కుడితిలో పడ్డ కమలసేన !

325

బిజెపి హెచ్చరికలు జగన్ బేఖాతర్
అనుకున్నదే చేసిన వైసీపీ సర్కారు
అయితే.. మోదీకి చెప్పే చేశారన్నది నిజమేనా?
ఏపీపై బిజెపి డబుల్‌గేమ్?
కమలం.. కింకర్తవ్యం? 

(మార్తి సుబ్రహ్మణ్యం)

నవ్యాంధ్రలో కమలసేన పరిస్థితి కుడితిలో పడ్డట్టయింది. బిజెపి రంగంలోకి దిగింది కాబట్టి రాజధాని మార్పు విషయంలో, జగన్ ధైర్యం చేయకపోవచ్చనుకున్న వారి అంచనాలు తలకిందులయ్యాయి. జగన్ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని తూనా బొడ్డు అని.. తాను అనుకున్నదే అమలు చేసి, ‘ఆడు.. మగాడ్రా బుజ్జీ!’  అనిపించుకున్నారు. మరి శాసన రాజధానిని అమరావతిలోనే ఉంచాలన్న బిజెపి రాష్ట్ర కమిటీ తీర్మానం, అక్కడ నుంచి అరడుగు కూడా రాజధానిని తరలించరలేరన్న నేతలు చేసిన పత్రికా ప్రకటనలు బజ్జీ పొట్లాలు కట్టుకోవడానికేనా? అంటే.. రాజధాని మార్పు గురించి ప్రధానికి సీఎం జగన్ చెప్పే చేస్తున్నారంటూ వచ్చిన వార్తా కథనాలు నిజమేనా? మరిప్పుడు ఏం చేయాలి? కమలసేన పోరాటం ఎవరిమీద చేస్తుంది? పాపం.. పవన్ కల్యాణ్ ఘీంకారాలు ఇక ఎవరిపై చేస్తారు? కమలానికి దొరకక దొరకక దొరికిన లడ్డూ లాంటి సమస్య చేజారిపోయిందే!? మరిప్పుడు బిజెపి రాష్ట్ర కమిటీ తీర్మానం మాటేమిటి?.. ఇవీ తెరపైకొచ్చిన ప్రశ్నలు.
నాడు సోనియా.. నేడు మోదీని ఖాతరు చేయని జగన్
అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పదిమంది నేతల్లో,  ఒకరిగా ఉన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీనే లెక్కచేయని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి… ఇప్పుడు దేశంలోనే అత్యంత బలమైన బిజెపిని కూడా బేఖాతరు చేశారు. స్వయంగా మోదీ శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చి, దేశాన్ని కంటిచూపుతో శాసించే బిజెపినే అవమానించి, తాను కుమారస్వామి లాంటి బలహీనుడిని కాదని చాటి చెప్పారు. రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మార్చుతూ అసెంబ్లీలోనే తీర్మానం ఆమోదించారు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీల బలంతో.. మహాబలశాలిగా ఉన్న జగన్ కేంద్రంలోని బిజెపి మాట వింటారని అనుకోవడమే తప్పు. సోనియానే ధిక్కరించిన జగన్ మనస్తత్వం గురించి తెలిసిన వారెవయినా, మోదీకి భయపడతారనుకోవడం వెర్రితనం. ఆ మేరకు బిజెపి గొప్పతనం గురించి ఎక్కువ ఊహించుకోవడమే తప్పున్నర తప్పు.
రాజధానిపై బిజెపి రంగంలోకి దిగినా…
రాజధానిని అక్కడే ఉంచాలని జరుగుతున్న రైతుల ఆందోళనకు అన్ని పార్టీల కంటే ముందుగానే బిజెపి మద్దతు ప్రకటించింది. కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి, బిజెపి రంగంలోకి దిగితే రాజధాని తరలింపు ప్రక్రియ నిలిచిపోతుందని అటు రైతులు కూడా ఆశపడ్డారు. వారి మనోభావాలు గుర్తించిన తర్వాతనే కమలదళపతి కన్నా లక్ష్మీనారాయణ రాజధాని ప్రాంతానికి వెళ్లి, మోదీ శంకుస్థాపన చేసిన చోటనే మౌనదీక్ష నిర్వహించారు. అటు కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కూడా రైతుల వద్దకు వచ్చి భరోసా ఇచ్చారు. రాజధాని ఎక్కడికీ తరలిపోదని, కేంద్రం-బిజెపి నాయకత్వంతో మాట్లాడిన తర్వాతనే తాను ఈ విషయం చెబుతున్నానని హామీ ఇచ్చారు.
     అంతేనా..? రాష్ట్ర నేతలంతా రాజధాని తరలింపుపై ఒకేమాటపై ఉండాలని ఆదేశిస్తూ,  అమరావతిలోనే రాజధానిని ఉంచాలంటూ బిజెపి రాష్ట్ర శాఖ ఓ తీర్మానం ఆమోదించింది. సహజంగా ఏ సీపీఐ, సీపీఎం, టిడిపినో అలాంటి తీర్మానం చేస్తే దానికి పెద్దగా విలువ ఉండదు. కానీ, ఆ తీర్మానం చే సింది బిజెపి! ఆ పార్టీకి రాష్ట్రంలో ఒక్క సీటుకు ఠికాణా  లేకపోయినా, ఒక్క శాతం ఓటు రాలకపోయినా..కేంద్రంలో ఉన్నది ఆ పార్టీనే కాబట్టి, రాష్ట్రంలో ఉన్న వైసీపీ సర్కారు అధినేత జగన్‌కు మోదీ-అమిత్‌షా ద్వయం ‘సంగతి’ తెలుసు కాబట్టి.. సహజంగా రాష్ట్ర ప్రభుత్వం, తన  భవిష్యత్తు మనుగడ కోసం కేంద్రంతో కయ్యం పెట్టుకోదని చాలామంది లెక్కలు వేశారు. కానీ.. తీరా జగనేమో కేంద్రంలోని బిజెపిని ఖాతరు చేయకుండా, రాష్ట్ర బిజెపి నేతల హెచ్చరికలను పట్టించుకోకుండా.. తాను అనుకున్నది అసెంబ్లీ తీర్మానం రూపంలో పెట్టేసి, కమలానికి కన్నీరు తెప్పించారు.  బహుశా.. బిజెపికి జగన్‌బాబు సంగతి ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలిసివచ్చినట్లుంది. ఏదైనా అనుభవ మయితే గానీ తత్వం బోధపడదుకదా?!
మరిప్పుడు బిజెపి ఏం చేస్తుంది? ఏం చేయాలి? బిజెపి వీరత్వాన్ని నమ్ముకుని, ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లకు ముందే, తొందరపడి ముందే కూసిన జనసేన కోయిల పవన్‌కల్యాణ్ ఏం చేస్తారు? రాజధాని కోసం పోరాడతానన్న ‘తమ్ముడు’ ఇప్పుడు ఇక ఎవరిపై ఎలా పోరాడతారు? బిజెపిని నమ్ముకుంటే ఏం జరుగుతుందో అనుభవమయింది కాబట్టి, మళ్లీ సొంత బాట పడతారా? తన తీర్మానాన్ని కాదని వెళ్లిన జగన్ సర్కారుపై కమలదళాలు ఎలా.. ఎన్నాళ్లు  పోరాటం చేస్తారు? పరువు పోకుండా రెండురోజులు ధర్నాలు లాగించి మమ అనిపిస్తారా? లేక.. పోయిన పరువును కాపాడుకునేందుకు కేంద్రం నుంచి నరుక్కువస్తారా? అన్నదే ప్రశ్న. జనసేన కూడా జతయింది కాబట్టి, ఇక కమలసేన కలిస్తే కదనమేనని భావించిన వారికి ఇవన్నీ షాకింగులే. ఇది కూడా చదవండి.. ‘ కమల-సేన కలిస్తే కదనమే!
రాష్ట్రంలో బిజెపికి నయాపైసా బలం లేకపోయినా, నాయకుల సంఖ్యకు తక్కువేమీ లేదు. రాజధానిపై వారిది తలా ఒక వాదన. తలా ఒక దారి! అలాంటి పరిస్థితిని చక్కదిద్ది, అందరినీ ఒక తాటిపైకి తెచ్చి, అమరావతే రాజధాని అని తీర్మానించేసరికి  నాయకత్వానికి తాడు తెగినంత పనయింది. మరి రాష్ట్ర శాఖ తీర్మానం చేసింది కాబట్టి, కేంద్ర పార్టీ దానికి అనుగుణంగా వ్యవహరించి.. రాష్ట్ర పార్టీ పరువు నిలబెట్టే పనేమైనా చేసేందుకు ప్రయత్నించిందా అంటే అదీ లేదు. అక్కడ కూడా ఎవరి దుకాణాలు వారివే. ఎవరి గ్రూపులు వారివే. ఇక్కడ రాజధాని తరలింపుపై రాష్ట్రంలో  ఎంత యాగీ జరుగుతున్నా, సీఎం జగన్ ఎలాగైతే ఇప్పటివరకూ పెదవి విప్పలేదో.. అదే అంశంపై సొంత పార్టీనే రంగంలోకి దిగినా, కేంద్ర నాయకత్వం పెదవి విప్పింది లేదు.
అయితే.. జగన్-మోదీ దోస్తీ నిజమేనా?
   రాజధాని తరలింపుపై జగన్ దూకుడు చూస్తుంటే.. ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చినట్లు, దానిపై ప్రధానితో ముందస్తుగానే మాట్లాడి విశాఖకు తరలించారన్నది నిజమనే తేలిపోయింది. అంటే.. బిజెపి నాయకత్వం, రాష్ట్ర పార్టీ నేతలను అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదని స్పష్టమయింది. బిజెపి పుణ్యపురుషులైన మోదీ-అమిత్‌షా, ఏపీలో జగన్‌తో ఒకవైపు దోస్తానా చేస్తూ, మరోవైపు అవకాశం కోసం చూస్తున్నారనీ అర్ధమవుతోంది. ఇంతకూ అమరావతి ఆటలో పులుసులో ముక్కలయింది ఎవరన్నది భేతాశప్రశ్న. ఇది కూడా చదవండి.. ‘ అమరావతి ఆటలో బిజెపి గెలుస్తుందా?