అవును.. పేద రాష్ట్రానికి మండలే కాదు.. అన్నీ అనవసరమే!

521

మరి సలహాదారుల జీతాల మాటేమిటి?
వాలంటీర్లకు అన్ని నిధులు అవసరమా?
కార్పొరేషన్లు, దేవాలయాలకు పాలకవర్గాలెందుకు?
జగన్ వ్యాఖ్యలపై కొత్త చర్చ

(మార్తి సుబ్రహ్మణ్యం)

 

‘అసలు ఇంత పేద రాష్ట్రానికి శాసనమండలి అవసరమా? రోజుకు కోటి. ఏడాదికి 60 కోట్లు ఖర్చు పెడుతున్నాం’.. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి శాసనసభలో చేసిన వ్యాఖ్య ఇది. నిజమే. పేద రాష్ట్రానికి మండలితో పని లేదు. దాని అవసరం కూడా పెద్దగా ఏమీ లేదు. పైగా సభ నిర్వహణ, ఎమ్మెల్సీల జీతభత్యాలు, టిఏ, డిఏలు, కమిటీల పర్యటనలకు తడిసి మోపెడు ఖర్చు. ఇదంతా జనంపై భారమే. జగన్ స్వతహాగా వ్యాపారవేత్త. డబ్బు ఎలా సృష్టించాలో, దానిని ఎలా ఖర్చు పెట్టాలో, ఏ మార్గాల్లో ఖర్చు పెట్టాలో ఆయనకు కొట్టినపిండి. లేకపోతే ఇంత చిన్న వయసులో అన్ని వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం నిర్మించేవారు కాదు.
జగన్ సీఎం అయితే, డబ్బు సంపాదనలో ఆయన నిష్ణాతుడు కాబట్టి, రాష్ట్ర ఖజానాకు ఇకపై అదనపు డబ్బు సమకూరుతుందని ఆయనలోని ఆర్దికవేత్తను గుర్తించిన వారు భావించారు. కానీ అందుకు భిన్నంగా, రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే అతి పెద్ద వనరయిన వైన్‌షాపులు రద్దు చేసి, ప్రభుత్వంతోనే వాటిని నడిపిస్తున్నారు. బార్‌షాపులను కూడా రద్దు చేసే ప్రయత్నం చేసినా కోర్టు దానికి మోకాలడ్డింది. దానితో బార్ల సమయం తగ్గించేశారు. గత నెల వరకూ ఇసుకపై నిషేధం విధించారు. మరి ఇవన్నీ ఖజానాకు ఆదాయం సమకూర్చేవే. అయినా వాటిని నియంత్రించి తనదైన శైలి ప్రదర్శించారు. అయితే, సిమెంటు పరిశ్రమల కోసం ఇసుకను, లిక్కర్ కంపెనీల కోసం వైన్‌షాపులపై వేటు వేశారని, సర్కారీ వైన్‌షాపుల్లో కమిషన్లు ఇచ్చిన కంపెనీ బ్రాండ్లనే పెడుతున్నారని, ఇసుక కంపెనీ వారి నుంచి బస్తాకు 5 రూపాయల చొప్పున కమిషన్ ఇచ్చిన తర్వాతనే ఇసుకను ఫ్రీ చేశారని టిడిపి నేతలు ఆరోపించారు. అది వేరే విషయం.
ఇక సీఎం జగన్ చెప్పినట్లు.. ఒక్క శాసనమండలే కాదు, రాష్ట్రంలో అనేకానేక సంస్థలను కొనసాగించడం కూడా వృధానే. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వేల దేవాలయాలకు చైర్మన్లు, పాలకమండలి సభ్యుల నియామకం వల్ల ఎవరికి ఉపయోగం? ఫాస్టర్లు, ముల్లాలకు గౌరవం వేతనం, జెరూసెలం యాత్రలకు సబ్సిడీలు, జనం డబ్బుతో చర్చి నిర్మాణాలు ఎందుకు? అసలు ధార్మిక సంస్థలతో సర్కారుకు ఏం పని? డజన్ల కొద్దీ ఉన్న ప్రభుత్వ కార్పోరేషన్లకు చైర్మన్లు, ైడె రక్టర్ల వల్ల ప్రయోజనం ఏమిటి? వారికి గౌరవ వేతనాలు, కార్లు, నౌకర్లు, చాకర్లు ఎందుకు? లక్షల సంఖ్యలో ఉన్న గ్రామ, పట్టణ వాలంటీర్లను జనం డబ్బుతో మేపడం ఎందుకు? కోట్లాది రూపాయలు పోసి ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వడం ఎందుకు?ఇటీవల రాజధాని తరలింపు కేసులను వాదించేందుకు ఢిల్లీకి చెందిన న్యాయవాదికి అక్షరాల ఐదు కోట్ల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించడం కూడా అనవసరమే కదా ఒప్పందంలో భాగంగా కోటి రూపాయలు ఇచ్చేందుకు జీవో జారీ చేయటం మరో అనవసరమైన పని ఇంత పెద్ద రాష్ట్రానికి లాయర్ కోసం ఐదు కోట్లు వెచ్చించడం అవసరమా?
ఇవికాకుండా.. దాదాపు 30 మంది సలహాదారుల నియామకాలు ఎవరికి ఉపయోగం? 3,4 లక్ష ల రూపాయల జనం డబ్బును పప్పు బెల్లాల్లా వారికి పంచిపెట్టడం వల్ల ఖజానాపై భారమే కదా? పక్క రాష్ట్రం నుంచి అరువు తెచ్చుకుని మరీ వారిచ్చే సలహాలేమిటో ఎవరికీ అర్ధం కాదు. అయినా లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్న ఐఏఎస్, ఐపిఎస్ అధికారులుండగా, మళ్లీ లక్షలు పోసి సలహాదారుల  అరువు ఆలోచనలు సర్కారుకు అవసరం లేదు కదా? మంత్రులు, అధికారులకు విమానాల్లో బిజినెస్ క్లాసు ప్రయాణాలు ఎందుకు? ఎంచక్కా సాధారణ తరగతి విమానాలు, రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని ఉత్తర్వులివ్వవచ్చు కదా?.. గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ప్రత్యేక విమానాల్లో తిరిగి కోట్లాది రూపాయలు ప్రజాధనం వృధా చేశారని,చివరకు హైదరాబాద్-డిల్లీకి సైతం ప్రత్యేక విమానాల్లో వెళ్లారని గతంలో వైసీపీ విమర్శించింది. మరి ఇప్పుడు సీఎం జగన్ కూడా ప్రత్యేక విమానాల్లో కాకుండా, సాధారణ విమానాల్లోనే ప్రయాణిస్తే బాగుంటుంది కదా? అసలు ఇవన్నీ పేద రాష్ట్రానికి అవసరమా? అన్నది  జనం ప్రశ్న. మరి శాసనమండలి ఖర్చు గురించే అంత ఆందోళన చెందిన జగ నన్న మిగిలిన ఈ వృధా ఖర్చులపై ఏమంటారో?! ఎందుకంటే ఆయనే చెప్పినట్లు ఏపీ పేద రాష్ట్రం కదా?!