మున్సి ‘పల్స్’ పట్టిన టీఆర్‌ఎస్?

315

‘వందే’సిన కారు స్పీడు
కాంగ్రెస్, బిజెపికి పదొస్తే ఎక్కువేనట
సీపీఎస్ సర్వే ఫలితాలు
  (మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణలో కారు స్పీడుకు బ్రేకులు వేసే మొనగాడెవరూ కనిపించడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచి మీసం మెలేసిన తెరాస, ఈసారి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ సునాయాసంగా దూసుకుపోయినట్లు సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
ఎన్నికల సర్వే ఫలితాల్లో నిష్ణాతులైన సీపీఎస్ సంస్థ నిర్వహించిన ఎన్నికల సర్వేలో కారు ‘వంద’ కిలోమీటర్ల స్పీడుతో దూసుకుపోతుందని ఆ సర్వే సంస్థ వెల్లడించింది. మొత్తం 120 మున్సిపాలిటీలలో  తెరాసకు 104-109 స్థానాలు, కాంగ్రెస్‌కు 0-4, భాజపాకు 0-2, ఎంఐఎంకు 2 స్థానాలు లభించే అవకాశాలున్నట్లు చెప్పింది. 7-10 స్థానాల్లో పోటాపోటీ ఉందని పేర్కొంది. అలాగే 9-10 మున్సిపల్ కార్పొరేషన్లలో తెరాస జండా ఎగురవేస్తుందని, 0-1 స్థానాల్లో బిజెపి విజయం సాధించవచ్చని వెల్లడించింది.
గత ఎన్నికల్లో కూడా సీపీఎస్ సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాలు నిజమయిన విషయం తెలిసిందే. టిఆర్‌ఎస్‌కు 94-104 స్థానాలు, కాంగ్రెస్ కూటమికి 16-21, బిజెపికి 1-2 స్థానాలు వస్తాయని స్పష్టం చేసింది. దానితోపాటు ఏపీలో చేసిన సర్వే కూడా నిజమయింది. గత ఎన్నికల్లో వైసీపీకి 121-130 స్థానాలు, టిడిపికి 45-54, జనసేనకు 1-2 స్థానాలు రావచ్చని, లోక్‌సభలో వైసీపీకి 21,టిడిపికి 4 స్థానాలు రావచ్చని చెప్పిన జోస్యమే నిజమయింది. ఇప్పుడు తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లోనూ తెరాసనే విజయం సాధిస్తుందని, కాంగ్రెస్-బిజెపి పోటీ నామమాత్రమేనని సీపీఎస్ తేల్చింది.
దీన్నిబట్టి తెలంగాణ ప్రజల మూడ్ ఇంకా కారుపైనే ఉందని, తెరాస ఉంటేనే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విపక్షాల బలహీనతలే అధికార పక్షానికి బలంగా మారుతున్నట్లు ఇటీవలి కాలంలో జరిగిన ఈ రెండో ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం స్థానాల్లో పోటీ చేసే పరిస్థితి లేని విపక్షాల విజయధీమా అంతా పత్రికా ప్రకటనలు, విలేకరుల సమావేశాలకే పరిమితమయినట్లు కనిపించింది. మున్సిపోల్స్‌ను ఆది నుంచి తుదివరకూ భుజాన వేసుకున్న తెలంగాణ భావి సీఎం కేటీఆర్ ఖాతాకే ఈ విజయం వెళుతుంది.