భలే ఎమ్మెల్యేలు బాసూ!

380

సెలెక్ట్ కమిటీ టెన్షన్‌లో సినిమా సందడి
కౌన్సిల్ గ్యాలరీలో బాలయ్యతో సెల్ఫీ సందోహం

(మార్తి సుబ్రహ్మణ్యం)

ఏదైనా సినిమా యాక్టర్ల దారే వేరు. వాళ్లు ఎక్కడ ఉన్నా, ఏ రూపంలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా.. జనం వాళ్లను సినిమా నటులుగానే చూస్తారు. అందుకు ఎమ్మెల్యేలూ మినహాయింపు కాదు. ఓవైపు శాసనమండలిలో నరాలు తెగేంత ఉత్కంఠ కొనసాగుతుంటే, మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అక్కడికొచ్చిన టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ-వైసీపీ ఎమ్మెల్యే రోజాతో సెల్ఫీలు దిగేందుకు సందడి చేయడం అందరినీ ఆకర్షించడమే కాదు, ఆశ్చర్యపరిచింది. కొన్ని లక్షల మందికి ప్రతినిధులయి కూడా, వారు కూడా సాధారణ ప్రేక్షక అభిమానుల మాదిరిగానే, హీరోలతో ఫొటోలు దిగేందుకు ఆసక్తిచూపడమే ఆశ్చర్యం.
రాజధాని తరలింపునకు సంబంధించి రెండు కీలక బిల్లులను విపక్ష తెలుగుదేశం.. సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో శాసనమండలిలో ఉత్కంఠ రేపింది. దానిని తిలకించేందుకు అసెంబ్లీలో విపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తన పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ, ఇతర ఎమ్మెల్యేలతో కలసి మండలి గ్యాలరీకి వచ్చారు. అంతే. అప్పటికే అక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు బాలకృష్ణను చూశారు. వారిలో యువ ఎమ్మెల్యేలే ఎక్కువ. బాలయ్య లోపలకి వచ్చి రోజా పక్క సీట్లో కూర్చుకున్నారు. అంతే..ఎమ్మెల్యేల సందడికి అవధుల్లేకుండా పోయాయి. వైసీపీ ఎమ్మెల్యేలు బాలయ్య-రోజాతో సెల్ఫీలు దిగారు. అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే.. అటువైపు కుర్చీలో కూర్చున్న చంద్రబాబునాయుడు ఇవేమీ పట్టించుకోకుండా, మండలి చర్చను చూడటంలో మునిగిపోయారు.
సినిమా నటులు రాజకీయాల్లోకి వచ్చినా వారిని, సినిమా నటులుగానే పరిగణిస్తారు. సినీ రంగం నుంచే వచ్చిన ఎన్టీఆర్‌ను ప్రజలు రాజకీయ నేతగా కాకుండా, సినీ నటుడిగానే చాలా కాలం చూశారు. అలాగే వివిధ పార్టీలకు ప్రచారం కోసం వచ్చే సినీ నటులను చూసేందుకు జనాలు విపరీతంగా వస్తుంటారు. కానీ ఓట్లు ఎవరికి వేస్తారన్నది వేరే విషయం. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత.. ఆయన పార్టీ 18 సీట్లు గెలుచుకుని, దానిని కాంగ్రెస్‌లో విలీనం చేసేవరకూ ఆయనను జనం ీసినీ హీరోగానే చూశారు. జనసేన పెట్టిన ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్‌ను కూడా జనం అలాగే చూస్తున్నారు. పవ న్ కల్యాణ్ విలేకరుల సమావేశాల్లో జర్నలిస్టుల కంటే, ఆయనకు జిందాబాదులు కొట్టే జనసేన పవన్ ఫ్యాన్సే ఎక్కువగా కనిపిస్తుంటారు.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు, హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించే విలేకరుల సమావేశానికి సినిమా రిపోర్టర్లు కూడా ఎక్కువమంది హాజరయ్యేవారు. ఆ సందర్భంగా వారంతా చిరంజీవిని అన్నయ్య అని సంబోధిస్తూ.. ‘పాజిటివ్‌లో నెగటివ్’ ప్రశ్నలు వేసేవారు. ఇది చాలామంది జర్నలిస్టులకు చికాకు వేసేది. అయితే జర్నలిస్టులలో కూడా చాలామంది సినిమా కోణంలో.. తొలిరోజుల్లో చిరంజీవిని చూడాలని, ఆయనతో మాట్లాడాలన్న తపనతో పార్టీ ఆఫీసుకు వచ్చేసరికి, ప్రెస్‌కాన్ఫరెన్సు హాలు కిక్కిరిసిపోయేది. కొద్దికాలం తర్వాత అందరికీ అలవాటయి, ఆయన సమావేశాలు కొద్దిమంది జర్నలిస్టులతో ముగిసేది. చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించిన సమయంలో.. ఆయన కొద్దిమంది జర్నలిస్టులను తన నివాసానికి ఆహ్వానించి, వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు చిరంజీవి ఇంకా మెగాస్టారే. అయితే, చిరంజీవిని కలిసిన ఆనందం పట్టలేని ఇద్దరు, ముగ్గురు జర్నలిస్టులు.. తమ భార్యలకు ఫోన్లు చేసి మరీ, చిరంజీవితో మాట్లాడించారు. ప్చ్.. అదొక తుత్తి!