎమ్మెల్సీలు వైసీపీ వ్యూహానికి చిక్కుతుండగా, ఇప్పటికే ఆఫర్లు ఉన్న మరికొందరు ఎమ్మెల్సీలు డోలాయమానంలో ఉన్నారు. సభ జరిగిన రోజు అక్కడే ఉన్న విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి కొందరు టిడిపి ఎమ్మెల్సీలతో మంతనాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. కౌన్సిల్ చైర్మన్ షరీఫ్ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఇప్పటికే ఇద్దరు టిడిపి ఎమ్మెల్సీలు రాజీనామా చేయడం, అంతకుముందే డొక్కా మాణిక్య వర ప్రసాద్ రాజీనామా చేయటం వెనుక ఆ ఇద్దరే చక్రం తిప్పినట్లు చెబుతున్నారు. సాధ్యమైనంత వరకూ మండలిని రద్దు చేయకుండా, టిడిపి సభ్యులను ఆ పార్టీకి దూరం చేసి, చైర్మన్ స్థానాన్ని తమ వారికి కట్టబెట్టడం ద్వారా, కౌన్సిల్ తలనొప్పి వదిలించుకోవాలన్నది వైసీపీ ప్రధమ లక్ష్యంగా కనిపిస్తోంది. అది వీలుకాని పక్షంలోనే, మండలి రద్దుకు సిఫార్సు చే యాలన్నది వైసీపీ వ్యూహమంటున్నారు.
ఇదీ.. టిడిపి భరోసా
ఈ క్రమంలో తన పార్టీ సభ్యులను వైసీపీ ఎర నుంచి తప్పించేందుకు, టిడిపి నాయకత్వం కూడా రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. అందులో భాగంగా మండలి రద్దు అంశంపై సభ్యులంతా వైసీపీ ఎరకు చిక్కకుండా, మనోస్థైర్యంతో చివరి వరకూ ఉండాలని చంద్రబాబు వారికి ధైర్యం నూరిపోస్తున్నారు. ఒకవేళ ఆవిధంగా చివరి వరకూ పార్టీతో నిలబడి పోరాడినప్పటికీ, ఫలితం దక్కకపోయినా ఆ మేరకు తగిన ప్రతిఫలం అందుతుందని టిడిపి నాయకత్వం వారికి భరోసా ఇస్తున్నట్లు సమాచారం.ఆవిధంగా తమతో చివరివరకూ ఉన్న ఎమ్మెల్సీలకు.. మండలి రద్దయినా వారికి ప్రభుత్వపరంగా, నెలవారీ వచ్చే ఆర్ధిక ప్రయోజనాలన్నీ పార్టీ సమకూరుస్తుందని, ఇతర అవసరాలు కూడా చూసుకుంటుందని, వచ్చే ఎన్నికల్లో వారికి సీట్లు కూడా ఇస్తామని నాయకత్వం వారికి హామీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే..ఒకవేళ సభ రద్దయినా, జీతాలు, ఇతరసౌకర్యాలు కోల్పోతామన్న భయం వారిలో దూరం చేయడమే టిడిపి లక్ష్యంగా కనిపిస్తోంది.వైసీపీతో స్థానికంగా విబేధాలున్న వారు, నాయకత్వం వద్ద గౌరవం ఆశించే వారు ఇందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. వయసు, కులం, ఇక పోటీ చేసే అవకాశాలు లేని వారే అటు ఇటు ఊగిసలాడుతున్నట్లు వారి మాటల్లో స్పష్టమవుతోంది. అయితే తొలి నుంచి టిడిపిలోనే కొనసాగుతున్న వారు, రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వారు మాత్రం టిడిపిలోనే ఉండటం మంచిదని భావిస్తున్నారు.
ఆ హామీ నమ్మవచ్చా?
ఇదిలాఉండగా.. ఆర్ధిక ప్రయోజనాల హామీ విషయంలో, కొందరు నేతలు అనుమానంతో ఉన్నట్లు వారి మాటలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో ఆర్ధిక విషయాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు పెత్తనం ఉన్నంతవరకూ బాగానే ఉండేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారినందున ఆ హామీలను ఎంతవరకూ నమ్మాలన్న దానిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఎందుకంటే.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ నిధులు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నప్పుడు, ఎక్కడి అభ్యర్ధులు అక్కడ నిధులు సర్దుబాటు చేసుకుంటే, తర్వాత వాటిని పార్టీ సర్దుబాటు చేస్తుందని నాయకత్వం హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ భరోసాతో స్థానికంగా అప్పులు చేసిన అభ్యర్ధులకు, ఇప్పటివరకూ వాటిని సర్దుబాటు చేయని విషయాన్ని ఉదహరిస్తున్నారు. ఇటీవలే టిడిపికి రాజీనామా చేసిన ఓ ఎమ్మెల్సీ, పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన సందర్భంలో చేసిన అప్పులను తీర్చలేక, చివరకు అప్పులిచ్చిన వారిని పార్టీ నాయకత్వం వద్దకు తీసుకువెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు సొంత నిర్ణయాలు, స్వయంగా సమీక్షించిన రోజుల్లో ఇలాంటి పరిస్థితి లేదని చెబుతున్నారు.యువ నాయకత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయంటున్నారు.అయినా తమకు పార్టీ మారాలంటే మనసు అంగీకరించడం లేదని,ఒకవేళ మారితే ఆర్ధిక ప్రయోజనాలే తప్ప, అక్కడ తమకు ఏమాత్రం గౌరవం ఉండదంటున్నారు. జగన్ మంత్రులకే అపాయింట్‌మెంట్లు ఇవ్వరని, ఇక ఎమ్మెల్సీ,ఎమ్మెల్యేనేం పట్టించుకుంటారని వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు కనీసం తమను పిలిచి మాట్లాడతార ని, ఏ విషయంపైనయినా ఆయనతో చర్చించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. చూడాలి ఏం జరుగుతుందో?