బిజెపిపై వైసీపీ మైండ్‌గేమ్!

454

కన్నాకు అమరావతిలో ఆస్తులపై సోషల్ వార్
డాక్యుమెంట్లతో తిప్పి కొట్టిన బిజెపి
ఢిల్లీ బాదుషాలు తమ వైపేనని ప్రచారం
మోడీ-షాకు చెప్పే చేస్తున్నామని స్పష్టీకరణ
ఏపీ కమిటీ తీర్మానాలు బేఖాతర్
కన్నా, పవన్, సుజనాపై వైసీపీ ఎదురుదాడి
బిజెపితో కలసి ఉన్నా పవన్‌పై ఆగని విమర్శలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలో విపక్ష అవతారమెత్తి తనకు రాజకీయ విరోధిగా మారిన బిజెపిపై అధికార వైసీపీ నాయకత్వం  మైండ్‌గేమ్‌ను తీవ్రతరం చేస్తోంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ తీర్మానించడమే కాకుండా, ప్రత్యక్ష ఆందోళనకు నడుంబిగించిన రాష్ట్ర బిజెపిపై, ైవైసీపీ నాయకత్వం మెండ్‌గేమ్ ఆడుతోంది. బిజెపితో జనసేనాధిపతి పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకుని, కలసి కదం తొక్కుతామని బహిరంగ ప్రకటన చేసిన తర్వాత కూడా, వైసీపీ నేతలు పవన్ కల్యాణ్‌పై ఆరోపణలను కొనసాగించడం బట్టి.. వైసీపీ నాయకత్వం ఢిల్లీతో సఖ్యతగా ఉంటూ, రాష్ట్ర బిజెపిని పూచిక పుల్లగా చూస్తున్నట్లు స్పష్టమవుతోంది.
     తాజాగా బిజెపి చీఫ్ కన్నా లక్ష్మీనారాయణకు అమరావతిలో భూములున్నాయని, అందుకే ఆయన అమరావతి కోసం పోరాడుతున్నారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వెనుక, వైసీపీ సోషల్ మీడియా విభాగం ఉందని బిజెపి అనుమానిస్తోంది. ఇటీవల ప్రధాని శంకుస్థాపన చేసిన స్థలంలో కన్నా మౌనదీక్ష నిర్వహించి, అమరావతి రాజధాని రైతులకు భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే. పైగా, కన్నా చొరవ, పట్టుదలతోనే రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని రాష్ట్ర కమిటీ తీర్మానించింది. దానికి ఇద్దరు ప్రముఖులు అడ్డుపడినా, చివరకు కమిటీ మొత్తం అమరావతిపైనే మొగ్గు చూపింది. దీనితో సహజంగానే వైసీపీ సోషల్ మీడియా వింగ్ కన్నాను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే ఆయనకు అమరావతిలో భూములున్నాయన్న కొత్త ప్రచారానికి తెరలేపినట్లు బిజెపి నేతలు ధ్వజమెత్తుతున్నారు.
      నిజానికి ఆ భూములు,  అమరావతి ఆలయం ఉన్న అమరావతి గ్రామంలోనివని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లను ఎన్నికల అఫిడవిట్‌లోనూ చూపినట్లు.. ఆయా డాక్యుమెంట్లను తెరపైకి తీసుకువచ్చి, ఎదురుదాడి చేసింది. ‘ఇది వైసీపీ సోషల్‌మీడియా చేస్తున్న విష ప్రచారం. దానికి బిజెపిని విమర్శించేందుకు అంశాలేవీ దొరక్క ఇలాంటి చిల్లర ప్రచారానికి దిగుతోంది. వ్యక్తులను విమర్శించడం, వారిపై ఆరోపణలు చేయడం ద్వారా బిజెపి నాయకత్వం దృష్టిలో ప్రభుత్వంపై పోరాడుతున్న అగ్ర నేతలను చిన్నవారిగా చూపాలన్న వారి దుష్ట పన్నాగాలు, మా పార్టీ నాయకత్వం వద్ద పనిచేయవు. కన్నా లక్ష్మీనారాయణ ఎలాంటి వారో దశాబ్దాలుగా ఆయన సేవలు పొందుతున్న ప్రజలకు తెలుసు. రాజధానిలో ఉన్న అమరావతికి, దేవాలయం ఉన్న అమరావతి గ్రామానికీ తెలియకుండా చేస్తున్న దుష్ప్రచారానికి ఆ డాక్యుమెంట్లే నిదర్శనమ’ని బిజెపి అధికార ప్రతినిధి, సీనియర్ నేత విల్సన్ స్పష్టం చేశారు.
ఇక టిడిపి నుంచి బిజెపిలో చేరిన ఎంపి, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిని కూడా వైసీపీ నాయకత్వం, ఇంకా బిజెపి నేతగా గుర్తించడం లేదు. ఆయనను టిడిపి కోవర్టుగానే అనుమానిస్తూ, ఆ మేరకు ఆయనపై ఆరోపణాస్త్రాలు సంధిస్తూనే ఉంది. ఇటీవల సీఎం జగన్ సభలో మాట్లాడుతూ, సుజనా చౌదరిని తన్ని బయటకు పంపించాలని బిజెపి వారికి పిలుపునివ్వడం బట్టి..  బిజెపిలో చురుకుగా పనిచేస్తున్న కన్నా, లక్ష్మీనారాయణ ఏవిధంగా వైసీపీకి లక్ష్యంగా మారారో స్పష్టమవుతోంది.
ఇక బిజెపితో జత కట్టిన తర్వాత కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కూడా వైసీపీ విడిచిపెట్టకపోవడం చర్చనీయాంశమయింది. సహజంగా కేంద్రంలో అధికార పార్టీతో రాష్ట్ర స్థాయిలో మరొక పార్టీ జత కలసినప్పుడు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. ఆ భయంతో కేంద్రంతో ఉన్న పార్టీ జోలికి వెళ్లవు. కానీ, వైసీపీ మాత్రం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో పవన్ ముందస్తు పొత్తు పెట్టుకున్నప్పటికీ ఏ మాత్రం ఖాతరు చేయకపోగా, ఎదురుదాడి చేస్తుండటం విశేషం. అంటే..  వైసీపీ నాయకత్వం అటు బిజెపి ఢిల్లీ నాయకత్వంతో సన్నిహితంగా వ్యవహరిస్తూనే, ఇటు రాష్ట్ర నాయకత్వాన్ని ఖాతరు చేయకపోగా, ఆ పార్టీ నేతలపై ఎదురుదాడి చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. నిజం నరేంద్రుడికెరుక!