జగనన్న’వై’ అంటే.. రాజన్న ‘ఎస్’!

905

మండలి రద్దుపై తండ్రీతనయుల దారుల వేరు
నాడు పునరుద్ధరణకు వైఎస్ పాట్లు
చెన్నారెడ్డితో కానిది రాజన్నతో అయింది
నేడు దానినే రద్దు చేస్తానంటున్న జగనన్న
మండలి సీటుపై ఇప్పటికే వందమందికి హామీ
అయితే… ఇదంతా మైండ్‌గేమేనా?

( మార్తి సుబ్రహ్మణ్యం)

మాట తప్పను. మడమ తిప్పను’… ఈ మాట గుర్తుకు రాగానే ఠక్కున స్ఫురణకు వచ్చేది దివగంత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి! ఆయనకు సంబంధించి ఎవరికెన్ని అభ్యంతరాలు, ఆక్షేపణలు, విమర్శలు ఉన్నప్పటికీ.. వ్యక్తిగా వైఎస్‌పై సగటు ప్రజల్లో ఉన్న సానుకూలముద్ర చెరిపివేయలేనిది. ప్రభుత్వ ఆదాయ ఫలాలను కింది స్థాయి జీవికి చేర్చి, వారి గుండెల్లో శాశ్వతంగా కొలువైన మహానేత వైఎస్. ముఖ్యంగా ఆయనలో రాజకీయవాది కంటే మానవతావాదే ఎక్కువగా కనిపిస్తారు. వాడుకుని వదిలేసే ఈకాలపు రాజకీయాల్లో… ఎవరేమనుకున్నా నమ్ముకున్నవారికి మేళ్లు చేసే విషయంలో అప్పటి, ఇప్పటి తరం నేతలెవరూ ఆయనకు దరిదాపులకు రారు. రాలేరు!
దటీజ్..  వైఎస్!
ఒకసారి మాట ఇచ్చారంటే అది అమలయి తీరాల్సిందే. దానికోసం ఎందాకయినా వెళతారు. ఎవరితోనయినా కొట్లాడతారు. ఆయన నైజం అది. బహు నాయకత్వం, ముఠా తగాదాలు, కుమ్ములాటలతో ఇక అధికారంలోకి రావడం అనుకున్న కాంగ్రెస్ పార్టీకి తన పాదయాత్రతో జీవం పోసి, ఒంటిచేత్తో అధికారంలోకి తెచ్చిన మహానాయకుడాయన. ఆ సమయంలో పలువురు నేతలకు ఇచ్చిన శాసనమండలి పదవుల హామీలను నెరవేర్చిన ఘనుడు. రద్దయిన మండలిని, చెన్నారెడ్డితోనూ కాని పునరుద్ధరణను తన హయాంలో నెరవేర్చిన కార్యదక్షుడు. మరి.. ఇప్పుడు అదే మహానేత కుమారుడు, ఆయన వారసత్వం పుణికిపుచ్చుకుని, వైఎస్ బ్రాండ్‌తో జనం గుండెల్లో నిలిచిన ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి మాత్రం.. అందుకు వేస్తున్న భిన్నమైన అడుగులే ఆశ్చర్యపరుస్తున్నాయి. తండ్రి కష్టపడి పునరుద్ధరించిన శాసనమండలిని కొడుకు గిట్టించే పనికి దిగడమే దానికి కారణం.
వైఎస్ వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు జీవం
ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలో ఉన్న టిడిపిని గద్దె దించడం,   కాంగ్రెస్‌లో ఉన్న మొనగాళ్లెవరికీ సాధ్యం కాలేదు. కారణం ఎవరి దుకాణాలు వారివే. ఎవరి స్వార్థం వారిదే. ఆ సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి నడుంబిగించి, చంద్రబాబు నాయుడును గద్దె దించడానికి పడిన కష్టం, చేసిన శ్రమ అంతా ఇంతా కాదు. తెలుగు రాజకీయాల్లో సుదీర్ఘ పాదయాత్రకు బీజం వేసిన వైఎస్ ఒక్కరి కష్టం వల్లనే, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనడం మనం మనుషులం అన్నంత నిజం. మిత్రులెంతమంది ఉన్నారో, పార్టీలో శత్రువులు అంతమంది ఉన్న వైఎస్, పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు వారితో సఖ్యతగా వ్యవహరించారు. దానికోసం కోపమనే నరాన్ని తెంచుకున్నానని కూడా వ్యాఖ్యానించారు.
వైఎస్ కష్టంతోనే మండలి పునరుద్ధరణ
ఆ ఎన్నికల ముందు.. టికెట్ల పంపకాల సమయంలో జరిగిన పోటీలో, టికెట్లు రాని వారికి శాసనమండలి సీటు ఇస్తానని వైఎస్  హామీ ఇచ్చారు. అది వారిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే.. ఎన్టీఆర్ రద్దుచేసిన శాసనమండలిని అప్పటికి ఎవరూ పునరుద్ధరించలేదు. మధ్యలో చెన్నారెడ్డి ప్రయత్నించినా పార్లమెంటు అంగీకరించలేదు. రాజ్యసభలో అంగీకరించినా, లోక్‌సభ తిప్పికొట్టింది. దానితో అంతా మండలిని మర్చిపోయారు. కానీ వైఎస్ దానిపై మళ్లీ హామీ ఇచ్చేసరికి చాలామందికి ఆశలు చిగురించాయి. దానితో నేతలంతా వైఎస్‌కు సహకరించారు. అధికారంలోకి వచ్చిన వైఎస్.. మండలి పునరుద్ధరణకు నడుం బిగించారు. తన మిత్రుడైన కంతేటి సత్యనారాయణరాజును అదే పనికోసం ఢిల్లీలో ఉంచారు. ఆయనకు నాటి హోంమంత్రి మిత్రుడు కావడంతో, కంతేటి చేసిన తీవ్రమైన ప్రయత్నాలు, ఒత్తిళ్లు ఫలించి మండలి మళ్లీ ప్రాణం పోసుకుంది. అయితే, మండలి పునరుద్ధరించిన తర్వాత దానికోసం అంత కష్టపడిన కంతేటికి అప్పుడు ఎమ్మెల్సీ దక్కలేదు. అది వేరే విషయం.
నాడు మండలిని వ్యతిరేకించిన బాబు
ఫలితంగా ఎన్టీఆర్ వల్ల రద్దయిన శాసనమండలి 2007లో మళ్లీ జీవం పోసుకుంది. 1958 జులై 1న ఆర్టికల్ 168 కింద శాసనమండలి ఏర్పాటయింది. నిజానికి మండలి కచ్చితంగా ఉండాలన్న నిబంధనమేమీ లేదు. కానీ, రాజకీయ పార్టీలు తమపై ఉన్న ఒత్తిళ్లు తగ్గించుకోవడానికి, నేతలను, సామాజికవర్గాలను సంతృప్తి పరిచే ందుకు మండలి ఒక సాధనంగా పనికొస్తుందంతే! నిజానికి చంద్రబాబు నాయుడు విపక్షంలో ఉన్నప్పుడు శాసనమండలి పునురుద్ధరణకు అంగీకరించలేదు. తాము వ్యతిరేకించినా మండలిని సాధించిన వైఎస్, రాష్ట్రానికి ప్రాజెక్టులు ఎందుకు సాధించలేకపోతున్నారంటూ వైఎస్‌పై ఎదురుదాడి చేశారు. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ సైతం మండలిని ఆరోవేలుగా అభివర్ణించేవారు.
వైఎస్ తెచ్చింది.. జగన్ మూసేస్తారా?
మండలి పునరుద్ధరణ కోసం మహానేత వైఎస్ అన్ని కష్టాలు పడితే.. ఆయన తనయుడైన జగన్ మాత్రం, అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండం చర్చనీయాంశంగా మారింది. తాజాగా రెండు బిల్లులను మండలి సెలెక్ట్ కమిటీకి పంపించడంతో తీవ్ర అసహనం, అవమానంగా భావించిన జగన్.. మండలి రద్దు కోసం మంత్రాంగం చేస్తున్నారన్న వార్తలు సహజంగానే చర్చకు దారితీశాయి. మండలిలో టిడిపి బలం ఎక్కువగా ఉండటమే దానికి కారణం. మంత్రి బొత్స వంటి నేతలు, వైసీపీకి మిత్రపక్షంగా ఉన్న మీడియా చానెళ్లు మండలి రద్దుపై విపరీతమైన లీకులు ఇస్తున్నాయి. అయితే, దానిపై జగన్ గానీ, చివరకు ఆయన సొంత మీడియా గానీ ఇప్పటివరకూ ప్రస్తావించకపోవడం బట్టి, ఇదంతా టిడిపి సభ్యులను బెదిరించే మైండ్‌గైమ్‌గానే భావించాల్సిన పరిస్థితి. ఎందుకంటే.. మండలిలో చర్చరోజు.. రాత్రి పదిగంటలకు క్యాబినెట్ భేటీ కాబోతోందని, అందులో మండలిని రద్దు చేస్తూ తీర్మానించనున్నారంటూ భారీ స్ధాయిలో లీకుల ప్రహసనం కొనసాగింది. కానీ, ఆరోజు క్యాబినెట్ మీటింగు పెట్టింది లేదు.
రద్దు చేస్తే జగన్‌పైనే ఒత్తిడి
నిజంగా, జగన్‌కు మండలి రద్దు చేసే ఆలోచన ఉందా? లేదా? లేక ఇదంతా టిడిపి సభ్యులను ఆ పార్టీ నుంచి బయటకు తీసుకువచ్చే మైండ్‌గేమా? అన్నది పరిశీలిస్తే.. ఇప్పటి పరిస్థితిలో రద్దు అంశం ఆయన పార్టీకే నష్టం.  మరో ఏడాదిన్నర తర్వాత మండలి అంతా వైసీపీతో సభ్యులతోనే నిండిపోతుంది. పైగా.. జగన్ వివిధ సందర్భాల్లో తన పార్టీ నేతలకు ఎమ్మెల్సీ పదవులిస్తానని హామీలిచ్చారు. అలాంటి వారి సంఖ్య సుమారు 100 మంది వరకూ ఉండవచ్చు. ఒక్క రాజధాని గుంటూరు జిల్లాలోనే మర్రి రాజశేఖర్, అప్పిరెడ్డి వంటి నేతలు అరడజను మంది ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఆ జాబితాలో మాజీ మంత్రి డొక్కా కూడా చేరారు. తాజాగా వైసీపీలో చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీతపై ఒకవేళ అనర్హత వేటు పడితే ఆమెకూ న్యాయం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రకారంగా జిల్లాలకు డజన్ల సంఖ్యలో ఆశావహులున్న క్రమంలో, మండలిని రద్దు చేసి, వ్యతిరేకత కొనితెచ్చునేంత పిచ్చివాడు జగన్ కాదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
టిడిపి ఎమ్మెల్సీలను దూరం చేసే మైండ్‌గేమేనా?
పైగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయంలో పదవులు పోయిన ఎమ్పెల్సీలతో పాటు, పదవుల ఆశపెట్టుకున్న వారంతా టికెట్లకు పోటీ పడి, టికెట్లు దక్కని వారు విభీషణుల అవతారమెత్తితే  అది పార్టీకి మరింత ప్రమాదం. అందుకే.. ఇప్పుడు టిడిపిలో ఉన్న ఎమ్మెల్సీలను డొక్కా మాదిరిగా ఆ పార్టీకి దూరం చేయడం ద్వారా, విపక్షాన్ని నిర్వీర్యం చేసి సర్కారు బిల్లులను ఆమోదించుకునే వ్యూహానికే, ఇకపై జగన్ పదును పెట్టవచ్చు. అప్పుడు వచ్చే ఏడాదిన్నరలో రానున్న మండలి ఎన్నికల్లో వైసీపీని పూర్తిస్థాయిలో మండలిలో నింపేయవచ్చు. అప్పటిదాకా… మండలి రద్దుపై హడావిడి, మిత్రపత్రికలతో లీకులతో లాగించడమే జగన్ అసలు లక్ష్యంగా కనిపిస్తోంది.