రాజధాని ‘మూడు’ మారింది

233

సెలక్ట్ కమిటీకి వికేంద్రీకరణ బిల్లు
జగన్ సర్కారుకు తొలి షాక్
చరిత్రలో నిలిచిపోయిన మండలి చైర్మన్ షరీఫ్
జంధ్యాల సలహాతోనే సెలక్ట్ కమిటీకి బిల్లు
సంక్షోభంపై ఆయనతో ముగ్గురు మంతనాలు
నిబంధనలు వాడుకున్న టిడిపిదే పైచేయి
అక్కరకొచ్చిన మండలి మెజారిటీ
పనిచేయని సర్కారు మంత్రాంగం
ఇక మూడు నెలలు రాజధాని తరలింపు లేనట్లే

( మార్తి సుబ్రహ్మణ్యం)
నలభై ఎనిమిది గంటల ఉత్కంఠకు తెరపడింది. ప్రజాస్వామ్యంలో మెజారిటీనే గెలిచింది. అసెంబ్లీలో అధికార పార్టీకి ఉన్న సంపూర్ణ మెజారిటీ.. కౌన్సిల్‌లో ఓడిపోయింది. ప్రజాస్వామ్యంలో మెజారిటీనే ప్రాతిపదిక కాబట్టి, అసెంబ్లీలో నెగ్గిన ఆ రెండు బిల్లులు శాసనమండలిలో వీగిపోవడం కూడా ప్రజాస్వామ్యం గొప్పతనమే. కాకపోతే.. ఒత్తిళ్లు, ఉత్కంఠ, ఆరోపణల ఉక్కపోతను తట్టుకుని విచక్షణాధికారాలు వినియోగించిన మండలి చైర్మన్ షరీఫ్ ఈ మొత్తం ఎపిసోడ్‌తో చరిత్రలో చిరస్థాయిగా నిలిస్తే, … తెర వెనుక శాసన వ్యవస్థ కథ నడిపించి, మండలికి మార్గదర్శిగా నిలిచిన న్యాయవాది జంధ్యాల రవిశంకర్ పాత్ర అమోఘం. మొత్తంగా.. ఇది ఏడు నెలల జగన్ నిర్నిరోధ విజయయాత్ర పాలనకు తొలి వజ్రాఘాతమైతే, పరాజయ వియోగంలో ఉన్న విపక్ష తెలుగుదేశం పార్టీకి తొలి నైతిక, సాంకేతిక విజయం. ఇక్కడ విజేతలు, పరాజితులెవరన్నది పక్కకుపెడితే, గెలించింది మాత్రం శాసనసవ్యవస్థనే. దానికి కారణమైన సారథికి ఎవరేం పేరు పెట్టినా, ఎన్ని విమర్శలు కురిపించినా క చ్చితంగా అది మండలి చైర్మన్ షరీఫ్ ఖాతాకే వెళుతుంది. సాహో షరీఫ్! ఇది కూడా చదవండి.. కౌన్సిల్‌పై షరీఫ్ మార్కు ముద్ర
మూడునెలలు తరలింపునకు బ్రేక్
ఇక రెండురోజుల పాటు నరాలు తెగే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. జగన్ సర్కారు అసెంబ్లీలో ఆమోదం పొందిన పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీడీఏ ఉపసహరణ బిల్లును శాసనమండలి మోకాలడ్డింది. దానిని మండలి చైర్మన్ షరీఫ్ రూల్ 154 ప్రకారం.. సభ మెజారిటీని దృష్టిలో ఉంచుకుని, తన విచక్షణాధికారాలు వినియోగించి సెలక్ట్ కమిటీకి పంపించడం ద్వారా.. మరో మూడు నెలల పాటు రాజధాని ‘మూడు’ మారినట్టయింది. అంటే, ఇక విశాఖకు పాలనా రాజధాని, కర్నూలుకు న్యాయ రాజధాని, అమరావతికి శాసన రాజధానిని మార్చాలన్న జగన్ సర్కారు ప్రయత్నానికి మూడు నెలల పాటు బ్రేకులు పడినట్లే. ఇది రాజధాని రైతులు, రాజధాని తరలిపోకూడదనుకునే వారికి తాత్కాలిక ఊరట. అధికార పార్టీలు.. ఒక సభలో మెజారిటీగా ఉండి, మరొక సభలో మైనారిటీగా ఉంటే ఎలాంటి పరిణామాలు, ఫలితాలు ఎదుర్కోవలసి వస్తుందనడానికి ఈ రెండు బిల్లుల ఫలితాలు నిదర్శనంగా నిలిచాయి.
ఇది బాబు మార్కు ‘సెలెక్ట్’
అంతకుముందు జరిగిన సన్నివేశాలు, సంఘటనలు ప్రజలలో ఉత్కంఠ పెంచాయి. సెలెక్ట్ కమిటీకి పంపించాలని టి డిపి, పంపించకూడదని వైసీపీ వ్యూహ ప్రతివ్యూహాలు రచించాయి. ఈ మధ్యలో టిడిపి మహిళా ఎమ్మెల్సీ సునీతను తమ శిబిరం వైపు తీసుకురావడం ద్వారా, ఒక సభ్యుడి బలం తగ్గించే ప్రయత్నం చేశారు. సభలో జరుగుతున్న పరిణామాలు పరిశీలించేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా మండలి గ్యాలరీకి వచ్చారంటే, రెండు బిల్లుల వ్యవహారాన్ని టిడిపి ఎంత ప్రతిష్టాకత్మంగా తీసుకుందో స్పష్టమవుతోంది. తొలిరోజు సర్కారుపై రూల్ 71ను సంధించిన చంద్రబాబు, రెండోరోజు సెలెక్ట్ కమిటీ అస్త్రాన్ని విజయవంతంగా సంధించి, ‘ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ అనుభవానికి పదునుపెట్టారు.
షరీఫ్ ప్రకటనతో బిల్లుకు ముగింపు
గంటలపాటు వాదనలు, ఆరోపణలు, దూషణల పర్వం తర్వాత చైర్మన్ షరీఫ్.. రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు ప్రకటించడంతో కథ సుఖాంతమయింది. చంద్రబాబు మండలికి వచ్చింది చైర్మన్ షరీఫ్‌ను ప్రభావితం చేసేందుకేనని మంత్రి బుగ్గన సహా మంత్రులు ఆరోపించగా.. అసెంబ్లీలో జగన్ కూడా స్పీకర్ తమ్మినేని సీతారాంపై రోజూ ప్రభావం చూపిస్తున్నారంటూ టిడిపి సభ్యులు ప్రత్యారోపణలు చేశారు. తాను మాత్రం విచక్షణాధికారాలు, సభలో మెజారిటీ ప్రాతిపదికన బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించానని చైర్మన్ షరీఫ్ స్పష్టం చేశారు. మండలి రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు మీడియాలో వార్తలు వెలువడిన నేపథ్యంలో, రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేయగా, చైర్మన్‌నుద్దేశిస్తూ ‘సాహో షరీఫ్’ అంటూ ఆయన ఫోటోను నెటిజన్లు షేర్ చేశారు. సహజంగా ఈ పరిణామాలు అధికార వైసీపీలో ఆగ్రహం, టిడిపిలో ఆనందం మిగిల్చాయి. తమ పార్టీ అధికారంలో లేకపోయినా, సర్కారు మెడలు వంచి రెండు బిల్లులను అడ్డుకుని, రాజధాని తరలింపును మూడు నెలలపాటు తాత్కాలికంగానయినా ఆపిన వైనం, టిడిపికి నైతిక స్ఱైర్యం మిగిల్చింది.
తెర వెనుక ఏం జరిగిందంటే…
బుధవారం ఉదయం నుంచి బిల్లులు సెలె క్ట్ కమిటీకి పంపించాలని, పంపించకూడదంటూ జరిగిన వాదోపవాదోల నడుము మండలి అనేకసార్లు వాయిదా పడింది. దీనితో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ, చైర్మన్ షరీఫ్ చాంబరుకు వెళ్లి నష్టనివారణ ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ సమయంలో తమ నోటీసును గుర్తు చేయడానికి టిడిపి ఎమ్మెల్సీ, పార్టీ సమన్వయకర్త టిడి జనార్దన్‌రావు చాంబరుకు వెళ్లారు. ఆ సందర్భంలో బిల్లులు ఆగిపోతే వచ్చే నష్టం, దానివల్ల తలెత్తే పరిణామాలను బొత్స వివరించారు. అయితే తాము నిబంధనల ప్రకారమే ముందస్తు నోటీసు ఇచ్చామని టిడి జనార్దన్ గుర్తు చేశారు. దానితో అంతా కలసి శాసనసభ చట్టాలపై అవగాహన ఉన్న ఉమ్మడి రాష్ట్ర మాజీ న్యాయ సలహాదారైన, జంధ్యాల రవిశంకర్ అభిప్రాయం తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆ ప్రకారంగా ఆయనతో స్పీకర్ ఫోనులో మాట్లాడి.. సభలో నెలకొన్న ప్రతిష్థంభన, సంక్షోభ కారణాలు వివరించారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర శాసనసభ న్యాయ సలహాదారుగా పనిచేసిన అనుభవం ఉన్నందున ఈ సమస్యకు పరిష్కారం చెప్పాలని బొత్స కోరారు. అప్పుడు బొత్స కూడా మంత్రిగా పనిచేశారు. దానితోపాటు, ఈ అంశంపై మీరు న్యాయవాదిగా ఒక పార్టీ వకాల్తా తీసుకుని వాదిస్తున్నప్పటికీ, ఒక డాక్టరుగా రోగానికి మందు సూచించే వైద్యుడి పాత్ర పోషించాలని అభ్యర్ధించారు. అందుకు స్పందించిన జంధ్యాల.. సభలో మెజారిటీ, నిబంధనల ప్రకారం బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించడం ద్వారా, ఈ సంక్షోభం అధికమించవచ్చని సూచించగా, అందుకు ఇరువురు అంగీకరించారు. ఇది కూడా చదవండి.. ‘జగన్ సర్కారుకు లాయర్ జంధ్యాల ఝలక్
జంధ్యాల సూచించిన మార్గంలోనే సంక్షోభ పరిష్కారం

కానీ, మళ్లీ బయటకు వెళ్లిన తర్వాత సభకు సెలెక్ట్ కమిటీకి పంపించకూడదని వైసీపీ, పంపించాలని టిడిపి యధావిధిగా ఆందోళనకు దిగినా, చివరాఖరకు జంధ్యాల సూత్రాన్నే చైర్మన్ అమలుపరిచారు. నిజానికి ఈ రెండు బిల్లుల అంశాన్ని ఆది నుంచి తుది వరకూ జంధ్యాలనే తెరవెనుక ఉండి నడిపించారు. ఆ మేరకు అనేక నిబంధనలు ఉటంకిస్తూ నోట్ పంపారు. ఉమ్మడిరాష్ట్ర అసెంబ్లీకి అధికారిక న్యాయ సలహాదారుగా ఉన్న సమయంలోనూ ఆయన ఇలాంటి పాత్రనే పోషించారు. ఇప్పుడు ఎలాంటి పదవి లేకపోయినా, గుంటూరు జిల్లా వాసిగా రాజధాని తరలిపోకూడదన్న పట్టుదలతో పనిచేశారు. అయితే.. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎంతోమంది మేధావులమని చెప్పుకుని, న్యాయపరమైన పదవులు తీసుకున్న వారికెవరికీ రాని ఆలోచన.. అసలు టిడిపితో ఎలాంటి సంబంధం, అనుబంధం లేని.. ఇంకా చెప్పాలంటే ఆ సామాజికవర్గానికే చెందని న్యాయవాదికి రావడమే గొప్ప. మరి టిడిపి న్యాయమేధావులేమయ్యారో?!