ఓటింగులో విజయం సరే.. పోయిన పరువు మాటేమిటి?

418

మంత్రులే విపక్షమైన వైచిత్రి
తెదేపాలో ఇద్దరు విభీషణులు
అసెంబ్లీ-కౌన్సిల్‌లో సీన్లు షేమ్ టు షేమ్

(మార్తి సుబ్రహ్మణ్యం)

నరాలు తెగే ఉత్కంఠ. నిమిష నిమిషానికీ ఊపిరి బిగపట్టుకుని, భారంగా శ్వాస తీసుకునేంత ఉద్వేగం. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియనంత ఆందోళన. ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేయడంతో, లోపల ఏం జరుగుతుందో తెలియక బయట ప్రపంచానికి ఉత్కంఠ.అందరి వాదనలు వింటున్న పెద్దమనిషి,చివరాఖరులో ఏం తీర్పు ఇస్తారోనన్న ఆత్రుత. ఇదంతా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కాదు. ఏపీ విధానమండలిలో మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగిన ఉత్కంఠ,ఉద్వేగభరిత సన్నివేశాలు.
 వికేంద్రీకరణ బిల్లును అడ్డుకునేందుకు శాసనమండలిలో అధికార వైసీపీపై తెలుగుదేశం పార్టీ సంధించిన రూల్ 71 అస్త్రం విజయవంతమయింది. రూల్ 71 తీర్మానంపై జరిగిన ఓటింగులో సర్కారుపై విపక్షం విజయం సాధించింది. ఇది విపక్షంలో ఉన్న టిడిపికి నైతిక స్థైర్యం ఇస్తే, అధికారపక్షంలో ఉన్న వైసీపీని నైతికంగా, సాంకేతికంగా గాయపరిచింది. ఉదయం నుంచి రాత్రి వరకూ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తూ, అంతకుమించి….నరాలు తెగే ఉత్కంఠ రేపిన శాసనమమండలిలో జరిగిన బిల్లులపై చర్చ వ్యవహారంలో ఒకరు గెలిచి, మరొకరు ఓడిన మాట అటుంచితే, పోయిన శాసనమండలి పరువును ఎవరు తెచ్చిస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
మంత్రులే ప్రతిపక్షమైన వేళ..
మండలి ప్రారంభం నుంచి రాత్రి ఓటింగుతో ముగిసేంతవరకూ జరిగిన ఘటనలు, చూసిన దృశ్యాలు ప్రజాస్వామ్యానికి ఏమాత్రం శోభనివ్వవు. స్వయంగా మంత్రులే ప్రతిపక్ష సభ్యుల మాదిరిగా చైర్మన్‌ను చుట్టుముట్టి, సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించడం చరిత్రలో మున్నెన్నడూ చూసి ఉండరు. అసెంబ్లీలో వైసీపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నందున, సర్కారు అనుకున్నవన్నీ సజావుగా సాగిపోవడం సహజం. దానికి కారణం మెజారిటీ. ప్రజాస్వామ్యంలో మెజారిటీనే కదా ప్రాతిపదిక! కాబట్టి తాను అనుకున్నది చేసుకుంటున్న అధికార పార్టీ ప్రతిపక్షాన్ని బుల్‌డోజ్ చేస్తోందని, ప్రజాస్వామ్యాన్ని మంటకలుపుతోందని, స్పీకర్ అధికార పార్టీ తొత్తులా మారారని యాగీ చేయడం ప్రతిపక్షాల  నైజం. ఇది కొన్నేళ్ల నుంచీ అసెంబ్లీ వ్యవహారాలు చూస్తున్న వారికి తెలిసిందే. కానీ, అదే అధికార పార్టీ, తనకు బలం లేని చోట కూడా తన మాటే చెల్లాలనుకుని, ఆ క్రమంలో సభాధ్యక్షుడిపై ఆరోపణలు చేయడం అనైతికం. మంగళవారం నాటి మండలి దృశ్యాలు  ఇవే తలపించాయి.
ఎక్కడైనా మెజారిటీనే ప్రాతిపదిక
అసెంబ్లీలో పూర్తి మెజారిటీ ఉన్న వైసీపీకి మండలిలో మెజారిటీ లేదు. ఆ పార్టీ బలం కేవలం తొమ్మిది. మరి అక్కడ విపక్షమైన టిడిపిదే పైచేయి. కాబట్టి, బిల్లులు వగైరాలన్నీ మెజారిటీ ప్రాతిపదికనే కొనసాగుతాయి. రూల్ 71పై జరిగిన తీర్మానం, ఓటింగూ దానినే స్పష్టం చేసింది. రూల్ 71పై  నిర్వహించిన ఓటింగులో ప్రభుత్వం ఓడిపోయి, ప్రతిపక్షం గెలిచింది. జగన్ అధికారంలోకి వచ్చిన ఆయనకు చట్టసభలో ఎదురైన తొలి ఓటమి ఇది. కాబట్టి అవమానభారం ఎదురుకాకుండా ఎదురుదాడి చేయడం సహజం. కానీ, ఆ క్రమంలో సభా విలువలను విస్మరించడమే విమర్శలకు తావిస్తుంది. సభలో 14 మంది మంత్రులు తిష్టవేసి, సభకు సుప్రీం అయిన చైర్మన్‌ను చుట్టి ముట్టి, ప్రతిపక్ష సభ్యుల్లా వ్యవహరించడమే విస్మయకరం.
అసెంబ్లీలో అబద్ధమైతే..మండలిలో నిజమా?
 సభా నిబంధనల ప్రకారం.. రూల్ 71పై నోటీసు ఇచ్చే అధికారం విపక్షానికి ఉంది. అయితే దానికి తగినంత సంఖ్యాబలం అవసరం ఉంది. ఆ బలం సభలో టిడిపికి ఉంది. ఒకసారి చైర్మన్ దానిని అనుమతిస్తూ రూలింగ్ ఇచ్చిన తర్వాత, ఇక ఏ అంశంపై చర్చించే అవకాశం లేదు. ఇది ఇప్పటి సంప్రదాయం కాదు. కాకపోతే అమలు చేశారంతే! కొత్తగా మంత్రులైన వారంటే వారికి నిబంధనలపై పెద్దగా అవగాహన లేదనుకోవచ్చు. కానీ, సీనియర్ సభ్యుడైన మంత్రి సత్తిబాబు కూడా నిబంధనలు తెలిసీ, చైర్మన్‌పై నిందలు వేయడమే ఆశ్చర్యకరం. చైర్మన్ ప్రతిపక్షం చెప్పినట్లల్లా వ్యవహరిస్తున్నారని, మండలి చంద్రబాబు కనుసన్నలలో నడుస్తోందని బొత్స సహా మంత్రులు ఆరోపించడం సహేతుకమేనా?  మరి.. ఇలాంటి ఆరోపణలే అసెంబ్లీ స్పీకర్‌పై వస్తుంటే మంత్రులు దానికేం జవాబిస్తారు? అసెంబ్లీ కూడా జగన్ కనుసన్నలలో నడుస్తోందన్న విపక్షాల ఆరోపణలు ఒకవేళ నిజమనుకుంటే, మండలిపై మంత్రులు చేసిన ఆరోపణలూ నిజమనుకుని తీరాలి మరి!
మండలి చైర్మన్‌కు ఏదీ మర్యాద?
అసెంబ్లీలో స్పీకర్‌కు ఎన్ని అధికారాలున్నాయో, మండలిలో చైర్మన్‌కూ అన్ని అధికారులున్నాయి కదా? అసలు మండలి చైర్మనే ప్రొటొకాల్‌లో ముందుంటారు. కాకపోతే రాష్ట్రాలలో అసెంబ్లీ వైపే ఫోకస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవేమి పట్టవు. అసెంబ్లీ స్పీకర్‌పై విపక్షాలు చేసే ఆరోపణలను తిప్పికొట్టి, వారితో క్షమాపణకు డిమాండ్ చేసే అదే మంత్రులు.. మరి మండలికి వెళ్లి  చైర్మన్‌ను చుట్టుముట్టడం ఎలాంటి సంప్రదాయమో వారికే ఎరుక? ఇక సభా వ్యవహారాలు ప్రత్యక్ష ప్రసారాలు కాకుండా, కనీసం చైర్మన్‌కూ తెలియకుండా వాటిని నిలిపివేయడం బట్టి.. చైర్మన్‌కు ఎంత విలువ ఇస్తున్నారో స్పష్టమవుతోంది. అన్ని చానెళ్లనూ అనుమతించాలని గతంలో చైర్మన్ ఇచ్చిన రూలింగుకే విలువ లేకపోతే, ఇక ఆయన తాజా రూలింగుకు స్పందన ఉంటుందని ఆశించడం అవివేకం.
మధ్యలో తెలుగుదేశం విభీషణుల దూకుళ్లు
ఇంత రసవత్తర, ఉత్కంఠ భరిత వాతావరణంలో జరిగిన ఓటింగులో ఇద్దరు విపక్ష ఎమ్మెల్సీలు విభీషుల అవతారం ఎత్తడం కొత్త మలుపు.  పోతుల సునీత, శివనాగిరెడ్డి రూల్ 71కు వ్యతిరేకంగా ఓటు వేశారన్న విషయం తెలిసిన తెదేపాయులు నోరెళ్లబెట్టారుట. మరో ఐదుగురు ఎమ్మెల్సీలు అసలు సభకు రాకుండా ముఖం చాటేస్తే, సభలో ఉన్న ఇద్దరు సర్కారుకు పరోక్షంగా జైకొట్టడం, లోకేష్‌కు సలహాదారుగా ఉన్నారనుకున్న డొక్కా మాణిక్యవరప్రసాద్ అయితే.. రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం  పెద్ద వింతేమీ కాదన్నది, అంతకుముందు లాబీల్లో వైసీపీయులు ఆడిన మైండ్‌గేమ్ బట్టి అర్ధమవుతుంది. ప్రభుత్వం కౌన్సిల్‌ను రద్దు చేస్తుందని, అప్పుడు మీరంతా మాజీలవుతారంటూ చేసిన హెచ్చరికలు వారిపై ప్రభావం చూపించి ఉండవచ్చు. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్సీలు సర్కారుతో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో టిడిపి కూడా వైసీపీ విషయంలో ఇలాంటి ఆటనే ఆడింది కాబట్టి, ఇప్పటి వైసీపీ తీరును తప్పుపట్టలేం.
పెద్దల సభ చిన్నబోయింది!
నిజానికి శాసనవ్యవస్థలో శాసనసభ వేరు. శాసనమండలి వేరు. ఎవరి అధికారాలు వారివే. అసెంబ్లీ/పార్లమెంటులో ఒకలా, మండలి/రాజ్యసభలో మెజారిటీ మరోలా ఉంటే పరిస్థితులు ఇంతకు భిన్నంగా ఉండవు. పార్లమెంటులో దండిగా మెజారిటీగా ఉన్న బిజెపికి, రాజ్యసభలో బలం లేదు. కాబట్టి మిత్రపక్షాలు, రహస్య మిత్రుల సాయంతో ఎప్పటికప్పుడు బయటపడుతుండాల్సిందే. ఇప్పుడు జరుగుతున్నదీ అదే. అలాగని కేంద్రమంత్రులు రాజ్యసభకు వచ్చి (ఏపీలో మంత్రులు మండలికి వచ్చినట్లు), తాము అనుకున్న బిల్లును ఆమోదించాలి,  లేదా ముందు తమ బిల్లులపై చర్చించాలని రాజ్యసభ చైర్మన్ మెడపై కత్తిపెట్టి ఒత్తిడి చేయలేరు. మెజారిటీ నిరూపించుకుని బిల్లు ఆమోదించుకోవలసిందే.  అలాంటి విచిత్ర సంప్రదాయం సరికొత్తగా ఏపి శాసనమండలిలో దర్శనమిచ్చింది. వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టేందుకు ఉదయం నుంచి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు.. రాత్రి ఓటింగులో విపక్షం విజేతగా నిలిచి, సభ వాయిదా పడేంతవరకూ జరిగిన సంఘటనలు, దర్శనమిచ్చిన దృశ్యాలు పరిశీలిస్తే.. హుందాగా, ఒకరికి ఆదర్శంగా  ఉండాల్సిన  పెద్దల సభ, ఈ స్థాయిలో చిన్నబోవడం ప్రజాస్వామ ప్రియులను సిగ్గుతో తలవాల్చేలా చేసింది. సెలవింక డెమోక్రసీ సిరిసిరిమువ్వ!