తెరాసలో అతివృష్టి.. విపక్షంలో అనావృష్టి

552

స్థానిక సమరంలో కాంగ్రెస్‌తోనే పోటీ
అనేకచోట్ల  తెరాసతో తెరాస రెబల్స్ పోటీ
కీలక ప్రాంతాలకే బిజెపి పరిమతం

(మార్తి సుబ్రహ్మణ్యం)

 

తెలంగాణ ఎన్నికల యుద్ధం ఏకపక్షంగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న తెరాసలో టికెట్ల కోసం యుద్ధమే జరుగుతుండగా, విపక్ష శిబిరాలు యుద్ధం చేసే సైనికుల కోసం వెతుకులాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకూ ఉన్న పరిస్థితి గమినిస్తే.. రాష్ట్రంలో తెరాసకు తెరాస తిరుగుబాటుదారులే పోటీగా మారారు. తర్వాత స్థానంలో కాంగ్రెస్, ఆ తర్వాత స్థానంలో బిజెపి ఉన్నట్లు కనిపిస్తోంది. దీన్ని బట్టి ఎన్నికల యుద్ధంలో విజేతలెవరన్నది ముందస్తుగానే తెలిసిపోతుంది.
ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తన బలాన్ని గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల తర్వాత విస్తరించుకోవడంలో విఫలమయిందన్నది,  అభ్యర్ధులు వేసిన నామినేషన్ల సంఖ్య స్పష్టం చేస్తోంది. పిసిసి చీఫ్ పదవి కోసం కోట్లాటలే తప్ప, కింది స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అగ్రనేతలెవరూ ఆసక్తిచూపలేదన్నది తాజా నామినేషన్ల పర్వం స్పష్టం చేసింది. అన్నీ  కుదిరితే 2023లో జమిలి ఎన్నికలు జరుగుతాయన్న ప్రచార నేపథ్యంలో, హేమాహేమీలున్న కాంగ్రెస్ నాయకులు ఆ మేరకు క్షేత్రస్థాయిలో తన యంత్రాంగాన్ని విస్తరించుకునేందుకు విముఖత చూపడమే ఆశ్చర్యం. ఒక డజను మంది అగ్ర నేతల నియోజకవర్గాల్లో తప్ప, మిగిలిన నేతలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో ఉన్న మున్సిపాలిటీలలో అభ్యర్ధులు లేరు. దీన్నిబట్టి తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్తేమిటన్నది సులభంగానే అర్ధమవుతుంది. కేవలం పత్రికా సమావేశాలు, మీడియా సవాళ్లు తప్ప.. కాంగ్రెస్ నేతలు క్షేత్రస్థాయి పర్యటనలకు పనికిరావడం లేద న్నది పార్టీ కార్యకర్తల ఆవేదన. ఒకవేళ రేపటి ఎన్నికల్లో కాలం కలసివచ్చి, సంతృప్తికర సంఖ్యలో సీట్లు తెచ్చుకుంటే, అది ప్రభుత్వ వ్యతిరేకత తప్ప, తెరాస అంతర్గత కలహాలు తప్ప.. తమ పార్టీ నేతల గొప్పతనం కాదని పార్టీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక బిజెపి విస్తరణ కోసం పరితపిస్తోంది. గత ఎన్నికల తర్వాత ఆ పార్టీలో జోష్ కనిపిస్తోంది. డజన్లమంది కేంద్రమంత్రులు హైదరాబాద్‌కు వచ్చి వెళుతున్నారు. అధ్యక్షుడు కోవా లక్ష్మణ్ అవిశ్రాంతంగా పర్యటిస్తున్నారు.  అయితే బిజెపి బలం నగరాలు, కొన్ని పట్ట ప్రాంతాలకే పరిమితమవుతోంది. కేంద్రమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు శరవేగంగా అడుగులు వేస్తున్నారు. పార్టీకి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. తెరాస లక్ష్యంగా బిజెపి అగ్రనేతలు ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు.  కానీ పార్టీ అగ్రనేతలెవరూ పట్ణణాలు, గ్రామాల్లో కనిపించడం లేదు. కేవలం కార్యక్రమాలు పిలుపు ఇచ్చినప్పుడే దర్శనమిస్తున్నారు.
హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్  వంటి చోట మాత్రమే నేతలు కనిపిస్తున్నారు. బిజెపి అగ్రనేతలెవరూ క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదని, గ్రామాలను పట్టించుకోవడం మానేసి, మెజారిటీ నేతలు హైదరాబాద్‌లో ఉండేందుకే పరిమితమవుతున్నారన్నది ఒక ఫిర్యాదు.అయితే జాతీయ అంశాలపై తెలంగాణ బిజెపి నేతలు దూకుడుగానే వెళుతున్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై అన్ని రాష్ట్రాల కంటే తె లంగాణ బిజెపినే ఎక్కువ కార్యక్రమాలు, మద్దతుగా ర్యాలీలు నిర్వహించింది. కానీ, స్థానిక అంశాలపై మాత్రం వెనుకబడిపోయిందన్న విమర్శ ఉంది.   స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపికి అనేకచోట్ల అభ్యర్ధులు కరవైన నేపథ్యంలో, బరిలో ఉన్న స్వతంత్రులకు మద్దతునివ్వాలని తీసుకున్న నిర్ణయం బట్టి.. మునిసిపాలిటీలలో పార్టీ బలోపేతంపై పార్టీ ఎంత సీరియస్‌గా ఉందో స్పష్టమవుతోంది. పార్లమెంటు ఎన్నికలలో వచ్చిన ఫలితాల ఉత్సాహాన్ని కొనసాగించి, పార్టీని క్షేత్రస్థాయికి విస్తరించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అటు ఈ ఎన్నికలను అధికార తెరాస  సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. నాయకత్వం కేవలం నేతల మధ్య సమన్వయం-ప్రచారంపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కింది స్థాయిలో జరుగుతున్న సమన్వయం, అభ్యర్ధుల ఎంపిక, పోటీ నివారణకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన నిర్వహించిన టెలీకాన్ఫరెన్సు స్పష్టం చేస్తోంది. గత ఏడాదిలో నిధులు లేకపోవడం వల్ల ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోయినప్పటికీ.. పార్టీ అధికారంలో ఉండటం, విపక్షాలు బలహీనంగా ఉండటం వంటి కారణాలు గెలుపుపై ధీమాకు కారణంగా కనిపిస్తోంది.

అయితే ఇప్పుడు ఎన్నికల్లో తెరాసకు తెరాసనే పోటీగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్నందన పోటీ ఎక్కువయి, అది తిరుగుబాటు చేసేవరకూ వెళ్లింది. తిరుగుబాటుదారులుగా బరిలోకి దిగిన వారంతా బలం ఉన్న వారే కావడంతో.. అలాంటి చోట్ల ఎవరు గెలిచినా తెరాసనే గెలిచినట్టవుతుంది. ఎందుకంటే వారికి మళ్లీ పార్టీ కండువా కప్పుతారు కాబట్టి!  అందుకే తెరాస అభ్యర్ధులకే ఓటు వేయాలని, వారే అసలైన అభ్యర్ధులని, టికెట్లు రాని వారిని అభ్యర్ధులు ప్రచారంలో సమన్వయం చేసుకుని వెళ్లాలని కేటీఆర్ పదే పదే ఆదేశిస్తున్నారు. పోటీ అభ్యర్ధుల వల్ల పార్టీకి నష్టం జరగకుండా వారిని తప్పించే పనిని సీనియర్ మంత్రులకు అప్పగించారు. రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్‌రెడ్డి టికెట్ విషయంలో ప్రతిష్ఠకు వెళ్లగా, అక్కడ తిరుగుబాటు అభ్యర్ధి పోటీ చేసే పరిస్థితి నెలకొంది. అది జరిగితే కాంగ్రెస్ అభ్యర్ధికి లాభం. దీనితో కేటీఆర్, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ను రంగంలోకి దింపారు. స్థానికంగా ప్రచారానికి వెళ్లిన తలసాని వారిద్దరినీ ఒప్పింది, పోటీపై ఏకాభిప్రాయం తీసుకువచ్చారు. ఆ స్థానంపై సస్పెన్స్ నెలకొనడం, అది కాస్తా మీడియాలో ప్రముఖంగా రావడంతో, కేటీఆర్ దానిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని తలసానిని పంపించి టికెట్ కథను సుఖాంతం చేశారు. అనేక జిల్లాల్లో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఒకవేళ తెరాస అభ్యర్ధులు ఎక్కువ సంఖ్యలో ఓడిపోతే దానికి రెబల్స్ కారణమవుతారు.