ఇంతకూ ‘మండలిరద్దు’లో తప్పెవరిది?

528

60 కోట్లు ఖర్చవుతుందన్న సీఎం జగన్
గతంలో మండలిని రద్దు చేసినప్పుడు ఎన్టీఆర్‌దీ అదే మాట
అన్న గారి నిర్ణయాన్ని తిరగతోడిన రాజన్న
ఇప్పుడు రాజన్న నిర్ణయాన్ని తప్పుపట్టిన జగనన్న
 రాజన్న హయాంలోనూ ఖర్చయిందన్నమాటనే
నాడు ఎన్టీఆర్ వల్ల, నేడు బాబు వల్ల  రద్దు?
మండలి రద్దుపై టిడి పి మహా ఇరకాటం

( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ శాసనమండలిపై రద్దు కత్తి వేలాడుతోంది. రద్దు-కొనసాగింపు మధ్య కౌన్సిల్ ఊగిసలాడుతోంది. మండలికి ఏడాదికి 60 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ప్రజల అవసరానికి అక్కరకురాని సభ వల్ల ప్రయోజనం ఏమిటో చర్చిద్దామని సీఎం జగన్ నిండుభలో చెప్పారు. అంటే 60 కోట్లు ఖర్చు పెడుతున్నా కౌన్సిల్ వల్ల ఉపయోగం లేదని సీఎం చెప్పకనే చెప్పారన్నమాట! ఒకప్పుడు ఎన్టీఆర్ వల్ల రద్దయిన కౌన్సిల్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వల్ల రద్దయ్యే పరిస్థితి ఏర్పడింది.
నాడు అసెంబ్లీలో టిడిపికి ఇదే మాదిరిగా సంపూర్ణ మెజారిటీ ఉన్నా, కౌన్సిల్‌లో ఇప్పటి టిడిపి మాదిరిగా అప్పుడు కాంగ్రెస్‌దే పెత్తనం. దానితో బిల్లులకు అడ్డంకి కావడం, అదే సమయంలో ఈనాడు అధిపతి రామోజీరావును సభకు పిలిపించాలని కౌన్సిల్ అప్పటికే తీర్మానించడంతో, ఎన్టీఆర్ అసలు కౌన్సిల్‌నే రద్దు చేసి పారేశారు. కౌన్సిల్‌కు కోట్ల రపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తోందని, దాని వల్ల ఉపయోగం లేకపోగా, అది అసలు ఆరోవేలని కూడా ఎన్టీఆర్ ఆనాడు చెప్పారు. దానితో సభలో చర్చ కూడా లేకుండా కౌన్సిల్‌ను రద్దు చేశారు. ఇప్పటి జగన్ మాదిరిగా అప్పుడు ఎన్టీఆర్ నిర్ణయాన్ని ప్రశ్నించే పరిస్థితి టిడిపిలో లేదు. మండలి రద్దు చేస్తూ కేంద్రానికి పంపించడం, ఆలస్యమైనా దానిని కేంద్రం అంగీకరించడంతో అక్కడితో ఉమ్మడి రాష్ట్రంలో కౌన్సిల్ కథ కంచికి చేరింది.
ఇప్పుడు ఏపీలో కౌన్సిల్‌కు ఏడాదికి 60 కోట్లు ఖర్చు పెట్టినా ఉపయోగం లేదన్నట్లు జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఒకరకంగా అంత డబ్బు వృధా అన్నట్లు మాట్లాడిన జగన్ వైఖరిని, నాడు ఆయన తండ్రి వైఎస్ మండలి పునరుద్ధరణ కోసం తీసుకున్న నిర్ణయాన్ని పోలుస్తూ.. ఆ ప్రకారంగా వైఎస్ నిర్ణయాన్ని కూడా తప్పు పట్టినట్లే ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆ ప్రకారంగా వైఎస్ కూడా మండలి కోసం కోట్లు వృధాగా ఖర్చు పెట్టారన్న సంకేతాలు వెళుతుండటం ప్రస్తావనార్హం. నిజానికి వైఎస్ సీఎం అయి, మండలి పునరుద్ధరణకు ప్రయత్నాలు చేసిన రోజుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగానే ఉంది. రియల్ ఎస్టేట్, ఐటి  రంగం మంచి ఊపులో ఉంది. కానీ, ఇప్పుడు విభజిత ఏపీ అప్పుల్లో, ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. నిజాయితీగా చెప్పాలంటే, ఇప్పటి ఆర్ధిక సంక్షోభ పరిస్థితిలో కౌన్సిల్ వల్ల పెద్దగా ఉపయోగం లేదన్నది విద్యావంతుల అభిప్రాయం.
ఒకవేళ జగన్ నిజంగా మండలిని రద్దు చేసినట్టయితే.. దాని పునరుద్ధరణ కోసం తండ్రి వైఎస్ తీసుకున్న నిర్ణయం తప్పని తేల్చినట్టయివుతుంది. అదీకాకుండా, తండ్రి నిర్ణయానికి కొడుకు భిన్నంగా వ్యవహరిస్తున్నందున ఆయన వైఎస్‌కు రాజకీయ వారసుడు ఎలా అవుతారని రాజకీయ ప్రత్యర్ధులు ఎదురుదాడి చేసే అస్త్రం కూడా ఇచ్చినట్టవుతుంది. అదీకాకుండా.. ఏడు నెలల క్రితమే మండలి నుంచి క్యాబినెట్‌లోకి తీసుకున్న పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ తమ పదవులు కోల్పోతారు. మండలిని రద్దు చేయమని వారిద్దరితో చెప్పించినా, అంతర్గతంగా వారు సంతృప్తితో ఉంటారని భావించలేం.
ఇక్కడ ఇరకాటం ఒక్క జగన్‌కే కాదు.చంద్రబాబు నాయుడుకూ లేకపోలేదు. వైఎస్ జమానాలో మండలి పునరుద్ధరణ యత్నాలను టిడిపి సభలో అడ్డుకుంది. ఇప్పుడు విచిత్రంగా ఆయన కొడుకు జగన్, అదే మండలిని రద్దు చేసే ప్రయత్నాలనూ అడ్డుకోవటం విస్మయపరుస్తోంది. నాడు వద్దన్న టిడిపి.. నాటి వాదన ప్రకారమే నేడు జగన్ మండలి వద్దని తొలగిస్తుంటే,  దానిని విపక్షంలో ఉన్న టిడిపి అడ్డుకోవడం రాజకీయ వైచిత్రి. దీనిపై వైసీపీ ఎదురుదాడి చేస్తే దానికి టిడిపి ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒకవేళ శాసనసభను మరికొన్నాళ్లు పొడిగించి కౌన్సిల్ రద్దు బిల్లుపై చర్చకు పెడితే, సభకు దూరంగా ఉండటం ద్వారా టిడిపి ఆ దాడిని తప్పించుకునే అవకాశం లేకపోలేదు. రాజకీయాల్లో స్థిరమైన నిర్ణయాలు, విలువలు లేకపోతే ఏ పార్టీకయినా ఇలాంటి కష్టాలు తప్పవు