జగడాల సమయంలో జగన్ ‘కమ్మ’టి కబుర్లు

595

తమకూ కమ్మనేతలు ఉన్నారన్న వాదన
ఆ రెండు జిల్లాలపై జగన్ కుల అస్త్రం
‘కమ్మదనం’ గొప్పతనంపై అసలు వ్యూహం అదేనా?
కొడాలి ప్రసంగంలో బయటపడిన వాస్తవాలు

(మార్తి సుబ్రహ్మణ్యం)

కమ్మ సామాజికవర్గ ప్రాబల్యం, ప్రభావం ఎక్కువగా ఉన్నందుకే ఏపీ సీఎం జగన్ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మారుస్తున్నారు. రాజధానికి భూములు ఎక్కువగా ఇచ్చిన వారిలో కమ్మ వారే ఎక్కువగా ఉన్నందున, వారికే ఎక్కువ లబ్థి జరిగింది కాబట్టి రాజధానిని మారుస్తున్నారు. రాజధాని  ఉద్యమంలో కూడా వారే ఎక్కువగా పాల్గొంటున్నారు. గుంటూరు-కృష్ణా జిల్లాల్లో ఆ కులం వారి ఆధిపత్యం ఎక్కువ కాబట్టే, బీసీలు ఎక్కువగా ఉండే విశాఖకు రాజధానిని మారుస్తున్నారు. ఇదీ.. రాజధాని తరలింపు వ్యవహారంలో  ఇప్పటి వరకూ వినిపిస్తున్న చర్చలు, ఆరోపణలు, అనుమానాలు. గతంలో కర్నూలును రాజధానిగా కొనసాగిస్తే అక్కడ రెడ్ల ప్రాబల్యం ఉంటుందని, విజయవాడలో రాజధానిగా ఏర్పాటుచేస్తే అక్కడ కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుందన్న కుల సమీకరణతోనే.. హైదరాబాద్ రాష్ట్రంలో  విలీనం చేసి, ఆంధ్రప్రదేశ్ చేసినట్లు… ఇప్పుడు జగన్ కూడా, కమ్మ ప్రాబల్యం ఉన్నందుకే గుంటూరు జిల్లాలో ఉన్న రాజధానిని.. బీసీలు ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్రకు తరలిస్తున్నారన్నది మరో కుల విశ్లేషణ .
జగన్ మౌనవ్రతం
ఎవరెన్ని ఆందోళనలు చేసినా, ఎవరెంత అడ్డుకున్నా ఏపీ సీఎం జగన్ చివరాఖరకు తాను చేయాల్సింది చేశారు. గత రెండు నెలల నుంచి రాజధాని తరలింపుపై విపక్షాలు ఎంత గొంతు చించుకున్నా, జగన్ సీఎంగా వాటి గురించి అసలు పెదవి విప్పలేదు. చివరకు ఆయన సొంత మీడియాలో కూడా చిన్న ముక్క కూడా రాకుండా జాగ్రత్త పడ్డారు. కాగల కార్యాన్ని సచివులే కానిచ్చేశారు. కావలసినన్ని లీకులు ఇచ్చేశారు. బహుశా… ఇంత పెద్ద సమస్యపై ఒక్కసారి కూడా మీడియాతో మాట్లాడని ఏకైక సీఎం జగనే కావచ్చు. అయితే.. సీఎం అన్నంత మాత్రాన, ప్రతిదీ మీడియా ముందుకొచ్చి మాట్లాడాలన్న రూలేం లేదనుకోండి. అది వేరే విషయం. తెలంగాణ  రాష్ట్ర  సీఎం కేసీఆర్,  అవసరమైనప్పుడు మాత్రమే మీడియాముందుకొస్తుంటారు. తమిళనాటయితే ప్రెస్‌నోట్లలో సీఎంలను చూసుకోవాల్సిందే. ఇది కూడా చదవండి… సీఎం మాట్లాడాలని రూలుందా?
కొడాలితో కదనం..
రాజధాని తరలింపు వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి కులం వైపు మళ్లడం ఆసక్తికరంగా మారింది.  గత ఎన్నికల్లో 40 శాతం కమ్మ వర్గీయులు స్థానిక కారణాలతో తన పార్టీకి ఓటేసిన వైనం, బయటకు వెల్లడించకపోయినా సొంత పార్టీలోని కమ్మ వర్గం కూడా తనపై అసంతృప్తిగా ఉన్నారన్న విషయాన్ని జగన్ గ్రహించినట్లున్నారు. నిజానికి గత ఎన్నికల ముందే కమ్మ వారిని తన పార్టీలోకి వ్యూహాత్మకంగా తీసుకువచ్చి, తనకూ కమ్మ వర్గం మద్దతు ఉందని సంకేతాలిచ్చారు. అందుకే జగన్ తాజాగా.. తాను కమ్మ కులానికి, వారి ప్రభావం ఎక్కువగా ఉన్న గుంటూరు-కృష్ణా జిల్లాలకు ఏమాత్రం వ్యతిరేకం కాదన్న వాదనతో ఆ వర్గంలో తనపై ఉన్న కోపం తగ్గించి, వారిని మెప్పించే ప్రయత్నాలు చేసినట్లు అసెంబ్లీలో ఆయన ప్రసంగం కనిపించింది. కమ్మ వర్గానికే చెందిన తన ప్రధాన అనుచరుడైన మంత్రి కొడాలి నాని గురించి, జగన్ ప్రత్యేకంగా ప్రస్తావించడం కూడా వ్యూహాత్మకంగానే కనిపించింది.ఎందుకంటే కొడాలి నాని తొలి నుంచీ జగన్‌కు గట్టి మద్దతుదారు.కమ్మవారయినంతమాత్రాన కమ్మవాళ్లంతా టిడిపిలో ఉండాలా? అని బాహాటంగానే ప్రశ్నించిన నేత కొడాలి. రాజధాని తరలింపు అంశంలో వస్తున్న ఆరోపణలు, ఆందోళనల సమయంలో కూడా జగన్ వ్యూహాత్మకంగా కొడాలినే ముందుంచి ఎదురుదాడి చేయించారు.రాజధాని తరలిపోతున్న తమ పార్టీ విశాఖ ఎంపీ కూడా.. కమ్మ వర్గానికి చెందిన వారేనని జగన్ చెప్పడం కూడా, ఆ వర్గంలో తనపై ఉన్న కోపాన్ని తగ్గించే ప్రయత్నం మాదిరిగానే కనిపించింది. తనకు గుంటూరు-కృష్ణా జిల్లాలపై వ్యతిరేకత ఉందన్న విమర్శలకు తెరదించేందుకు.. తన మేనత్తను కృష్ణా జిల్లాకే ఇచ్చారని, తన సినిమా థియేటర్లు బెజవాడలోనే ఉన్నాయని చెప్పడంతోపాటు.. తనకు కోపం ఉంటే అమరావతిలోనే శాసన రాజధానినిఎలా కొనసాగిస్తానన్న లాజిక్‌ను  తెరపైకి తీసుకువచ్చారు. అంతేనా? రైతులకు కౌలు పెంచి, దానిని మరికొన్నేళ్లు పొడిగించి ఆర్ధిక ప్రయోజనం చేకూర్చడం  వల్ల.. వారిలో తనపై ఉన్న కోపం తగ్గించాలన్న ఆయన ప్రయత్నం కనిపిస్తూనే ఉంది.
 విశాఖకూ ‘కమ్మ’టి కబురేనట
ఇలా ఓ వైపు కమ్మ సామాజికవర్గం, గుంటూరు-కృష్ణా జిల్లాలపై తనకు కోపం లేదన్న వాదనను వినిపిస్తూనే, అదే కులానికి చెందిన మంత్రి కొడాలితో.. తాను తరలించనున్న విశాఖ నగరంలో  కమ్మ వారికి ఏయే వ్యాపారాలున్నాయి? ఏయే రంగాలను వారు శాసిస్తున్నారనే జాబితాను సభలోనే చదివి వినిపించడం ద్వారా,  అన్ని రంగాల్లోనూ కమ్మ వారున్నారన్న విషయాన్ని చెప్పకనే చెప్పించడం మరో విశేషం. మంత్రి కొడాలి తన కమ్మ సామాజికవర్గానికి విశాఖలో ఎన్ని హోటళ్లున్నాయి? ఎన్ని సినిమా థియేటర్లున్నాయి? అన్న వివరాలు వెల్లడించారు. విశాఖలో కూడా కమ్మ వారి ఆధిపత్యమే ఉంది కాబట్టి కమ్మసోదరులెవరూ ఆందోళన చెందవద్దని, జగన్ కమ్మ వారిని నాశనం చేయడానికి రాజధానిని మార్చడం లేదని కొడాలితో చెప్పించడం ఆసక్తికరం. ‘మా కులం వారికి  వైజాగ్‌లో చాలా ఫైర్‌స్టార్ హూటళ్లున్నాయి. రామోజీరావు డాల్ఫిన్ హోటల్ మాదే. నొవాటెల్ మాదే. దసపల్లా మాదే. గ్రాండ్ వే మాదే. హీరో హోండా, హుండాయ్  షోరూములు మావే. వాటిలో పెద్దపెద్దవాళ్లున్నారు. మాకూ ఉన్నాయి. 50 శాతం థియేటర్లు మావే. స్టూడియోలు మావే. 50 నుంచి 80 శాతం వ్యాపారాలు మావే. లోకేష్ తోడల్లుడికి చెందిన గీతం యూనివర్శిటీ మాదే. కాబట్టి జగన్‌మోహన్‌రెడ్డి ఏదో కమ్మ వాళ్లను నాశనం చేయడానికే విశాఖకు రాజధానిని తరలిస్తున్నారని,  కమ్మ సోదరులు ఆందోళన చెందవద్దు. కమ్మ సోదరులు ఎక్కడున్నా వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకోవచ్చు అధ్యక్షా’ అని విశాఖలో కమ్మ వారి ప్రాబల్యం ఏమిటన్నది స్పష్టం చేశారు. దీనిద్వారా.. రాజధాని తరలింపుపై ఆందోళనతో ఉన్న, సగటు కమ్మ వారిని సంతృప్తిపరిచే ప్రయత్నం చేసినట్లు స్పష్టమవుతోంది.
విశాఖలో అంతా వలస నేతలే

నిజానికి కొడాలి నాని చెప్పినట్లు.. విశాఖలో దాదాపు లక్షమంది కమ్మ సామాజికవర్గ ఓట్లున్నట్లు 2014 ఎన్నికల నాటి అంచనా. వారంతా ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి కొన్ని దశాబ్దాల క్రితమే విశాఖకు వలస వెళ్లి, విశాఖ-విజయనగరం చుట్టుపక్కల పొలాలు కొనుగోలు చేశారు.  అసలు విశాఖలో చాలామంది ప్రజాప్రతినిధులు వలస వెళ్లి గెలిచిన వారే. ద్రోణంరాజు ఒక్కరే అందుకు మినహాయింపు. ఇప్పటి వైసీపీ ఎంపి సత్యనారాయణ, దివంగత ఎంపి ఎంవిఎస్ మూర్తి తూర్పు గోదావరి జిల్లా వాసులే. మాజీ మంత్రి  గంటా శ్రీనివాసరావు, మాజీ ఎంపి కంభంపాటి హరిబాబు, పురంధీశ్వరి (ప్రకాశం),  సుబ్బరామిరెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి (నెల్లూరు), యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, వెలగపూడి రామకృష్ణ (కృష్ణా) కూడా విశాఖకు వలసదారులే. రాష్ట్రంలో ఉన్న అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తల్లో ముప్పావు శాతం విశాఖకు చెందిన వారే కాగా, అందులో కమ్మ సామాజికవర్గానికి చెందిన వారి సంఖ్యనే ఎక్కువ. ఈ విషయంలో కృష్ణా జిల్లా కమ్మ వారిది రెండో స్థానమే. కాబట్టి.. కొడాలి నాని చెప్పినట్లు, విశాఖ రాజధానిగా తరలివెళ్లినా అక్కడే తమ సామాజికవర్గం వారిదే హవా అని కమ్మ వర్గం సంతోషించాలేమో?!