కౌన్సిల్‌పై షరీఫ్ మార్కు ముద్ర

332

నిబంధనలకే మండలి చైర్మన్ పెద్దపీట
రూల్ 71తో సర్కారుకు ఇరకాటం
అసెంబ్లీలో స్పీకర్, మండలిలో చైర్మన్లే బాసులు
రాజధాని మార్పునకు  మండలి మోకాలడ్డు
టిడిపి వ్యూహాత్మక నిర్ణయం
మండలి రద్దు అంత వీజీ కాదు

( మార్తి సుబ్రహ్మణ్యం)

వైసీపీ సర్కారుకు చట్టసభలో తొలి దెబ్బ. శాసనమండలి చైర్మన్ షరీఫ్ తనదైన ముద్ర వేసి, నిబంధలకే జై కొట్టడంతో వికేంద్రీకరణ బిల్లు మండలిలోనే నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. మండలిలో మెజారిటీ ఉన్న టిడిపి అకస్మాత్తుగా రూల్ 71ను తెరపైకి తీసుకురావడంతో  వైసీపీ ఖంగుతినాల్సి వచ్చింది. ఫలితంగా సర్కారు తలపెట్టిన వికేంద్రకరణ బిల్లు వెనక్కివెళ్లే పరిస్థితి ఏర్పడింది.
సర్కారుకు మోకాలడ్డిన షరీఫ్
ఏపీ మండలి చైర్మన్ షరీఫ్ చాలా మృదుస్వభావి. వివాదాల జోలికి వెళ్లరు. అసెంబ్లీలో వైసీపీకి బలం ఉన్నా, మండలిలో మాత్రం టిడిపిదే ఆధిక్యం. అయినా మంత్రులు మండలి చైర్మన్‌పై ఎన్ని ఒత్తిళ్లు తీసుకువస్తున్నా, ఆయన పాలక పార్టీని ఖాతరు చేయడం లేదు. సుదీర్ఘ కాలం నుంచీ రాజకీయాల్లో ఉన్న షరీఫ్, మండలిలో రూల్స్ ప్రకారమే సభ నిర్వహిస్తున్నారు. అయితే, అసెంబ్లీలో ఉన్న 151 మంది ఎమ్మెల్యేల మద్దతుతో వికేంద్రీకరణ బిల్లును నెగ్గించుకున్న వైసీపీ, మండలిలోనూ తన ఆధిపత్యం చూపించేందుకు చేసిన ప్రయత్నాలు ైచె ర్మన్ షరీఫ్ నిర్ణయం వల్ల నీరుగాయిపోయాయి. దీనితో మంత్రులు సహనం కోల్పోయి వారే చైర్మన్ పోడియం వద్దకు వెళ్లిన అరుదైన దృశ్యాలకు మండలి వేదిక కావడం విశేషం.
టిడిపి వ్యూహాత్మక నిర్ణయంతో కొత్త మలుపు
మండలిలో వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి బుగ్గన ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదు ఎదురయింది. బిల్లుపై చర్చకు అనుమతిస్తే వ్యవహారం వైసీపీ సర్కారు చేతిలోకి వెళుతుందని,  ముందే ఊహించిన టిడిపి పక్ష నేత యనమల రామకృష్ణుడు.. ఎవరూ ఊహించని రీతిలో రూల్ 71ను తెరపైకి తెచ్చారు. ముందుగానే రూల్ 71పై నోటీసు ఇవ్వడం, దానిని చైర్మన్ షరీఫ్ నిబంధనల ప్రకారం అనుమతించడం జరిగిపోయాయి. ఈవిధంగా రూల్ 71పై నోటీసు ఇవ్వడం ఇదే తొలిసారి. అయితే, దీనిపై మంత్రులు బొత్స, బుగ్గన చైర్మన్ నిర్ణయాన్ని తప్పు పట్టారు. చైర్మన్ రాజకీయ కోణంలో నిర్ణయాలు తీసుకోకూడదని, ఇలాగైతే ప్రభుత్వ నిర్ణయాలు ఆగిపోతాయని, అది మంచి సంప్రదాయం కాదని చైర్మన్ నిర్ణయాన్ని తప్పు పట్టే ప్రమయత్నం చేశారు. అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేనిని విపక్ష టిడిపి ఎలాగైతే విమర్శిస్తుందో, మండలిలో అధికార వైసీపీ అదే విమర్శలను చైర్మన్ షరీఫ్‌పై చేయడం ప్రస్తావనార్హం.
ఒత్తిళ్లకు లొంగకుండా నిబంధలనకే షరీఫ్ పెద్దపీట
అయితే, తనకు రాజకీయాలతో సంబంధం లేదని, నిబంధనల ప్రకారం రూల్ 71పై తీర్మానానికి  అనుమతించానని స్పష్టం చేశారు. నిజానికి షరీఫ్ టిడిపి ఎమ్మెల్సీ నుంచి మండలి చైర్మన్ అయిన తర్వాత ఒక్కసారి కూడా టిడిపి ఆఫీసుకు గానీ, స్పీకర్ తమ్మినేని మాదిరిగా పార్టీ కార్యక్రమాలకు హాజరయి, విపక్షాలను విమర్శించిన దాఖలాలు గానీ లేవు. దివంగత నేత కోడెల శివప్రసాదరావు స్పీకర్ అయిన తర్వాతనే స్పీకర్లు అధికార పార్టీని బహిరంగంగా సమర్ధిస్తూ మాట్లాడం, తాము ఎన్నికయిన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే సంప్రదాయం మొదలయంది. గతంలో కోడెల ఆవిధంగానే వ్యవహరించిన సందర్భాల్లో వైసీపీ దానిని ఆక్షేపించింది. ఇప్పుడు స్పీకర్ తమ్మినేని సీతారాం అదే విధానం కొనసాగిస్తున్న నేపథ్యంలో,  దానిని ఇప్పటి విపక్షమైన టిడిపి విమర్శిస్తోంది.
 అయితే, మండలి చైర్మన్ షరీఫ్ టిడిపి నుంచి వచ్చినప్పటికీ, పార్టీకి దూరంగానే ఉంటు, స్వతంత్ర వైఖరి కొనసాగిస్తు అందరికీ ఆదర్శంగా నిలిచారు. తాజా రూల్ 71 నోటీసుపైనా ఆయన మెజారిటీ ఎమ్మెల్సీల అభిప్రాయాలనే పరిగణనలోకి తీసుకున్నారు. నిజానికి రూల్ 71పై తీర్మానానికి 20 మంది మద్దతు ఉండాలి. ఆ నిబంధన ప్రకారమే చైర్మన్ షరీఫ్ దానికి ఎంతమంది మద్దతునిస్తున్నారని ప్రశ్నించగా, 30 మంది ఎమ్మెల్సీలు మద్దతునిస్తున్నట్లు ప్రకటించారు. దానితో చైర్మన్ తీర్మానానికి అనుమతించారు. ఆ ప్రకారంగా.. మండలిలో పాలకపార్టీ కంటే విపక్షమైన టిడిపికే బలం ఉన్నట్లు తేలింది. మండలిలో టిడిపికి 34 మంది, వైసీపీకి 9 మంది, పిడిఎఫ్‌కు 6, స్వతంత్రులు ముగ్గురు, బిజెపికి ఇద్దరు, కాంగ్రెస్‌కు ఒక ఎమ్మెల్సీ బలం ఉంది.
 సర్కారు తపనకు అసలు కారణం ఇదీ..

మండలిలో వికేంద్రీకరణ బిల్లు ముందుగా ప్రవేశపెట్టడం ద్వారా, బిల్లు పెట్టి అది ఒకవేళ వీగిపోతే.. దానిని డీమ్డ్ టు పాస్డ్ కింద ఆమోదించుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అయితే అసలు బిల్లే ప్రవేశపెట్టకపోతే అలాంటి అవకాశం ప్రభుత్వానికి ఉండదు. ఈ సాంకేతికపరమైన వ్యవహారాన్ని గుర్తించిన తర్వాతనే తెలుగుదేశం ముందుగానే రూల్ 71పై తీర్మానం ప్రవేశపెట్టింది. నిబంధల ప్రకారం..చైర్మన్ ఒకసారి దానిపై రూలింగ్ ఇచ్చిన తర్వాత, ఇక ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉండదు. ఆ రకంగా.. మండలిలో వికేంద్రీకరణ బిల్లుకు విపక్షం చెక్ పెట్టిన ట్టయింది. స్వయంగా సభ్యులను నియంత్రించాల్సిన మంత్రులే, చైర్మన్‌తో వాగ్వాదానికి దిగడం ప్రస్తావనార్హం. దీన్ని బట్టి సర్కారు వికేంద్రీకరణ బిల్లుపై ఏ స్థాయి ఆందోళనతో ఉందో స్పష్టమవుతోంది.
మండలి రద్దు అంత వీజీ కాదు
ఒకవేళ మండలిలో వికేంద్రీకరణ బిల్లు వీగిపోతే,  మండలిని రద్దు చేయాలని భావిస్తున్న వైసీపీ సర్కారు ప్రయత్నాలపై చర్చ జరుగుతోంది. సర్కారు అనుకున్నట్లు మండలి రద్దు వెంటనే కుదిరేపని కాదని, దానిని పార్లమెంటు ఆమోదించాల్సి ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దానికి సుమారు ఏడాది సమయం పడుతుందని చెబుతున్నారు. గతంలో ఎన్టీఆర్ వల్ల రద్దయిన మండలిని పునరుద్ధరించడానికి, వైఎస్‌కు చాలా ఏళ్లు పట్టింది. కంతేటి సత్యనారాయణరాజును ఢిల్లీలోనే ఉంచి, నాటి హోంమంత్రి షిండే కార్యాలయంపై ఒత్తిడి తెచ్చిన ఫలితంగా, మండలి మళ్లీ పునరుద్ధరించబడింది