బాబ్బాబూ.. కాంగ్రెస్‌కు నీవే దిక్కు రాహుల్‌బాబూ!

313

గుర్రం గుడ్డిదయినా దాణాకు లోటులేదన్నది ఒక సామెత. ఇప్పుడు నడిపించే నాధుడు లేక నానాపాట్లు పడుతున్న కాంగ్రెస్ అనే జాతీయ పార్టీ చేసే హడావిడి మాత్రం తక్కువేమీ ఉండదు.  అయితే, అధ్యక్ష పదవి నాకొద్దు బాబోయ్ అని యువరాజు రాహుల్‌గాంధీ ఎన్నిసార్లు చేతులు పైకెత్తి అస్త్రసన్యాసం చేసినా, ప్రజలు మాత్రం రాహుల్ బాబే దిక్కులేని కాంగ్రెస్‌కు దిక్కవాలని కోరుకుంటున్నారట. రాహుల్‌బాబు లాంటి వారే నమ్మలేని విషయమిది. కాంగ్రెస్ ఉత్తరాధికారిగా రాహుల్‌గాంధీనే బెటరని, అసలామాటకొస్తే ఈ చిదంబరాలు, ఆ సచిన్‌పైలెట్లూ కంటే,  గాంధీ కుటుంబమే కాంగ్రెస్ పగ్గాలు తీసుకుంటే మంచిదని ప్రజలు సెలవిచ్చారట. అంటే పిచ్చి ప్రజలు ఇంకా రాజకీయ వారసత్వాన్ని కోరుకుంటున్నారన్న  మాట.
ఇంతకూ ఏం జరిగిందంటే.. దిక్కూ మొక్కూ లేని కాంగ్రెస్‌కు అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుందని ఇండియాటుడే-కార్వీ మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరిట సర్వే నిర్వహించింది. 19 రాష్ట్రాల్లో, 194 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12,141మంది అభిప్రాయం సేకరించారట. అందులో రాహుల్‌కు 24 శాతం ఆమోదం లభిస్తే, ఆయన సోదరి ప్రియాంకకు 14 శాతం, సోనియాకు 11 శాతం, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగుకు 10 శాతం ఆమోదముద్ర లభించిందట. రాహుల్ విషయంలో ఇది గత ఏడాది 11 శాతమే ఉందట. అంటే ఆయన తల్లికి ఇప్పుడు వచ్చిన శాతమన్నమాట. బాగానే ఉంది. యావత్ దేశం (24 శాతమే అయినప్పటికీ) యువరాజే కాంగ్రెస్ రాజు కావాలని కోరుకుంటున్నప్పటికీ, ఆయన మాత్రం అసలు ఆ మూడ్‌లోనే లేనట్లున్నారు.
థాయ్‌లాండ్, మలేషియా, శ్రీలంక, లండన్, అమెరికాలో మనసు సేదదీర్చుకునే పనిలో  బిజీగా ఉన్న యువరాజు శరీరాన్ని, దేశ ప్రజలు అనవసరంగా అధ్యక్ష పదవి ఇచ్చి కష్టపెట్టేలా ఉన్నారు. ఇంకా కుర్రతనం పోని రాహుల్‌బాబు తన వైవాహిక జీవితాన్ని కూడా త్యాగం చేసి, దేశం కోసం పెళ్లి కూడా చేసుకోకుండా, ఏదో సమయం కుదిరినప్పుడల్లా నాలుగు దేశాలు తిరిగొచ్చి, ఆ బడిలికలో హాయిగా లోక్‌సభలో కునుకు తీసే అదృష్టానికీ నోచుకోకుండా చేస్తున్నట్లున్నారు పాపం.
సోనియా అనారోగ్యంతో ఉన్నందున,తన కళ్లెదుటే రాహుల్‌బాబు అధ్యక్షుడవుతే చూసి మురిసిపోవాలన్నది ఆ తల్లి కోరికలా కనిపిస్తోంది.అది సహజం కూడా.తన తర్వాత కేటీఆర్ సీఎం కావాలని కేసీఆర్‌కు, తన తర్వాత కొడుకు లోకేష్ తనంతటి వాడు కావాలని చంద్రబాబుకు మాత్రం ఉండదూ? సోనియా కూడా అంతే! పెళ్లి గిళ్లీలాంటి పనులేవీ పెట్టుకోకపోయినా, ఆ దేశం ఈ దేశం తిరగకుండా, అవసరమైతే అప్పుడప్పుడు కేరళకు వెళ్ళినా ఫర్వాలేదు, ఎంచక్కా  ఢిల్లీ పట్టునే ఉండి తన సోదరుడు ‘ఫ్యామిలీ పార్టీని’  చూసుకుంటే అంతకంటే ఇంకేం కావాలన్నది సోదరి ప్రియాంక కోరిక. ఇలా పాపం రాహుల్‌బాబుపై ఎవరి కోరికలు పెట్టుకున్నారు. బాగానే ఉంది. మరి రాహుల్‌బాబు కోరికలు ఏమిటో? పార్టీ పగ్గాలు తీసుకుంటే తాను  కోల్పోయేదేమిటో ఒక్కరూ ఆలోచించరేమిన్నది యువరాజు ఆవేదన. నిజమే. సీత బాధ సీతది. పీత బాధ  పీతది!