జగన్ వద్దన్నదే.. మోదీకి ముద్దయింది!

496

ఢిల్లీలో పాలనా భవనాలన్నీ ఇక ఒకేచోట
అమరావతిలో అదే పద్ధతి పాటించిన బాబు
విడగొట్టి విశాఖకు తీసుకువెళ్లనున్న జగన్

(మార్తి సుబ్రహ్మణ్యం)

అభివృద్ధి వికేంద్రీకరణ- అధికార వికేంద్రీకరణ- పరిపాలనా కేంద్రీకరణ. ఇవి భిన్నమైన అంశాలు. అధికార వికేంద్రీకరణ అంటే ప్రజలకు కష్టాలే. ఒక శాఖ తూర్పున ఉంటే మరో శాఖ పడమరలో ఉంటుంది. ఇంకోటి ఉత్తరాన ఉంటే మరొకటి దక్షిణంలో ఉంటుంది. ఫలితంగా జనంలోనే కాదు, అధికారులలోనూ గందరగోళం. ప్రతి చిన్న అంశానికీ వందల మైళ్లు దాటి రావాలి. దానికి బోలెడు ప్రజాధనం వృధా. ఇక ప్రజలకు వదిలే చేతిచమురుకయితే లెక్కనే లేదు. మంత్రులు రాజధానిలో…. వారు ప్రాతినిధ్యం వహించే శాఖల కార్యాలయాలు మరొక చోట ఉంటాయి. అసెంబ్లీ రాజధానిలో ఉంటే పరిపాలన కార్యాలయాలు, విభాగాధిపతులు ఇంకొక చోట ఉన్నప్పుడు.. అటు ఇటు తిరిగే అధికారులకు శారీరక శ్రమ, దానికయ్యే ఖర్చులతో ఖజానాకు నష్టం. అదే.. అన్ని కార్యాలయాలు, విభాగాధిపతులు, అసెంబ్లీ ఒకే చోట ఉంటే పాలనలో వేగం పెరుగుతుంది. ఖజానాపై భారం ఉండదు. ఉదాహరణకు హైదరాబాద్‌లో కొంతకాలం క్రితం వరకూ సచివాలయం ఒకేచోట ఉండేది. తర్వాత దానిని మార్చి మంత్రుల చాంబర్లు ఒకచోట, విభాగాధిపతులు మరొక చోట ఉండటంతో గందరగోళం కొనసాగుతోంది. ఉద్యోగులపై భారం ఎక్కువయింది. అయితే, ఏపీలో మాదిరిగా ఎక్కడా ప్రైవేటు భవనాలు తీసుకోనందున, సర్కారుపై ఆర్ధిక భారం పడటం లేదు. అదొక్కటే ఊరట.
పాలనా కేంద్రీకరణ కోసం బాబు ప్రణాళిక
ఇప్పుడు ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మార్చేందుకు జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలే ఈ చర్చకు కారణమవుతోంది.  నిజానికి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు రైతులిచ్చిన 33 వేల ఎకరాల్లో రోడ్లు, పార్కుల వంటివి మినహాయిస్తే మిగిలిన భూముల్లో అసెంబ్లీ, సచివాలయం, జడ్జిలు, మంత్రులు, ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల క్వార్టర్లు నిర్మించాలన్నది ప్రణాళిక. ఆ మేరకు కొన్ని భవనాలు ఇప్పటికే 70 శాతం పూర్తవగా, మరికొన్ని 50 శాతమే పూర్తి అయ్యాయి. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఓటుకు నోటు కేసు పరిణామాలతో చంద్రబాబు నాయుడు పరిపాలనను పూర్తిగా బెజవాడకు మార్చారు. కానీ అప్పటికే హైదరాబాద్‌లోని సచివాలయ భవనాలను, దాదాపు 10-12 కోట్లతో ఆధునీకరించారు. పోనీ దానిని వినియోగించుకుంటున్నారా అంటే అదీ లేదు. లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌నూ కోట్ల రూపాయలతో ఆధునీకరించారు. బెజవాడకు రావడంతో ఆ డబ్బంతా బూడిదలో పోసినట్టయింది.
బెజవాడలో బోలెడు ఖర్చు చేసిన టిడిపి సర్కారు
బెజవాడకు వచ్చిన తర్వాత సూర్యారావుపేటలో ఉన్న ఇరిగేషన్ కార్యాలయాన్ని సీఎంఓగా మార్చేందుకు మరికొన్ని కోట్లు ఖర్చు చేశారు. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణానికి గుత్తేదారుకు ప్రభుత్వ భూమి ఇచ్చి కూడా, చదరపు అడుగుకు వేలాది రూపాయలు ధారాదత్తం చేశారన్న విమర్శలొచ్చాయి. హైదరాబాద్‌లో భూమిని కొనుగోలు చేసి శాశ్వత భవంతులు నిర్మించినా అందులో సగం ఖర్చు కూడా కాదని, ఆ కాంట్రాక్టులో టిడిపి అగ్రనేతలు కోట్లు స్వాహా చేశారని విపక్షాలు ధ్వజమెత్తాయి. బెజవాడలో ఉన్న ప్రభుత్వ భవనాలలో కొన్ని శాఖలను తరలిస్తే, అనేక కార్యాలయాలను నెలకు వందలకోట్లు చెల్లించి అద్దెలకు తీసుకున్నారు. దానిలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి.
అయిన వారికోసం అద్దెలకు కోట్లు దుబారా?
గుంటూరు, మంగళగిరి, బెజవాడలో ఒక సామాజికవర్గానికి చెందిన భవనాలనే ఎక్కువ ధర చెల్లించి అద్దెలకు తీసుకున్నారని, గుంటూరులో దివంగత మాజీ స్పీకర్ తనయుడు కోడెల శివరాంకు చెందిన భవనాల్లో ఎక్కువ అద్దెలు చెల్లించారన్న ఆరోపణలు వెలువడిన విషయం తెలిసిందే. అదే.. అమరావతిలో అన్ని ప్రభుత్వ భవనాలు ఒకే చోట ఉన్నట్టయితే, అద్దెలకు చెల్లించే వందలకోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతాయి. చంద్రబాబునాయుడు డిజైన్ల పేరిట విదేశీ పర్యటనలతో కాలయాపన చేయకుండా, రైతులు భూములిచ్చిన వెంటనే హైదరాబాద్‌లో పాలన కొనసాగుతున్నప్పుడే రెండు, మూడు శాశ్వత కట్టడాలు నిర్మించి ఉంటే అమరావతి స్వరూపం, పాలన మరో రకంగా ఉండేది. అది వేరే విషయం.
జగన్ రాకతో అగమ్యగోచరంగా మారిన అమరావతి
కానీ, ఎన్నికల్లో టిడిపి ఓడిపోయి జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో రాజధాని భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. అమరావతిలో రాజధానిని కొనసాగించాలంటే లక్షకోట్ల  రూపాయాలు కావాలని, సర్కారు వద్ద అంత డబ్బులేనందున, విశాఖకు తరలిస్తే కేవలం పదివేల కోట్లతో అన్నీ నిర్మించవచ్చని మంత్రులు కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారు. దానితో అమరావతికి భూములిచ్చిన రైతుల్లో ఆందోళన మొదలయి, అది ఉద్యమంగా మారింది. అది ఇప్పుడు జాతీయ స్థాయికి చేరింది. విశాఖకు రాజధానిని తరలించేందుకు సచివాలయ ఉద్యోగులూ అంగీకరించడం లేదు. హైదరాబాద్ నుంచి వచ్చి ఇప్పుడిప్పడే స్థిరపడుతున్న తమ కుటుంబాలను, మళ్లీ విశాఖకు ఎలా తీసుకువెళ్లాలన్న ఆందోళన వారిది. కానీ, ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అది వేరే విషయం.
రాజధాని అక్కడే.. కానీ..?
అమరావతి రైతుల ఆందోళన, బిజెపి దానిపై దృష్టి సారించడం, వివిధ వర్గాల్లో వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని.. జగన్ సర్కారు ఇప్పుడు కొత్త మార్గం ఎంచుకుందన్న ప్రచారం జరుగుతోంది. రాజధానిగా అమరావతిని అక్కడే ఉంచి, ఎక్కువ శాఖలను విశాఖకు తీసుకువెళ్లి, సీఎం కూడా అక్కడే ఉండే ప్రణాళిక రూపొందిస్తున్నారన్న మరో ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఇప్పటి వరకూ లీకులే తప్ప ప్రభుత్వం నుంచి ఒక్క అధికార ప్రకటన వెలువడింది లేదు. ఈ రకంగా ఒకేచోట పరిపాలన కేంద్రీకరణ జరగాలన్న చంద్రబాబు నాయుడు విధానానికి వ్యతిరేకంగా, పరిపాలనా వికేంద్రీకరణ చేయాలన్న జగన్ ప్రయత్నాలు వివాదంగా మారి చర్చనీయాంశమవుతున్నాయి.
ఢిల్లీలో మోదీ-బాబు ఆలోచన ఒకటిగా…
అయితే… దేశ రాజధాని ఢిల్లీలో కూడా చంద్రబాబునాయుడు ఆలోచన తరహాలోనే  పార్లమెంటు, ప్రధాని, ఉప రాష్ట్రపతి భవనాలు, నివాసాలు,  ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండే ప్రణాళికకు  ప్రధాని మోదీ తెరలేపడం విశేషం. ప్రస్తుతం ఢిల్లీలో ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రుల కార్యాలయాలు  వేర్వేరు ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. దానివల్ల దాదాపు 32 వేల మంది ఉద్యోగులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పనిచేయాల్సివస్తోంది. ఢిల్లీలో నెలకొన్న ట్రాఫిక్ సమస్య, అద్దె భవనాలకు చెల్లిస్తున్న నిధులు వంటి అంశాలు పరిగనలోకి తీసుకున్న ప్రధాని మోదీ.. ఢిల్లీలో  పరిపాలన కేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు.

 ఆ ప్రకారంగా కొత్త పార్లమెంటు భవనం, సెంట్రల్ విస్టా ప్రణాళిక వల్ల సుమారు 70 వేల మంది ఉద్యోగులు ఒకేచోట పనిచేసే అవకాశం ఏర్పడుతుంది. పైగా దీనివల్ల ఇప్పటికే వివిధ ప్రాంతాల్లోని కార్యాలయాలకు అద్దె కింద చెల్లించే వెయ్యి కోట్ల వార్షిక ఖర్చు కేంద్రానికి ఆదా కానుంది. నరేంద్రమోదీ నయా విధానం వల్ల ఇకపై రాష్ట్రపతి భవన్‌కు నైరుతి వైపు ప్రధాని కార్యాలయం, నివాసం, ఆ సమీపంలోనే ఉప రాష్ట్రపతి నివాసం అంతా ఒకేచోట ఉండే ప్రణాళికను 2024 కల్లా పూర్తి చేయాలన్నది మోదీ సర్కారు సంకల్పం. దీనివల్ల మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులకు ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు. ప్రతి ఏటా అద్దెలకు చెల్లించే వెయ్యి కోట్లు ఖజనాకు మిగలడం మరో లాభదాయకమైన అంశం. ఆరకంగా.. ఏపీలో చంద్రబాబు అనుకున్నదీ..  సీఎం జగన్ వద్దన్న పరిపాలన కేంద్రీకరణ,  ప్రధాని మోదీకి ముద్దయింది. బహుశా బిజెపి కూడా అందుకే అభివృద్ధి వికేంద్రకరణకు తప్ప, పాలనా వికేంద్రీకరణకు తాము అంగీకరించేది లేదని స్పష్టం చేసినట్లు కనిపిస్తోంది.