బోస్టన్ కమిటీపై క్రిమినల్ చర్యలుంటాయా?

599

జీ.ఎన్.రావు కమిటీ సత్తా ఇంతేనా?
మద్రాస్ ఐఐటి పేరిట బోగస్ నివేదిక
సర్కారునే మోసం చేసిన క మిటీపై చర్యలేవీ?
కోర్టుకెళితే విజయకుమార్‌కు చిక్కులు తప్పవా?
ఐఏఎస్‌లకు ఇదేనా విశ్వసనీయత?

( మార్తి సుబ్రహ్మణ్యం)

అది స్వయంగా సర్కారే వేసిన కమిటీ. అంటే దానికి ఓ నిబద్ధత, విశ్వసనీయత అంటూ ఒకటి ఏడుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్మమంత్రే దానిని ఏర్పాటు చేశారు కాబట్టి. అందులో చట్టాలపై గురి ఉన్న వారు అఘోరించారు కాబట్టి. పూర్వాశ్రమంలో కలెక్టరు వంటి పదవులు వెలగబెట్టిన వారున్నారు  కాబట్టి, వారిచ్చే నివేదిక సత్యహరిశ్చంద్రుడి తమ్ముడిలా ఉంటుందన్న నమ్మకం కాబట్టి! మరి అలాంటి తోపులు ఉన్న కమిటీనే, పచ్చి అబద్ధాలు చెబితే శిక్ష ఎవరికి వేస్తారు? అబద్ధాలు చెప్పిన కమిటీకి ఏ శిక్ష వేస్తే ప్రజలలో ప్రభుత్వం పట్ల విశ్వసనయత ఉంటుంది?.. మద్రాసు ఐఐటి యాజమాన్యం సమాధానం ఇచ్చిన తర్వాత తెరపైకి వస్తున్న ప్రశ్నలివి.
రాజధానిని అమరావతి నుంచి తరలించాలనే పట్టుదలతో ఉన్న జగన్ సర్కారు, అందుకు అనుగుణంగా జీ.ఎన్.రావు, బోస్టన్ కమిటీలను ఏర్పాటు చేశారు. రాజధాని తరలింపు, అధికార వికేంద్రకరణ వంటి అంశాలపై ఆ కమిటీలు ఇచ్చే నివేదికలనే బైబిల్‌గా భావించాలన్నది జగన్ సర్కారు భావన. అంటే ఆ కమిటీల నివేదికల పేరు చెప్పి, తాను చేయాలనుకున్నది చేయడమే జగన్ సర్కారు అసలు లక్ష్యం. తన ఆలోచనలు వారి నోట్లో పెట్టి,  అనుకున్నది అమలు చేయడమే అసలు లక్ష్యమన్నమాట. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా, కర్నూలు జ్యుడిషియల్ రాజధానిగా, అమరావతిలో అసెంబ్లీలో ఉండాలన్నది తన అభిప్రాయమని ఒక సీఎం నిండు సభలో చెప్పిన తర్వాత.. ఆయన వేసిన కమిటీ అందుకు భిన్నంగా నివేదిక ఇస్తుందని ఏ తలకుమాసిన వాడూ భావించడు. ఆ రెండు కమిటీలు కూడా దాదాపు సీఎం అభిప్రాయాన్నే వ్యక్తీరించానుకోండి అది వేరే విషయం.
సరే,  వాటిని పక్కకుపెడితే.. బోస్టన్ కమిటీ, జీ.ఎన్.రావు కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత వాటి సారాంశాన్ని మీడి యాకు వివరించారు. దాన్ని తప్పుపట్టాల్సిన పనిలేదు. చాలా యువకుడు, మారధాన్‌లో యువకులనూ పక్కకునెట్టి పరుగులు తీసే జీ.ఎన్.రావు వంటి నిత్య యవ్వనుడు, ఎలాంటి రాజకీయ నీడ లేని బోస్టన్ కమిటీ తాము ఇచ్చిన నివేదికను ప్రజల ముందు ఉంచాలి కాబట్టి మీడియా ముందుకొచ్చాయి. అంతవరకూ సంతోషమే. కానీ, అమరావతి రాజధానిగా పనికిరాదని చెప్పడానికి వారు ఎంచుకున్న ప్రాతిపదికే ఆ తర్వాత నవ్వులపాలయింది. ఓ కమిటీ, మరో ఐఏఎస్ అధికారిని ముద్దాయిగా నిలబెట్టింది.  సహజంగా సర్కారు ఏ కమిటీ వేసినా అది కొంత కసరత్తు చేస్తుంది. వివిధ వర్గాల ప్రజలను కలసి, తన అభిప్రాయాలను జోడించి, సర్కారుకు అనుకూలంగా ఒక నివేదిక ఇస్తుంటుంది. ఇది అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వంలోనయినా జరిగేదే. లేకపోతే ఆయా కమిటీలో ఫలానా వ్యక్తులనే ప్రభుత్వం ఎందుకు నియమిస్తుంది? కాకపోతే ఎప్పటి జీ.ఎన్.రావు? ఎక్కడి కథ? సరే.. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక అంతా.. అమరావతి  రాజధానిగా పనికి రాదని, అక్కడ ముంపు వస్తుందని ఇంకా అనేక అంశాలు ప్రస్తావించారు. దానినీ తప్పుపట్టాల్సిన పనిలేదు. ఎందుకంటే గ్రీన్ ట్రిబ్యునల్ కంటే కమిటీలో ఉన్న వారే ఎక్కువ విజ్ఞానులు కాబట్టి!
అయితే, ఎటొచ్చీ.. అసలు నివేదికనే ఇవ్వని ఒక ప్రఖ్యాత సంస్థను ఈ వ్యవహారంలో ఈడ్చి, ఆ సంస్ధ కూడా అమరావతి రాజధానిగా పనికిరాదని చెప్పడమే నేరం. అసలేం జరిగిందంటే.. అమరావతిపై జగన్ సర్కారు వేసిన బీసీజీ ఒక నివేదిక ఇచ్చింది. అదేమిటంటే… అమరావతి ప్రాంతం రాజధానికి అనుకూలం కాదని, అది ముంపు ప్రాంతమని స్వయంగా మద్రాస్ ఐఐటి నివేదిక ఇచ్చిందని! ఇదే ముక్క సదరు కమిటీ నివేదికలో పేర్కొంది. అంతేనా? ది గ్రేట్ ఐఏఎస్ ఆఫీసర్ విజయకుమార్ కూడా దానిని నిర్ధారించారు. అమరావతి ముంపు ప్రాంతమని మద్రాసు ఐఐటి  కూడా నివేదిక ఇచ్చిందని, బీసీజీ తన నివేదికలో ఈ విషయం వెల్లడించిందని పురపాలక శాఖ డైరక్టర్ హోదాలో ఆయన కూడా సర్టిఫై చేశారు. ఇక ఇంతముందు మేధావులు చెప్పిన తర్వాత.. తమది ముంపు ప్రాంతం కామోసని  అమరావతి రైతులు అనుకోవడం సహజమే కదా? అందులోనూ మద్రాసు ఐఐటి అంటే అల్లాటప్పా సంస్థ కాదు. దానికో క్రెడిబిలిటీ ఉంది.
అయినా ఎందుకయినా మంచిదని సదరు మద్రాసు ట్రిపుల్‌ఐటి వారికే మెయిల్ పెట్టిన రైతులు.. అయ్యా మాది ముంపు ప్రాంతమని మీరు సెలవిచ్చారట కదా నిజమేనా? అని వాకబు చేశారు. అయితే.. ఠాట్, అసలు మేము అమరావతి గురించి ఎలాంటి నివేదిక ఇవ్వలేదు. మమ్మల్ని నివేదిక ఇవ్వాలని ఎవరూ సంప్రదించలేదు. మేము ఏ మీడియాకూ వివరాలు ఇవ్వలేదు. అయినా అది ముంపు ప్రాంతమా? కాదా అని నిర్థారించేందుకు అవసరమైన యంత్రాంగం, వ్యవస్థ తమ వద్ద లేదని విజయశ్రీ చౌదరి అనే వ్యక్తి 12 వ తేదీ పంపిన ఈ- మెయిల్‌కు, మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ రవీంద్ర గట్టు సమాధానిమిచ్చారు. మరి మద్రాస్ ఐఐటి కూడా అమరావతి ముంపు ప్రాంతమని నివేదిక ఇచ్చిందని ఐఏఎస్  విజయ్‌కుమార్, మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు ఎలా చెప్పారు? సరే బొత్స అంటే రాజకీయ నాయకుడు. నేతలు ఏం చెప్పినా చెల్లుతుందనుకుందాం. మరి విజయకుమార్ అంటే ఐఏఎస్ అధికారి. ఆయన సుబ్బారావు, పుల్లారావు మాదిరిగా అబద్ధం ఆడేందుకు కుదరదు.కానీ,ఆయన కూడా అడ్డగోలుగా మద్రాసు ఐఐటి పేరు చెప్పి అబద్ధాలు ఆడారంటే.. ఐఎఎస్‌లు ఆత్మగౌరవం లేకుండా, పోస్టింగులకు కక్కుర్తి పడి అబద్ధాలు ఆడుతున్నారా? సర్కారు చెప్పినట్లు చిలక పలుకులు పలుకున్నారని మెడ మీద తల ఉన్న ఎవరికైనా అనిపిస్తుంది కదా?
రేపు విజయకుమార్, బొత్స, బొస్టన్ కంపెనీమీద ఎవరైనా కోర్టులో కేసు వేస్తే ఎవరి పరువు పోతుంది? మద్రాసు ఐఐటి వాళ్లకు మీరు ఎప్పుడు లేఖ రాశారు? ఏమని లేఖ రాశారు? వాళ్లు అమరావతి ముంపు ప్రాంతమని మీకు ఎప్పుడు లేఖ రాశారు? ఎవరికి లేఖ రాశారు? అసలు బోస్టన్ కమిటీ గానీ, జీ.ఎన్.రావు కమిటీ గానీ మద్రాసు ఐఐటికి ఏ అధికారంతో లేఖ రాశారు? విజయకుమార్‌కు బోస్టన్ కమిటీ ఇచ్చిన నివేదికలో మద్రాసు ఐఐటి వారి లేఖను జతపరిచారా? ఒకవేళ మద్రాసు ఐఐటి వాళ్లు అమరావతికి ఎప్పుడు వచ్చారు? ఏ యంత్రాలు తీసుకువచ్చారు? వంటి కోర్టు సంధించే ప్రశ్నలకు జవాబివ్వకపోతే  పడే శిక్ష ఎవరికి?
దాన్ని పక్కకు పెడితే.. మద్రాసు ఐఐటి తాను ఎలాంటి నివేదక ఇవ్వలేదని స్పష్టం చేసినందున, అలాంటి నివేదిక ఇచ్చిందని సర్కారును మోసం చేసిన బోస్టన్ కమిటీ, ఐఏఎస్ విజయకుమార్‌ను సర్కారు ఏవిధంగా శిక్షిస్తుంది? నిజానికి ఈ విషయంలో సర్కారే ముందుగా స్పందించి, వారిద్దరిపై ఫిర్యాదు చేయాలి కదా?! మద్రాసు ఐఐటి బోస్టన్ కమిటీకి నివేదిక ఇచ్చిందని మీడియాకు చెప్పిన విజయకుమార్‌పై, రేపు ఏ పౌరుడైనా కోర్టుకు వెళితే పరువు పోయేది ప్రభుత్వానికా? విజయకుమార్‌కా? అసలు తప్పుడు నివేదిక ఇచ్చిన బోస్టన్ కమిటీ నివేదికను అసెంబ్లీలో ప్రస్తావించడం ఎంత వరకు నైతికం? ఈ ప్రశ్నలకు జవాబు ఇచ్చే మొనగాడెవరు?