మళ్లీ కారెక్కిన తెలంగాణ !

543

మున్సి‘పల్స్’ తెరాసకే
51 శాతం ఓట్లు సాధించిన టీఆర్‌ఎస్
తారకరాముడి ఖాతాకే ఈ విజయం
పత్తాలేని జాతీయ పార్టీలు
తెలంగాణ రాజకీయ చిత్రపటం ఇక సుస్పష్టం

(మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణలో ఇకపై ఎలాంటి ఎన్నికలు జరిగినా విజయం టీఆర్‌ఎస్‌దే. ఏవైనా ఇక ఏకపక్షమే. తాజా మునిసిపల్ ఎన్నికల ఫలితాలు ఈ సంకేతాలే ఇచ్చాయి. అంతేనా.. భవిష్యత్తు ఎన్నికల్లో జాతీయ పార్టీలకు రాజకీయ భవిష్యత్తు లేదని, తెలంగాణ భవిష్య రాజకీయ చిత్రపటం ఇకపై ఇలాగే ఉండబోతోందని ఈ ఫలితాలు స్పష్టం చేశాయి. ఈ ఎన్నికలు తెరాస యువనేత, భావి సీఎం తారకరాముడి ఖాతాకు వెళ్లగా.. జాతీయ పార్టీలు కొత్త వ్యూహాలు రచించుకునేందుకు అక్కరకొచ్చాయి. 
120 మున్సిపల్, 9 కార్పొరేషన్ ఎన్నికల్లో  ఓటేసిన తెలంగాణ మళ్లీ కారెక్కింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 47 శాతం ఓట్లు సాధించిన తెరాస, ఈ ఎన్నికల్లో 51 శాతం సాధించడం ద్వారా.. భవిష్యత్తులో ఇక ఏ పార్టీ తన సమీపంలోకి రాదన్న తేల్చింది. సమిష్టి కృషి, సమన్వయం, నాయకత్వ ప్రతిభ, కఠిన నిర్ణయాలే తెరాస విజయానికి బాటలు వేశాయి. రాష్ట్రంలో తెరాసను ఒంటిచేత్తో గెలిపించిన కేటీఆర్.. తన సిరిసిల్లలో 40 వార్డులకు 22 మాత్రమే సాధించినా, గెలిచిన 12 మంది అభ్యర్ధులు కూడా తెరాస తిరుగుబాటుదారులే కావడం బట్టి.. అక్కడ కూడా విజయం తెరాసదేనని స్పష్టమయింది. ఈ ఎన్నికల్లో చాలాచోట్ల.. తెరాసకు తెరాస తిరుగుబాటు అభ్యర్ధులే పోటీగా నిలవడం బట్టి, తెరాస క్షేత్రస్థాయిలో ఎంత ఊపులో ఉందో స్పష్టమవుతుంది.ఈ ఎన్నికల్లో ఏదైనా అద్భుతాలు సృష్టిస్తుందని భావించిన జాతీయ పార్టీలయిన కాంగ్రెస్, బిజెపి ఫలితాల్లో తెరాసకు కనీస స్థాయిలో కూడా పోటీ ఇవ్వలేకపోక చతికిలపడిపోయాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్రంలో రాజకీయంగా స్థిరపడేందుకు ఆ రెండు జాతీయ పార్టీ నేతలు ఎంత కష్టపడినా, కడకు ఫలితం మాత్రం దక్కలేదు.ఆ రెండు పార్టీలు కలసి మొత్తం పది మున్సిపాలిటీలు కూడా గెలుచుకోలేదంటే, తెలంగాణ ప్రజల మూడ్ ఎలా..ఎవరిపై ఉందో స్పష్టమవుతుంది. 
అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయానంతరం క్షేత్రస్థాయిలో పార్టీలను బలోపేతం చేసుకునే బదులు.. తమ కార్యాలయాల్లో తిష్టవేసి, మీడియాలో సవాళ్లకే పరిమితవడం, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించి, స్థానికంగా బలపడలేకపోవడం వంటి అంశాలు, రెండు జాతీయ పార్టీలను ఫలితాలు మరగుజ్జులుగా మార్చాయి. ఇటీవలి ఎంపి ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్-బిజెపి ఎంపిలు చివరకు తమ పరిథిలో మున్సిపాలిటీలను కూడా గెలిపించుకోలేకపోయారంటే.. పోటీ ఏకపక్షంగానే సాగిందన్నది నిష్ఠుర నిజం. ప్రతిపక్షాలు ఉంటేనే ప్రజాస్వామ్యం శోభిల్లుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రతిపక్షాలు ప్రజాపక్షంగా ఉండి బలం పెంచుకుంటే  మంచిది. 
తెలంగాణ శాశ్వత గుండె చప్పుడు తెరాసనే:తలసాని
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ముందుగానే ఊహించినదే అయినా, ఈ స్థాయిలో ప్రజాతీర్పు వెలువడటం బట్టి.. తెలంగాణ శాశ్వత గుండె చప్పుడు తెరాసనేనని తేలిపోయిందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వ్యాఖ్యానించారు. నేలవిడిచి సాము చేసిన జాతీయ పార్టీలకు తెలంగాణ ప్రజలు సరైన సమాధానం చెప్పారన్నారు. ఇకపై వారిని పట్టించుకోవలసిన అవసరం లేదని ఫలితాలు చాటాయన్నారు.  ‘ఎప్పుడైనా కష్టపడే వాడిదే ఫలితం. జనం నాడి తెలిసినవాడే నాయకుడు. జనం మెచ్చినదే నిజమైన పార్టీ. తాజా ఫలితాల సరళి, ఓట్లు తెరాసకు  ఏకపక్షంగా పోలయిన వైనం చూస్తే యువ నేత కేటీఆర్ నాయకత్వ ప్రతిభ, సత్తా ఏమిటన్నది స్పష్టమయింది.ఈ ఘనత ఆయనదే. ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారని మరోసారి తేలిపోయింది. ఈ విజయం కార్యకర్తలకు అంకితం. నాలాంటి వారి పాత్ర వారితో పోల్చుకుంటే తక్కువే.  మేం ఏ పార్టీని శత్రువుగా చూడ ం. కేవలం రాజకీయ ప్రత్యర్ధులుగానే చూస్తాం. కానీ వాళ్లు మాత్రం ప్రతిదీ మసిపూసి మారేడుకాయ చేసి, ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేసినా జనం కర్రుకాల్చి వాత పెట్టారు. మొన్న అసెంబ్లీ, ఇప్పుడు మున్సిపల్ ఫలితాల తర్వాత, ఇక జాతీయ పార్టీలు రాష్ట్రంనుంచి దుకాణం సర్దుకుంటే మంచిది. రాష్ర్టాభివృద్ధికి సరైన  సలహాలిచ్చే పాత్రకు పరిమితమయితే కనీసం ఉనికి అయినా ఉంటుంది.  జనాన్ని నమ్ముకున్న వారికి ఎప్పుడూ విజయమేనని మా పార్టీ నిరూపించింది. దీన్ని ప్రతి ఒక్క నాయకుడూ గుర్తించి,జనంలోఉండాలి. ఎన్నికల్లో టికెట్లు రాని వారు కూడా పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేసినందుకు అభినందలు. వారికి పార్టీ కచ్చితంగా న్యాయం చేస్తంద’ని తలసాని హామీ ఇచ్చారు.