దావోస్‌లో తెలంగాణ దరువు

554

కేటీఆర్ చుట్టూ బడా కంపెనీల ప్రదక్షణలు
యానిమేషన్ సెంటర్లపై తెలంగాణ సర్కారు దృష్టి
హైదరాబాద్‌కు మరింత మార్కెట్ పెంచిన కేటీఆర్ టూరు
దావోస్‌లో నాడు  బాబు.. నేడు కేటీఆర్ ప్రత్యేక ఆకర్షణ

(మార్తి సుబ్రహ్మణ్యం)

వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని దూసుకుపోవడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబం తర్వాతనే ఎవరైనా. ప్రపంచ వ్యాపార, వాణిజ్య దిగ్గజాలంతా ఒకచోట కొలువు దీరి, ప్రపంచ మార్కెట్ స్థితిగతులు, అవసరాలు, వాటి అన్వేషణ కోసం చర్చించే దావోస్ వరల్ట్ ఎకనామికల్ ఫోరం సదస్సును రాష్ట్రంలో పెట్టుబడుల కోసం, తెలంగాణ యువ మంత్రి కేటీఆర్ చాలా చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో కంపెనీల విస్తరణకు బడా కంపెనీలు ఆయన చుట్టూ ప్రదక్షణలు చేస్తుంటే, మరిన్ని దిగ్గజ కంపెనీలను హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు కేటీఆర్ వాటి చుట్టూ తిరుగుతున్నారు. దావోస్‌లో కేటీఆర్ పర్యటన వివరాలు వాటినే ప్రతిబింబిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ సీఈఓలు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు హాజరయ్యే ఈ సమావేశం ఆహ్వానాలు ఎలా అందుతాయి? వాటికి ప్రభుత్వాలు పెట్టే ఖర్చెంత అన్నది పక్కకుపెడితే.. దిగ్గజ కంపెనీలను తమ రాష్ట్రాలకు తీసుకువెళ్లే వారే మొనగాళ్లు. ఆయా కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను కార్యరూపం లోకి తీసుకువచ్చిన వారే కార్యదక్షులు. అది గతంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు అయితే.. ఇప్పుడు తెలంగాణ యువ మంత్రి, భావి సీఎం కేటీఆర్. దావోస్ పర్యటనలో అదే నిజమమవుతోంది.

దావోస్ అంటేనే ఫక్తు ప్రపంచ వ్యాపారస్తుల ముచ్చట్లకు వేదిక. కంపెనీల వృద్ధి, విస్తరణకు ఒక అడ్డా.  ఎక్కడేం వనరులున్నాయి? అక్కడి మార్కెట్ కథేమిటి? అక్కడ ఎలా వాలిపోవాలి? అక్కడి ప్రభుత్వాలు ఎంత చౌకగా భూములిస్తే, ఎంత మిగులుతుంది? ఎన్ని లాభాలొస్తాయి? మార్కెట్ ఎంత విస్తరిస్తుంది?.. ఇవే దావోస్‌లో గుమిగూడే కంపెనీలు, వచ్చే పారిశ్రామికవేత్తల ఆలోచనలు. అటు ప్రభుత్వాల తరఫున హాజరయ్యే ప్రతినిధులు కూడా, వాటిలో తమకు అనుకూలంగా ఉండే ఎన్ని కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావచ్చు? వాటిలో ప్రపంచ దిగ్గజ కంపెనీలను తీసుకువస్తే, వాటి ద్వారా వచ్చే ఉద్యోగ కల్పనతో అటు నిరుద్యోగులు, ఇటు జనంలో ఎంత ఇమేజ్ సాధించవచ్చన్నది  అధికారంలో ఉన్న ప్రభుత్వాల ఆలోచన. సరే.. గతంలో ఏపీలో.. ఉత్తుత్తి ఒప్పందాలు, ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు కమిషన్లు ఇస్తేనే భూములు ఇస్తామనే బెదిరింపు పర్వాలూ, బేరసారాలూ  జరిగాయనుకోండి. అది వేరే విషయం.
ఇప్పటికే ఐటి హబ్‌గా మారిన హైదరాబాద్‌లో కంపెనీలు కిటకిటలాడుతున్నాయి. ప్రపంచ దిగ్గజ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపే చూస్తున్నాయి. దానికి కారణం.. హైదరాబాద్ వాతావరణం, మార్కెట్, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు వగైరా. ఇప్పుడు కేసీఆర్ సర్కారు హైదరాబాద్‌ను యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్ హబ్‌గా మార్చే పనిలో ఉంది. వాటిని ఇమేజ్ టవర్స్ పేరుతో ఒకేచోటకు చేర్చే పనిలో బిజీగా ఉంది. ఎందుకంటే.. ప్రపంచాన్ని ఆకర్షించిన ‘చోటా బీం’ పాత్ర సృష్టితోపాటు.. బాహుబలి, లైఫ్ ఆఫ్ వై వంటి భారీ టెక్నికల్ సినిమాలకు హైదరాబాద్‌లో ఉన్న కంపెనీలే విజువల్ ఎఫెక్ట్స్ అందించాయి మరి. దీనిని మరింత మార్కెట్ చేసుకుని, ప్రపంచంలో ఆ రంగంలో ఉన్న వారందరినీ హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు కేటీఆర్ తన దావోస్ పర్యటనను వినియోగించుకున్నట్లు ఆయన చేసిన ప్రసంగం స్పష్టం చేస్తోంది.  కేటీఆర్ తాజా దావోస్ పర్యటనలో అన్నీ కుదిరితే, ప్రపంచ ప్రఖ్యాత యూట్యూబ్ కంపెనీ కూడా హైదరాబాద్‌లో అడుగుపెట్టవచ్చు.ఇప్పటికే ప్రఖ్యాత ఫార్మా కంపెనీ పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్ హైదరాబాద్‌లో 500 కోట్ల రూపాయలతో తమ కంపెనీ విస్తరణకు సిద్ధమని ప్రకటించారు.
గతంలో దావోస్‌లో జరిగిన ఇలాంటి సదస్సులను ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బాగా వినియోగించుకున్నారు. కంపెనీల ప్రాధాన్యం, వాటి మార్కెట్ బట్టి.. తమ రాష్ట్రంలో భూములు, ఇతర రాయితీలు ఇస్తామని హామీలిచ్చి వాటిని తీసుకువచ్చే వారు. కంపెనీ సీఈఓలు విడిచి చేసిన హోటళ్లకూ వెళ్లేవారు. వాటికి తెలుగు రాష్ట్రాల్లోని పలువురు పారిశ్రామికవేత్తలు, ఆర్ధిక నిపుణులను తీసుకువెళ్లేవారు. ఇప్పుడు దేశంలో ఆయన తర్వాతి స్థానాన్ని కేటీఆర్ సంపాదించారు. ఒకరకంగా ఆయననే మించిపోతున్నారు. కేటీఆర్ కూడా ప్రపంచ దిగ్గజ కంపెనీలను హైదరాబాద్‌కు తీసుకువచ్చి తెలంగాణను అగ్రస్థాయిలో నిలబెట్టే పనిలో బిజీగా ఉన్నారు. ఆల్ ది బెస్ట్!