చంద్రబాబు విజన్‌ 2020 ఒక 420 విజన్‌:రోజా

392
టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు విపక్షనేతనా.. లేదంటే 29గ్రామాలకు మాత్రమే విపక్ష నేతనా? అంటూ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.అమరావతి అనే భ్రమలో ప్రజలను మోసంచేసి కేవలం గ్రాఫిక్స్‌తోనే ఐదేళ్లు కాలంగడిపారని మండిపడ్డారు. చంద్రబాబు విజన్‌ 2020 ఏంటో అమరావతి కుంభకోణంతోనే తేటతెల్లమైందని రోజా అన్నారు. చంద్రబాబుది 420 విజన్‌ అని ఎద్దేవా చేశారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన చట్టసభలను అడ్డుకోవడం, అల్లర్లు సృష్టించడమే చంద్రబాబు విజనా? అని ఆమె ప్రశ్నించారు. కేవలం 20 మంది శాసనసభ్యులతో.. 20 గ్రామాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళగిరిలో వేలకోట్ల ఖర్చుపెట్టినా తన కుమారుడు నారా లోకేష్‌ను గెలిపించుకోలేకపోయారని, ఇంతకంటే రెఫరెండమ్‌ ఇంకేముంటుందని వ్యాఖ్యానించారు. సీఎంగా ఉండి అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరుతో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని విమర్శించారు. చంద్రబాబు ప్రతిపక్షనేతనా లేక పనికిమాలిన నేతనా అని రోజా నిలదీశారు. కూకట్‌పల్లి నుంచి మహిళలను తీసుకొచ్చి నిరసనలు చేయిస్తున్నారని ఆరోపించారు. తల్లి తన బిడ్డలను సమానంగా చూసినట్లుగానే.. జగన్‌ మూడు ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు.పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ నుంచి ఎందుకొచ్చారని రోజా ప్రశ్నించారు.అమరావతిలో ఒక్క శాశ్వత భవనమైనా నిర్మించారా? అని నిలదీశారు. ఏ అనుభవం ఉందని నారాయణ అధ్యక్షతన కమిటీ వేశారని రోజా ప్రశ్నించారు. అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలకు రెండు బాత్‌రూమ్‌లేనా? అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్నో ప్రలోభాలు పెట్టినా.. తడిగుడ్డలో చెప్పు పెట్టి కొట్టినట్టుగా ప్రజలు ఓడించారని రోజా పేర్కొన్నారు.40 ఏళ్ల కుర్రాడు వేసిన దెబ్బకు.. చంద్రబాబు జోలె పట్టి అడుక్కుతింటున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై చంద్రబాబు ఏనాడైనా జోలె పట్టారా? అని రోజా ప్రశ్నించారు.ఐదేళ్ల పాటు మహిళలు ఎన్నో బాధలు పడినప్పుడు.. ఈ మహిళలు ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆడదానికి రక్షణ కల్పించలేదని రోజా విమర్శించారు.