‘మూడు’ కోసం ముప్పేటదాడి!

424

నర్సరావుపేట, బెజవాడలో వైసీపీ రివర్స్ గేర్
రాజధానులకు మద్దతుగా భారీ ర్యాలీలు
అసెంబ్లీ ముందు రోజు తెరపైకి  ‘అమరావతి బినామీలు’
వైసీపీ వ్యూహాత్మక ఎదురుదాడి

( మార్తి సుబ్రహ్మణ్యం)

మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చిన ఏపీ సీఎం జగన్.. అసెంబ్లీకి ముందు ఆ వ్యవహారాన్ని మరింత రక్తికట్టించడం ద్వారా, ఏం జరుగుతుందోనన్న సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. అమరావతి, విశాఖ, కర్నూలును మూడు రాజధానులుగా చేయాలన్న జగన్ సర్కారు ప్రయత్నాలపై గుంటూరు జిల్లా అమరావతి సమీపంలోని 29 గ్రామాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. రైతులు తమ ఆందోళలను తీవ్రతరం చేస్తున్నారు. దానికి టిడిపి, బిజెపి వంటి ప్రధాన పార్టీలు మద్దతునిస్తున్నాయి. బిజెపి చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ అక్కడ ఒకరోజు మౌనదీక్ష చేయగా, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తన భార్య, కోడలు, బావమరిది సహా దీక్షా శిబిరాలకు వెళ్లి వారికి మద్దతుప్రకటించారు.
బాబుకు అందివచ్చిన అమరావతి అవకాశం
మరోవైపు చంద్రబాబు అందివచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునే వ్యూహంలో ఉన్నారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలన్న డిమాండ్‌తో, ఆయన చేస్తున్న జిల్లా పర్యటనలు విజయవంతం అవుతున్నాయి. ఆయన ఒక్కో జిల్లాను పెంచుకుంటూ వెళ్లి ఆందోళనకు మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా రైతుల పోరాటానికి సంఘీభావంగా ఆయన వెళ్లిన ప్రతిచోటా జోలె పడుతున్నారు. ఎన్నికల పరాజయానంతరం తొలిసారి జనంలోకి వెళుతున్న ఆయనకు, ప్రజల స్పందన ఆశించినరీతిలోనే కనిపిస్తోంది. దానికి అమరావతి నుంచి విశాఖకు రాజధానిని తరలిస్తున్నారన్న ప్రజల సెంటిమెంట్ కూడా తోడయినట్లు కనిపిస్తోంది.
వ్యతిరేకతను సానుకూలంగా మార్చుకోవడమే లక్ష్యం
రాజధానిపై పెరుగుతున్న వ్యతిరేకతను సానుకూలంగా మార్చుకోవడం, దానికంటే ముందు జనం మూడ్‌ను మార్చడమే లక్ష్యంగా వైసీపీ ఎదురుదాడి వ్యూహానికి తెరలేపడం ఆసక్తికరంగా మారింది. దానికితోడు రాజధానిపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేసే ముందు రోజు.. అమరావతి పరిసర గ్రామాల్లో టిడిపి నేతలు కొనుగోలు చేసిన భూములపై, సీఐడి నిర్వహించిన విచారణ వివరాలను తన మీడియా ద్వారా లీక్ చేయడం ద్వారా, మైండ్‌గేమ్‌కు తెరలేపడం ఆసక్తికరంగా మారింది. దానిద్వారా.. రాజధానిని తాము ఎందుకు వ్యతిరేకిస్తున్నామో, అక్కడ ఎవరు లబ్థిపొందారన్న అంశాన్ని చర్చనీయాంశం చేయడమే వైసీపీ వ్యూహంగా స్పష్టమవుతోంది. ఫలితంగా సభలో తెలుగుదేశం చేసే దాడిని, సీఐడి వివరాలతో ఎదురుదాడిచేసే అస్త్రాన్ని వైసీపీ ముందస్తుగా  సిద్ధం చేసుకుంటోంది.
నర్సరావుపేటలో వైసీపీ ర్యాలీ సూపర్‌హిట్

ఇక మూడు రాజధానుల ప్రతిపాదనపై జనంలో వ్యతిరేకత లేదని చెప్పేందుకు, వైసీపీ రెండు కీలకమైన ప్రాంతాలను ఎంచుకుంది. పల్నాడులో రాజకీయంగా తనకు పట్టున్న నర్సరావుపేట, రాజధాని న గరమైన విజయవాడలో మూడు రాజధానులకు అనుకూలంగా భారీ ర్యాలీలు విజయవంతంగా నిర్వహించడం ద్వారా.. తనపై ప్రజల్లో వ్యతిరేకత లేదని నిరూపించుకునే ప్రయత్నం చేసింది. ఒకవేళ మూడు రాజధానులపై వ్యతిరేకత ఉన్నట్టయితే, తమ ర్యాలీలకు వేలాదిమంది ప్రజలు ఎలా హాజరవుతారన్న ప్రశ్నలతో విపక్షాలపై ఎదురుదాడి చేయడమే వైసీపీ అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ విషయంలో వైసీపీ నాయకత్వం వ్యూహాత్మంగానే ఈ ర్యాలీల కార్యక్రమాన్ని రూపొందించింది. వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెండుసార్లు వరసగా విజయం సాధించిన నరసరావుపేటను ఎంచుకుంది. అక్కడ విపక్ష తెలుగుదేశం పార్టీకి సరైన నాయకత్వం లేక బలహీనంగా ఉండటం, గ్రామాలపై ఎమ్మెల్యే గోపిరెడ్డికి పట్టు ఉండటం ర్యాలీ సక్సెస్ కావడానికి దోహదపడింది. లాయర్లు, డాక్టర్లను కూడార్యాలీలో భాగస్వాములను చేయడం బట్టి.. తమ వాదనకు విద్యావంతుల మద్దతు కూడా ఉందని వైసీపీ చాటింది. వేలాదిమంది పాల్గొన్న ర్యాలీ, బహిరంగసభకు రాష్ట్ర మంత్రులను కూడా తీసుకురావడం ద్వారా, రాజకీయంగా గోపిరెడ్డి కూడా తన సత్తా చాటేందుకు ఆ ర్యాలీ ఉపయోగపడింది.
బెజవాడలోనూ అదే జోరు
ఇక విజయవాడ నగర నడిబొడ్డున మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో మూడు రాజధానులకు అనుకూలంగా నిర్వహించిన ర్యాలీ కూడా సక్సెస్ అయింది. ఈ ర్యాలీకి మహిళలు ఎక్కువ సంఖ్యలో కనిపించారు. దీనిద్వారా రాజధాని నగరమైన విజయవాడలో కూడా, ప్రజల మద్దతు తమకే ఉందన్న సంకేతాలివ్వడంలో వైసీపీ విజయం సాధించింది. నరసరావుపేట, విజయవాడ ర్యాలీలు వైసీపీ నాయకత్వంలో కొంత ఆత్మస్ఱైర్యం నింపినట్లున్నాయి. సభలో సీఎం జగన్.. తాము ఈ రెండు ప్రాంతాల్లో నిర్వహించిన ర్యాలీలకు ప్రజామోదం లభించిందని విపక్షంపై ఎదురుదాడి చేయడానికి ఈ కార్యక్రమాలు పనికొస్తాయి.
అసెంబ్లీ ముందురోజున ‘భూ’కంపం
ఇక అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన, సీఆర్డీఏ రద్దుపై తీర్మానం చేస్తారన్న ప్రచార నేపథ్యంలో సరిగ్గా ఒకరోజు ముందు.. జగన్ సొంత మీడియాలో అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై వచ్చిన కథనాలు,  సభలో టిడిపిపై ఎదురుదాడికి వైసీపీ సిద్ధపడుతోందన్న సంకేతాలను స్పష్టం చేశాయి.  అమరావతి చుట్టూ ఉన్న గ్రామాల్లో టిడిపి నేతలు ఎవరెవరు భూములు కొన్నారన్న అంశంపై సీఐడి ఇప్పటికే విచారించింది. ఆ మేరకు అధికారులు ప్రతి గ్రామాలకు వెళ్లి, భూములు కొన్న టిడిపి నేతల పేర్లపై ఆరా తీశారు. ఆ మేరకు రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లి,  ఆ డాక్యుమెంట్లు సేకరించారు. తాజాగా జగన్ మీడియాలో వచ్చిన వివరాలన్నీ అందులో భాగం కావడమే విశేషం. దీన్నిబట్టి.. పూర్తి ఆధారాలతో వైసీపీ సభలో టిడిపిని ఆడుకుంటుందన్నది చెప్పకనే చెబుతోంది.
‘తెల్ల’బోయిన పేదల కార్డులు
అయితే.. అందులో పేదలకు ప్రభుత్వం ఇచ్చే తెల్లకార్డులు తీసుకున్న వారు సైతం, రూపాయలు పెట్టి భూములు కొనుగోలు చేశారన్న సీఐడి వివరాలు సామాన్యులను విస్మయానికి గురి చేశాయి. ఆదాయపన్ను, పాన్‌కార్డులు లేకుండానే ఒక సామాన్యుడు కోట్లు ఖరీదు చేసే భూములు ఎలా కొనుగోలు చేశారన్నదే ఆ విస్మయానికి కారణం. భూములు కొనుగోలు చేసిన తెల్లకార్డుదారులు, వారి పేర్లు, చివరకు ఆధార్‌కార్డు నెంబర్లు కూడా జగన్ మీడియా బట్టబయలు చేసింది. అందులో టిడిపి ప్రముఖుల పేర్లు, బినామీలున్నారన్నది జగన్ మీడియా ప్రధాన ఆరోపణ. ఆ కథనాలు కూడా ఆ దారిలోనే సాగాయి. జగన్ మీడియా దూకుడు చూస్తుంటే… అసలు సభ ప్రారంభం అయిన తర్వాత సీఐడి నివేదికలో ఇంకెన్ని విభ్రమగొలిపే నిజాలు బయకు వస్తాయో, దాని ఆధారంగా వైసీపీ ఎదురుదాడి ఏ స్థాయిలో ఉంటుందోనన్న ఆసక్తి అన్ని వర్గాల్లో కనిపిస్తోంది.
దాడికి ‘దేశం’ సిద్ధం
   అటు టిడి పి కూడా ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉంది. ఆ మేరకు టిడిఎల్పీ కూడా వ్యూహరచన ఖరారు చేసింది. అసలు అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందు అక్కడ అధికారికంగా జరిగిన రిజిస్ట్రేషన్లు ఎన్ని? రాజధానిగా ప్రకటించిన తర్వాత నమోదైన రిజిస్ట్రేషన్లు ఎన్ని? అంతకుముందు ఏ ప్రభుత్వాలు ఎవరెవరికి భూములు కేటాయించాయి? వంటి అంశాలపై సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే, తెల్లకార్డుదారులు కొనుగోలు చేసిన భూములపైనే అసెంబ్లీలో రచ్చ అయ్యే అవకాశం కనిపిస్తోంది. వారు ఎవరికి బినామీదారులన్నది వైసీపీ ఎలా రుజువు చేస్తుందో చూడాలి.