పవర్ కథలో పవన్ పులుసులో ముక్కేనా?

551

కాపులర్ కోసమే కల్యాణ్‌ను తీసుకువచ్చారా?
వర్కవుట్ కాకపోతే పవన్‌ను పక్కకుపెడతారా?
ఏడాదిలో బిజెపిలో జనసేన విలీనం?
రాజధాని మార్పుపై పవన్ వేదన ఆరణ్యరోదనేనా?
ఆయనకు హామీ ఇచ్చిన నద్దా మరి మీడియాకు చెప్పలేదేం?
బిజెపి డబుల్‌గేమ్‌లో పవన్ పాపం పసివాడేనా?
టిడిపి బలహీనపడే వరకూ వైసీపీని ప్రోత్సహిస్తుందా?

(మార్తి సుబ్రహ్మణ్యం)

ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఆడుతున్న పవర్‌గేమ్‌లో జనసేనాధిపతి పవన్ కల్యాణ్ చివరకు పులుసులో ముక్కగానే మిగిలిపోతారా?రాష్ట్రంలో కాపులను సమీకరించేందుకే ఆయనను బిజెపి తెరపైకి తీసుకువచ్చిందా? అది వర్కవుట్ కాకపోతే ఆయనను అవలీలగా పక్కకుపెట్టేస్తుందా? అసలు పవన్ కల్యాణ్ బిజెపిని అమాయకంగా నమ్మి వెళ్లారా?.. నిజంగా రాజధాని తరలింపును కేంద్రం అంగీకరించదని కమలదళపతి నద్దా చెబితే.. ఆ విషయాన్ని బిజెపి నాయకత్వం ఇప్పటిదాకా అధికారికంగా ఎందుకు ప్రకటించడం లేదు? బిజెపితో పొత్తు బంధంపెట్టుకున్నప్పటికీ, వైసీపీ నేతలు పవన్‌పై విమర్శలకు దిగుతుంటే కమలదళాలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయి? అంటే పవన్‌ను బిజెపి అమాయకంగా ముగ్గులోకి దింపిందా?… గత రెండు,మూడురోజుల నుంచి జరుగుతున్న చర్చలివి.
తెలుగునాట క్రౌడ్ పుల్లర్‌గా పేరున్న జనసేనాధిపతి పవన్ కల్యాణ్‌కు వ్రతం చెడ్డా ఫలితం దక్కే సూచనలు కనిపించడం లేదు. బిజెపితో పొత్తు బంధం పెట్టుకున్నా, వ్యక్తిగతంగా గానీ, సంస్థాగతంగా గానీ ఆయన బావుకునేదేమీ లేదన్నట్లు కనిపిస్తోంది. అయితే, వైసీపీ దాడి నుంచి రక్షణ కోసం పవన్ కల్యాణే బిజెపి శరణువేడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో బిజెపి రెండ ంచెల వ్యూహం అనుసరిస్తున్నట్లు చెబుతున్నారు. జనాభా పరంగా పైచేయిగా ఉన్న కాపులు ఇప్పటిదాకా తటస్థంగానే ఉన్నారు. గత ఎన్నికల్లో కొంత శాతం జనసేన, మరికొంత శాతం టిడిపి వైపు మొగ్గు చూపారు. అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులు ఆ రెండు పార్టీవైపే ఎక్కువ శాతం మొగ్గుచూపగా, కృష్ణా-గుంటూరు జిల్లాల్లో కాపులు ఎక్కువ శాతం వైసీపీకే జైకొట్టారు.చిరంజీవి కుటుంబంలో ముగ్గురినీ ఆయన పుట్టిన పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల్లో తిరస్కరించింది. ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవి, జనసేన అధినేత పవన్, ఆయన సోదరుడు నాగబాబు ఎంపీగా పోటీ చేసిన నర్సాపురం ఎంపీ స్థానంలో ఓడించారు. దానితో చిరు కుటుంబానికి సొంత జిల్లాల్లో సత్తా లే దని తేలిపోయింది. అయినా బిజెపికి పవన్ కల్యాణే దిక్కవడంపై బిజెపి వర్గాల్లోనే ఆశ్చర్యం వ్యక్తమయింది. అయితే, ప్రస్తుత పరిస్థితిలో బిజెపికి ఆయన తప్ప మరో గత్యంతరం లేదంటున్నారు. అటు పవన్ ఉన్న పరిస్థితిలో ఆయనకూ బిజెపితో జత కట్టడం వినా మరో మార్గం లేదని చెబుతున్నారు.
పవన్‌కు ఒక్క సీటు మాత్రమే వచ్చినా ఆయన సభలకు జనం విరగబడతారు. అది బిజెపికి కలసి వచ్చే అంశం. ఏపీలో బిజెపిని ఓ జాతీయ స్ధాయి నేత లేవకుండా సమాధి చేశారు. ఈ పరిస్థితిలో మళ్లీ పైకి లేవాలంటే అది అంత సులభం కాదు. దానికోసం కన్నా లక్ష్మీనారాయణ, పురంధ్వీరి వంటి నేతలు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. పార్టీని పటిష్టం చేసేందుకు కన్నా విస్తృంగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పైగా బిజెపి ఏపీలో వైసీపీకి మిత్రపక్షమో, శత్రుపక్షమో రాష్ట్ర బిజెపి నాయకులకే తెలియని గందరగోళం. దానిపై కేంద్ర నాయకత్వం ఇప్పటివరకూ స్పష్టత ఇవ్వలేదు. రాజ్యసభలో బలం తక్కువగా ఉన్న బిజెపికి, బిల్లుల విషయంలో వైసీపీ సహకరిస్తూనే ఉంది. ఆ మేరకు వైసీపీకి బిజెపి తెరచాటు హస్తం అందిస్తూనే ఉంది. రాష్ర్టానికి సంబంధించిన అంశాలన్నీ మోదీ-షాలతో చర్చించే నిర్ణయం తీసుకుంటున్నామని, రాష్ట్ర బిజెపి నేతల విమర్శలను ఖాతరు చేయాల్సిన పనిలేదని వైసీపీ నేతలు స్పష్టం చేస్తూనే ఉన్నారు. ప్రధానంగా, రాజధాని విషయంలో రాష్ట్ర బిజెపి స్పష్టమైన వైఖరితో ఉంటే, దానిని పార్టీ జాతీయ అధ్యక్షుడు నద్దా గానీ, అమిత్‌షా గానీ ఇప్పటివరకూ ధృవీకరించలేదు. జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌తో ఒకమాట, రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దియోధర్‌తో మరోమాట చెప్పించడం ద్వారా వైసీపీతో లౌక్యపరమైన సంబంధాలు నెరపుతోంది.
ఈ పరిస్థితిలో పవన్ కల్యాణ్‌తో జతకట్టడంవల్ల కాపులేమైనా బిజెపికి చేరువు కాలేకపోతారా అన్న అంచనాతో ఉన్నట్లు కనిపిస్తోంది. కాపునేత ముద్రగడ పద్మనాభాన్ని కూడా తీసుకువచ్చి, పార్టీకి కాపు ముద్ర వేస్తే కనీసం ప్రత్యామ్నాయ శక్తిగా మారవచ్చన్నది బిజెపి వ్యూహంగా కనిపిస్తోంది. ఈ వ్యూహంతోనే పవన్ కల్యాణ్ జనసేనను బిజెపిలో విలీనం చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, తన అన్న ప్రజారాజ్యం పార్టీని ఎన్నికలయిన తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేసి చెడ్డపేరు తెచ్చుకున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకున్న పవన్.. విలీనానికి ఏడాది సమయం అడిగినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంటే అన్నీ కుదురుతే ఏడాదిలోపే పవన్ తన పార్టీని బిజెపిలో విలీనం చేయవచ్చంటున్నారు. ఈలోగా జగన్‌ను బలహీనపడితే, అవకాశం వచ్చినప్పుడు ఆ పార్టీని దెబ్బతీసి అధికారంలోకి రావాలన్నది బిజెపి అసలు వ్యూహమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ పవన్ విఫమయితే ఆయనను పక్కనపెట్టవచ్చన్నది మరో వ్యూహమంటున్నారు.
అయితే..ఏపీ రాజకీయాలపై అవగాహన ఉన్నవారెవరూ బిజెపి వ్యూహం ఫలిస్తుందని చెప్పరని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ రాక వల్ల బిజెపి సమావేశాలు,సభలకు జనం రావచ్చేమో గానీ ఓట్లు రాలడం కష్టమేనంటున్నారు. పటిష్టమైన యంత్రాంగం, లెక్కకుమించిన నేతలు, చురుకైన కార్యకర్తలు ఉన్న తెలంగాణలోనే బిజెపి పైకి లేవలేకపోతోందని గుర్తు చేస్తున్నారు. అలాంటిది కులమే ప్రధానంగా ఉండే ఏపీ రాజకీయాల్లో బిజెపి వ్యూహం ఫలించడంకష్టమేనంటున్నారు.పైగా ప్రస్తుతం బిజెపి వైసీపీ అనుకూల-వ్యతిరేక వర్గాలుగా చీలినందున, ఏకాభిప్రాయం సాధించడం అంత సులభం కాదంటున్నారు. తాజాగా బిజెపి-జనసేన తలపెట్టిన లాంగ్ మార్చ్‌ను అర్ధంతరంగా రద్దు చేసిన విషయాన్ని బిజెపి నేతలు జనసేనకు చెప్పలేదంటున్నారు. రాష్ట్రంలో వైసీపీకి అప్పుడే ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతోనే పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం జరిగిఉంటుందని చెబుతున్నారు. టిడిపి బలహీనపడేవరకూ వైసీపీని ప్రోత్సహించాలన్న వ్యూహమే బిజెపి నాయకత్వంలో కనిపిస్తోంది.