ఏపీ కొత్త సీఎస్ సతీష్‌చంద్ర?

578

నీలం సహానీకి ప్రభుత్వ సలహాదారు పదవి?
చక్రం తిప్పిన సీఎంఓ ఉత్తరాది అధికారి?
(మార్తి సుబ్రహ్మణ్యం)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎస్‌గా మూడో కృష్ణుడు రానున్నారా? సచివాలయ వర్గాలలో జరుగుతున్న చర్చలు చూస్తుంటే ఈ వార్త నిజమేననిపిస్తోంది. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీలం సహాని తన పదవీ వివరణ కంటే ముందుగానే, ఆ పదవి నుంచి త ప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆమె తర్వాత ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి సతీష్‌చంద్ర ప్రధాన కార్యదర్శిగా రానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం సీఎస్‌గా కొనసాగుతున్న నీలం సహానీ తనపై వస్తున్న ఒత్తిళ్లను భరించలేకపోతున్నారని, సీఎంఓ స్థాయిలోనే ఫైళ్లను క్లియర్ చేసి, కేవలం వాటిని ర్యాటిఫికేషన్ చేసేందుకే తనను పరిమితం చేస్తున్న విధానాలపై ఆమె అసంతృప్తిగా ఉన్నట్లు భోగట్టా. నేను రాటిఫికేషన్లపై సంతకం చేసేందుకు ఉన్నానా? అని పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారని వార్తలు వెలువడుతున్నాయి. సీఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వ్యవహారశైలి ఆమెకు రుచించడం లేదన్న ప్రచారం జరుగుతోంది. 
ఈ నేపథ్యంలో తమకు నమ్మకమైన వ్యక్తి, తమ ఆదేశాలు పాటించే అధికారి కోసం చేసిన అన్వేషణలో, సతీష్‌చంద్ర పేరును సీఎం ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ఆ మేరకు సీఎంఓ ఉన్నతాధికారి సిఫార్సు కూడా పనిచేసినట్లు చెబుతున్నారు. సదరు సీనియర్ అధికారి సిఫార్సు వల్లే ఎల్వీ సుబ్రమణ్యం సీఎస్ పదవి కోల్పోగా, 6నెలల పాటు ఎలాంటి పోస్టింగు లేని సతీష్‌చంద్రకు కీలకమైన ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పదవి కట్టబెట్టినట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబుకు అత్యంత నమ్మకమైన అధికారిగా పేరున్న సతీష్‌చంద్రను ఏరికోరి ఆయన కేంద్ర సర్వీసులను నుంచి తీసుకువచ్చి, సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా నియమించిన విషయం తెలిసిందే. 
బాబు హయాంలో సతీష్‌చంద్ర, ఏబి వెంకటేశ్వరరావు ఇద్దరూ వైసీపీ ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడారంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి బహిరంగంగానే ఆరోపించిన విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిద్దరికీ ఆరు నెలలపాటు ఎలాంటి పోస్టింగులు ఇవ్వలేదు. అయితే, సీఎంఓలో ఉత్తరాదికి చెందిన ఓ ఐఏఎస్ లాబీయింగ్ వల్ల అదే ఉత్తరాదికి చెందిన సతీష్‌చంద్రకు పోస్టింగు లభించగా, డిజిపి స్థాయి అధికారి అయిన ఏబి వెంకటేశ్వరరావుకు మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి పదవి ఇవ్వకపోవడం విచిత్రం. అయితే, త్వరలో సతీష్‌చంద్ర సీఎస్ కానున్న నేపథ్యంలో, ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న నీలం సహానీని కొద్దినెలల్లో ప్రభుత్వ సలహాదారుగా నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నీలం సహానీ ఇటీవలే డిఓపీటీకి ఓ లేఖ రాశారని ప్రచారం జరుగుతోంది.